మెయన్ ఫీచర్

‘విపక్ష శూన్యత’ మరింత విస్పష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు బలహీనపడటం 2014 ఎన్నికల నాటినుంచి కన్పిస్తున్నదే. ఆ బలహీనత ఎంతన్నది ఇపుడు పెద్దనోట్ల రద్దు తర్వాత మరింత బాగా స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ తీసుకున్న ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణయం ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులను కలిగిస్తున్నా, ఆ చర్య మునుముందు చాలా మేలు చేసేదీ, లేనిదీ ఇంకా స్పష్టం కావటం లేదు. నోట్లరద్దు తర్వాత వారాల తరబడి ఇబ్బందులు, ‘ఇన్‌ఫార్మల్ ఎకానమీ’ అని పిలిచే చిన్న వ్యాపారాలు, లావాదేవీలకు తీవ్రమైన నష్టాలు కలుగుతున్నాయి. ప్రతిపక్షాలకు ఇది చాలు ఆందోళనలతో దేశాన్ని ఊపివేసి, మోదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు. కాని పార్లమెంటును స్తంభింప చేయటం, బయట రోజూ మీడియాలో హోరెత్తించటం మినహా విపక్షాల నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపం ఏదీ కన్పించటం లేదు. ‘కేడర్’ పార్టీలైన కమ్యూనిస్టుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ప్రతిపక్ష శూన్యత స్పష్టంగా కన్పిస్తున్నదని అనటం అందువల్లనే.
ఇందుకు కొన్ని కారణాలున్నాయి. 2014 ఎన్నికలలో వారికి ప్రతికూలంగా వెలువడిన ఫలితాలు సరేసరి. ఆ ప్రభావం వారిని ఇంకా వెన్నాడుతూనే ఉంది. గత రెండున్నరేళ్లలో వారి పరిస్థితి ‘ఇంతలో వెలుగు, అంతలో చీకట్లు’ అన్న విధంగా సాగుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికలు కొ న్ని అనుకూలం, కొన్ని ప్రతికూలమయ్యాయి. ఆ విధంగా బ్యాలెన్స్‌షీట్ యథాతథంగా మిగిలిపోయింది తప్ప కొత్త ఊపిరినివ్వలేదు. 2014లో ఎంతగానో భయపెట్టిన మోదీ ‘రోడ్ రోలర్’ ఉద్ధృతికి కొంత బ్రేకు పడిందన్న సంతోషం మాత్రం కలిగింది. ఎన్నికల పరిధి నుంచి బయటకు వెళ్లి చూస్తే ఈ సంతోషం కూడా లేదన్నది గమనించవలసిన విషయం. ఇదే స్థితి నోట్లరద్దు సందర్భంలోనూ పాత్ర వహిస్తున్నది. 2014 ఎన్నికల అనంతరం వేర్వేరు జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయి పార్టీల మధ్య అవసరార్థం తాత్కాలిక సమీకరణలు కొన్ని ఏర్పడ్డాయి. ఆ మేరకు ఎన్నికల ఫలితాలు వారికి అనుకూలమయాయి. ఎన్నికలను పక్కన ఉంచి చూసినపుడు ఆ పార్టీలు దేనికదిగా రాజకీయంగా ప్రజలలో కొత్తగా బలపడింది లేదు, ప్రజల విశ్వాసాన్ని పొందింది లేదు. ఆ పని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమాల ద్వారా జరపలేకపోయారు. పార్టీలను ఇతరత్రా నిర్మించటం ద్వారానూ చేయలేకపోయారు. గత రెండున్నరేళ్లలో కేంద్రం వైఫల్యాలు తగినన్ని ఉన్నాయి. ప్రజలు తమ స్థాయిలో తాము కొన్ని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ అవకాశాలను వినియోగించుకోలేకపోయాయి. అప్పుడప్పుడు మీడియా ప్రకటనలు, సెమినార్ ప్రసంగాలకు మించి వారు ఏ ఒక్క అంశంపై కూడా సంబంధిత వర్గాలను కదిలించి ఉద్యమాలు చేయలేదు. ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ స్థాయి హర్తాళ్‌ల ప్రభావం సైతం ఆ తర్వాత ఏమీ లేకపోయింది. ఆ అంశాలను రాజకీయ పార్టీలూ ముందుకు తీసుకుపోలేదు.
ఇలా ప్రతిపక్షాలు తమ పరిధిలో తాము ఉన్న చోటనే ఉండిపోవటం ఒకటికాగా, వారిలో అందరో, కొందరో కలిసి ఉమ్మడి కార్యారణలు చేసింది కూడా లేదు. బహుశా ఇది ఒక కొత్త పరిస్థితి కావచ్చు, భవిష్యత్తులో ఇట్లాగే ఉండకపోవచ్చునేమో. ఇదివరకు ఎవరికివారు, పలువురు కలిసి తరచూ ఉద్యమాలు చేసేవారు. ఇపుడు కన్పించకపోవటం కొత్త స్థితి. ఇది వారికి విడివిడిగా, ఉమ్మడిగా నష్టదాయకమవుతున్నదని వేరే చెప్పనక్కరలేదు. దీన్ని నోట్ల రద్దు సందర్భంలోనూ చూడవచ్చు. ఇటువంటి స్థితికి ఒక కారణం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు సరైన నాయకత్వం లేకపోవటం. కొన్ని పార్టీల విషయంలో వారికే అస్పష్టతలు ఏర్పడ్డాయి. నోట్లరద్దు అంశంపై ప్రాంతీయ పార్టీలలో భిన్న వైఖరులు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కలగలిసి తిరిగి ప్రతిపక్షాలకే బలహీనతగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఆ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంచుమించు అధ్యక్షుడి వలె వ్యవహరిస్తున్న ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శక్తియుక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. క్రియాశీల రాజకీయాలలోప్రవేశించిన సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఆయన స్వంత పార్టీ వారి నుంచే మొక్కుబడి విధేయతలు మినహా విశ్వాసాన్ని పొందలేకపోయారు. అటువంటి స్థితిలో ఇతర జాతీయ ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల మాట చెప్పనక్కరలేదు. కాంగ్రెస్‌లో జన సామాన్యం వద్ద తగిన ప్రతిష్ట కలిగి సమర్థులనే పేరున్న నాయకులు వేరే లేరు. ఉన్నప్పటికీ ఆ కుటుంబ పార్టీ వ్యవస్థలో ఉపయోగం లేదన్నది వేరే సంగతి. అటువంటపుడు నోట్లరద్దు సమస్యపై స్వంత పార్టీని, ఇతర ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను, ఇతర శక్తులను, సాధారణ ప్రజలను ఉత్తేజపరచగలవారెవరు? ప్రతిపక్ష శూన్యానికి ఇది ప్రాథమిక కారణం.
ఇతర పార్టీల విషయం చూస్తే,కమ్యూనిస్టులు ఇతరత్రా పలు విషయాలలో చీకటిలో తడుములాడుతున్నారు. నోట్లరద్దుపై వీరోచితంగా మాట్లాడుతున్నారే తప్ప అంతకుమించి ముందుకు పోవటం లేదు. సోషలిస్టు అంశ ఎంతో కొంత మిగిలి ఉందనుకునే ములాయం సింగ్, శరద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి గంగా పరీవాహక ప్రాంత నాయకుల వైఖరిలో స్పష్టత, నిలకడ కన్పించదు. వారు ఈ అంశాన్ని స్థానిక రాజకీయాలకు ముడిపెట్టి చూడటమూ ఉంది. మాయావతి, మమత, కేజ్రీవాల్ గట్టిగా వ్యతిరేకిస్తున్నా మొత్తం ప్రతిపక్షంలో వారొక చిన్న భాగమే. దక్షిణాన, పశ్చిమాన , తూర్పునగల ఇతర ప్రధాన ప్రాంతీయ పార్టీలలో నోట్లరద్దును స్పష్టంగా వ్యతిరేకిస్తున్న వారెవరూ లేరు. మొత్తం మీద ప్రతిపక్ష రాజకీయ చిత్రం అయోమయంగా ఉంది. స్పష్టమైన, పదునైన వైఖరి లేనపుడు ప్రతిపక్షపు జాగా అంతిమ విశే్లషణలో శూన్యంగా తేలటం తార్కికమైన స్థితి.
ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది నోట్లరద్దుపై సామాన్య ప్రజల వైఖరి ఏమిటన్నది. ఇదేమిటో స్థూలంగా కనిపిస్తున్నదే. ఒక్కమాటలో చెప్పాలంటే అది కనీసం ప్రస్తుతానికి ప్రతిపక్షాలకు కలిసొచ్చేలా లేదు. ధనవంతులు, నల్లధనం కూడబెట్టేవారు, పన్నులు ఎగవేసేవారు, ఇటువంటి సంపదలతో భోగభాగ్యాలు అనుభవించేవారిపైన సామాన్యులలో నివురుగప్పిన నిప్పువంటి కసి ఒకటుంది. ఇది పేదలకు మాత్రమే ఉందని, మధ్య తరగతివారు నిచ్చెన మెట్లలో పైకి ఎగబ్రాకే ప్రయత్నంలో సంపన్నులపై వ్యతిరేకతను తగ్గించుకుంటున్నారని చాలామంది పండితులు కూడా ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కాని అది ఎక్కువ భాగం నిజం కాదని, వారిలోనూ తగినంత కసి అంతర్గతంగా ఉందని బహుశా గత పాతికేళ్లలో (సంస్కరణలు మొదలైన తర్వాత) మొదటిసారిగా నోట్లరద్దు సందర్భంగా బయటపడుతున్నది. ఇది పండితులకు ఒక ఆర్థిక- సామాజిక పాఠం. ప్రజల వైఖరి ఇలా ఉన్నపుడు ప్రతిపక్షాలు ఆందోళన చేసినా వారి స్వంత కార్యకర్తలు మినహా కలిసి వచ్చేది ఎవరు? పైగా, నోట్లరద్దు వల్ల ఏదో మేలు జరుగుతుందని ఆశిస్తున్న సామాన్యులు తమపై ఆగ్రహించే ప్రమాదమూ ఉంది. అందువల్ల ఆ మేరకు పార్టీల పరిమితులను, సందేహాలను అర్థం చేసుకోవచ్చు. కాని వారు ఇన్ని వారాలలో దాదాపు ఏమీ చేయలేకపోవటానికి కారణం ఇటువంటి పరిమితులు మాత్రమేనా? లేక వారిలో అంతర్నిహితంగానే పైన పేర్కొన్న వివిధ బలహీనతలు వచ్చి చేరాయా? నోట్లరద్దు వెనుక ఇతర లక్ష్యాలున్నాయని, అందుకు ఈ చర్య మొదటి అడుగు మాత్రమేనని ప్రధానమంత్రి చెప్తున్న మాటను ప్రతిపక్షాలు తిరస్కరిస్తున్నాయి. అందుకు వారి వాదనలు వారు చేస్తున్నారు. నల్లధనం అంటే ఏమిటి? అది ఎక్కడ ఏ రూపాలలో ఉంది? నల్లకుబేరులెవరు?, ఈ సమస్య నిర్మూలనకు చిత్తశుద్ధి ఉంటే- తీసుకోవలసిన చర్యలేమిటి? అది ఏ పద్ధతిలో? అనే ప్రశ్నలపై వారు తమ అభిప్రాయాలను బలంగానే చెప్తున్నారు. పెద్దనోట్ల రద్దు అవసరమే అయినా ఆ పని ఏ పద్ధతిలో జరగవలసింది, సామాన్యులకు ఇక్కట్లు లేకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవలసింది అనే విషయాలూ చెప్తున్నారు. నల్లధనవంతులు తమ జాగ్రత్తలు తాము ఏ విధంగా తీసుకుంటున్నారు, నోట్లరద్దు అపహాస్యం పాలవుతుండగా కొత్త నోట్ల జారీ ఎంత అస్తవ్యస్తంగా సాగుతున్నది, బ్యాంకర్ల నుంచి మొదలుకొని ధనవంతులూ, మరొకవైపు రకరకాల మార్పిడి ఏజెంట్లూ చేస్తున్నదేమిటో ఎత్తిచూపుతూనే ఉన్నారు.
నోట్లరద్దు వల్ల మేలు జరగబోతున్నదని ప్రజలలోగల ఆశాభావం వల్ల ప్రతిపక్షాలకు కొన్ని పరిమితులు ఏర్పడినప్పటికీ, యథాతథంగా ఈ ప్రక్రియలో, క్రమంలో లోటుపాట్లు అనేకం ఉన్నాయన్నమాట. ప్రభుత్వం సామాన్యులను నగదు లావాదేవీలు తగ్గించి డిజిటల్ లావాదేవీల వైపు నెట్టజూడటంలో ఎదురవగల ఆచరణాత్మక సమస్యలు కూడా అనేకం ఉన్నాయన్నమాట. వాటి గురించి మీడియా ఇప్పటికే రాస్తున్నది. అటువంటపుడు ప్రతిపక్షాలు గాని, సామాజిక సంఘాలు గాని మాటలకు మించి చేయగలిగింది నిజంగానే ఏమీ లేదా? ఏమీ చేయలేని స్థితి వీరిని ఆవరించినట్లు కనిపిస్తున్నది గనుకనే ‘ప్రతిపక్ష శూన్యత’ అనే మాట ఉపయోగించవలసి వస్తున్నది.
రద్దయిన పెద్దనోట్లకు డిసెంబరు 30తో గడువు ముగిసిపోతున్నది. ఆ తర్వాత అంతా మామూలు కాగలదని ప్రధాని ఇచ్చిన హామీపై సందేహాలు మొదలయ్యాయి. ‘అంతా మామూలు కాగలద’న్న హామీని మరింత సందేహాస్పదం చేసేట్లు, ఆ తర్వాత ఆ స్థితి ‘క్రమంగా’ ఏర్పడగలదని, జనవరి నెలాఖరు కావచ్చునని, ఏప్రిల్ అయినా కాగలదని ప్రభుత్వ బాధ్యులు చేస్తున్న సూచనలు పరిస్థితిని ఉద్విగ్నంగా, సున్నితంగా మార్చుతున్నాయి. ‘డిసెంబర్ 30’ ఒక మహా ఉత్కంఠ దినంగా సమీపిస్తున్నది. దీనంతటి మధ్య ‘అవినీతి నిర్మూలన, టెర్రరిజం నిరోధం’ అనే తక్కిన రెండు హామీలు ఎవరికీ గుర్తువస్తున్నట్లు కూడా లేవు. మునుముందు మరిన్ని చర్యలు ఉండగలవని ప్రధాని ప్రకటించారు. వాటిలో డిజిటల్ లావాదేవీలు ఒకటన్నది మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్న విషయం. దానిపై సందేహాలూ మొదలయ్యాయి. ఇటువంటి స్థితిలో, డిసెంబర్ ముగిశాక మొట్టమొదట జరగవలసింది నగదు ఇక్కట్లు తీరటం. ‘ఇన్‌ఫార్మల్ ఎకానమీ’ తిరిగి కుదుటపడటం. ఇవి జరగకుండా ఇతర చర్యలవైపువెళితే, ప్రస్తుత సమస్యల పరిష్కారంలో జాప్యమైనా, కొత్త ఇక్కట్లు వచ్చినా- ప్రజల మద్దతు అనుమానాస్పదమే. *

టంకశాల అశోక్ 98481 91767