మెయన్ ఫీచర్

‘ఏకకాలంలో ఎన్నికలు’ ఎంతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు శాసనసభల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహిస్తే అవినీతికి, విశృంఖల ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఎన్నికల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ప్రతిపాదనను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైతం బలంగా సమర్ధించారు. ‘ఏడాది పొడవునా ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ఎన్నికల నియమావళి వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు సమాలోచనలు జరిపి, ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు మద్దతు ఇస్తే పరిస్థితులను మార్చవచ్చు. ఈ అంశంపై ఎన్నికల సంఘం నిర్దిష్ట కార్యప్రణాళికను రూపొందించాలి. దీనివల్ల అన్ని వర్గాలకూ మేలు జరుగుతుంది’ అని ప్రణబ్ అన్నారు.
లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మన దేశంలో కొత్తకాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951-52, 1957, 1962, 1967లలో ఇలా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. 1968, 1969లలో కొన్ని శాసనసభలు, 1970లో లోక్‌సభ అర్ధాంతరంగా రద్దుకావడంతో పరిస్థితులు మారిపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటి మూడు సార్లు లోక్‌సభ సమావేశాలు అయిదేళ్ల చొప్పున నిరాటంకంగా సాగాయి. నాలుగవ లోక్‌సభ 1970లో అర్ధాంతరంగా ముగిసింది. 1971 ఎన్నికల్లో కొలువుదీరిన అయిదవ లోక్‌సభ 1977 వరకూ నిర్ణీత కాలానికి మించి కొనసాగింది. ఆ తరువాత ఆరవ, ఏడు, తొమ్మిది, పనె్నండు, పదమూడవ లోక్‌సభలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఇదే రకమైన రాజకీయ అనిశ్చితి అనేక శాసనసభలలో ఏర్పడడంతో వాటి పదవీ కాలం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. దీంతో ఏకకాలంలో అసెంబ్లీ,లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వ్యవస్థకు దెబ్బతగిలి, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది.
సార్వత్రిక ఎన్నికల ఖర్చును కేంద్రం, శాసనసభల ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఎన్నికలు ఒకేసారి జరిగితే ఆ ఖర్చును కేంద్రం, రాష్ట్రాలు కలిసి భరిస్తాయి. ప్రభుత్వం చేసే ఎన్నికల నిర్వహణా వ్యయానికి ఎన్నో రెట్లు అధికంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. 1989 వరకూ ఒక మోస్తరుగా ఉన్న ఎన్నికల నిర్వహణా వ్యయం ఆ తరువాత అనూహ్యంగా పెరిగింది. 2009 ఎన్నికలకు 1,115 కోట్లు, 2014 ఎన్నికలకు 3,870 కోట్లు ఖర్చయ్యాయి. 2015లో బిహార్ శాసనసభ ఎన్నికలకు 300 కోట్లు వెచ్చించారు. 2017లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 240 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఇప్పటికే అంచనావేశారు. తరచూ జరిగే ఎన్నికల వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 8,000 కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. సాలీనా ఈ ఖర్చు 1,500 కోట్లు. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే దాదాపు 4,000 కోట్లు అవసరం. ఈ పద్ధతి వల్ల ఎన్నికల నిర్వహణా వ్యయం సగానికి పైగా తగ్గిపోతుంది. ప్రజాధనం చాలామేరకు ఆదా అవుతుంది.
ఎన్నికల నిబంధనావళి ప్రకారం లోక్‌సభ అభ్యర్థి 70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి 28 లక్షలకు లోబడి ఖర్చుపెట్టాలి. ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు లెక్కకు అందని రీతిలో ఖర్చుపెడుతున్నారు. దీంతో ఎన్నికలలో అవినీతి, నల్లధనం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ‘ప్రస్తుత ఎన్నికల విధానంతో అవినీతి పెరుగుతోంది. ఎన్నికల్లో గెలిచాక రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కై తాము పెట్టిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నందున అవినీతి ప్రారంభమవుతోంది..’ అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ ఎస్.వై.ఖురేషీ అంటున్నారు. అంచనా వేయడం కష్టమే అయినప్పటికీ అనధికారిక వర్గాల ప్రకారం 2014 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాయి. దేశంలో ఏటా ఏదో ఒక ఎన్నికలు జరుగుతూ ఉండడంతో రాజకీయ పార్టీలు నిధుల సేకరణలో నిమగ్నమైపోతున్నాయి. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే రాజకీయ రంగంలో అవినీతికి అడ్డుకట్టవేయడానికి ఆస్కారం ఉంటుంది.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో గడువు ముగిసేవరకూ నిబంధనావళి అమలులో ఉంటుంది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్’ను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. ‘కోడ్’ కారణంగా సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్పించి, మిగతా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎన్నికలు జరగడంతో సుదీర్ఘకాలంపాటు ‘కోడ్’ అమలులో ఉంటున్నందున విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకం ఏర్పడడంతోపాటు సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలు ఆగిపోతున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 79వ నివేదికలో పేర్కొన్నది. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో కొన్ని నెలలపాటు ‘కోడ్’ అమలులో ఉండడంతో అభివృద్ధి పనులు నెమ్మదించాయి. 2021 వరకూ దేశంలో వివిధ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో దాదాపు రెండు నెలలపాటు కోడ్ అమలులో ఉంటుంది. ఏడాదిలో సగటున రెండు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే 4 నెలలు కోడ్ అమలులో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది ఎక్కువ కాలం కూడా ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలు నెమ్మదిస్తాయి. ఈ పరిస్థితి అభిలషణీయం కాదు. ఎన్నికల నిర్వహణ అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పెద్దసంఖ్యలో పోలింగ్ అధికారులతోపాటు రక్షణ బలగాలను వినియోగిస్తారు. 16వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు కోటి మంది ఎన్నికల సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. ఎన్నికలకు సాధారణంగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) సేవలను వాడుకుంటారు. తగినంత సిబ్బంది సిఎపిఎఫ్ దగ్గర లేకపోవడంతో స్టేట్ ఆర్మ్‌డ్ పోలీస్, హోమ్‌గార్డ్స్ తదితర సంస్థల సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. ఎన్నికలకు ముందుగా ప్రారంభమైన వీరి విధులు కౌంటింగ్ ముగిసేవరకూ అనేక వారాల పాటు కొనసాగుతాయి. గత లోక్‌సభ ఎన్నికలకు 1349 కంపెనీల సిఎపిఎఫ్ సిబ్బందిని వినియోగించారు. ఎన్నికలకు రక్షణ బలగాలను ఒకచోట నుంచి మరొక ప్రదేశానికి తరలించడం కష్టమైన పనే. ఇనే్నసి నెలలపాటు వీరి సేవలు దేశరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు దూరంగా ఉంటున్నాయి. దేశ సరిహద్దులను కాపాడాల్సిన, అంతర్గత భద్రతను పటిష్టం చేయాల్సిన భాద్రతా బలగాలను వారి విధులకు దూరంగా ఎన్నికలలో వినియోగించడం శ్రేయస్కరం కాదు.
ఈ నేపథ్యంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నది. వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మేధావులతోపాటు ఎన్నికల సంఘం, లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నుంచి ఇందుకు అనుకూలంగా నివేదికలు వచ్చాయి. దీన్ని అమలు చేయడంలో సాధక బాధకాలను తొలగించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎన్.సి.పి, మజ్లిస్ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీలు, లోక్‌సభ పదవీకాలాన్ని ఎలా సమన్వయ పరుస్తారు? అని ఈ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. అర్ధంతరంగా అధికార పార్టీ మద్దతును కోల్పోయినట్లయితే ఆ అసెంబ్లీ పరిస్థితి ఏమిటి? అన్నది మరొక ప్రశ్న. మన ఓటర్లు ఒక్కో ఎన్నికలలో ఒక్కో విధంగా స్పందిస్తారు. స్థానిక సంస్థలలో ఒక రకంగా, అసెంబ్లీ ఎన్నికలలో మరొక విధంగా, పార్లమెంట్ ఎన్నికలలో ఇంకొక రకంగా వారు స్పందించడం మనం గమనిస్తూనే ఉన్నాము. ఆయా ఎన్నికలను బట్టి వారి ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే పార్టీకి అనుకూలంగా ఓటర్లను మలుచుకోవడానికే ఏకకాలంలో ఎన్నికలు ఉపయోగపడతాయన్న ప్రతిపక్షాల ఆరోపణలలో పస కనపడడం లేదు. గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పటికీ లోక్‌సభకు ఒక రకంగా, అసెంబ్లీ మరొక రకంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఏకకాల ఎన్నికలతో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందన్న వాదనలోనూ పస కనపడడం లేదు. అయిదేళ్ల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు చట్టసభల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతాయనడంలో సందేహం లేదు. రాజకీయ సామర్థ్యంతోపాటు ప్రజాహిత పనుల్లో నాణ్యత పెరుగుతుంది. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సంబంధాలు బలపడతాయి. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా పరిపాలన కొనసాగుతుంది.
ఒకేసారి ఎన్నికలు జరిగితే వేల కోట్ల రూపాయలలో ఖర్చు ఆదా మిగులుతుంది. ఈ మొత్తాన్ని ప్రజాసంక్షేమ పథకాలకు మళ్ళించే అవకాశం ఉన్నది. రాజకీయ పార్టీలు అభ్యర్థులు పెట్టే ఖర్చు తగ్గడమే కాకుండా నియంత్రణ ఏర్పడుతుంది. విలువైన సమయం ఆదా అవుతుంది. విధాన నిర్ణయాలను, సంక్షేమ పథకాలను సకాలంలో అమలుచేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మించి కులం, మతం పేరిట రాజకీయ వ్యవస్థను శాసిస్తున్న ‘ఓటు బ్యాంక్’ రాజకీయాలకు స్వస్తిచెప్పే అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం రాజకీయ సిద్ధాంతాలు, కార్యాచరణ పథకాలను కాదని కుల సమీకరణాల ఆధారంగా ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఈ నీచ సంస్కృతిని కూలదోసి సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలను పక్కకుపెట్టి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగవుతాయి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అత్యంత అవసరం. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113