ఎడిట్ పేజీ

‘బంగారు తెలంగాణ’ పునాదులు ఇవిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు కాగా, గత రెండేళ్లలో నేను కనీసం ఇరవైసార్లు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లాను. అక్కడి వారితో మాట్లాడటం, తెలంగాణలో నివసిస్తున్న ఆ ప్రాంతీయులతో కలవటం వంటి సందర్భాల్లో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. వీరందరిలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, ఉద్యోగాలు, పనులు చేసుకునేవారి దాకా చాలా వైవిధ్యత ఉంది. నాయకులు, రాజకీయ కార్యకర్తలు,మేధావులు, రచయతలు, జర్నలిస్టులు సరేసరి. తెలంగాణలో పరిపాలన బాగాలేదని వేలెత్తి చూపిన వారు వీరిలో బహుశా అయిదు శాతానికి మించరు. తక్కిన 95 శాతానికి సానుకూల అభిప్రాయం ఉండటం ఆశ్చర్యమనిపించింది. సానుకూలతను ఏర్పరచుకునే సమాచారం వీరికి ఎట్లా అందుబాటులోకి వచ్చిందా? అన్నదే ఆ ఆశ్చర్యకరం.
రాష్ట్రం విడిపోయిన కొత్తలో సుమారు ఆరుమాసాలకు పైగా, తెలంగాణ వార్తలు ఎపి పత్రికల్లో, టీవీ చానళ్లలో సరిగా వచ్చేవి కావు. అందుకు ప్రధానంగా మూడు కారణాలు కన్పించాయి. రాష్ట్రం వేరైనందున ఇక్కడి వార్తలు అక్కడివారికి అంతగా అవసరం కావనే తార్కికమైన స్థితి ఒకటి. విభజన సృష్టించిన ఆగ్రహం తగ్గకపోవటం, విభజన సమస్యలపై కలహాలు సాగుతుండటం రెండవది. ఈ పరిస్థితుల మధ్య అక్కడి సాధారణ ప్రజలకు కూడా పాలనాపరంగా తెలంగాణలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడకపోవటం మూడవది. వాస్తవానికి తొలి దశలో తెలంగాణ పాలన అప్పుడప్పుడే కుదురుకుంటున్నది గాని, చెప్పుకోదగినవంటూ ఒకటీ అరాకు మించి జరగలేదు. అదెంత నిజమో, ఎపిలో సామాన్య ప్రజలకు తెలంగాణ పట్ల ఆసక్తి ఏర్పడకపోవటం కూడా అంతే నిజం. ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు మారసాగాయి. తెలంగాణ పరిపాలన ముందుకు సాగటం, ఆ సమాచారాలు అందుబాటులోకి రావటం, సానుకూల అభిప్రాయాలు ఏర్పడటం మొదలయ్యాయి.
పైన పేర్కొన్న పరిస్థితులు మొదటి ఆరుమాసాల తర్వాత నుంచి క్రమంగా మారసాగాయి. విభజన ఆగ్రహాలు నెమ్మదిగా చల్లబడటం మొదలైంది. విభజన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంతీయులకు సమస్యలు ఏర్పడగలవన్న భయాలు నిజం కాదని తేలిపోయింది. విభజన సమస్యలు చాలావరకూ కొలిక్కి వస్తుండటం, ఇంకా కానివి పెచ్చరిల్లిపోవటం గాక, రెండువైపులా గల విజ్ఞతవల్లనైతేనేమి, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారానో, నేరుగానో జోక్యం చేసుకోవడంవల్ల నైతేనేమి మంద్రస్థాయిలో ఉండటం మరొక మార్పు అయింది. ఎపి ప్రజలు కొంతకాలం పాటు స్వరాష్ట్ర పాలనను గమనించిన తర్వాత, దానిని తెలంగాణ పాలనతో పోల్చిచూసే ధోరణి బయలుదేరింది. దీంతో తెలంగాణ పాలన పట్ల కుతూహలం ఏర్పడసాగింది. ఈ దశనుంచి వారికి తెలంగాణ గురించిన సమాచారం అందటం పెరిగింది. ఇది వేర్వేరు రూపాలలో జరిగింది. పత్రికలు, ఛానళ్లలో తెలంగాణ వార్తలు గతం కన్న ఎక్కువయాయి. తెలంగాణ పాలన కుదుటపడి ముందుకు సాగుతున్నందున సానుకూల అభిప్రాయాలు ఏర్పడసాగాయి. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు విఘాతమన్నది ఎప్పుడూ లేనందున, ఈ కొత్త దశలో వచ్చిపోతున్న వారినుంచి సానుకూల సమాచారాలు రాసాగాయి. రాష్ట్రం విడిపోయింది 2014 జూన్‌లో కాగా, ఆ తర్వాత పండగలకు పెద్దఎత్తున ఎపి వాసులు తమ స్వస్థలాలకు వెళ్లడం, తమ వారితో తెలంగాణ గురించిన సంభాషణలు ఇందుకు దోహదం చేసాయి. ఆ విధంగా 2015 మధ్యకాలం వచ్చేసరికి సమాచారాలు, అభిప్రాయాలు మారటం వేగాన్ని అందుకుంది. కాలం గడిచినాకొద్దీ ఇదే ధోరణి మరింత పెరగటం తప్ప వెనుక ముఖం పట్టింది లేదు. నేను గత నెలలో విశాఖపట్నం వెళ్లినపుడు అక్కడి వారి నుంచి - ‘బంగారు తెలంగాణ’ అనే మాటనైతే ఉపయోగించటం లేదుగాని, ‘బాగుంది, చాలా బాగుంది’ అన్న మాటలు వినవచ్చాయి. వారికి ‘తెలంగాణ అభివృద్ధి వ్యూహం’ అనే విషయాలు తెలియవు. బాగా చదువుకున్నవారికి, మేధావులకు, నాయకులకు కూడా ఆ విషయాలు తెలియకపోవడానికి అటువంటి వ్యూహం అనేది ఒకటుందని గాని, అదేమిటని గాని అక్కడ సమాచారం లేకపోవడమే కారణమని అనిపించింది. వారికి తెలియవస్తున్నవి ముఖ్యంగా వివిధ పరిపాలనా చర్యలు. సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు, విద్యుత్తు, గురుకులాలు, ఉద్యోగులకు వేతనాల హెచ్చింపు, చెరువులు, చేపలు, ప్రాజెక్టులు మొదలైనవి. ఇవి పేదలకు, రైతులకు, పనులు చేసుకునేవారికి, పరిశ్రమల అభివృద్ధికి, యువకుల ఉపాధికి ఉపయోగపడతాయన్నది అక్కడివారి స్థూలమైన అవగాహన. మొత్తం వ్యూహం గురించి తెలియనట్లే, ఈ వివిధాంశాలలో కొందరికి కొన్ని తెలియవచ్చు, కొందరికి కొంత ఎక్కువ తెలియవచ్చు.
విశేషం ఏమంటే, జాతీయస్థాయిలోనూ పరిస్థితి ఇదే విధంగా పరిణమిస్తూ వస్తున్నది. అక్కడ మేధావులు, మీడియా, ఉన్నతాధికార వర్గాలు, దౌత్యవర్గాలు, రాజకీయ నాయకులలో తెలంగాణ పట్ల ఉద్యమకాలంలో వ్యతిరేక అభిప్రాయం ఉండేది. ఇందుకు ఒక కారణం- తెలంగాణ ప్రజల ఆకాంక్ష అధికులకు తెలియకపోవటం. మరొక కారణం- ఆర్థిక సంస్కరణల దరిమిలా అందరిలో ‘అభివృద్ధి మూడ్’ వంటిది వచ్చి, రాష్ట్రాల విభజన అభివృద్ధిని దెబ్బతీస్తుందనుకోవటం. సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మాట అనటంతోపాటు తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లు పెరుగుతారనటం. ఇంకొక కారణం టిడిపి నాయకత్వానికి ఢిల్లీలోని యంత్రాంగం, సిపిఎం యంత్రాంగం, కాంగ్రెస్‌లోని ఒక వర్గం తెలంగాణ పట్ల వ్యతిరేక ప్రచారాన్ని సాగించటం. దానిని తెలంగాణవాదులు ఎదుర్కొనలేకపోవటం. ఇదంతా టిఆర్‌ఎస్ నాయకత్వం పట్ల కూడా వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగించింది. విభజనకు ముందు ఉన్న ఈ అభిప్రాయం ఆ తర్వాత కూడా కొనసాగింది. చంద్రబాబుకు ఎన్టీఆర్ కాలం నుంచి ఢిల్లీలో ఏర్పడిన సంబంధాలు, సంస్కరణలవాదిగా వచ్చిన పేరు, విభజన సమస్యల పరిష్కారానికి తాను సామరస్య పూర్వక ప్రయత్నాలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం కలసిరావటం లేదన్న ప్రచారం, సమగ్ర కుటుంబ సర్వే ఉద్దేశం ఆంధ్రులను వెళ్లగొట్టటమనే అపోహలు జాతీయస్థాయిలో సృష్టించగలగటం వంటివి కలిసి తెలంగాణకు విభజన అనంతరం కూడా ప్రతికూలమయ్యాయి. ఇటువంటి అభిప్రాయాలను పూర్తిగాకాకపోయినా తగినంతమేర దూరం చేయగల అవకాశాలు ఉద్యమకాలంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉండేవి. కాని, కారణాలు ఏమైతేనేమి అటువంటి ప్రయత్నాలు జరగలేదు. అందువల్ల జరిగిన నష్టాలు తక్కువ కాదు.
వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి, ఆకాంక్షలకు వాస్తవ పరిస్థితులను బట్టి దేశవ్యాప్తంగా సానుభూతి, మద్దతు లభించాలి. కాని అది రావలసినంత రాలేదు. ఇటువంటి పరిస్థితులలో మార్పు ఇప్పుడిప్పుడే కొంత కన్పిస్తున్నది. అందుకు కారణం తెలంగాణ ప్రభుత్వ పరిపాలన తీరని వేరే చెప్పనక్కరలేదు. ప్రభుత్వం చేయవలసింది బాగా చేసుకుంటూపోతే ఇతరులు వెనుకముందు, వెనుకలుగా తామే గుర్తిస్తారన్న వైఖరి దీనివెనుక ఉందేమోననే అభిప్రాయం కలుగుతుంటుంది. ఇది సరైనదా? కాదా? అనే చర్చ చేయవచ్చు. కాని యథాతథంగా అదొక వైఖరి. తెలంగాణ నాయకత్వం ఆలోచన అదేనో కాదో మనకు తెలియదు గాని, ఇది బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరాంను గుర్తుచేస్తుంది. తాము గుర్తింపుకోసం ఇతరుల చుట్టూ తిరగబోమని, తమ పని తాముచేసి బలపడితే ఇతరులే అది గుర్తించి తమవద్దకు వస్తారని ఆయన అనేవారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో వలెనే జాతీయస్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వ పరిపాలనకు గుర్తింపు లభించటం మొదలైంది. అయితే ప్రస్తుతానికి అది ఇంకా జాతీయ ప్రభుత్వం, అధికార యంత్రాంగం, పరిశ్రమలు, వ్యాపారాలు, తదితర సంస్థల స్థాయిలో ఉంది. పార్టీలు, మీడియా మేధావి వర్గాలకు అంతగా వ్యాపించలేదు. ఇందుకు ఏకైక కారణం సమాచార లోపం. మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గాని, అటు జాతీయస్థాయిలో గాని ఏర్పడుతున్న ‘కొత్త అభిప్రాయం’ సానుకూలమైనది కావటం వౌలికంగా గుర్తించవలసిన విషయం. రాగల కాలంలో ఈ రాష్ట్రం బాగుపడబోతున్నదని, ఆ జాడలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయన్నది వీరందరి అభిప్రాయం. ఈ అభిప్రాయం జాతీయ స్థాయిలోనూ ఏర్పడటం మరొకందుకు కూడా గమనించదగ్గది అవుతున్నది. 2000లో ఏర్పడిన చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ అనే చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాయా? లేదా? అనే చర్చ సుమారు దశాబ్దకాలంగా నడుస్తున్నది గాని ఇప్పటికీ ఇదమిత్థంగా తేలలేదు. అవి అభివృద్ధి చెందలేదనేవారు తెలంగాణ ఏర్పాటునూ వ్యతిరేకించారు. తెలంగాణ చిన్నది కాదన్నది వేరే విషయం. కాని వ్యతిరేకతలోని ఉద్దేశం విభజన వల్ల ఉపయోగం ఉండదనటం. ఇదే దృష్టితో 2014 అనంతరపు తెలంగాణను గమనిస్తున్నవారు, ఇక్కడి పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు అంగీకరించటం మొదలుపెట్టారు.
ఇటువంటి మార్పులు బయటివారిలో కన్పిస్తున్నాయంటే అందుకు కారణం ‘బంగారు’ లేదా మెరుగైన తెలంగాణకు పునాదులు పడుతుండటమేనని వేరే చెప్పనక్కరలేదు. అది ఏవిధంగా జరుగుతున్నదో ఆయా చర్యలను విడివిడిగా చెప్పుకోవటం కన్న ఒక వ్యూహం అనే ఫ్రేమ్‌వర్క్ ప్రకారం చూడటం వల్ల స్పష్టత వస్తుంది. వ్యూహంలో ప్రధానంగా రెండు భాగాలున్నట్లు ప్రభుత్వ ప్రకటనలను, కార్యాచరణను పరిశీలించినపుడు అర్థమవుతుంది. ఒక భాగం సంక్షేమం, రెండవ భాగం అభివృద్ధి. ఈ రెండింటిని విశే్లషిస్తే సంక్షేమంలో రెండున్నాయి. ఒకటి, బడుగువర్గాల దైనందిన మనుగడ. రెండవది- మనుగడకు ఉపకరిస్తూనే వారిని దీర్ఘకాలంలో ‘మానవ వనరులు’గా లేక మనుషులుగా అభివృద్ధిపరచి సమాజంలో భాగంగా నిలబెట్టటం. ఇక అభివృద్ధి అనే దానిలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, వృత్తుల అభివృద్ధి, సమతులనంతో కూడిన ప్రాంతీయాభివృద్ధి, మధ్యమకాల అభివృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధి, సామాజికాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి అంటూ అనేకం ఉన్నాయి. వీటన్నింటితో కూడుకున్నది సమగ్రమైన, వాంఛనీయమైన అభివృద్ధి అవుతుంది. తెలంగాణలో రెండున్నరేళ్ల పాలనను పరిశీలించినపుడు ఈ విధమైన సంక్షేమం, అభివృద్ధి అనదగిన వాటికి ఆలోచనలు, ఆచరణలు ఏదో ఒక స్థాయిలో మొదలై కన్పిస్తాయి. అవి మెరుగైన తెలంగాణకు పునాదులవుతున్నాయి. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767