మెయన్ ఫీచర్

ఆహారలోపంతో నీరసిస్తున్న బాల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నప్పటికీ భారత్ సహా అనేక దేశాల్లో పేదరికం, ఆకలి సమస్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. అంతర్జాతీయ ఆహా ర విధాన పరిశోధనా సంస్థ ( ఐఎఫ్‌పిఆర్‌ఐ) భారత్‌తో పాటు 118 దేశాల్లో ప్రజలకు ఆహార లభ్యత, ఆకలి సమస్యలను పరిశీలించి, ‘ప్రపంచ ఆహారలేమి సూచీ’ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్- జి.హెచ్.ఐ)ని గత ఏడాది అక్టోబర్‌లో రూపొందించారు. ఈ సంస్థ 118 దేశాల్లో స్థితిగతులను విశే్లషించగా భారత్‌కు 97వ ర్యాంకు వచ్చింది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే ఆహార భద్రత, పేదరికం నిర్మూలన విషయంలో మనం వెనుకబడే ఉన్నామని తేలింది. ఆకలి సమస్య విషయంలో మన దేశంలోని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధ్యయనంలో వెల్లడైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా నెలకొన్న పరిస్థితి ఇది. మన రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రజలకు గల జీవించే హక్కును గురించి చెబుతూంటే, 42వ అధికరణం ‘ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదే’ అని నొక్కివక్కాణిస్తున్నది. ప్రభుత్వం ఈ బాధ్యతను నిర్వర్తించినపుడే ఆహార భద్రత లభిస్తుంది.
‘ఆహార భద్రత’ అంటే ఏదో వేళకు ఇంత తిని ఆకలిని కొంతమేరకు ఉపశమింప చేసుకోవడం కాదు. ఆహార భద్రతలో ఏయే అంశాలు ఉండాలో స్వామినాథన్ ఫౌండేషన్ వారు కొన్ని విషయాలను ప్రస్తావించారు. అవి ఏమిటంటే- దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కావలసిన మేరకు వుండాలి. లభ్యమవుతున్న ఆహారాన్ని వినియోగం చెయ్యడానికి కావలసిన కొనుగోలుశక్తి ప్రజలలో వుండాలి. ఈ రెండింటికీ అనుబంధంగా మంచినీటి లభ్యత, వైద్యం, పారిశుద్ధ్యం, ఇతర వౌలిక సదుపాయాలు మెరుగైన రీతిలో వుండాలి. పాలకులు ‘ఆహార భద్రతా చట్టం’ చేసినంత మాత్రాన సరిపోదు. ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా పనిచేసిన ఓ ప్రముఖుడు పదవ పంచవర్ష ప్రణాళిక వచ్చిన రోజుల్లో ఒక వ్యాసంలో- ‘పంచవర్ష ప్రణాళికల లక్ష్యం ‘దారిద్య్ర నిర్మూలన’. అయితే దీని గురించి గంభీర ఉపన్యాసాలు తప్ప ఇంతవరకూ నిజమైన ఫలితాలు సాధించలేకపోయామ’ని రాసిన వాక్యాలు ఈనాటికీ వర్తిస్తాయి. ఆహార భద్రతను సాధించేందుకు అవసరమైన ‘ప్రజాపంపిణీ వ్యవస్థ’ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) దగ్గిర నుండి ఉపాధి కల్పన వరకూ ఏ పథకాన్నీ పాలకులు సక్రమంగా అమలు జరపడం లేదు.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నిరుపేదలున్నది భారత్‌లోనే అని, మనదేశ జనాభాలో ఇప్పటికీ 30 శాతం మంది పేదలున్నారని ఇటీవల విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఈ నిరుపేదల సంఖ్య 22.4 కోట్లు అని ఆ నివేదికలో వెల్లడించారు. రోజుకు 1.9 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం గలవారిని నిరుపేదలుగా ప్రపంచ బ్యాంకు భావిస్తుంది. ఇంతమంది నిరుపేద తల్లిదండ్రులున్న దేశంలో అయిదేళ్ల వయసు రాకముందే చనిపోతున్న పిల్లల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఎలాగో బతికినా చాలామంది పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, పౌష్టికాహార లోపం, అనారోగ్యం, ఇతర వ్యాధులు కనిపిస్తున్నాయి. ప్రసూతి సమయంలో, ఆ తర్వాత కొద్దికాలానికి చనిపోతున్న తల్లుల సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువే.
బాలల పౌష్టికాహార లేమితో భారత్ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని ‘అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ (యునిసెఫ్) నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ సమస్య తీవ్రంగా వుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. పౌష్టికాహార లేమి కారణంగా ఈ ప్రాంతాలలో 42 శాతం బాలలు ఎదుగుదల లేకుండాను, 32 శాతం బాలలు తక్కువ బరువుతోను ఉన్నారు. 15 శాతం మంది చిన్నారులు విరోచనాలతో బాధపడుతున్నారు. సరైన ఆహారం లేని పిల్లలు శారీరకంగానే కాదు. మానసికంగా కూడా ఎదుగుదల లేకుండా వుంటారు. వీరు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నింటికీ ప్రధాన కారణం దారిద్య్రం అని వేరే చెప్పనవసరం లేదు. దారిద్య్రం కారణంగా బాలలకు పోషకాహారం లభించదు. ఫలితంగా వారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనినే అర్థశాస్తవ్రేత్తలు ‘పావెర్టీ న్యూట్రిషన్ ట్రాప్’ అని అంటారు. ఈ సమస్యను ఎదుర్కొనేలా బాలలు, తల్లుల కోసం పాలకులు పలు సంక్షేమ పథకాలను రూపొందించిన మాట వాస్తవమే. వాటిలో సమీకృత శిశుసంక్షేమ పథకం (ఐసిడిఎస్) ప్రముఖంగా పేర్కొనదగ్గది. బాలలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే పథకాలలో ప్రపంచం మొత్తం మీద ఇది అతి పెద్దది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం కూడా విశ్వవిఖ్యాతి గాంచింది. ఇవన్నీ వాస్తవాలే అయినప్పటికీ వీటి ఆచరణలోనే అసలు సమస్య ఎదురవుతోంది. ఈమధ్య హర్యానాలో జరిగిన అధ్యయనంలో పలు ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. పౌష్టికాహారం పంపిణీ పథకానికి కేంద్రం ఇచ్చే నిధులు బాగా తగ్గిపోయాయి. ఆరోగ్యం, పౌష్టికాహారంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగినంత మంది ఉద్యోగులు లేరు. 40 మంది ఉద్యోగులు ఉండాల్సినచోట పదిమంది కూడా వుండటం లేదు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో బాలబాలికలలో విటమిన్ల లోపం, ఐరన్ లోపం, ప్రొటీన్ల లోపం వుంటాయి. వారికి కావలసిన గుడ్లు, పాలు, ఆకుకూరలు వంటివి అందజేయవలసి వుంటుంది. తగినన్ని నిధులు లేకుండా ఇవన్నీ ఎలా అమలు జరుగుతాయి?
ఇక, అదనపు పౌష్టికాహారం పేరుతో ఇచ్చే ప్యాకెట్లు- రుచీ పచీ లేకుండా తినడానికి వీలులేని రీతిలో వున్నందున వాటిని పుచ్చుకున్నవారు పారవేసిన సందర్భాలు చాలా వున్నాయి. కొత్తగా ఐసిడిఎస్‌లో చేరిన ఉద్యోగులకు తగు శిక్షణ ఇచ్చిన సందర్భాలు తక్కువే. ఈ ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఉన్నతాధికారులకు పంపాలి. కంప్యూటర్‌లు లేక ఉన్నా వాటిపై పరిజ్ఞానం లేక పర్యవేక్షకులు నానా అవస్థలు పడుతున్నారు. నివేదికలను బయటి నుంచి ఆన్‌లైన్‌లో పంపాలనుకున్నా దానికి డబ్బు ఎవరిస్తారు? ఆధార్ కార్డుల నమోదు, ఇతర పనులు కూడా వీరే చెయ్యాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఇలాంటి అదనపు బాధ్యతలు నిర్వహించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
హర్యానాలో నెలకొన్న పరిస్థితులే దాదాపు దేశమంతటా కనిపిస్తున్నాయి. పిల్లలు పుష్ఠిగా ఎదగడానికి కావలసిన పాలు, గుడ్లు, బిస్కట్లు, విటమిన్ మాత్రలను బీద పిల్లలకు అందివ్వలేని స్థితి కొనసాగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. 5 ఏళ్ల వయసులోపు పిల్లల్లో 48 శాతం మంది పౌష్ఠికాహార లోపంతో ఎదుగుదలకు నోచుకోవడం లేదు. ఇరవై శాతం మంది తరచూ విరేచనాలతో బాధపడుతున్నారు. నలభై మూడు శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. దీనికి కారణం- దేశంలో ఆర్థికాభివృద్ధి లేకపోవడమా? బాలల పట్ల శ్రద్ధ చూపించాలనే ఉద్దేశం లేకపోవడమా?-
ఆర్థికపరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అధిక వృద్ధిరేటు (గ్రోత్‌రేట్)గల రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. ఇటీవల గుజరాత్‌లో జరిపిన ఒక సర్వే ప్రకారం- ఆ రాష్ట్రంలోని 13 గిరిజన జిల్లాలలో దాదాపు 50 వేల మంది బాలలు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు. గిరిజనేతర ప్రాంతాల్లోనూ ఈ సమస్య లేకపోలేదు. ప్రతి ముగ్గురు బాలలలో ఒకరు తక్కువ బరువును కలిగి ఉన్నారు. అంగన్‌వాడీలలో వున్న 43 లక్షలమంది పిల్లలలో 1.47 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 1.87 కోట్ల మందికి సమీకృత శిశుసంక్షేమ పథకం కింద ఎలాంటి సేవలు అందడం లేదు. అంగన్‌వాడీలలో పనిచేసే ఉద్యోగులు గ్రామీణులకు ముఖం చూపించడం లేదు. చాలామంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అందడం లేదు. దీనికి కారణం- గుజరాత్ ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించక పోవడం, పాలకులతో పాటు అధికారులకు ఈ పథకాలపై చిత్తశుద్ధి లేకపోవడం. దేశం మొత్తం మీద ఈ పరిస్థితి ఇంచుమించుగా ఒకేలా వుంది. ఆహార లేమి వల్ల పేద వర్గాల వారు క్షయవ్యాధికి లోనవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్షయవ్యాధి నిరోధక కార్యక్రమం భారతదేశంలోనే వుంది. కానీ, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2014-2015లో క్షయ రోగుల సంఖ్య 22 లక్షల నుంచి 28 లక్షలకు పెరిగింది. మనం చేపడుతున్న కార్యక్రమాల్లో చిత్తశుద్ధి లోపించడం ఇందుకు కారణం.
బాలబాలికలకు అనారోగ్యం చేస్తే చాలా గ్రామాల్లో తగిన వైద్య సదుపాయాలు లేవు. చాలా ఆస్పత్రులలో వైద్యుల నియామకం కావలసిన రీతిలో వుండదు. వైద్య సదుపాయాలూ వుండవు. దీనికి కారణం వైద్య రంగంపై మనం చేస్తున్న వ్యయం తక్కువగా వుండడమే. మన స్థూల జాతీయోత్పత్తి విలువలో కేవలం 1.5 శాతం మాత్రమే ప్రజారోగ్యంపై ఖర్చుచేస్తున్నాం. ఇది కనీసం 2.5 శాతం వుండాలి. ఈ విషయంలో థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలు ఎక్కువ వ్యయం చేస్తున్నాయి. ఆకలి, దారిద్య్రం, పౌష్ఠికాహార లోపం, క్షయ.. ఇవన్నీ ఒక విష వలయం. ఇందులో చిక్కుకున్న బాలలను రక్షించలేమా?
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969