మెయన్ ఫీచర్

ఎన్నికల సంస్కరణకు ఇది నాందీ ప్రస్తావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులం, మతం ఆధారంగా ఓట్లు దండుకోవడం కుదరదని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎన్నికల సంస్కరణలో కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగంలోని వౌలిక విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ కులమతాల పేరిట ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. వ్యక్తులకు, భగవంతుడికి మధ్య సంబంధాలు వ్యక్తిగత విషయాలని చెబుతూనే మతాన్ని రాజకీయాలతో ముడివేయడాన్ని రాజ్యాంగం ఆమోదించదని తేల్చి చెప్పింది. దేశ పరిపాలనా విధానాలపై మత ప్రభావాన్ని ఆమోదించబోమని అన్నది. ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్‌తో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు సభ్యుల మెజారిటీ అభిప్రాయంతో ఈ తీర్పు వెలువడింది. ఎన్నికల నిర్వహణ లౌకిక తత్వంతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఇందులో మతానికి తావులేదని నలుగురు సభ్యులు వాదిస్తే కులం, మతం అంశాలపై బహిరంగ చర్చ రాజ్యాంగబద్ధమైనదేనని, దీనిపై నియంత్రణ విధించడం కుదరదని మిగిలిన ముగ్గురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3) ప్రకారం అభ్యర్థులు కానీ వారి తరఫున ఇతర ప్రతినిధులు కానీ కులం, మతం, వర్గం ఆధారంగా ఓట్లను అభ్యర్థించడం కుదరదు. ఈ నిబంధన ఉల్లంఘన జరిగిన పక్షంలో ఆయా అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3)పై దాదాపు పాతికేళ్ల క్రితం వివిధ కోర్టుల్లో వెలువడ్డ అభిప్రాయాలపై సరైన వ్యాఖ్యానం కోసం ఈ కేసులు 1992లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఈ ప్రక్రియలో రెండు కేసులు (అభిరామ్ సింగ్ వర్సెస్ సి.డి.కొమ్మాచిన్, నారాయణ్ సింగ్ వర్సెస్ సుందర్‌లాల్ పట్వా) ప్రధాన పాత్ర పోషించాయి. 1990లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శాంతాక్రజ్ స్థానం నుంచి గెలిచిన అభిరామ్ సింగ్ ఎన్నికను సి.డి.కొమ్మాచిన్ సవాల్ చేశారు. ఈ ఎన్నికలలో ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 123(3) ప్రకారం అభిరామ్ సింగ్ ‘ఎన్నికల అక్రమాలకు’ పాల్పడ్డాడంటూ ముంబయి హైకోర్టు ఆయన ఎన్నికను కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ అభిరామ్ సింగ్ 1992లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ ఒక కీలక అంశాన్ని లేవనెత్తింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3) ప్రకారం ఎన్నికల అక్రమాలు వాటి పరిధులు, తదితర అంశాలపై సమగ్ర వ్యాఖ్యానం అవసరం. ఇలా జరగని పక్షంలో చట్టంలోని సెక్షన్‌లను వ్యాఖ్యానించే సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంది అని భావించిన ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును అయిదుగురు జడ్జీలు ఉన్న ధర్మాసనానికి అప్పగించింది.
1993లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భోజ్‌పూర్ నుంచి గెలుపొందిన సుందర్‌లాల్ పట్వా ఎన్నికను నారాయణ్ సింగ్ సవాల్ చేశారు. మతం ఆధారంగా ఎన్నికల ప్రచారం చేస్తూ పట్వా ఓట్లను అభ్యర్థించారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3) ప్రకారం ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ఫిర్యాదును కొట్టివేసింది. దీనిపై నారాయణ్ సింగ్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు సెక్షన్ 123(3)కు 1961లో చేసిన సవరణలలో కొన్ని తప్పులు కనపడ్డాయి. ఎన్నికల అక్రమాలకు సంబంధించి సవరణకు ముందు, సవరణ తరువాత వ్యత్యాసం పెరగడమే కాకుండా అర్థాలు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. సవరణల సమయంలో కొన్ని పదాలు తీసివేయడం, కొన్ని పదాలను చేర్చడం వల్ల పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలు వెలువడే ప్రమాదం ఏర్పడింది. సుదీర్ఘకాలం పాటు అయిదుగురు జడ్జీల బెంచ్ ముందు వాదోపవాదాలు జరిగిన తరువాత ఈ రెండు ప్రధానమైన కేసులతోపాటు మరికొన్ని కేసులు కూడా కలిపి ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ విస్తృత ధర్మాసనం ముందున్న ప్రధాన ప్రశ్నలు- ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3)కింద ఏయే చర్యలు ఎన్నికల అక్రమాల కిందకు వస్తాయి? వాటి పరిధులు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ సెక్షన్ 123(3)పై వ్యాఖ్యానం చేస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అయితే, విచిత్రమైన పరిస్థితి ఏమంటే గతంలో లేని విధంగా ఏడుగురు సభ్యులలో ముగ్గురు ప్రకటిత తీర్పుపై తమ అభ్యంతరాలను వెల్లడించారు. కులం, మతం, భాష, ప్రాంతం, సంఘం తదితర అంశాల ఆధారంగా ఓట్లు అడగడం సెక్యులర్ వ్యవస్థకు వ్యతిరేకం కాబట్టి వీటిని ఎన్నికల అక్రమాలుగా గుర్తిస్తామని నలుగురు జడ్జీలు చెబుతూండగా మరొక ముగ్గురు జడ్జీలు దీనితో విభేదించారు. జస్టిస్ చంద్రచూడ్ తన 55 పేజీల భిన్నాభిప్రాయ ప్రకటనతో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంట్‌లో పలుసార్లు సవరించరాని, కాబట్టి 123(3)పై వ్యాఖ్యానంపై పార్లమెంట్‌కు తగిన అవగాహన ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సెక్షన్‌పై గతంలో సరైన వ్యాఖ్యానమే ఉన్నదని, ఇపుడు దీన్ని పునర్ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మతం, కులం, భాష, సంఘం తదితర అంశాల కారణంగా వివక్షకు లోనవుతున్న వారి సమస్యల గురించి ప్రస్తావించడం ఎన్నికల అక్రమంగా ఎలా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు.
సుప్రీం జడ్జీల మధ్య అభిప్రాయభేదాలను పక్కన పెడితే, ఎన్నికల సమయంలో కులం, మతం, సంఘం, ప్రాంతం, భాష తదితర అంశాల ఆధారంగా ఓట్లను అభ్యర్థించడానికి వీలులేదన్న తీర్పును రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు స్వాగతించాయి. మకిలి పట్టిన మన ఎన్నికల వ్యవస్థను సంస్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కులం,మతం, సంఘం, ప్రాంతీయ తత్వాల ఆధారంగా ఓట్లు సంపాదించి పదవులను అనుభవిస్తూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని శాశ్వత అడ్డుగోడలుగా నిలపాలనుకునేవారి ప్రయత్నాలను వమ్ముచేయడానికి మంచి అవకాశం. మతం ఆధారంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ కారణంగా దేశం ఎంతో నష్టపోతున్నది. ఒక వర్గం లేదా మతం వారి ఓట్లను మూకుమ్మడిగా రాబట్టుకునే ‘ఓటు బ్యాంక్’ రాజకీయాలు ప్రబలిపోతున్నాయి. ఆయా వర్గాల వారిని ఆకర్షించేందుకు దేశ ప్రయోజనాలకు భిన్నంగా సంతుష్టీకరణ విధానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూకుమ్మడి ఓట్లకోసం కొన్ని సందర్భాలలో విధాన నిర్ణయాలనే మార్చివేశారు. మైనారిటీ వర్గాలను సంతృప్తి పరచేందుకు షాబానో కేసులో సుప్రీం తీర్పును కాదంటూ కొత్త చట్టాలను తీసుకువచ్చారు. ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం ఇంతవరకూ యూనిఫార్మ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) గురించి ప్రస్తావించడానికి కూడా నేతలు భయపడుతున్నారు. మతం ఆధారంగా కొనసాగుతున్న ‘పర్సనల్ లా’ను సంస్కరించేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదు. 1988లో సల్మాన్ రష్దీ రాసిన ‘సటానిక్ వర్సెస్’ పుస్తకాన్ని రద్దుచేసిన మొట్టమొదటి దేశం భారత్ మాత్రమే. విచిత్రమేమంటే ఇరాన్‌కు చెందిన ఆయతుల్లా ఖుమైనీ కంటే ముందే అప్పటి మన రాజకీయ నాయకత్వం ఒక మతం వారి ఓట్లకోసం ఇటువంటి చర్యలకు దిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను మన దేశంలోని మైనారిటీ వర్గం వారు వెంటాడి వెంటాడి వేధిస్తున్నప్పుడు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పటి మన రాజకీయ నాయకత్వం గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. 2010లో కేరళలో ఓ యూనివర్సిటీకి సంబంధించిన ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నపై మత ఛాందసవాదులు స్పందించి కె.టి.జోసఫ్ అనే వ్యక్తి చేతులు నరికివేసినప్పుడు ఆయనకు రక్షణగా నిలవాల్సిన రాజకీయ నాయకత్వం జోసఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. దేశ భద్రతను పణంగాపెట్టి మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు చేపట్టిన సంఘటనలు మన దేశంలో కోకొల్లలు. దేశంలో 14-15 శాతం, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో 18-20 శాతం ఉన్న ఓ మైనార్టీ వర్గం వారి ఓట్లకోసం పడరాని పాట్లుపడుతూ ఎన్నికలలో గెలుపు కోసం వీరి షరతులను నేతలు అంగీకరిస్తూండడం వల్ల దేశ ప్రగతి కొరవడింది.
రాజేంద్ర సచార్ కమిటీ నివేదికనే తీసుకుంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారు. వీరి అభివృద్ధికి ఎటువంటి చర్యలూ తీసుకోకుండా కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పడుతున్న తాపత్రయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో నిర్లజ్జగా కులం పేరిట, మతం పేరిట పార్టీలే ఏర్పడ్డాయి. ముస్లింలు,యాదవ్‌లు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే దళితులు, బ్రాహ్మణులు కలిసి మరొక కూటమిగా ఏర్పడి కుల, మత రాజకీయాలను నిస్సిగ్గుగా నిర్వహిస్తూండడంతో ఈ కీలక రాష్ట్రాల్లో అభివృద్ధి స్తంభించిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.
కులం, మతం ఆధారంగా ఇంతకాలం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ కారణంగా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శ్రేయోదాయక రాజ్యం స్థానంలో మత, కుల సమీకరణలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ దుష్టప్రభావం నుంచి బయటపడితే తప్ప మనం అభివృద్ధి సాధించలేం. సంతుష్టీకరణ రాజకీయాలను విడనాడితే తప్ప శ్రేయోరాజ్యాన్ని నిర్మించలేం. మంచి పాలన, ప్రగతి కోసం ఎన్నికలలో ధన ప్రభావాన్ని అరికట్టడంతోపాటు మతాల, కులాల ప్రాముఖ్యతను తగ్గించాల్సిందే. 1947లో దేశ విభజనతో మతం ఆధిపత్యం ఆగిపోయిందనడానికి వీలు లేదు. ఆ తరువాతి సమయంలో కూడా మతం ఆధారిత రాజకీయ దుష్పరిణామాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం. భారత్ ఎన్నడూ మత రాజ్యం కాదు. భవిష్యత్‌లో కాబోదు. అటువంటిది ఎన్నికలలో కొన్ని దశాబ్దాలుగా చేరిన మతం, కులం వికృతుల కారణంగా నలిగిపోతున్నాం. అభివృద్ధికి దూరం అవుతున్నాం.
ఈ నేపథ్యంలో ఎన్నికలలో మతం కులం ప్రమేయాలను నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకొక వరం. ఈ తీర్పు వల్ల రెండు ప్రయోజనాలు కనపడుతున్నాయి. ఒకటి- ఫలానా పార్టీకే ఓట్లు వేయాలంటూ జారీ అయ్యే ‘్ఫత్వాలు’ ఆగిపోతాయి. ఏ మతానికి చెందిన వారైనా తమ అభీష్టానికి అనుగుణంగా ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. రెండు- మతం, కుల రాజకీయాలు ఆగిపోతే అభివృద్ధి అజెండా ముందుకు వస్తుంది. రాజకీయ పార్టీలు కుల సమీకరణాలు పక్కకుపెట్టి ప్రగతి పథకాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఎన్నికలలో గెలవడానికి అభివృద్ధే తారకమంత్రం అవుతుంది. ఆయా వర్గాల ప్రజలు తమ ‘నాయకత్వం’ కబంధ హస్తాల నుంచి బయటపడి తమకు మేలు చేసే వారిని ఎన్నుకుంటారు. సగటు మానవుడి అభివృద్ధికి, సమాజ వికాసానికి సుప్రీం తీర్పు బలమైన పునాది కాగలదు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113