మెయిన్ ఫీచర్

గోదా కల్యాణ వైభోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగ నాథుడ్ని మెప్పించిన మహా భక్తురాలు గోదాదేవి. భక్తి విశ్వాసాలు ఉన్నభక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు శ్రీవైకుంఠం నుంచి తరలివస్తాడు. అక్కున చేర్చుకుని సేదతీరుస్తాడు. అలా ఆ భగవానుడి అనుగ్రహం పొంది, చివరకు స్వామిని వివాహమాడి శ్రీరంగనాథునిలో ఐక్యమయన గోదాదేవిని గురించి తెలుసుకుందాం..

విష్ణుచిత్తుడు శ్రీ మన్నారాయణునికి మాలలను కట్టి సమర్పిస్తూ వుండేవాడు. ఒకరోజు మా మూలుగా తుల సీవనాన్ని త్రవ్వుతూండగా ఆ ప్రదేశంలో ఒక శిశువు కనిపించింది. ఆ శిశువు సౌకుమార్యానికి, దేహకాంతికీ, తేజస్సుకీ అబ్బురపడ్డాడు సం తానం లేని విష్ణుచిత్తుడు. ‘‘అనపత్యునకమ్ముకుందుడే తనయగ నాకు నీ శిశువు తా కృపచేసెనని’’ విష్ణుమూర్తియే తనకు బిడ్డగా ఈ శిశువునిచ్చాడని సంతోషించాడు. భార్యకు ఇచ్చా డు, ఆ పిల్లకు గోద అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆమె మాటలు, నడకలు, సౌందర్యంతో మురిసిపోయారు విష్ణుచిత్తుని దంపతులు. పిల్ల ఎపుడైనా ఏడ్వగానే తల్లిదండ్రులు శ్రీకృష్ణుని ఉద్దేశించిన పాటలు పాడేవారు. పిల్ల వెంటనే ఏడుపు ఆపేసేది. పాటలను వింటూ సంతోషపడేది. పాటలు పాడనపుడు ఏడవడం, పాట మొదలుపెట్టగానే మానడం- ఇది చూస్తే ఆ పిల్ల పాటలకోసం ఏడుస్తున్నదేమోనన్నట్లుండేది. విష్ణుగాధ శ్రవణం ఈ విధంగా అలవాటుగా మారిపోయింది.
ఆమె యవ్వనవతి అయింది. ఆ ఊరిలోనే వుండే భాగవతోత్తముల ఇండ్లలో వుండే మరాళిక, ఏకావళి, స్రగ్విణి, హరిణి అనే వారు చెలికెత్తలయినారు. వారంతా కలిసి రుక్మిణీ శ్రీకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణుల బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ, వారి గుణగణాలను స్తుతిస్తూ, పాటలు పాడుతూ వుండేవారు. శ్రీమన్నారాయణుని దయవల్ల విష్ణుచిత్తునికి ఎన్ని సంపదలు వున్నప్పటికీ మొదటినుండీ ఉన్న ప్రకారంగానే పూలమాలలను అల్లడం, సమర్పించడం, వైష్ణవపురాణాలు వినడం, విష్ణుసేవాతత్పరుడై సమయాన్ని గడపడం వంటి పనులలో నిమగ్నమై వుండేవాడు. గోదాదేవి తల దువ్వుకుని శుచియై, తిరుమణి బొట్టును ధరించి, తండ్రి భక్తితో సిద్ధం చేసిన పూలదండలను తలలో పెట్టుకుని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మళ్లీ పూలబుట్టలో పెడుతూండేది. ధరించిన పూలదండలనే తిరిగి ఇచ్చినది కాబట్టి ఆమె ఆముక్తమాల్యద అయింది. ఒకనాడు భగవంతునికి సమర్పించిన పూలదండల్లో తలవెంట్రుకలు కనబడడంతో బాధపడిన విష్ణుచిత్తుడు విషయం తెలుసుకున్నాడు. బాధపడి ఆ దండలను భగవంతునికి సమర్పించలేక ఊరకుండిపోయాడు.
భగవంతుడు కలలో కనిపించి గోదాదేవి ధరించిన దండలే నాకు అత్యంత ప్రియమైనవి అని చెప్పాడు. విష్ణుచిత్తుడు పరమానందభరితుడైనాడు. నీ దయకు పాత్రమైన నా కుమార్తె ధన్యురాలు. ఆమెకు తండ్రినైనందువల్ల నేను ధన్యుడను అనుకున్నాడు. గోదాదేవి భూదేవి అవతారం కాబట్టి ఆమెకు శ్రీహరిని పెండ్లాడాలనే కోరికతో వున్నది. ఈ సంఘటనతో ఆమె శ్రీహరినే భర్తగా పొందాలని నిశ్చయించుకున్నది. గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి చేసిన ధనుర్మాస వ్రత విధానాన్ని విష్ణుచిత్తుడు గోదాదేవికి వివరించాడు. గోదాదేవి భక్తితో కాత్యాయనీ వ్రతాన్ని చేసింది. ధనుర్మాసకాలంలో రోజుకొక్క పాశురం చొప్పున రచించి భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడింది. ఆ పాశురాలే తిరుప్పావైగా ప్రసిద్ధిని పొంది విష్ణ్వారాధనలో ప్రాధాన్యాన్ని పొందినాయి. నిద్రాహారాలు లేక శుష్కించిపోతున్న గోదాదేవి స్థితిని చూసి తట్టుకోలేక విష్ణుచిత్తుడు భగవంతునితో తన బాధను విన్నవించుకున్నాడు.
శ్రీహరి మాలదాసరి కథను చెప్పి ఈ కథను వరాహావతారంలో వున్నప్పుడు భూదేవికి చెప్పానన్నాడు. గానకైంకర్యము అధిక ఫలప్రదమని తలచినందువల్ల భూదేవి అవతారమైన గోదాదేవి ఆ విధంగా పాడుతున్నదని దానికి కారణాన్ని తెలిపాడు. ఆమెను తీసుకుని శ్రీరంగానికి రమ్మని తరుణోపాయాన్ని కూడా చెప్పాడు. అంతా శుభమేనన్నాడు. విష్ణుచిత్తుడు గోదాదేవిని తీసుకుని శ్రీరంగనాథునికి నమస్కరించి సేవించాడు. కీర్తించాడు. శ్రీరంగనాథుడు గోదాదేవిని చూడగానే తనలో ఐక్యం చేసుకున్నాడు.
మాయా గోదాదేవిని విష్ణుచిత్తుని వద్ద వుంచాడు. ఒకింతసేపు తన కుమార్తెను చూడలేకపోయిన విష్ణుచిత్తుడు భగవంతుడు తనను పరాభవించినట్లు భావించాడు. ఆమె అక్కడే వున్నట్లు భగవంతుడు తెలిపాడు. విష్ణుచిత్తుడు కుమార్తె శిరస్సును మూర్కొ ని సంతోషించాడు. ఇంతలో రంగనాథుడైన శ్రీమన్నారాయణుడు పిల్లను అడిగి రమ్మని దేవతలను విష్ణుచిత్తుని ఇంటికి పంపించాడు. విష్ణుచిత్తుడు వారందరికీ ఆతిథ్యమిచ్చి గౌరవించాడు. వారంతా శ్రీరంగనాథుని దగ్గరకు తరలివెళ్ళగా గోదా రంగనాథుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సాక్షాత్తూ శ్రీరంగనాథుణ్ణే అల్లుడిగా పొందగలిగి ధన్యుడైన విష్ణుచిత్తుడు మాలలను సమర్పిస్తూ వుండిపోయాడు. భక్తితో భగవంతుని పాశురాలను సమర్పించిన గోదాదేవి శ్రీరంగనాథుని మెప్పును పొంది అనుగ్రహానికి నోచుకున్నది.

- కె.లక్ష్మీ అన్నపూర్ణ