మెయన్ ఫీచర్

ఆచరణ కానరాని జైళ్ల సంస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్రయిమ్ అండ్ పనిష్‌మెంట్’, ‘బ్రదర్స్ కర్మజోవ్’, ‘ఇడియట్’ వంటి గొప్ప నవలల్ని చదివినవారు ‘దోస్తోయేవ్ స్కీ’ని ఏనాటికీ మరచిపోలేరు. ఆ మహారచయిత ఓ సందర్భంలో అంటాడు- ‘ఒక సమాజంలో నాగరికత ఎంత ఉందనేది అక్కడి చెరసాలలోకి అడుగుపెడితే తెలుస్తుంది’అని. నిజానికి రచయిత దోస్తోయేవ్ స్కీ కూడా రష్యాలోని ఆనాటి జార్ ప్రభువుల ఆగ్రహానికి గురై జైలు జీవితాన్ని రుచిచూసిన వాడే. జైళ్లలో వుండేది వివిధ నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్నవాళ్లే. అలాంటి వారిపై జాలి, దయ, చూపించనక్కర్లేదనే ఆదిమ కాలం నాటి అభిప్రాయం చాలామందిలో వుంటుంది. చెరశాలలు మానవతాభావానికి నిలయాలుగా ఉంటే- ఆ సమాజంలో నాగరికత ఉన్నతస్థాయిలో ఉందని భావించాలి.
ఇటీవల రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేస్తూ- జైళ్లు అనేవి ఖైదీలు శిక్ష అనుభవించడానికే కాదు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కూడా ఉపయోగపడాలని ఎపి ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం జైళ్ల సంస్కరణకు నిర్దిష్ట కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఇపుడు జైళ్లలో పరిస్థితిని చూస్తే- చిన్న చిన్న చోరీలు చేసి చెరశాలకు వచ్చినవాడు దోపిడీలు చేసే స్థితికి ‘ఎదిగి’ బయటకు వెళ్లే పరిస్థితులే అధికంగా వున్నాయన్న విమర్శలు లేకపోలేదు.
జైళ్ల సంస్కరణ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలాకాలం నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఇంగ్లాండ్‌లో ఖైదీల పట్ల అమానుష వైఖరిని జైలు అధికారులు ప్రదర్శించేవారు. 18వ శతాబ్దం చివరిలో జాన్ హోవార్డ్ అనే సంఘ సంస్కర్త బ్రిటన్‌లోని జైళ్లనన్నింటినీ సందర్శించి, ‘ది స్టేట్ ఆఫ్ ది ప్రిజన్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్’ అనే పుస్తకాన్ని 1777లో ప్రచురించారు. ఆ పుస్తకం ఇంగ్లాండ్‌లో సంచలనం సృష్టించింది. ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం ఖైదీల పట్ల క్రూరత్వం చూపకుండా, వారిని సంస్కరించేందుకు చర్యలు తీసుకుంది. అయితే, ఆ విధానాన్ని బ్రిటన్ ప్రభువులు తమ ఏలుబడిలో ఉన్న భారత్ వంటి దేశాలకు విస్తరింపచేయలేదు. దక్షిణాఫ్రికా కూడా బ్రిటన్ వారి వలస రాజ్యంగానే వుండేది. ఆ దేశంలో గాంధీజీ సత్యాగ్రహోద్యమాన్ని నిర్వహించే రోజుల్లో 1909లో ఆయనను అక్కడి ప్రభుత్వం అరెస్ట్‌చేసి, సంకెళ్లతో రోడ్డుమీద నడిపించింది. దక్షిణాఫ్రికాలో పేరొందిన ‘వోల్క్స్స్ట్’్ర జైలులో కరడుగట్టిన నేరస్తులు వుండే గదిలో గాంధీజీని ఉంచారు. చెరువులు తవ్వడం, భూమి దున్నడం, జైలు గదులను తడిగుడ్డతో ఒత్తడం వంటి పనులను గాంధీజీ చేత జైలు అధికారులు చేయించేవారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీతో పాటు ఎంతోమంది నేతలు జైలు పాలై శిక్షలు అనుభవించారు. జైలుశిక్ష అనుభవిస్తున్నది ఎవరైనా వారిని క్రూరంగా శిక్షిస్తే సమాజం బాగుపడుతుందని, వాళ్లు మరెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యరనీ, అనుకోవడం సరైనది కాదు. ఖైదీలకైనా కనీస సౌకర్యాలు కల్పించి వారి పట్ల మానవత్వం చూపాలి.
మన దేశంలో జైళ్ల సంస్కరణలకు సంబంధించి సూచనలు చేసేందుకు బ్రిటిషువారి హయాంలో ‘అఖిల భారత జైలు కమిటీ’(1919-1920)ని నియమించారు. జైళ్లలో సంస్కరణలు, ఖైదీలకు పునరావాసం వంటి అంశాలపై అప్పటి ప్రభుత్వం సూచనలు కోరింది. 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ‘జైళ్ల నిర్వహణ’ అంశాన్ని కేంద్రం నుండి రాష్ట్రాలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన సంస్కరణలు అమలుపరచడం సాధ్యం కాలేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల నిపుణుడు డాక్టర్ డబ్ల్యుసి రెక్లెస్‌ను 1951లో ఆహ్వానించి సలహాలను కోరింది. 1951-52లో ఆయన పలు కారాగారాలను సందర్శించి, వాటి సంస్కరణల గురించి సలహాలు ఇచ్చాడు. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు ప్రకారం జైళ్ల సంస్కరణలు అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. జైళ్ల సంస్కరణల విషయాన్ని ‘ఉమ్మడి జాబితా’లో చేర్చమని అప్పట్లో కొందరు మేధావులు కోరినా మన పాలకులు పట్టించుకోలేదు. 1980లలో ప్రభుత్వం ఈ విషయమై మళ్లీ ఓ కమిటీని వేసింది. ‘అఖిల భారత జైళ్ల సంస్కరణ కమిటీ’కి జస్టిస్ ఎఎన్ ముల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘ముల్లా కమిటీ’ జైళ్ల విషయంలో జాతీయ విధానం అవసరమని చెబుతూ 658 సూచనలను చేసింది. ఈ సిఫార్సులను అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపి చేతులు దులుపుకుంది. ఖైదీలను మానవీయ కోణంలో చూడాలని, జైళ్లలో ఆహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి విషయాలలో సంస్కరణల చేపట్టాలని ముల్లా కమిటీ చేసిన సూచనలు ఇప్పటికీ అనుసరణీయం. జైళ్లను ఆధునికీకరించేందుకు ‘జాతీయ స్థాయి కమిషన్’ ఉండాలన్న సూచన ముఖ్యమైంది. ఈ సూచనలకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి చెప్పుకోదగ్గ స్పందన రాలేదు.
పరాయి ప్రభుత్వం 1894లో చేసిన జైళ్ల చట్టం స్థానంలో- రాజ్యాంగంలోని 252వ అధికరణం ప్రకారం కొత్త చట్టం రూపొందించాలని 2003లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్’ ఆధ్వర్యంలో ‘మోడల్ ప్రిజన్ మాన్యువల్‌‘(ఎం.పి.ఎమ్.)ను ప్రచురించి దేశంలోని జైళ్లన్నింటికీ పంపింది. ఖైదీల పట్ల జైలు సిబ్బంది ఎలా ప్రవర్తించాలనే అంశాలను ఇందులో పేర్కొన్నారు. ఈ మాన్యువల్ గురించి చాలామంది ఖైదీలకు తెలియదు.
అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జైళ్ల సంస్కరణకు కమిటీలను వేశాయి. బిహార్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షుడు జస్టిస్ సిన్హా ఆ రాష్ట్రంలోని జైళ్లలో ఉంటున్న 30,070 ఖైదీలను వ్యక్తిగతంగా విచారించి 2015లో సమర్పించిన నివేదిక, సామాజిక కార్యకర్త స్మితా చక్రవర్తి ఇచ్చిన నివేదిక ముఖ్యమైనవి. ఈ నివేదికలు ఖైదీల దుర్భర పరిస్థితులను వివరించాయి.
బిహార్‌లోని 58 జైళ్లలోని ఖైదీల పరిస్థితి గమనించి ఇచ్చిన 700 పేజీల మధ్యంతర నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. ఖైదీలలో దళితులు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు చాలామంది వుంటారు. ఏదో నేరం చేసి జైలుకు వచ్చినా వారికి చట్టపరమైన వివరాలేవీ తెలియవు. తమపై అభియోగాలకు సంబంధించిన ‘్ఛర్జిషీటు’ను చాలా సందర్భాలలో వారికి ఇవ్వరు. ఆర్థిక స్థోమత ఉన్నవారు శిక్షల నుంచి బయటపడేందుకు న్యాయవాదిని నియమించుకుంటారు. పేదవర్గాలకు చెందిన ఖైదీలకు ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయం అందించాలనే నియమం వుంది. ఈ నిబంధన ప్రకారం పేద ఖైదీల తరఫున వాదించేందుకు న్యాయవాదులను నియమిస్తున్న దాఖలాలు తక్కువే.
ఇక, జైలు నిబంధనల ప్రకారం శిక్షపడిన ఖైదీల చేతే పనిచేయించాలి. కేసు విచారణను ఎదుర్కొంటున్న ఖైదీల చేత పనిచేయించనవసరం లేదు. కానీ, జైలు అధికారులు ఖైదీలందరి చేత పనిచేయిస్తారు. చేసిన పనికి ప్రతిఫలం తక్కువే. కొన్నిసార్లు అది కూడా అందదు. జైలులో కనీస వసతులు, తమ హక్కుల గురించి ఖైదీలు ఫిర్యాదు చేస్తే అక్కడి అధికారులు సానుకూలంగా స్పందించాలి. కానీ, ఈ పరిస్థితులు ఏ కారాగారంలోనూ కానరావు. ఫిర్యాదు చేసే ఖైదీలు జైలు అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. అనారోగ్యంతో ఉన్న ఖైదీలు ఎంతో బతిమాలితే కాని వారికి వైద్యసేవలు దక్కవు. ఆస్పత్రుల్లో ఖైదీలను మంచాలకు సంకెళ్లతో కట్టేస్తున్న దృశ్యాలు షరామామూలే. రోగాలతో ఉన్నా పేద ఖైదీలు అవస్థలు పడాల్సిందే. సంపన్న వర్గాలకు చెందిన ఖైదీలకైతే సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నది బహిరంగ రహస్యం. ఇక కొన్ని జైళ్లలో బాలనేరస్థులను ఇతర ఖైదీల మధ్యన ఉంచుతున్నారు. మహిళా ఖైదీల పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. కొన్ని జైళ్లలో మహిళా వార్డర్లు ఉండరు. మహిళా ఖైదీలు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి.
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఖైదీలకు న్యాయమూర్తి అన్ని విధాలా సంరక్షకుడు. అయితే, ఇలాంటి ఖైదీల సమస్యలను న్యాయమూర్తులు ప్రత్యక్షంగా పరిశీలించే పరిస్థితి లేదు. కోర్టులో పనిభారం, న్యాయమూర్తుల కొరత వంటివి ఇందుకు కారణాలు. జైళ్లలో వసతులు, ఖైదీల హక్కుల గురించి చర్యలు తీసుకోకుండా- ఆదర్శ చెరశాలలను రూపొందిస్తామంటే అది సాధ్యం కాదు. ఖైదీలకు పునరావాసం అంత సులువు కాదు. ఈ విషయాలపై దృష్టి సారించకుండా- కమిటీలను వేసి కారాగారాలను సంస్కరిస్తామంటే అది జరిగే పనికాదు. *

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969