మెయిన్ ఫీచర్

సౌందర్య రస స్రవంతి.. సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితాః’’- ఈ విశ్వాన్ని పాలించేది ధర్మం. అలాగే ‘‘ధర్మసార మిదం జగత్’’ అని, ‘‘సర్వే ధర్మం ప్రతిష్ఠితం’’ అన్నారు. ‘్ధృ’ అనే ధాతువు నుండి పుట్టిన పదం ధర్మం. ‘్ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలవటం. ధరించేది ధర్మం. ధర్మమే సమాజాన్ని కుటుంబాన్ని విచ్ఛిన్నమైపోకుండా సంఘటితంగా నిలుపుతున్నది. స్వార్థరహితం, సమిష్ఠి తత్త్వాన్నిచ్చేది ధర్మం.
కనుక జగత్తు స్వరూపం- ధర్మా ధర్మముల మిశ్రమం. సక్రమ మార్గంలో అనగా ధర్మమార్గంలో పయనించటం వలన మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆ స్థితిలో మాలిన్యం అనగా చీకటి తొలగి, జ్ఞానోదయం అంటే ‘వెలుగు’ మార్గం కనపడుతుంది. దేశ కాల వస్తువులచే మార్పు చెందక నిరంతరంగా ఉండే అఖండైక ఆనంద సౌందర్య రస స్వరూపంగా ఆ ‘వెలుగు’ మనకు గోచరమవుతుంది. విశ్వంలోని ప్రతి వస్తువు నందు ‘ఆ వెలుగు’ని దర్శించగలుగుతాం. పంచభూతములలో, మృగపక్షులలో వృక్షలతలలో అంతర్లీనంగా ఉండే ఆ
పరమాత్మ స్వరూపమయిన ‘ఆ వెలుగు’ను దర్శించగలుగుతాం. ఆ వెలుగును చూపే పండుగే మకర సంక్రాంతి.
నీటికి మూలం- అగ్ని. ఆ అగ్నే ‘వెలుగు’నిస్తుంది. ఆ వెలుగు మార్గాన్ని తెలిసికొని అటుగా పయనించటానికి ఒక నిర్ణీత సమయం అనగా ముహూర్తం కావాలి. ఆ ముహూర్తం సూర్యగమనాన్ని అనుసరించి నిర్ణయింపబడింది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయానే్న శుభముహూర్తంగా నిర్ణయించారు. అందుకే మకర సంక్రాంతికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది.
ప్రకృతి రామణీయతకు ప్రతీకగా నిలుస్తుంది- మకర సంక్రాంతి. సూర్యుడు తన దివ్యకాంతులను ప్రజ్వరిల్లచేస్తూ ప్రకాశిస్తాడు. జీవన సరళిని నిర్దిష్టించి ఆనంద మకరందాలను అందించి ఆనందమయకోశానికి చేరుకునే వెలుగు మార్గాన్ని చూపిస్తూ, జన జీవనానికి నవ జీవన వికాసాన్ని జాగృతం చేసే క్రాంతినిచ్చేది- మకరసంక్రాంతి.
‘సమ్యక్ క్రాంతి సంక్రాంతి’
సమ్యక్ అనగా పవిత్రమైన, క్రాంతి అనగా మార్పు. ఘూణ్ ప్రేరణే సువతి ప్రేరయతి వ్యాపారేషు ఇతి సూర్యః అన్నది నిరుక్తం. సూర్యుడు జీవుల కార్యకలాపాలకు మూలకారకుడు. సూర్యుని వెలుగు చేత ప్రకాశించేవాడు- చంద్రుడు. కనుక, సూర్యుడు శక్తి; చంద్రుడు- పదార్థం. అన్ని గ్రహాలకు, పంచభూతములకు వెలుగునిచ్చి, సర్వ ప్రపంచానికి పైభాగమున ఉండి, కిరణములను ధరించి, ప్రకాశింపచేస్తున్నాడు- సూర్యుడు.
సూర్యచంద్రులు అనగా శక్తి పదార్థముల, చీకటి వెలుగుల క్రియాక్రియల పరస్పర సమ్మేళన ఫలితంగా ఏర్పడిందే రుూ కాలచక్రం- ఉత్తరాయణం- మకర సంక్రాంతి. దీనినే పర్వదినంగా భావించి పండుగ చేసుకుంటాం.
మకర సంక్రమణమంటే, రవి మకరరాశిలో ప్రవేశించుట. దాని వివరణలోకి వెడదాం. అశ్విన్యాది నక్షత్రములు ఇరువది ఏడు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు, వెరశి నూట ఎనిమిది. మేషాది మీనరాశులు- పనె్నండు. నూట ఎనిమిది నక్షత్రపాదాల్ని పనె్నండు రాశులలో సమానంగా పంచుతే, ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలుంటాయి. అందులో మకర రాశిలోని నక్షత్రముల పాదాలు- ఉత్తరాషాఢ 2,3,4 పాదములు; శ్రవణం నాలుగు పాదములు, ధనిష్ఠ రెండు పాదములు. సూర్యుడు నెలకొక రాశిలో ఉంటాడు. ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం. సంవత్సరానికి పనె్నండు సంక్రాంతులు వస్తాయి. అయితే రవి, మకరరాశిలో ప్రవేశించినపుడు వచ్చే మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది.
మకర సంక్రాంతి సౌందర్య విలాసాన్ని ప్రకృతి రమణీయ శోభను వాల్మీకి మహర్షి శ్రీద్రామాయణంలో హృద్యంగా వర్ణించాడు.
రవి సంక్రాంతి సౌభాగ్యః తుషారారుణ మండలః
విశ్వానంద ఇవా ధర్మః చంద్రప్రకాశలే
జీవన స్రవంతిని నయనానందకరం చేసే సౌందర్య రస స్రవంతిగా సంక్రాంతిని వర్ణించిన మహనీయులెందరో ఉన్నారు. మకర సంక్రాంతితో ప్రకృతిలో మార్పు గోచరిస్తుంది. దక్షిణాయనం ఆరు నెలలూ చీకటే. చిత్తడితో అనారోగ్యంగా ఉంటుంది. మకర సంక్రమణంతో నవ్యతకు నాంది పలుకుతుంది. ప్రకృతిలోని నవచైతన్యంతో, జన జీవనం ఉరకలు వేస్తుంది. తట్టలో కూర్చోబెట్టిన వధువులాగా, గుమ్మడి పూవులో కులికే మంచు బిందువులతో, రాబోయే శిశిర భయం తో ప్రకృతి కాంత జమిలి దుప్పటి కప్పుకొన్నదా అన్నట్లు తెలుగు నేల నాల్గుదెసల మంచు కురుస్తూ ఉండగా హేమంత ఋతువు వచ్చిందంటాడు కవి సమ్రాట్ విశ్వనాథ.
వేకువఝామున ముగ్గుపెట్టే కనె్న, మంచుకొండ ఆడపడుచులాగా, పశువులను తోలుకొనిపోయే రైతు హిమగిరి పాలి కాపులాగా, పంట కుప్పపై వేయు కొప్పు- మంచుకొండ శిఖరమువలె, తడిపాటి మట్టి గోడను చిఱుకొమ్మలతో గోరాడుగిత్త- నందిలాగా కనపడుటచేత, నిత్యము మంచుపడుచుండుట చేత, హిమాలయ సపరివారముగ ఉత్తరము నుండి దక్షిణాపథమునకు వచ్చినట్లుండగా హేమంతము తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించినట్లుంది. హేమంత ఋతువులో, మార్గశిర పుష్యమాసాలు ఉంటా యి. అందులో సూర్యుడు ధనుర్రాశిలో మార్గశిరమాసంలో ప్రవేశిస్తాడు. అదే ధనుస్సంక్రమణం. ధనుర్రాశి నుండి మకరరాశిలో ప్రవేశించేవరకు ‘్ధనుర్మాసం’ అని పిలుస్తారు. ధనుర్మాసవ్రతాన్ని ఆచరిస్తారు.
ధనుర్మాసవ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాధుని వివాహమాడింది గోదాదేవి. ఆమెయే ఆండాళ్ తల్లి. సంక్రాంతి పండుగకు ముందు రోజైన ‘్భగి’ పండుగ రోజున, 30 రోజుల ధనుర్మాస వ్రత సమాప్తి చేసి గోదాదేవి శ్రీరంగనాథుని పరిణయమాడింది. మూడు రోజులు ముచ్చటగా జరుపుకునే సంక్రాంతి పండుగ మొదటిరోజే ‘్భగి’.
గజేంద్ర మోక్షం - మకర సంక్రాంతి
మకరరాశిలో రవి ప్రవేశాన్ని గురించి, అందులోని యోగశాస్త్రాన్వయమును, విశిష్టతను పరమ భాగవతోత్తముడైన పోతన భాగవతంలో మనకు గజేంద్ర మోక్ష ఘట్టంలో అద్భుతంగా వర్ణించాడు. ‘‘మకరమొకటి రవి జొజ్చెను, మకరము మఱియొకటి ధనుసు మాటున దాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్’’-
మకరమొకటి ధనుసుమాటున దాగినదనగా- ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటిపాదం, ధనుర్రాశిలో ఉంటుంది. అక్కడే వున్న మూలానక్షత్రం పృధ్వీతత్త్వంతో కూడింది. కూర్మరాజు- పృధ్వీకి సంకేతం. కావున ధనుర్రాశిలోని నక్షత్రాన్ని మకరరాశిలోని నక్షత్రాల్ని వివరిస్తూ, రవి మకరరాశిలో ప్రవేశించేటపుడు వచ్చే ‘మకర సంక్రాంతిని’ గురించి మనోహరంగా గంభీరంగా, ఆధ్యాత్మికతను వెలువరిస్తూ వివరించాడు-పోతన.
అష్టదిక్పాలకులలో, ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. అతని వాహనం ‘ఐరావతం’ అంటే గజరాజు- ఏనుగు- గజేంద్రుడు. పడమర దిక్కుకు అధిపతి వరుణుడు. అతని వాహనం మకరం- మొసలి. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో, షట్చక్రములలో మూలాధారంలో ఉంటుంది ఏనుగు. మూలాధారం పృధ్వీతత్త్వం. గజవాహనుడైన ఇంద్రుడు సహస్రార చక్రానికి అధిదేవత. యోగసాధకుడు, మూలాధారంలో వున్న కుండలినీ శక్తిని యోగసాధనతో ఒక్కొక్క ఆధ్యాత్మిక చక్రమును అధిగమించి పై చక్రములకు తీసుకొని వెడుతూ సహస్రారానికి చేరుస్తాడు. మూలాధార తత్త్వాన్ని మననం చేసికొని, పృధ్వీతత్త్వాన్ని జయించి, స్వాధిష్టాన చక్రంలో ప్రవేశింపజేస్తాడు. స్వాధిష్టానం జలతత్త్వం. అనగా మూలాధారచక్రంలో ఐరావతము, జలతత్త్వంలోకి ప్రవేశించగా, స్వాధిష్ఠాన వాసుడై మకరరాశిలోని శ్రవణా నక్షత్రాధి దేవత అయి, చండ మార్తాండ మధ్య మండలమున ప్రచండ తేజస్సుతో వెలుగొందే సూర్యనారాయణుని అధిష్ఠానుడైన శ్రీమన్నారాయణుడు, కాలచక్రమనే సుదర్శన చక్రాన్ని పంపి, ఖండిస్తాడు. అజ్ఞానాంధకారం తొలగి, నవ్య తేజస్సుతో ‘ఉత్తరాయణం’ వస్తుందని, మకర సంక్రాంతికి యోగశాస్త్రం విశదీకరించింది.
ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతినాడు, పితృదేవతలకు తర్పణములు అర్పిస్తే వారు సంతసించి వంశవృద్ధినొందించి శుభాల్ని కూర్చి పెట్టి, శుభకార్యములు గృహంలో నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారు. పితృదేవతలకూ, ఉత్తమ గతి లభిస్తుంది.
గోమయం (ఆవుపేడ) క్రిమి సంహారిణి. నెల రోజులు ముగ్గులు తీర్చిదిద్దుతారు. ముగ్గులోని బియ్యపు పిండిని క్రిమికీటకాదులు భుజిస్తాయి. ఇది ఒక విధమైన భూత యజ్ఞం.
గోమయంతో చేసిన ముద్దలను గొబ్బిళ్ళు అంటారు. ప్రధానంగా మూడు ముద్దలు పెడతారు. ఒకటి- అందరినీ ఆకర్షించి, విశ్వమోహన మురళీగానంతో ఆనందపరిచే గోపాలునికి, రెండవది- గోపాలుని అనంతశక్తితో ఎత్తబడిన గోవర్థనగిరికి, మూడవది- నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకు ప్రతీకగా పెడతారు. గొబ్బిళ్ళు ఈ మూడు ‘గ’కారాలకు స్ఫూర్తి.
పురాణేతిహాసములు, చరిత్ర, సాంఘిక జీవన స్థితిగతులను ప్రతిబింబించేటట్లుగా బొమ్మల కొలువు పెడతారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు స్ఫూర్తినిస్తాయి బొమ్మల కొలువులు. అత్యంత విజ్ఞానదాయకం కూడా. హరిహరాంశగా అవతరించి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ శరణుఘోషతో శబరిమలకు వచ్చే భక్తులను కటాక్షించే స్వామి అయ్యప్పస్వామి. మకర సంక్రాంతినాడే అయ్యప్ప జయంతి. పందల రాజుకిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామిని జ్యోతి స్వరూపంగా దర్శించుకుని, జ్ఞానోదయాన్ని పొందుతారు. ఇది మకరసంక్రాంతి పండుగకొక విశేషం.
‘‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’’ అని, ఏరువాక పౌర్ణమితో సేద్య యజ్ఞానానికి నాందిపలికి, శ్రమకోర్చి, విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి, దైవానుగ్రహంతో పంటను యింటికి తీసుకువస్తారు, కృషీవలులు. కనుకనే మకర సంక్రాంతి పండుగను వైభవోపేతంగా, లక్ష్మీప్రదంగా జరుపుకుంటారు. వ్యవసాయ వృత్తికి చేదోడు వాదోడుగా నిలిచే గోజాతికి కృతజ్ఞత చూపుతూ కనుమ పండుగనాడు పశువుల్ని పూజిస్తారు.
కృషియున్న నెపుడు దుర్భిక్షమ్ యుండదు, గోజాతి కృషికిని కుదురుకాన, కనుము పండుగనాడు కర్షక జనులెల్ల గోవుల పసుపులన్ కుంకుమలను పూజించి, వానికి పుష్కలమ్ముగ పుష్టి కలుగు నాహారము తొలయజేసి.. అని పైడిపాటి సుబ్బరాయశాస్ర్తీగారు ‘మకర సంక్రాంతి’లో మనోహరంగా వర్ణించిన విషయం కనుము పండుగకు స్ఫూర్తినిస్తుంది.
వ్యష్టి నిష్టం కాని సృష్టిలో, పరస్పరాన్యోన్యమైన సమాజంలో ఉత్తేజ ఉత్సాహ స్ఫూర్తితో, ముందు వచ్చే మార్పుకు స్వాగతం పలుకుతూ సమన్వయ సమరసభావంతో జీవనయాత్ర సల్పుతూ సర్వమానవ సౌభ్రాత్రతో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించే నవ్య తేజస్సును పొందాలని చెప్తోంది’’ మకర సంక్రాంతి.

- పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464