మెయన్ ఫీచర్

నిజం రుచించక.. నిందారోపణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహాభారతం’ విరాట పర్వంలోని ఉత్తర కుమారుడికి, నేటి రాజకీయ భారతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తేడా కనిపించడం లేదు. ప్రగల్భాలు పలకడంలో యువనేత రాహుల్ ఉత్తర కుమారుడిని మించిన వాడని ఇప్పటికే జాతిజనులు తెలుసుకున్నారు. ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవ సేనలు విరాటుని రాజ్యంపై దండెత్తినపుడు- వారిని నిరోధిస్తానంటూ బృహన్నల ముందు ఉత్తర కుమారుడు పలికిన బీరాలు అన్నీ ఇన్నీ కావు. యుద్ధ్భూమిలోకి అడుగుపెట్టాక ఉత్తర కుమారుడి మేకపోతు గాంభీర్యం బయటపడుతుంది. ‘నేను పార్లమెంట్‌లో మాట్లాడితే ప్రధాని మోదీ అక్కడ కూర్చోలేరు. నన్ను మాట్లాడనీయడం లేదు. నన్ను చూసి ప్రభుత్వం పారిపోతోంది. నేను మాట్లాడితే ఎంతటి భూకంపం వస్తుందో మీరే చూస్తారు’- అంటూ రాహుల్ ఘనమైన ప్రకటనలు చేశారు. ఏదో జరిగిపోతుందని ఆశగా ఎదురుచూసిన ప్రజలు ఏమీ జరగకపోవడంతో నిరాశకు గురయ్యారనే చెప్పుకోవాలి. ఇది జరిగిన వారం రోజులకు గుజరాత్‌లోని మెహ్‌సానా ప్రాంతం నుంచి ‘్భకంపం’ సృష్టించేందుకు రాహుల్ నీరస ప్రయత్నం చేశారు. ‘సహారా కంపెనీ నుంచి ఆరునెలల వ్యవధిలో తొమ్మిదిసార్లు మోదీకి పెద్దఎత్తున ముడుపులు ముట్టాయి. సహారా నుంచి 40 కోట్ల రూపాయలు, బిర్లా కంపెనీ నుంచి 12 కోట్ల రూపాయలు ముట్టాయి. ఇందుకు తగిన సాక్ష్యాలు ఐ.టి. శాఖ అధికారుల దగ్గరున్నాయి. వీటికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి’- అంటూ ఏవో కాగితాలు చూపిస్తూ గాల్లో చేతులు ఊపుతూ భూకంపం సృష్టిస్తానని కాంగ్రెస్ యువరాజావారు భయపెట్టారు. ఆయన ఎంత ప్రయత్నించినా గాలిలో గడ్డిపరక కూడా కదలలేదని జనానికి అర్థమైంది.
రాహుల్ చేసిన ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? వీటికి మూలం ఎక్కడ? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. భూకంపం సృష్టిస్తానంటూ ప్రధానిపై రాహుల్ చేసిన ఆరోపణలు- సుప్రీంకోర్టులో ‘కామన్ కాజ్’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం నుంచి యథాతథంగా తస్కరించినవే. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదిస్తున్న ప్రశాంత్ భూషణ్ వీరికి న్యాయవాది. కొంతమంది సామాజిక ఉద్యమకారులు అందించిన అరకొర సమాచారంతో సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం వేస్తూ మోదీ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. బొగ్గు గనుల కుంభకోణంపై దర్యాప్తుచేస్తున్న సిబిఐ అధికారులు 2013లో ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీలపై దాడులు చేసి 25 కోట్ల రూపాయల నల్లధనంతోపాటు ఆ కంపెనీ సిఇఓ అమితాబ్ సొంత కంపెనీ నుంచి కొంత సమాచారాన్ని స్వాధీనపర్చుకున్నారు. పర్యావరణ అనుమతుల కోసం సంబంధిత అధికారులకు లేదా మంత్రికి లంచాలు ఇచ్చినట్లుగా ఉన్న కొన్ని పత్రాలను కూడా స్వాధీనపర్చుకున్నారు. ఇలా స్వాధీనపర్చుకున్న పత్రాలను మరింత విచారణ కోసం ఆదాయపుపన్ను శాఖ వారికి అప్పచెప్పారు. మరొక సంఘటనలో 22 నవంబర్ 2014న సహారా కంపెనీపై మరొక దాడి జరిగింది. అప్పటికే లక్షలాది మంది మదుపుదార్లను మోసగించిన కేసుల్లో సహారా కంపెనీ అధినేత సుబ్రతోరాయ్ జైలుకు వెళ్లారు. 2014లో జరిగిన ఈ దాడిలో కూడా 137 కోట్ల రూపాయల నల్లధనంతోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలకు డబ్బు ఇచ్చినట్లుగా కొన్ని కాగితాలు దొరికాయి. ప్రముఖ నేతల పేర్లు ఈ కాగితాలపై ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆదిత్య బిర్లా, సహారా కంపెనీలపై సిబిఐ, ఐటి శాఖల దాడుల్లో దొరికిన పత్రాలు, వ్యక్తిగత కంప్యూటర్లలో ఉన్న సమాచారం ఆధారంగా దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొంతమంది వ్యక్తుల డైరీలు లేదా కంప్యూటర్లలోని ధృవీకరించని సమాచారం ఆధారంగా ప్రముఖులపై దర్యాప్తు ఆదేశించడం సరికాదని, ఇలా చేసిన పక్షంలో రాబోయే రోజుల్లో అసాంఘిక శక్తులు లేదా ఎవరుపడితే వారు ఇతరులపై నిందలు మోపే ప్రమాదం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ కోసం కామన్ కాజ్ సంస్థ దాఖలు చేసిన సాక్ష్యాధారాలు నమ్మదగినవిగా లేవని, ధ్రువీకరింపబడని కాగితాలను కోర్టుకు సమర్పించారని సుప్రీంకోర్టు 25 నవంబర్ 2016న అభిప్రాయపడింది. ప్రశాంత్‌భూషణ్ సమర్పించిన సాక్ష్యాలను ‘తయారుచేయబడ్డ కాగితాలు’గా భావించిన సుప్రీంకోర్టు వాటిని పనికిమాలిన సాక్ష్యాలుగా పేర్కొన్నది. ‘ఈ సాక్ష్యాలను వెనక్కు తీసుకోండి. ఇంతకంటే బలమైన ఆధారాలు ఉంటే తిరిగి రండి. ఈ ప్రక్రియ పరోక్ష నింద తప్ప మరేమీ కాదు’-అని సుప్రీం ఖరాఖండీగా చెప్పింది. రాహుల్ అపరిపక్వ రాజకీయ పరిజ్ఞానం ఇక్కడే బయటపడింది. విశ్వసనీయత లేని పనికిమాలిన సాక్ష్యాలుగా సుప్రీం కొట్టిపారేసిన కాగితాల ఆధారంగా ‘్భకంపం’ సృష్టిస్తానని ప్రకటించి రాహుల్ అపహాస్యం పాలయ్యారు.
ఇదే కేసు 14 డిసెంబర్ 2016న తిరిగి తమ వద్దకు వచ్చినపుడు పిటిషనర్ల తీరును సుప్రీం తప్పుపట్టింది. ఉన్నత పదవులలో ఉన్నవారిపై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం మంచిదికాదని మందలించింది. కామన్‌కాజ్, ప్రశాంత్ భూషణ్‌లపై చిరాకును ప్రదర్శిస్తూ- ‘మమ్మల్ని అసాధారణ పరిస్థితులలోకి గురిచేస్తున్నారు. ఆరోపణలకు అనుగుణంగా నమ్మదగిన సాక్ష్యాధారాలను ఒక్కటైనా ఇమ్మని చెప్పాం. అటువంటి ఆధారం దొరికితే వెంటనే స్పందిస్తాం. ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్నవారు పనులు ఎలా చేయగలుగుతారు? పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలకు ఏ ఒక్క ఆధారమూ కనపడించడం లేదు’అని సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ ఖేహర్‌కు బదులుగా ఇంకొక జడ్జి ఈ కేసును విచారించాలని ప్రశాంత్‌భూషణ్ చేసిన అభ్యర్థనను కోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఒత్తిడులకు లొంగిపోతామని అనుకుంటున్నారా? మా నిబద్ధతను శంకించడం మంచిది కాదు. ఇటువంటి వ్యాఖ్యలను కోర్ట్ధుక్కరణగా పరిగణింవచలసి వస్తుంది’- అని జడ్జీలు మందలించారు.
ఇంత జరిగినా రాహుల్‌కు కనీస రాజకీయ స్పృహ కలుగలేదు. ఏ సాక్ష్యాలను సుప్రీం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసిందో అటువంటి కాగితాలను గాల్లో చూపిస్తూ, తెచ్చిపెట్టుకున్న హావభావాలతో మోదీపై ఆరోపణలు చేశారు. రాజకీయ దుమారం సృష్టించాలనుకున్న రాహుల్ ప్రయత్నాలు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీటి బుడగలా పేలిపోయాయి. రాహుల్ ఆరోపణలను ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అసంబద్ధ ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఇదొక ‘చెత్త’ ఆరోపణ అని ఆమె కొట్టిపారేయడంతో రాహుల్ పరిస్థితి తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు అయ్యింది.
ఇటువంటి ఆరోపణలు రావడం, వాటిపై కోర్టులు తీవ్రంగా స్పందించడం మన దేశంలో కొత్తేమీకాదు. 1995-96లో మన రాజకీయ నాయకులపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఇది ‘జైన్ హవాలా డైరీ’ కేసుగా ప్రసిద్ధికెక్కింది. హవాలా వ్యాపారస్తుడు ఎస్.కె.జైన్ డైరీలో సంక్షిప్తాక్షరాలలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్.కె.అద్వానీ, తదితర రాజకీయ నాయకుల పేర్లు వారి ఎదురుగా కొంత మొత్తం రాసి ఉన్నాయి. ఈ కేసులో తీర్పుచెప్పిన దిల్లీ హైకోర్టు జడ్జి మహ్మద్ షమీమ్- ‘‘కొన్ని విడి కాగితాల కట్ట లేదా క్షణకాలంలో తీసివేయగలిగిన లేదా కూర్చగలిగిన కాగితాలను అకౌంట్ పుస్తకాలుగా పరిగణించలేం’ అంటూ అద్వానీ, వి.సి.శుక్లా తదితరులను ఈ కేసునుంచి విముక్తి కలిగించారు.
నిజ నిర్ధారణకు నిలువలేని సహారా, బిర్లా డైరీల ఆధారంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఉన్నట్టుండి ‘హైపర్’ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనాలోచితంగా మాట్లాడడం, ప్రజల ఆగ్రహానికి గురికావడం రాహుల్‌కు కొత్తేమీకాదు. పఠాన్‌కోట్, ఊరీ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని తీవ్రవాదుల స్థావరాలపై విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. దేశం యావత్తూ గర్వపడే ఇటువంటి సంఘటనను కించపరచేలా, ప్రధాని పదవి గౌరవాన్ని భంగపరిచేలా రాహుల్- ‘మన సైనికులు త్యాగాలు చేస్తున్నారు. మెరుపుదాడులు నిర్వహించారు. మీరు (మోదీ) వారి వెనుక దాక్కుంటున్నారు. జవాన్ల రక్తంతో దళారీ ఉన్నాడు’- అంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రజలనుంచి నిరసన వెల్లువెత్తింది. మోదీని జాతి మొత్తం మెచ్చుకోగా, రాహుల్ నుంచి విపరీత వ్యాఖ్యలు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహాత్మాగాంధీ హత్యపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కింది కోర్టులు హాజరుకమ్మని సమన్లు జారీచేశాయి. కోర్టుకు హాజరు కావడంపై ఆయనకు మినహాయింపును సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాహుల్ అనాలోచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకుండా చేస్తున్నాయి.
సహారా, బిర్లా డైరీలను అడ్డంపెట్టుకుని ప్రధానిపై నిందలు మోపి ఆయన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ‘బురద చల్లడం మా పని- శుభ్రం చేసుకోవడం మీ పని’ అన్నట్లుగా ప్రతిపక్షాల వారు ఆరోపణలు చేస్తున్నారు. వీరందరికీ రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. రాజకీయంగా ప్రధానిని ఎదుర్కొనలేక ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని రాహుల్ నేతృత్వంలో మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితర నాయకులు అవలంబిస్తున్నట్టు కనపడుతున్నది. అవినీతిపై మోదీ చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు పక్కదారుల వెంట దాడులు చేస్తున్నాయి. సరైన నియమాలు, పద్ధతులు పాటించకపోతే ఇవి ప్రజల నిరసనకు గురికావల్సి వస్తుంది.
రాహుల్ చేస్తున్న ప్రకటనల వల్ల కాంగ్రెస్‌కు నష్టం ఖాయం. ఆయన చేష్టలు, ప్రకటనల కారణంగా రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయినా, ఏహ్యభావం పెరిగినా ప్రజాస్వామ్య వ్యవస్థకే దెబ్బతగులుతుంది. ఏదో ఒక వంక చూపించి పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో మన్నన కోల్పోతున్నది. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టుగా రాహుల్ వ్యాఖ్యలతో రాజకీయ వ్యవస్థ ప్రతిష్ఠకు దెబ్బతగులుతోంది. అసంబద్ధ, అసత్య, అవగాహనా రాహిత్య ప్రకటనలు, చర్యలు మానుకుంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే లాభం కలుగుతుంది. అందరి ప్రతిష్ఠ పెరుగుతుంది.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113