మెయన్ ఫీచర్

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి వారు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ పిలుపునిచ్చారు మొదట. ఆ తర్వాత బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్భారత్’ అని నినాదం వినిపించారు. ఇదంతా జరిగి కొంతకాలమైనా, ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొక వైపు నితీశ్‌కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాస్త ‘మచ్చిక’ అనదగ్గ రీతిలో వ్యవహరిస్తున్నారు. మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యక్ష ప్రతినిధి కారనే సాంకేతిక వాదనను పక్కకు ఉంచితే, ఈ పరిణామాలు దేశాన్ని ఎవరి నుంచి ఎవరైనా ‘ముక్త్’ చేయటం సాధ్యమనేలా ఉన్నాయా?
పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిచేదీ లేనిదీ, ఉత్తరప్రదేశ్‌లో తమ 28 స్థానాలు స్వంతంగా గాని లేక అఖిలేశ్‌తో పొత్తుద్వారా గాని ఈసారి పెరిగేదీ లేనిదీ, ఉత్తరాఖండ్‌లో ఈసారి కూడా అతి పెద్దపార్టీగా అవతరించగలదో లేదో, మణిపూర్, గోవాలలో ఏమవుతుందో ఏదీ చెప్పలేము. ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలను గమనించినపుడు భారతదేశం ‘కాంగ్రెస్ ముక్త్’ కాగల సూచనలు లేవు. ఈ అయిదింట కలిపి మొత్తం 690 అసెంబ్లీ సీట్లుండగా, వారి వారి మిత్రపక్షాలను పక్కన ఉంచితే పోయినమారు కాంగ్రెస్ 157, బిజెపి 111 గెలిచాయి. గత అయిదేళ్లలో ఎవరూ ‘ప్రమాదకరంగా’ బలహీన పడలేదు, ‘అరివీర భయంకరంగా’ బలపడలేదు. హెచ్చుతగ్గులు ఇరువురికీ ఎంతోకొంత ఉంటాయి. పొత్తులపై ఆధారపడి అధికారాలూ చేతులు మారవచ్చు. ఇవి ఎప్పుడూ ఉండేవే. కాని గుర్తించవలసింది దేశం ఎవరి నుంచీ ‘ముక్త్’ కాబోవటం లేదు. వాస్తవానికి బిజెపి గాని, నితీశ్ గాని తమ తమ పిలుపులను ఇచ్చినపుడు అవి తమ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఇచ్చిన నినాదాలుగా చూడటం తప్ప, ఆ పని నిజంగా సాధ్యమని రాజకీయాలు తెలిసిన వారెవరూ నమ్మి ఉండరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన పదేళ్ల అధికారాన్ని కోల్పోవటమే గాక, స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని విధంగా 48 స్థానాలకు పతనమైంది. రెండు పెద్ద రాష్ట్రాలు, అరడజను చిన్న రాష్ట్రాలు మినహా అంతటా ప్రభుత్వాలను పోగొట్టుకుంది. మరొక వైపు భవిష్యత్తును గమనిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం, క్రియాశీలక పాత్ర క్షీణించసాగాయి. కొత్త అధ్యక్షుడు కాగల రాహుల్ గాంధీ పట్ల ఎవరికీ నమ్మకం కలగటం లేదు. పార్టీ విధానాలకు పునర్నవీకరణ, సంస్థకు దూరమైన సామాజిక వర్గాలను తిరిగి ఆకర్షించగలగటం ఎండమావులుగా మిగిలాయి. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, ఇతర దేశాల కంపెనీలు ‘కాంగ్రెస్ గురించి ఆలోచించటం వృథా’ అనే స్థితికి వచ్చాయి. మరొక వైపు మోదీ వ్యక్తిగత ఉధృతికి ఎదురులేదనే వాతావరణం ఏర్పడింది. ఈ స్థితిలో బిజెపి 2014 నాటి అపూర్వ విజయాన్ని సుస్థిరం చేసుకోవాలని, దీర్ఘకాలికం చేసుకోవాలని భావించింది. అందుకు అవరోధం కాగల అవకాశం అంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానితో ‘కాంగ్రెస్ ముక్త్’ను ఒక లక్ష్యంగా ఎంచుకుని బిజెపి వారు ఆ నినాదమిచ్చారు.
అది నెరవేరి తీరగలదని బిజెపి నాయకత్వం నమ్మిందా? అంటే చెప్పలేము. అయితే వారికి అనుకూలం కాగలిగేట్లు ఉన్న కొన్ని పరిస్థితులను గమనించాలి. గతంలో పలు ప్రతిపక్షాలు కలిసి ‘కాంగ్రెసేతర వేదిక’గా అధికారానికి వచ్చిన సందర్భాలున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, కొన్ని ఇతర పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటుచేశాయి. రెండు విధాలైన సందర్భాలలోనూ కాంగ్రెస్ బలహీనంగా ఉండటం అన్నది సామాన్యాంశం. కాని దేశ రాజకీయాలలో ఆ దశ గడిచిపోయిందా? అనే అభిప్రాయం కలుగుతున్నది. అది ఇక తిరిగి రాని విధంగా గడిచిపోయినట్లు నిర్ధారణగా అనలేము గాని, ఇపుడు కనిపిస్తున్నదేమిటి? కాంగ్రెస్ గతంలో బలహీనపడినా మరీ ఇంతగా కాకుండా, ఇతర పార్టీలకు ఒక ఇరుసుగా నిలబడగలిగింది. వారితో సైద్ధాంతికంగా స్థూలమైన ఏకీభావం గలవారు, బిజెపితో ప్రాంతీయ స్థాయిలో అధికార వైరుధ్యమున్నవారు ఆ ఇరుసుచుట్టూ తిరిగారు. అందుకు భిన్నంగా ఇపుడు ఆ ఇరుసు, కనీసం ప్రస్తుత దశలో గణనీయంగా బలహీనపడింది. మునుముందు ఏమి జరగవచ్చునన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఇది ఒకటి కాగా మరొకటి, వివిధ ప్రాంతీయ పార్టీలకు గతంలో ఉండిన స్థూలమైన సైద్ధాంతికతలు క్రమంగా తగ్గుతుండటం. అధికారం, అభివృద్ధి అనేవే ప్రధానమవుతుండటం. అందుకు అనుగుణంగా వారి పొత్తులు ఏ విధంగా మారుతున్నాయో మనం కొంతకాలంగా గమనిస్తున్నదే. పైన చెప్పుకున్న విధంగా కాంగ్రెసేతర, బిజెపి యేతర శక్తులు కలసి మూడవ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల అవకాశాలు మాత్రం శూన్యం అనదగ్గ విధంగా ఉన్నాయి. లోగడ ఈ పార్టీల నుంచి ఒకటి ప్రత్యామ్నాయంగా మూడవ ఇరుసు కాగా, ఇతరులు దాని చుట్టూ కేంద్రీకృతమయేవారు. అట్లా ఇరుసు కాగల పార్టీ ఏదీ ఇపుడు లేదు. అయేందుకు ములాయం సింగ్ మధ్యమధ్య ప్రయత్నిస్తుంటారు గాని అదెన్నడూ ముందుకు పోలేదు. ఇతరులలో పలు పేర్లు వినిపించాయి. లాలూప్రసాద్, నితీశ్‌కుమార్, మమత, కేజ్రీవాల్, జయలలిత, శరద్‌పవార్, నవీన్ పట్నాయక్ వంటివి. కాని ఆ ప్రయత్నాలు ఎన్నడూ సీరియస్‌గా లేకపోగా వారితో వారికి పోటీ మాటలు విన్పించాయి. కనుక ప్రాథమిక దశను దాటలేదు. వీరినందరినో కొందరినో ఏకం చేసేందుకు వామపక్షాలు పట్టువదలని విక్రమార్కుని వలె ప్రతి ఎన్నికల ముందు ‘మూడవ ప్రత్యామ్నాయ’మంటూ గట్టి ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఇపుడిక ఆ జోలికి పోతున్నట్లు లేరు.
బిజెపికి తమ కోణం నుంచి ఆశాభావాలు, కాంగ్రెస్, ఇతర పార్టీల శిబిరాలలో నిరాశాజనక పరిస్థితులు ఉన్నందువల్ల ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి తగిన సమయం అనుకున్నట్లున్నారు. దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ చేయడమంటే రాజకీయపరమైన అర్థం ఆ పార్టీ ఉనికి లేకుండా చేయటం కాదు. మరింత గణనీయంగా బలహీనపరచి కేంద్రంలో, రాష్ట్రాలలో దీర్ఘకాలంపాటు అధికారానికి దూరం చేయటం, ఆ స్థానాన్ని తాము ఆక్రమించి స్థిరపడటం వారి లక్ష్యమని భావించాలి. ఇందుకు ప్రస్తుతం కనిపిస్తున్న అనుకూల పరిస్థితులు దీర్ఘకాలికం కాగలవా? అన్నది ప్రశ్న. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ ఈ ప్రశ్నకు సమాధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ సమాధానం తిరిగి నాలుగు అంశాలపై ఆధారపడుతుంది. మొదటిది, అన్నింటికన్న ప్రధానమైనది, బిజెపి పరిపాలన ఎంత జనరంజకం కాగలదన్నది. రెండవది, కాంగ్రెస్‌కు తగిన వివేకోదయం కలిగి తననుతాను ఎంతవరకు, ఎంతకాలంలో పునర్నవీకరించుకోగలదన్నది. మూడవది, రాష్ట్రాలలో కాంగ్రెస్ సహా వివిధ పార్టీల ప్రభుత్వాలు ఎంత బాగా పాలించి తమ ప్రజాదరణను నిలుపుకోగలవన్నది. నాల్గవది, ప్రజల దృక్పథాలలో రాగల మార్పులు. అందువల్ల 2014 నుంచి ఇప్పటివరకు గల పరిస్థితులను మాత్రమే నమ్ముకుని ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ సాధ్యమని బిజెపి భావిస్తే పొరపాటవుతుంది.
మరొక స్థాయిలో గుర్తించవలసిన విషయం ఒకటుంది. సమాజంలోని ఆర్థిక- సామాజిక- రాజకీయ పరిస్థితులనుబట్టి, ప్రజలలో ఏ ఆలోచనలు, ఆకాంక్షలు ఎంతమేరకు ఉన్నాయనే దానిపై ఆధారపడి, భిన్నమైన భావజాలాలు చెలామణీ అవుతాయి, మారుతుంటాయి కూడా. ఆ ప్రకారం చూసినపుడు కాంగ్రెస్‌కు తన చోటు అంటూ ఒకటి మొదటినుంచి ఉంటూ వస్తున్నది. అందులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, చోటు మాత్రం కాదనలేనిది. ఇతరులు విఫలమై, తననుతాను సంస్కరించుకోగలిగినపుడు ఆచోటు పెరుగుతున్నది. అనగా హెచ్చుతగ్గులు తన చేతిలోని విషయం. అందువల్ల ఆ పార్టీని ఇప్పటికిపుడు గాని, సమీప భవిష్యత్తులో గాని పూర్తిగా కొట్టివేయలేము. కాంగ్రెస్ ముక్త్ నినాదమిచ్చినవారు గ్రహించలేనివి కావు ఇవన్నీ.
నితీశ్‌కుమార్ నినాదం విషయానికి వస్తే, అది మెరుపువంటి ఆలోచన ఒకటి కలగటంతో అన్న పాప్యులిస్టు మాట తప్ప, దానికి అంతకుమించిన విలువను ఆయన సైతం ఇచ్చారనుకోలేము. వాస్తవానికి బిజెపితో నిజమైన సవాలుగల కాంగ్రెస్ అటువంటి ఊహాగానాలేవీ చేయకపోగా, నితీశ్ ఆ మాట అనటం నవ్వు తెప్పించింది కూడా. బిహార్‌లో నితీశ్, లాలూప్రసాద్‌లకు బిజెపి నుంచి ముప్పులేదని కాదు. రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలోగల అల్పసంఖ్యాక వర్గాలను వెంట ఉంచుకోవటం ఆయనకు అవసరం. తన విమర్శ బిజెపికి పరిమితం గాక, ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తావన తేవటం ఆ వర్గాలను మరింత మెప్పించగలదు. కాని ఆయన ఆ మాట అన్న తర్వాత మరేమాటా, చర్యా అందుకు సంబంధించి లేకపోవటం గమనించదగ్గది. కనీసం అదే పాప్యులిస్టు నినాదాన్ని అయినా కొద్ది వారాల తర్వాత నుంచి పునశ్చరించటం లేదు. ఇపుడు భిన్నమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. దీని అర్థం ఆయన లాలూప్రసాద్‌ను వదలి మోదీతో మైత్రి చేయనున్నారని కానక్కరలేదు. 2014 తర్వాతి ఉప ఎన్నికలలో తమను గెలిపించిన కూటమిలోని మిత్రులను వదలుకునే సాహసం ఆయన చేయకపోవచ్చు. జరుగుతున్నది మాత్రం ‘ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్’ ధోరణికి భిన్నమైనదనేది కన్పిస్తున్న విషయం.
భారత సమాజంలో ‘ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్’ లక్ష్యం ఎవరైనా సీరియస్‌గా పెట్టుకున్నా అది ఎంతమాత్రం సాధ్యమయేది కాదు. కాంగ్రెస్ ముక్త్‌ను సాధ్యం చేయని విధంగానే, ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్‌ను అసాధ్యం చేసే సామాజిక- సాంస్కృతిక- చారిత్రిక పరిస్థితులు దేశంలో ఉన్నాయి. హిందూ మతాన్ని, సంస్కృతిని పలువురు పలువిధాలుగా చూస్తున్నమాట నిజం. ఆ వైవిధ్య దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్‌ది ఒకటి. అది బలంగా మారి విస్తృతమైన రీతిలో చాలామందిని ప్రభావితం చేస్తున్నది. మతం, సంస్కృతితో సంబంధం గల భావజాలాలు,ప్రభావాలూ మూలాలలోకి వెళ్లి స్థిరపడతాయి. పరిస్థితులను బట్టి అందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చుగాక. కాని అవి నిర్మూలనమయేవి కాదు. ఈ మాట కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కు, హిందూ మతానికి పరిమితమైంది కాదు. ఇటువంటి ఏ మతానికి, సంస్కృతికి, సంస్థలకైనా వర్తిస్తుంది. వాటిని అణచివేసేందుకు ఎవరైనా విఫలప్రయత్నాలు చేయవచ్చుగాక, కాని భావజాలాలుగా ఒక దేశాన్ని వాటినుంచి ప్రజాస్వామికంగా కాని, అణచివేత ద్వారా గాని ‘ముక్త్’ చేయటం జరిగే పనికాదు. ఆర్‌ఎస్‌ఎస్ ముక్త్, కాంగ్రెస్ ముక్త్ రెండూ సాధ్యపడనివే. కాకపోతే ఆ రెండింటి ప్రత్యర్థులు తమ భావజాలాలను, పరిపాలనలను ప్రజలకు ఉన్నత స్థాయిలో ఆమోదయోగ్యం చేసినట్లయితే అపుడవి ఆమేరకు నియంత్రణలో ఉండవచ్చు. అది సహజ రీతి నియంత్రణ అవుతుంది. అంతకుమించి ఎవరేది ఆశించినా వృథా ప్రయాసే. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767