మెయన్ ఫీచర్

ప్రపంచంపై ఆధిపత్యమే ట్రంప్ అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏ జాతి పక్షి ఆ జాతి సమూహంతోనే ఎగురుతుంద’నేది ఓ ఆంగ్ల సామెత. బుద్ధిజీవులైన మానవులకు కూడా ఈ సూత్రీకరణే బాగా అలవడింది. ఒకప్పుడు దేశాల సౌభ్రాతృ త్వం చుట్టూ తిరిగే రాజకీయాలు, త్యాగ నిరతిని, ప్రాణ త్యా గాన్ని ఆభరణాలుగా భావించే ఈ ప్రాపంచిక రాజకీయాలు సమీకరణలను మార్చుకోవడం గత రెండు దశాబ్దాలకు పైగా శీఘ్రతరమైంది. సంకుచిత, స్వార్థ ప్రయోజనాలే దోపిడీ ఎజెండాగా రూపాంతరం చెంది రాజకీయాల్నే శాసించడం, తమతమ అనుకూల శక్తుల్నే అధికార పీఠంపై కూర్చుండపెట్టడం, ఇతర దేశాల్లోకూడా ఇలాంటివారే కూర్చుండేలా, గెలుపొందేలా రాజకీయ పావుల్ని కదపడం ప్రపంచ రాజకీయాలుగా మారిపోయాయి.
అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే చిత్రపటం కనపడుతున్నది. బీద దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారి ‘పెనంపై నుంచి పొయ్యిలో పడిన’ చందంగా తయారైంది. ఇప్పుడు హోచిమిన్‌లు, చావెజ్‌లు, సద్దాంలు, గడాఫీలు, ఫిడెల్ క్యాస్ట్రోలు లేకపోవడంతో అమెరికా ఆడిందే ఆటగా మారుతున్నది. ఇక లెనిన్‌లు, మావోలు జన్మించే పరిస్థితి లేకపోగా, జన్మించినా బతికిబట్టగట్టే పరిస్థితి ఇంటాబయట లేకుండా స్థానిక, అంతర్జాతీయ రాజకీయాలు బలంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి చోదకశక్తి రాజకీయాలకు అమెరికా కేంద్ర బిందువుగా వుండగా, వీటిని ‘పెంటగాన్’ తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నది. దీని కనుసన్నల్లోనే ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక సంస్థలు నడవడమేకాదు, మానవ హక్కుల ముసుగులో హక్కుల సంస్థలు ఎదగడం జరుగుతున్నది.
రెండు ప్రపంచ యుద్ధాలు నేర్పిన గుణపాఠాల్ని బాగా ఒంటబట్టించుకున్న అగ్రదేశాలు, యూరోపియన్ దేశాలు కూటములుగా ఏర్పడి తమతమ వ్యతిరేక శక్తుల మధ్య, దేశాల మధ్య యుద్ధాల్ని రగిలించడం, ఆయుధాల్ని అమ్ముకోవడం, కుదరకపోతే మార్కెట్లను ఆక్రమించుకోవడం, సొమ్ముచేసుకోవడంతో భారత్ సహా ఇతర బడుగు, బలహీన దేశాల ప్రజలు కేవలం వినియోగదారులుగా మారిపోతున్నారు. ఫలితంగానే దేశాలు ఆర్థికంగా ఎదిగినట్లు కనపడినా, ప్రజల ఆర్థిక స్థితి రోజురోజుకూ దిగజారడం మొదలైంది. ఈ కాలంలోనే బలిసేవారు మరింతగా బలిసిపోవడంతో, వీరి బలుపే దేశ బలుపుగా చిత్రీకరించబడుతున్నది. అందుకే గత సంవత్సరం ప్రపంచ జనాభాలోని సగం జనాభాకుపైగా సమానమైన సంపదలు 62 మంది చేతిలో వుండగా, ఈసారి కేవలం 8 మంది చేతిల్లోకి చేరగా, ఇందులో ఆరుగురు అమెరికా బిలియనీర్లే కావడం గమనార్హం. భారతదేశపు 3.1 ట్రిలియన్ డాలర్ల సంపదలో 58 శాతం సంపద కేవలం ఒక శాతం (ముఖేష్, సంఘ్వి, అజీమ్ ప్రేమ్‌జీ, బిర్లా తదితరులు) ధనవంతుల చేతిలో కేంద్రీకృతమైనట్లు గత సోమవారం దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆక్స్‌ఫామ్ నివేదిక తెలపడం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎపి సిఎం చంద్రబాబు సహా మన దేశం నుంచి వందమంది ఆర్థిక దిగ్గజాలు పాల్గొనడం జరిగింది. ప్రజల ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్నా, ఈ దిగ్జజాల ఆస్తుల పెరుగుదలనే దేశ జిడిపికి ఆధారంగా లెక్కించడం జరుగుతున్నది.
ఈ సందర్భంగానే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల తర్వాత నవంబర్ 19న భారత్ సహా 18 దేశాల్లో జరిగిన సర్వేలో వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేసియా, డెన్మార్క్, హాంకాంగ్ దేశాల ప్రజలు ప్రపంచీకరణకు బాసటగా నిలవడం గమనార్హం. చైనాలో ఈ సర్వే జరగలేదు. జరిగితే చైనీలుకూడా సంపద మోజులో ఓటువేసేవారే అని నిర్వాహకులు తెలుపుతూ, ప్రపంచ మార్కెటును, పెట్టుబడుల్ని శాసిస్తున్న అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశవాసులు ప్రపంచీకరణను వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కల్గించినా, ఈ దేశాల వాణిజ్యానికి, వీరి ఆర్థిక ఎదుగుదలకు ప్రపంచీకరణనే ఇబ్బందిగా తయారైయిందనేది వీరి భావనగా సర్వే నివేదిక ప్రస్తావించడం జరిగింది. అగ్రరాజ్యాల్ని ముఖ్యంగా అమెరికాను 365 రోజులు చివాట్లుపెట్టే భారత్‌లోని అభ్యుదయ శక్తులు కూడా ప్రపంచీకరణతోనే తమ పిల్లలు అమెరికాలో డాలర్ల వేట సాగించడమే కాదు, అమెరికా పౌరులుగా స్థిరపడడానికి కారణమని భావిస్తూ ప్రపంచీకరణను మానసికంగా ఆహ్వానించడం జరుగుతుందనేది కాదనలేని సత్యం. ఈ వర్గాలతోపాటు, భారతీయ మధ్యతరగతి వారు హెచ్1 వీసాలపై ట్రంప్ మాట్లాడుతున్న తీరుకు తెగ బాధపడిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మేలో ఉత్తర డకోటాలో ట్రంప్ మాట్లాడిన తీరు చాలమందికి గుబులు పుట్టించింది. తిరిగి అమెరికాను అగ్రభాగాన నిలపడం, అమెరికేతరుల (‘తెల్లవారు’ కాని) పీడ వదిలించుకోవడం, మెక్సికో ద్వారా అమెరికాలోని చొరబడుతున్న లాటిన్ అమెరికా దేశాల, ముస్లిం దేశాల పౌరుల్ని వెనక్కి పంపించి, ఉగ్రవాదం నుంచి అమెరికాను రక్షించడమే తన ప్రధాన ఎజెండా అని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో గాలి పీల్చి బతకాలనుకుంటున్న వారి ఆశలు అడియాసలుగా మారే ప్రమాదం వుందనేది వీరి భావన.
అంతర్జాతీయ రాజకీయాలపై ట్రంప్ మాట్లాడుతున్న తీరుకూడా వీరి ఆలోచనలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఓ మంచి పరిణామం అంటూనే, ఫ్రాన్స్ సహా డెన్మార్క్, నెథర్‌లాండ్, హంగరీ, ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్ లాంటి తదితర దేశాలు కూడా త్వరలో ఈ యూనియన్ నుంచి వైదొలుగుతాయని ట్రంప్ జోస్యం చెప్పడం, జర్మనీ చాన్సలర్ అంగెలా మెర్కెల్ పశ్చిమాసియా, ముఖ్యంగా సిరియా శరణార్థులకు ఆశ్రయాన్నివ్వడం ట్రంప్‌కు నచ్చడం లేదు. వీటితోపాటు గతంలో ఒబామా చేపట్టిన పథకాల్ని, రష్యాలాంటి దేశాలపై విధించిన ఆంక్షల్ని ట్రంప్ రద్దు చేయడం అప్పుడే ప్రారంభించాడు. 25 మిలియన్ల అమెరికన్లకు లాభాన్ని చేకూర్చిన ఎఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఒబామా కేర్)ను రద్దుచేయడం తోపాటు, ప్రతి కొత్త నిబంధన అమలు సందర్భంగా రెండు ఒబామా పాత నిబంధనల్ని నిర్ద్వంద్వంగా ట్రంప్ రద్దుచేయాలనుకోవడం డెమోక్రాట్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ఇలాంటి ఒబామా వ్యతిరేక ఆలోచనలే ట్రంప్‌ను మాస్కోకు దగ్గర చేయగా, అమెరికా ఎన్నికల్లో మొట్టమొదటిసారి విదేశీ హస్తం (వాల్దిమిర్ పుతిన్) రాజకీయాల్ని శాసించేలా చేయడానికి దోహదపడ్డాయి. ఇలా రష్యాకు దగ్గరౌతున్న ట్రంప్ వ్యూహాత్మకంగా చైనా మార్కెట్‌ను, ఆయుధ సంపతిని నియంత్రించడానికి తైవాన్‌తో, జపాన్‌తో దగ్గరయ్యేలా చేస్తున్నాయి. అందుకే ఎన్నికకాగానే తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్‌వెన్‌తో ట్రంప్ ఫోన్‌లో సంభాషించాడు. ప్రపంచ ఆధిపత్య రాజకీయాలకు ఆదినుంచి వేదికగా వుంటున్న పసిఫిక్, హిందూ మహాసముద్ర ఒప్పందాలను రద్దుచేసుకోవాలని భావిస్తూనే ట్రాన్స్-పసిఫిక్ కూటమి (టిపిపి)నుంచి అమెరికా వైదొలగాలనే ఆలోచనను ట్రంప్ ముందుకుతెచ్చాడు. ఆస్ట్రేలియాతో చెలిమిని సాగిస్తూ, భారత్‌ను బుజ్జగిస్తూ హిందూ మహాసముద్రంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనేదే ట్రంప్ అంతర్జాతీయ వ్యూహం.
ఇటలీ,గ్రీస్‌లతోపాటు ఆర్థికంగా చతికిలబడుతున్న యూ రప్ దేశాల బలహీనతలు, దేశీయంగానే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యత, మధ్య, పశ్చిమ ఆసియాలో వేళ్ళూనుకుంటున్న అంతర్గత కలహాలు, ఉగ్రవాద బూచి ట్రంప్‌కు బాగా కలిసి వస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఒబామా విధానాలే కొనసాగుతాయనే కొంత భయం ట్రంప్‌ను చివరి నిమిషంలో గెలిచేలా చేసాయి. అయితే ఆయన నోటి దురుసుతనం, నల్లజాతీయుల పట్ల, ముస్లింల పట్ల, అమెరికాలోని ఇతర దేశాల ఉద్యోగుల పట్ల మాట్లాడుతున్న తీరు ఈమధ్యననే నిర్వహించిన పాపులారిటీ రేటింగ్‌లో ట్రంప్‌ను 54శాతం మంది వ్యతిరేకించడం జరిగింది. ఇది కొంత ఊరట కలిగించడమేకాక, అమెరికా పౌర హక్కుల నేత జాన్ లివిస్‌పై ట్రంప్ విరుచుక పడడం హక్కుల కార్యకర్తలతోపాటు ఆలోచనాపరులు, నిజమైన బుద్ధిజీవులు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా వుండాలని నిర్ణయించుకోవడం కూడా ఓ మంచి పరిణామమే!
అయితే ఈ వ్యతిరేక పరిణామాలు ఎంతకాలం కొనసాగుతాయి? ఏయే దేశాధినేతలు ట్రంప్‌కు దూరంగా వుంటారు? అనేది చెప్పడం కూడా కష్టమే! ఎందుకంటే, అత్యధిక దేశాధినేతలు రాజకీయాల్ని వృత్తిగా భావించి అధికారాల్ని చలాయిస్తే, అమెరికా అధ్యక్షుడు ‘పెంటగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి’గా పనిచేయాల్సిందే. ఈయనకు సహాయకులుగా పనిచేసే జాతీయ భద్రతా సలహాదారు, డిఫెన్స్ సెక్రటరీ, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లాంటివారే అమెరికా రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషిస్తే, అధ్యక్షుడు ముఠామేస్ర్తిగా వ్యవహరిస్తాడు. ఈ వ్యవహారాల్లో పట్టుండి, అధ్యక్షుడికి అనుకూలంగా వుండేవారినే అధ్యక్షుడు నియమించుకునే అధికారం వుండడంతో, మైఖల్ ప్లైన్, జేమ్స్ మట్టిస్, రెక్స్ టిల్లర్‌సన్‌లను ట్రంప్ ఎంపిక చేసుకున్నాడు. ఇందులో మొదటిద్దరు పాక్ అనుకూలురు కావడం, భారత్‌కు కొంత ప్రతికూలతనే! అయినా ‘లిబర్టీ స్టాచ్యూ’ ముందు మన నాయకులు మోకరిల్లినంత కాలం భారత్‌కుగాని, అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కాని ఎలాంటి ఢోకా వుండదనేది మనవారి నమ్మకం. అందుకే నిన్నటిదాకా మన్మోహన్‌జీని నమ్మితే, నేడు మోదీజీని నమ్ముతున్నాం. ఫ్రాన్స్‌లో మేడమ్ లిపెన్‌ను, హంగరీలో బర్బాన్‌ను, టర్కీలో ఎర్డోగాన్‌ను ఆ దేశాల పౌరులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే ‘సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకేలాగుంటే, బాధపడే కుటుంబాల సమస్యలు, ఇబ్బందులు మాత్రం కుటుంబానికో తీరుగా వుంటాయ’న్న టాల్‌స్టాయ్ మాటలు ఈ సందర్భంగా అక్షరసత్యాలే! *

- జి.లచ్చయ్య సెల్: 94401 16162