మెయన్ ఫీచర్

ఒక ఉద్యోగి ఆత్మహత్య పాఠాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంచం తీసుకుంటూ పట్టుబడిన నిజామాబాద్ ఇంజనీర్ సిహెచ్.వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సహజంగానే సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్ర విభజన తర్వాత ఒక ఉద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఇదే మొదటిసారి. హైదరాబాద్ నివాసి అయిన వెంకటేశ్వర్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజనీరు. ఒక కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు బేరం కుదుర్చుకుని, ఇరవై వేల రూపాయల మొత్తాన్ని తన కింది సిబ్బంది ద్వారా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇతను దొరికిపోయాడు. ఈ నెల 21న ఎసిబి వలలో చిక్కి, అదేరోజు తన నివాస భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఒక మనిషి తన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించుకోవటమం ఒక విషాదం. ఎసిబికి దొరికిపోయి ఇతర ఉద్యోగుల ముందు, సమాజం ముందు అవమానాన్ని ఎదుర్కోవటం ఆయనకు భరించలేనిదిగా తోచి ఉండాలి. ఎదురు వాదనలు చేసేందుకు అది కేవలం ఆరోపణల కేసు కాదు. ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా నగదుతో దొరికిన కేసు. కనుక విచారణలు, శిక్షలు తప్పే అవకాశం లేదు. వెంకటేశ్వర్లు బహుశా సున్నిత మనస్కుడు, భయస్తుడు అయి ఉండాలి. లేనట్లయితే, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారెందరో నిర్లజ్జగా, నిర్భీతిగా తిరుగుతూ, పైరవీలు చేసుకునో తిరిగి పై అధికారులకు లంచాలు ఇచ్చో కొంతకాలానికి చల్లగా కేసులను మాఫీ చేయించుకుంటున్నప్పుడు, తను ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉండేవాడు కాదేమో. పరిస్థితులను అట్లుంచితే, ఆయన పట్ల, తన కుటుంబం పట్ల కొంత సానుభూతి కలగక మానదు.
ఇందులో వెంకటేశ్వర్లు చేసిన తప్పు తక్కువది కాదు. ఆయన మంచి జీతం తీసుకుంటున్న ఉన్నతోద్యోగి. ఏ ఉద్యోగి అవినీతినైనా ఆమోదించేందుకు వీలులేనిదే గాని, కింది స్థాయి వారైనపుడు రెండు మాటలు వినిపిస్తాయి. జీతాలు చాలక కక్కుర్తిపడ్డాడేమో అని ఒకటి, పెద్ద ఉద్యోగులు తీసుకుంటే ఏమీ చేయరు గాని చిన్నవారిని వేధిస్తారని మరొకటి. నిజానికి ఈ మాటలు చెల్లుబాటు కానివి. జీతాలు చాలని మాట వాస్తవమైనా దాని అర్థం అవినీతికి పాల్పడవచ్చునని కాదు. అట్లా పాల్పడటం వల్ల జరుగుతున్నదేమిటి? పనులు జరగక ఇబ్బందులు పడుతున్న వారిలో సామాన్యులు కూడా ఉంటున్నారు. పనుల కోసం పదే పదే ఆఫీసుల చుట్టూ తిరిగే వారిలో సాధారణ ప్రజలు, పేద రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు చాలామందే ఉంటున్నారు. వారు లంచాలు కూడా ఇవ్వవలసి రావటం మరింత సమస్య కాదా? ఉద్యోగులు చిన్నవారైనాసరే వారికి జీతభత్యాల రూపంలో నికరమైన ఆదాయం ఉంటుంది. అది నెల తిరిగేసరికి చేతికందుతుంది. వర్షాలు పడినా పడకున్నా, కరువుతో పంటలు ఎండిపోయినా వారి జీతానికి భంగముండదు. వీరంతా యూనియన్లు ఉండే సంఘటిత వర్గాలు గనుక ఇంకా జీతభత్యాలకు, ఇతర సదుపాయాలకు కలిసి ఆందోళనలు, సమ్మెలు చేయగలరు. పరిపాలనను స్తంభింపజేయగలరు. బ్యాంకుల నుంచి, అవసరమైతే బయటా అప్పులు తేలికగా తెచ్చుకోగలరు. ప్రభుత్వం నుంచి వైద్య సదుపాయాలు తగినన్ని ఉంటాయి. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాంతం పెన్షన్లు లభిస్తాయి.
వీటన్నింటితో పోల్చితే సామాన్యుల జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? వీరు కూడా మనుషులనే మానవత్వం ఉద్యోగులలో ఉండాలి. ప్రజల కోసం పని చేసేందుకే తమకు ఉద్యోగాలు ఇచ్చారనే ఇంగితజ్ఞానం అయినా ఉండాలి. ఇవేవీ లేక సామాన్యులను వేధించటం, లంచాలు డిమాండ్ చేసి పీడించటం చిన్న ఉద్యోగులకు అయినా సమర్ధనీయమవుతుందా? ఈ మాటకు ఎంత విలువలేదో, పెద్ద ఉద్యోగులే అవినీతి చేస్తుండగా చిన్నవారిని అనటం ఎందుకనే మాట కూడా అంతే విలువలేనిది. అవినీతి పైస్థాయిలోనూ ఉండటం, కింది స్థాయికన్నా అనేక రెట్లు కావటం అందరికీ తెలిసిందే. అవినీతి నిరోధక చర్యలు ఉన్నతాధికారులపై ఇంకా తీవ్రంగా ఉండాలనటం సరైన వాదనే. కాని ఆమాట చాటున కింది స్థాయి అవినీతి ఉపేక్షించదగినది కాబోదు. రాజకీయాలలో, అధికార యంత్రాంగానికి సంబంధించి అన్నిస్థాయిలలో అవినీతి లేనపుడే ప్రజల జీవితాలు గాని, పరిపాలన గాని సవ్యంగా సాగుతాయని కొత్తగా చెప్పనక్కరలేదు. అందువల్ల, పైన పేర్కొన్న తరహా వాదనలు సాకులు మాత్రమే అవుతాయి.
ఆత్మహత్యకు పాల్పడిన అధికారి ఇంజనీర్ హోదాలో ఉన్నవాడు. పెద్ద జీతం తీసుకుంటున్నవాడు. తానెందుకు ఈ పనిచేసినట్లు? రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సిబ్బంది జీతభత్యాలను దాదాపు రెట్టింపు చేశాయి. నేరుగా ప్రభుత్వ యంత్రాంగంలో లేని ఇతర ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరిగాయి. ఆ మొత్తాలను చూసి సామాన్యులు ఆశ్చర్యపోవటమేకాదు, ఉద్యోగాలు చేస్తున్న వారిలోనే నిజాయితీపరులు కొందరు కూడా మేం చేస్తున్న ఘనకార్యానికి ఇంతింత జీతాలా? అని వ్యాఖ్యానించారు. సమాజంలో సంపద పెరిగేకొద్దీ, అవసరాలు పెరిగిన కొద్దీ ఉద్యోగులకు జీతాలు పెరిగితే అందులో నిరసించదగినదేమీ ఉండకూడదు. అటువంటపుడు వారు తమ విధులను తాము సరిగా నిర్వర్తించాలని, అవినీతికి పాల్పడరాదని ఆశించటం తప్పవుతుందా? వారు సక్రమంగా పనిచేసినపుడు జీతాలు ఎక్కువన్నది సమస్య కాదు. మంచి జీతాలు తీసుకుంటూ కూడా ఈ విధంగా వ్యవహరించటం తప్పక ప్రశ్నార్థకమవుతుంది.
తెలంగాణ విషయానికి వస్తే, ఉద్యోగ సంఘాలవారు తాము పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధిచేయటంలో భాగస్వాములవుతామని, మామూలుకన్న ఎక్కువ పనిచేస్తామని పలుమార్లు ప్రతిజ్ఞలు చేసారు. కాని అందుకు కట్టుబడినవారు అతి తక్కువగా కన్పిస్తున్నారు. వారి అవినీతి గతంలోకన్న పెరిగిందనే మాట అంతటా వినవస్తున్నది. ఈ రెండున్నరేళ్లలో వచ్చిన ఆరోపణలు, పట్టుబడిన కేసులు లోగడకన్న తక్కువేమీ కానట్లు ఎసిబి లెక్కలు చెప్తున్నాయి. కేసుల పాలవుతున్న వారిలో జిల్లాస్థాయి, ఒకోసారి రాష్టస్థ్రాయి అధికారులు కూడా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే జరుగుతున్నది. రెండుచోట్ల కూడా ఉద్యోగ సంఘాలవారు, టీచర్లు మొదలైన ఇతర సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు డిమాండ్లు చేయటం మినహా, విధులను సరిగా నిర్వర్తించాలని, అవినీతికి పాల్పడరాదని తమ సంఘాల సభ్యులకు చెప్పటం కన్పించదు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సుమారు రెండు సంవత్సరాల క్రితం, అవినీతి విషయమై వరంగల్‌లో మాట్లాడుతూ తీవ్రమైన హెచ్చరికలు చేసారు. ఎవరైనా లంచాలు అడిగితే తన కార్యాలయానికి నేరుగా ఫిర్యాదులు చేయాలంటూ అప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు ప్రకటించారు. తర్వాత ఎసిబి ఉధృతంగా పనిచేయటం మొదలుపెట్టింది కూడా. రెండేళ్లు గడిచినాక సమీక్షించుకుంటే అవినీతి దారి అవినీతిదే అన్నట్లుగానే ఉంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగులు స్వయంగా బాధ్యతతో, స్ఫూర్తితో పనిచేయవలసిందిపోయి వారికి హెచ్చరికలు చేయవలసిన పరిస్థితి రావటమన్నదే విచారకరమైన స్థితి. హెచ్చరిక అనంతరం కూడా ఆ పరిస్థితి మారకపోవటం ఒక విషాదం.
కెసిఆర్ ఆలోచన ప్రకారం అవినీతిని మొదట రాజకీయ స్థాయిలో, సెక్రటేరియట్ స్థాయిలో నియంత్రించినట్లయితే ఆ సిగ్నల్స్ కిందిస్థాయికి వెళతాయి. అట్లా కానపుడు, పైవాళ్ల అవినీతి సంగతేమిటనే ప్రశ్న వస్తుంది. జవాబు చెప్పటం కష్టమవుతుంది. ఇట్లా ఆలోచించిన ఆయన ఉన్నత స్థాయి అవినీతిని అరికట్టటం చేసారు. ఆ విషయమై ప్రత్యర్థులు కూడా సీరియస్ ఆరోపణలు చేయలేకపోతున్నారు. కాని ఈ సిగ్నల్స్ ఆయన ఆశించినట్లు కిందిస్థాయికి వెళ్లటం లేదు. అట్లా పంపేందుకు ఉద్యోగి సంఘాలు సహకరిస్తున్నదేమిటో తెలియదు. పైకిమాత్రం ఏమీ కన్పించటం లేదు. ముఖ్యమంత్రి ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, సంక్షేమం, పౌర సరఫరాల శాఖలపై దృష్టిపెట్టినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఈ శాఖలలో అవినీతి ఎక్కువన్నట్లు కేసులు చెప్తున్నాయి. ఇవి ప్రజలతో నేరుగా సంబంధాలున్న శాఖలు కావటం గమనించదగ్గది. దీనినంతా గమనిస్తున్న ప్రజలకు ఉద్యోగుల పట్ల ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటన ఇపుడు ముందుకు వచ్చింది గనుక ఉద్యోగుల గురించి ఈ చర్చ జరుగుతోంది. కాని ఇతర రంగాల అవినీతిని ఉపేక్షిస్తున్నట్లు కాదు. ప్రస్తుత సందర్భానికి సంబంధించి ఉద్యోగులు, వారి సంఘాల నాయకులు చేస్తున్నదేమిటన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఇదే విధంగా అర్థం కాని విషయం మరొకటి ఉంది. అది ప్రతిపక్షాలు, వివిధ సామాజిక సంఘాలు, మేధావుల ధోరణి. కమ్యూనిస్టులు సహా వీరంతా ఉద్యోగుల హక్కులు, డిమాండ్ల గురించి అలసట లేకుండా మాట్లాడతారు గాని, అదే ఉద్యోగులు సామాన్య ప్రజల పట్ల చూపుతున్న అన్యాయపు తీరు గురించి ఒక్కసారైనా నోరుమెదపరు. ‘బాధ్యతలు సరిగా నిర్వర్తించండి, అవినీతికి పాల్పడకండి’ అనే మాట వీరినుంచి ఎంతమాత్రం విన్పించదు. ఉద్యోగుల తీరువల్ల ప్రజలు, గ్రామీణులు, పేదలు, రైతులు, కార్మికులు, వృద్ధులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను గమనించవలసిందిగా మాటమాత్రమైనా చెప్పరు. హక్కులతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయని, బాధ్యతలు నెరవేర్చని వారికి హక్కులు కోరే నైతికత ఉండదని ఒక్కసారైనా అనరు. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు ప్రజలు సంఘటిత శక్తిగా లేరు గనుక పట్టదు. ఉద్యోగులు సంఘటితమై ఉంటారు గనుక వారి మద్దతు కావాలి. వారి విరాళాలు కావాలి. వారు తమ మీటింగులకు, ధర్నాలకు రావటం అవసరం.
ఉద్యోగులు పట్టణ ప్రాంతాలతో కేంద్రీకృతమై ఉంటారు, తెల్లబట్టలు వేసుకుంటారు, చదువుకున్నారు గనుక మాట్లాడగలరు, తమ పనులు చేసి పెట్టగలరు, తమతో భుజాలు కలిపి తిరగగలరు కనుక వారి తీరును పట్టించుకోరు. అందువల్ల సామాన్యులకు కలిగే కష్టనష్టాలతో నిమిత్తం లేకపోయినా, ఆ ప్రజలను ఇతరత్రా భ్రమపెట్టి మోసం చేయవచ్చునన్నది వీరి భరోసా. అందుకు అలవాటుపడి సాగిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ ఇంజనీర్ ఆత్మహత్య ఇటువంటి పరిస్థితులన్నింటికీ ఒక ప్రతీక వంటిది. ఇప్పటికైనా జ్ఞానోదయమవుతుందా? *

టంకశాల అశోక్ సెల్: 98481 91767