మెయన్ ఫీచర్

విద్యలో విలువలు ఉత్తమాటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాబోధనలో విలువల గురించి ఆలోచించేటప్పుడు అమెరికా అధ్యక్షుడిగా, మానవతావాదిగా వినుతికెక్కిన అబ్రహాం లింకన్ తన కుమారుడిని బడిలో చేర్పించినపుడు హెడ్ మాస్టర్‌కు రాసిన లేఖ గుర్తుకొస్తుంది. ఆ లేఖలో లింకన్- ‘మనుషులందరూ మంచివారు కాకపోవచ్చును గాని, ప్రపంచంలో దుర్మార్గులున్నట్టే మంచివారు కూడా వుంటారు. పుస్తక పరిజ్ఞానంతో పెంపొందించుకున్న మేధస్సును ఎక్కువ ధరకు విక్రయించుకోవడంలో తప్పులేదు. కానీ, ఎట్టి పరిస్థితిలోనూ హృదయానికి ధరను తెలిపే చీటీ అంటించుకోకూడదు. కష్టపడకుండా వచ్చే అయిదు డాలర్లకన్నా, శ్రమించి సంపాదించిన ఒక్క డాలరు విలువైనది. మా అబ్బాయికి ఈ విషయాలన్నీ బోధించండి.. నలుగురూ నడిచే దారి మంచిది కాదని అనిపించినప్పుడు- నమ్మిన సత్యం కోసం పోరాడగలిగే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పండి-’అని రాశాడు. ఉత్తమ విలువలతో కూడిన విద్యకు ఇంతకంటే నిర్వచనం మరొకటి ఉండదు.
విద్య కేవలం బతుకుతెరువుకు మార్గంగా మా త్రమే కాకుండా, ఉన్నత విలువలను పరమలక్ష్యంగా కలిగి వుండాలి. ప్రస్తుత విద్యావిధానాన్ని చూ స్తుంటే- అది జీవనోపాధిని, ఉన్నత విలువలనూ కలిగించేదిగా కనబడటం లేదు. విద్యార్థులకు మానవీయ విలువలు తెలియాలంటే ఆ కృషి ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిల్లోనే జరగాలి. పిల్లల లేత మనసుల్లో కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావాలు తలెత్తకుండా చూడాలి. పాఠశాలల్లో ‘విలువల’ బోధనకు రోజూ కొంత సమయం కేటాయించాలని జాతీయ విద్యాపరిశోధనా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి) గతంలో ఒక విధానపత్రాన్ని తయారుచేసింది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలియదు. మన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక, హైస్కూలు విద్యలను గరిపే పాఠశాలలు సాధారణ బాధ్యతలను కూడా నిర్వహించే స్థితిలో లేవు. ఉన్నత విద్యావ్యవస్థ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
‘ప్రథమ్’ పేరిట ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జిఓ) ఒకటి వుంది. పాఠశాలల్లో బోధనా విధానం ఎలా వుంది? విద్యార్థుల్లో అవగాహన ఎలావుంది? పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను దేశవ్యాప్తంగా పరిశీలించి, వార్షిక విద్యాస్థాయి నివేదిక (ఏన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్- ఎయస్‌ఇఆర్)ను ఆ సంస్త విడుదల చేస్తూ వుంటుంది. ఈ నివేదికల్లోని ఒక విలక్షణమైన విషయం ఏమిటంటే- సంస్థ ప్రతినిధులు సందర్శించిన పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థులకు రెండవ తరగతి పుస్తకం ఇచ్చి, దానిని వారు చదవగలుగుతున్నారా? చిన్నచిన్న గుణకారాలు, భాగహారాలు చెయ్యగలుగుతున్నారా? ఒకటి నుండి వందవరకూ అంకెలు వరుసగా చెప్పగలుగుతున్నారా? ఇలాంటి ప్రాథమిక విషయాలను సేకరిస్తారు. తమ అధ్యయనం ఆధారంగా గణాంకాలు ప్రకటిస్తారు. విద్యారంగాన్ని పర్యవేక్షించే ప్రజాప్రతినిధులకు, విద్యాధికారులకు ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ సంస్థ సభ్యులు 2014లో దేశవ్యాప్తంగా 16,497 గ్రామాలను సందర్శించి, 5,69,279 మంది పిల్లలను కలిసి ఒక నివేదిక వెలువరించారు. ఆ నివేదిక ప్రకారం మూడవ తరగతిలో వున్న 75 శాతం మంది, అయిదవ తరగతిలో వున్న 50 శాతం మంది, ఎనిమిదో తరగతిలో వున్న 25 శాతం మంది పిల్లలు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగలిగిన స్థితిలో లేరు! దేశం మొత్తమీద రెండవ తరగతి చదువుతున్న గ్రామీణ బాలల్లో అక్షరాలు గుర్తుపట్టలేనివారు 2010లో 13.4 శాతం వుంటే, 2014లో 32.5 శాతం వుంది. అయిదో తరగతిలో వున్న బాలల్లో 20శాతం మంది అక్షరాలు గుర్తుపట్టగలిగినా, పదాలు చదవలేరు. 14 శాతం మంది పదాలు చదవగలరు కానీ వాక్యాలు చదవలేరు. రెండవ తరగతి బాలల్లో 20 శాతం మంది ఒకటి నుండి తొమ్మిదివరకూ అంకెలు గుర్తుపట్టలేరు. మూడవ తరగతిలోవున్న వారిలో 40 శాతం మంది వంద వరకూ అంకెలు గుర్తుపట్టలేరు. ఇలాంటి స్థితిలో ప్రాథమిక, మాథ్యమిక విద్య వుంటే విలువలతో కూడిన విద్య గురించి మాట్లాడడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వ బడుల పరిస్థితి ఇంత శోచనీయంగా వుండడానికి చాలా కారణాలున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయులు లేకపోవడం, తాత్కాలిక ఉపాధ్యాయులే అధికంగా వుండడం, టీచర్లకు తగిన శిక్షణ లేకపోవడం, వారిలో అంకితభావం లోపించడం, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బాలికలకు ప్రత్యేకించి మరుగుదొడ్లు లేకపోవడం వంటి కారణాలున్నాయి. ఒకటో తరగతిలో చేరిన పిల్లలు మాధ్యమిక స్థాయివరకైనా చదువు కొనసాగించకుండా మధ్యలోనే మానెయ్యడం, బడికి రోజూ రాకపోవడం ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక- అలనాటి ‘మెకాలే’ విద్యావిధానం స్థానంలో మనదైన విద్యావిధానాన్ని రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తూనే వచ్చాం. ఇటీవల నూతన విద్యావిధానం (న్యూ ఎడ్యుకేషన్ పాలసీ) రూపొందించడానికి టియస్‌ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ తన నివేదికను 2015 డిసెంబర్ 31న సమర్పించింది. 1986లో రూ పొందించిన విద్యా విధానం తర్వాత 30 ఏళ్లకు వచ్చిన నూతన విద్యా విధానమిది. సుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో ప్రధానంగా నాలుగు లక్ష్యాలు పేర్కొన్నారు. మొదటిది- సత్ప్రవర్తన (్ధర్మ), రెండోది శాంతి, మూడోది ప్రేమ, నాలుగోది అహింస. విద్యకు ఉన్నత విలువలను రూపొందించే లక్ష్యాలే ఇవన్నీ.
ప్రభుత్వ బడుల్లో కనీస సదుపాయాలు పెరగాలంటే నిధులు వుండాలి. కానీ, ప్రభుత్వం విద్యారంగానికి కేటాయిస్తున్న ద్రవ్యం సంతృప్తికరంగా లేదు. 1968, 1986 నాటి విద్యావిధానాల నుండి మొత్తం జి.డి.పి.లో ఆరు శాతం విద్యారంగానికి కేటాయించాలన్న ప్రతిపాదన నేటికీ అలాగే వుంది. మొత్తం జి.డి.పి.లో సగటున 3.5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చిచూచినా ఇది చాలా తక్కువ! సదుపాయాలు కల్పించడం మాట అటు వుంచి, ఉపాధ్యాయులను తగినంతగా నియమించలేకపోతున్నాం. ఒక అంచనాప్రకారం పాఠశాల విద్యలోనే 6,89,000 మంది ఉపాధ్యాయుల కొరత వుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండాలి. ఈ నిష్పత్తి 1:35గా వుంది. తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులైన టీచర్ల సంఖ్య ఎక్కువే. తగిన శిక్షణ లేనివారు కూడా ఇందులో ఉన్నారు. శాశ్వత ప్రాతిపదికపై టీచర్ల నియామకం జరిగితే ఎక్కువ ఖర్చుఅవుతుంది కాబట్టి ప్రభుత్వం అవలంభిస్తున్న పొదుపు ధోరణి ఇది! ఆమధ్య మానవ వనరులశాఖ దేశంలో వివిధ రంగాలకు చెందిన 29,000 మందిని నూతన విద్యావిధానం ఎలా వుండాలన్న విషయమై అభిప్రాయసేకరణ జరిపింది. అర్హత కలిగిన టీ చర్లను శాశ్వత ప్రాతిపదికపై నియమించాలని, బడుల్లో కనీస అవసరాలు తీర్చాలని చాలామంది సూచించారు.
ప్రభుత్వం ‘సర్వశిక్షా అభియాన్’ను రూపొందించి, ‘అందరికీ విద్య’ అంటూ ఆర్భాటం చేశాక ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ, వీరిలో కనీసం అయిదవ తరగతి వరకూ అందరూ చదవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలు పనికి వెళ్లడం, గ్రామీణులు కుటుంబాలతో పట్టణాలకు వలస పోవడంతో మధ్యలోనే చదువు మానెయ్యాల్సి రావడం, ఆడపిల్లలు ఇళ్లలో ఉంటూ తమకన్నా చిన్నపిల్లలను చూచుకోవడం, ఇంటి పనులలో సహాయం చేయాల్సిరావడం వంటి కారణాలు ఉన్నాయి.
మానవ వనరుల మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం ప్రాథమిక విద్యాస్థాయిలో చదువుమానేసే వారి శాతం (2014-15లో) 4.33 శాతం వుంటే, మా ధ్యమిక విద్య స్థాయిలో అది 17.86 శాతం ఉంది. పిల్లలు పనులకు వెళ్లే వయసు రావడమే ఇందుకు కారణం. పల్లెటూళ్ల పరిస్థితి ఇలావుంటే, పట్టణాలలో పరిస్థితి మరొక విధంగా వుంది. పట్టణాలలో చాలామంది ప్రయివేటు స్కూళ్లల్లోనే తమ పిల్లలను చేర్పిస్తూ వుంటారు. వేలకువేలు ఫీజులు గుంజే ఆ స్కూళ్లల్లో ఎయిర్ కండిషన్డ్ తరగతి గదులు, ఎయిర్ కండిషన్డ్ స్కూలు బస్సులు, స్విమ్మింగ్ పూల్, కంప్యూటర్లు, టాయిలెట్ సదుపాయాలు ఇట్లాంటి డాబులే తప్ప విద్యాబోధన పట్ల శ్రద్ధ వుండదు. ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడే టీచర్లు ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మిగతా వాళ్ళు తక్కువ జీతాలతో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే తగిన అర్హతలేనివారే. ‘డిటెన్షన్’ పద్ధతి లేదు కాబట్టి పిల్లలు పై క్లాసులకు వెళ్లిపోతూంటారు. ఇంగ్లీషులో చిలక పలుకులు పలుకుతూంటారు. తల్లిదండ్రులకు అదే సంతృప్తి!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులచేత జనాభా లెక్కలు, ఎన్నికల కార్డులు, ఆధార్‌కార్డులు, ఇతర సర్వేలంటూ అడ్డమైన పనులూ చేయిస్తుంటారు. ప్రయివేటు స్కూళ్లల్లో అయితే టీచర్ల చేత ఎడ్మిషన్ పనుల నుండి ఎకౌంట్లు రాసే పనివరకూ అన్ని పనులూ చేయిస్తుంటారు. ప్రభుత్వ స్కూళ్లల్లో తాగునీరు, లైబ్రరీ, ఫర్నిచర్ వంటి కనీస సదుపాయాలు వుండవుగాని, కొన్ని స్కూళ్లకు కంప్యూటర్లు పంపుతూ వుంటారు. వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవాళ్లు వుండరు. ఉపాధ్యాయులకు శిక్షణ వుండదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం అధికంగా వుంటుంది. కొందరు ఉపాధ్యాయులు రాజకీయ ఏజంట్లుగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతారు. బోగస్ డిగ్రీలతో టీచర్లుగా పనిచేస్తున్న వారి బాగోతాలు బిహార్ వంటి రాష్ట్రాల్లో బయటపడ్డాయి. ఉన్నత ఆశయాలతో విలసిల్లవలసిన విద్యాసంస్థలు రాజకీయవేత్తల జోక్యంతో- కులతత్వానికి, మతతత్వానికి, అవినీతి కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నూతన విద్యావిధానాలు రూపొందించి కొత్త ప్రయోగాలు చేద్దామనుకుంటుంది. ప్రముఖ తత్త్వవేత్త బెర్‌ట్రాండ్ రీసెల్ అంటాడు- ‘రోగికి ఏ మందు ఇవ్వాలో చెప్పే అర్హత వైద్యునికే తప్ప ఎవరికీ లేదు. కానీ, విద్యార్థికి ఎలాంటి విద్య బోధించాలో చెప్పేది విద్యారంగంతో సంబంధం లేనివాళ్లు’అని! ఇన్ని అవలక్షణాలున్నప్పుడు విలువలతో కూడిన విద్య ఎలా సాధ్యం?- అంగడి సరుకైన విద్య సమాజంలో విలువల గురించి చెబుతుందా?
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969