మెయన్ ఫీచర్

బడ్జెట్‌లో చెప్పేది ఎక్కువ.. చేసేది తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుక్కతోక వంకరెందుకో..’ తెలియనట్లే బడ్జెట్ రహస్యాలు అంత సులువుగా అర్థం కావు. ఆర్థికశాస్త్ర నిపుణులే వి విధ రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వుంటారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక విశే్లషణలు ప్రతి బడ్జెట్ సందర్భంగా చూస్తునే వుంటాం. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకోవడం చదువుకున్నవారికే కష్టం. అందుకే ప్రతి బడ్జెట్‌ను ఓ రొటీన్ వ్యవహారంలా చూడడం అలవాటైంది. ఓ లక్ష్యమంటూ లేని రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో ఎలా జనరంజకంగా వుంటుందో, బడ్జెట్ రూపకల్పన అలాగే వుంటుంది. ఏ పథకం ఎందుకు ప్రారంభించబడిందో,ఎంతకాలం కొనసాగించాలో, దానికి ముగింపు ఎలా పలకాలో పట్టించుకోని పాలకులు ఆ పథకాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించడం ఓ ఆనవాయితీగా మారింది.
రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోకు, పాలకపక్షంగా మారిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఎలాంటి సంబంధం కనపడదు. మధ్యమధ్యలో వచ్చే వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోలు ప్రజలకు స్వర్గానే్న చూపిస్తాయి. చెప్పే మాటలకు, చేపట్టే పథకాలకు, ఇచ్చే తాయిలాలకు, రాయితీలకు హేతుబద్ధత ఎక్కడా కానరాదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిపామనే ప్రకటనలు తప్ప ఎన్నికల సంఘానికి ఇవేమీ పట్టవు. ఈ గందరగోళమే సామాన్యుడిని బాధ్యతలకు దూరం చేస్తున్నది. అందుకే బడ్జెట్‌లో ‘నాకేం ఒరిగింద’ని చూడడం తప్ప, బడ్జెట్‌లో చూపిన అంకెలకు ప్రాతిపదిక ఏమిటి? మూలధనం ఎలా సమకూరుతుంది? ప్రత్యక్ష, పరోక్ష పన్నులు జనాలపై ఎలా మోపుతారు? పన్నుపోటు లేని బడ్జెట్ ఆమోదం పొందాక- వెన్నుపోట్లు ఎలా వుంటాయి? సామాన్యుడు మరింత సామాన్యుడిగానే ఎందుకు దిగజారుతున్నాడో, ఎదిగిన వాడే మరింత ఎత్తుకు ఎందుకు ఎదుగుతున్నాడో ఎవరికీ పట్టవు. పట్టినా వీటినో మామూలు విషయాలుగా భావించడం జరుగుతున్నది.
గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలు, వేసిన పన్నులు, సెస్సుల ద్వారా వసూలైన మూలధనం ఎంతమేరకు సంబంధిత పథకాలకు ఖర్చు చేయబడిందో, ఇచ్చిన హామీలు ఎంతమేరకు నెరవేర్చబడ్డాయో సమీక్ష ఎక్కడా జరగదు. వర్తమాన బడ్జెట్‌లో దీని ప్రస్తావన వుండదు. అందుకే తాత్కాలిక ప్రయోజనాలే జనాలను ఆకర్షించగా, ఇవే అభివృద్ధి నమూనాలంటూ పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈసారి బడ్జెట్‌ను బీదవారి, రైతుల, బడుగు, బలహీన వర్గాల బడ్జెట్‌గా అభివర్ణించిన ప్రధాని మోదీ, ఇది జాతి భవిష్యత్తుకు బాటవేస్తుందంటూ, ‘్ఫ్యచర్’ అనే ఆంగ్ల పదానికి ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థాన్ని ఆపాదిస్తూ రైతుల, బడుగువర్గాల బడ్జెట్ అని అన్నారు. పారదర్శకతను కలిగి సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుందని, పట్టణాభివృద్ధితోపాటుగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని పెంచుతుందని ఆయన సెలవిచ్చాడు. ముందుగా రైతుల విషయంగా చూసినప్పుడు, 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. సంతోషించదగ్గ విషయమే అయినా, ఇది వాస్తవరూపం దాల్చుతుందా? అనేది ప్రశ్న!
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కూరగాయలకు కనీస రవాణాచార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని చత్తీస్‌గఢ్ రైతులు పండించిన కూరగాయల్ని రోడ్లపైన కుమ్మరించడం చూశాం. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తూనే వున్నాం. మొన్నటికి మొన్న తెలంగాణలో దుడ్డు రకం వరి ధాన్యానికి మద్దతు ధర రాగా, సన్న ధాన్యానికి రాకపోవడంతో కల్లాల్లోనే రాశులుగా వుంచాల్సి వచ్చింది. చివరికి దళారులకు దొడ్డు రకం ధాన్యం ధర కన్నా తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. బజార్లో మాత్రం సన్నరకం బియ్యం క్వింటా 4వేల రూపాయలకు పైగా వుండడం గమనార్హం. బడ్జెట్‌లో రైతుల రుణమాఫీకి రూ.10 లక్షల కోట్లను కేటాయించడం ముదావహమే అయినా, నిజమైన రుణగ్రస్తునికి ఇవి ఎంతమేరకు చేరుతాయన్నది అనుమానమే! గత సంవత్సరం ఫసల్ బీమా యోజనను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికై 30 శాతం లబ్దిదారులకు ప్రయోజనం చేకూరేలా రూ.5,500 కోట్లను విడుదల చేసినా, అతి కొద్దిశాతం రైతులకు అది కూడా పరపతి గల రైతులకే బీమా ప్రయోజనం చేకూర్చిందని రైతు స్వరాజ్యవేదిక తెలుపుతూ, ఈసారి కేటాయించిన 13,240కోట్ల రూపాయల్లో రూ.9,000 కోట్ల రూపాయలు బీమా కంపెనీల బకాయిల చెల్లింపులకే పోతాయని మిగిలేది తక్కువేనని వ్యాఖ్యానించడం జరిగింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా మిగిలే డబ్బుతో 40 శాతం రైతులకు బీమా సౌకర్యం ఎలా కలుగుతుందనేది మరో ప్రశ్న.
అన్నింటికన్నా ముఖ్యమైంది.. 2008-09లో నాటి యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పనికిమాలిన పథకంగా అభివర్ణించిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ- వరుసగా బడ్జెట్‌లలో ఈ పథకానికి కేటాయింపులను పెంచడం గమనార్హం. బహుశా ఇదో జనరంజక పథకంగా మోదీ భావించినా, ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వ్యవసాయదారులను ఉపాధి హామీ కూలీలుగా మారేలా చేసింది. దీంతో 80 శాతంగా స్వయం సమృద్ధితో సాగిన వ్యవసాయం పరాధీనతకు గురై, 56 శాతానికి పడిపోయింది. ఉపాధి హామీ పథకం ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్ద కాలంలోనే చిన్న, మధ్యతరహా వ్యవసాయం కుప్పకూలుతుంది. దీని స్థానంలో కార్పొరేట్ వ్యవసాయం వేళ్లూనుకుంటుంది. ఇప్పటికే ఈ చర్య ప్రారంభమైంది. వ్యవసాయదారులంతా రైతు కూలీలుగా, పట్టణ ప్రాంత నిర్మాణరంగ కార్మికులుగా మారే ప్రమాదం వుంది. ఇదే జరిగితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఆహార ధాన్యాల్ని భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కరవుకాటకాల సందర్భంగా ప్రవేశపెట్టాల్సిన ఉపాధి హామీ పథకాన్ని ఎల్లకాలం కొనసాగిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఈ ప్రమాద ఘంటికలు ఇప్పటికే మోగుతున్నాయి. దీన్ని నివారిస్తే తప్ప వ్యవసాయ రంగం బాగుపడదని గ్రహించాలి.
ముఖ్యమైన మరో రెండు రంగాలైన విద్య, వైద్యానికి కేటాయింపులు అంకెల్లో బలుపుకనిపించినా, ఆచరణలో అతి బలహీనమే! పైగా ఈ కేటాయింపుల్లో సింహభాగం ప్రణాళికేతర (జీత భత్యాలు) వ్యయానికే ఖర్చుచేయాల్సి వుంటుంది. చదువులో వెనుకబడిన 3,479 బ్లాకుల్ని గుర్తించి విద్యాపరంగా అభివృద్ధి చేయాలనేది బడ్జెట్ లక్ష్యంగా జైట్లీ వివరించాడు. బుద్ధి కుశలత అభివృద్ధికై గతంలో నిర్దేశించిన 60 జిల్లాలకు బదులుగా, ఈసారి 600 జిల్లాలకు విస్తరించడం బాగానే వుంది. గత బడ్జెట్ కన్నా 10 శాతం నిధుల్ని పెంచి, కేటాయించిన 79,686 కోట్ల నిధుల్లో పాఠశాల విద్యకు కేటాయించింది 46,356 కోట్ల రూపాయలే! 3 శాతం విద్యాసెస్ ద్వారా సేకరిస్తున్న డబ్బులో గత సంవత్సరం ఖర్చు చేసింది 55.5 శాతమే! మిగతా రూ.64,188 కోట్ల గురించి ఈసారి బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. గత బడ్జెట్ మిగులు కూడా వుంటుంది. ఇవన్నీ ఎప్పటికీ తేలని లెక్కలే! వైద్య రంగం పరిస్థితి ఇంతే. గర్భిణులకు నేరుగా రూ.6,000 బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నది ఆహ్వానించ తగ్గదే! అయితే, ఆచరణలో ఇది ఎంతమేరకు ఫలితాల్నిస్తుందో సంవత్సరం తర్వాత తేలుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెరగాల్సిన వైద్య సదుపాయాల గూర్చి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితనం గూర్చి, జవాబుదారీ తనం గూర్చి, ప్రభుత్వ చర్యల గూర్చి ఎక్కడా ప్రస్తావన లేదు. విద్యతోపాటు అన్ని రంగాల పరిస్థితి ఇంతే! వౌలికంగా మార్పులు రాకుండా, జవాబుదారీతనం పెరగకుండా, నిధుల కేటాయింపే పరమార్థంగా భావిస్తే ఇప్పుడున్న స్థితే కొనసాగుతుంది. ఈ విషయంగా ఏ బడ్జెట్‌లోనూ చర్చ జరగడం లేదు.
ఉద్యోగ, ఉపాధి కల్పనకై ఈసారి బడ్జెట్‌లో 13.2 శాతాన్ని కేటాయించడం జరిగింది. 2016లో కల్పించిన ఉద్యోగాల సంఖ్య 1.5 లక్షలకన్నా తక్కువేనని అంచనా. గత ఎన్‌డిఎ ప్రభుత్వంలో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ పథకం వందలాది ప్రభుత్వరంగ సంస్థల్ని మూతపడేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోనే 181 సంస్థల్లో ఏడు ‘మహా రత్నాలు’గా, 18 ‘నవరత్నాలు’గా, 73 ‘మినీ రత్నాలు’గా పేరెన్నిక గాంచి, దేశ ఆర్థికశక్తికి చోదక శక్తులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇలా తొంబయవ దశకం దాకా స్థాపించబడిన 298 ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాల్ని అమ్మకానికి పెట్టి, కార్మికుల్ని వీధులపాలు జేస్తూ, తమది ప్రజా ప్రభుత్వమంటూ, యువతకు ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నామంటూ ప్రకటనలివ్వడం ఎలాంటి చర్యనో తెలియదు. ఈసారి బడ్జెట్‌లో 72,500 కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబట్టాలనే ప్రతిపాదనను ప్రజావ్యతిరేక చర్యగా ప్రభుత్వం గుర్తించడం లేదు. గత సంవత్సరం 56,500 కోట్లకై ప్రతిపాదించగా వచ్చింది కేవలం 30,000 కోట్లే. ఇలా సంపాదించిన డబ్బును కొత్త పరిశ్రమలకై వెచ్చిస్తున్నారా? అంటే అదీ లేదు. ప్రభుత్వ సేవా రంగాల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉపాధి లేకుండా చేస్తూ- ‘ఉపాధికి పెద్ద పీటవేస్తున్నామ’నడం ప్రభుత్వ లోపాయికారితనం కాదా! వీటినుంచి దృష్టిని మరలించడానికే దేశవ్యాప్తంగా 100 ఉపాధి నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో చెప్పారు. ఈ కేంద్రాలన్నీ విదేశీయ ఉద్యోగ సమాచార కేంద్రాలుగా పనిచేస్తాయన్నమాట. మన దేశ ప్రజల చెమటలో చదువుకున్న యువతను ఈ దేశ ప్రజల అవసరాలను తీర్చేవారిగా వినియోగించుకోవాల్సిన ప్రభుత్వాలు, మానవ వనరులను ఎగుమతి చేయడం గొప్ప విషయంగా భావించడం శోచనీయం. ఈ మాయజాలంలో పడిన కొన్ని వర్గాలు విదేశీ ఉద్యోగాల్ని ఓ మోజుగా భావించడం బాధాకరం.
వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకన్నా తక్కువ వున్న చిన్న, మధ్య సూక్ష్మ తరహా పరిశ్రమలు చెల్లించాల్సిన పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం, లాభాలపై వేయాల్సిన ప్రత్యామ్నాయ పన్ను కాలాన్ని 5 నుంచి 7 ఏళ్లకు పెంచడం పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వడమే! కానీ, దేశవ్యాప్తంగా ఉన్న 6.94 లక్షల సంస్థల్లో నిజాయితీ ఎంత? నిక్కచ్చి ఎంత అనేది? ఎప్పుడూ తేలదు. రాయితీపై భూమిని, యంత్ర పరికరాలను, విద్యుత్తును అనుభవించే ఈ సంస్థలు ఏనాడూ కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవు. కార్మిక శాఖకు ఇవి పట్టవు. దినసరి వేతనాలపై పనిచేసే ఈ కార్మిక వర్గం ఏనాడూ మూడుపూటలు తిన్నది లేదు. అయినా, ఈ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలను ఇస్తూనే వున్నది. ఇలా బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, ప్రణాళికా రహితంగా, స్థానికతను దృష్టిలో పెట్టుకోకుండా, వ్యవసాయాన్ని, కులవృత్తుల్ని దెబ్బతీస్తూ, విద్య, వైద్య రంగాల్ని ప్రభుత్వరంగంలో నడపకుండా రూపొందుతుంటే, ఎన్ని దశాబ్దాలు గడిచినా- ‘బడ్జెట్’ అంకెల గారడీగానే ఉంటుంది. ప్రతిపాదిక బడ్జెట్‌కు ముందుగానే గత బడ్జెట్‌పై సమీక్ష జరిగితే, కొంతలో కొంత న్యాయం జరుగుతుంది.
*

- జి.లచ్చయ్య సెల్: 94401 16162