మెయన్ ఫీచర్

అవార్డుల్లో అంతుచిక్కని ‘పద్మ’వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హిపోక్రసీ’ అనే పదం, ‘్భరతీయుడు’ అనే పదం సమానార్థకాలు! మనవాళ్లు లోకవంచనే కాదు, ఆత్మవంచన కూడా చేసుకోగలరు. ‘అన్‌సంగ్’ అనే ఆంగ్ల పదానికి ‘అనాదృత’ అనే సంస్కృత పదాన్ని సమానార్థకంగా ఇప్పుడు వాడుతున్నారు. ‘మరుగునపడిన మాణిక్యాలు’, ‘మట్టిలో మాణిక్యాలు’ అని కూడా అంటున్నారు. దేశంలో భారీ సంఖ్యలో ‘సెలబ్రిటీస్’ ఉన్నారు. వారికి ధనమూ కీర్తి పుష్కలంగా లభిస్తున్నాయి. వారికి గత ప్రభుత్వాలు పలుసార్లు పురస్కారాలు అందించాయి. కాబట్టి గుర్తింపులేని బడుగు కళాకారులను గుర్తించాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యంగా భావిస్తోంది. గత ప్రభుత్వాలు సంతలో కూరలను అమ్మినట్లే కేంద్ర పురస్కారాలను అమ్మకానికి పెట్టాయి. ఈ దుర్గతి నుండి బయటపడేలా ‘స్వచ్ఛ్భారత్’ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛ పురస్కారాలు ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించినట్లు కనిపిస్తోంది. ఇది వినడానికి చాలా బాగున్నా, అనుభవంలో ఎంతవరకూ అమలులోకి వచ్చిందనేది సంశయాత్మకమే. కేరళకు చెందిన జేసుదాసు సంగీత విద్వాంసుడు. ఆయనకు ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారం ఇచ్చారు. ఇతడు ‘అనాదృత’ వ్యక్తికాడు. కాబట్టి ‘అన్‌సంగ్ హీరో’ అనే నిర్వచనం విఫలమైంది. జగ్గీ వాసుదేవ్ ‘అనాదృత’ వ్యక్తికాడు. ఇంగ్లీషులో వేదాంత ప్రసంగాలు చేయగలిగిన ప్రజ్ఞాశాలి. గనుక ఇతనికి ‘పద్మ’ అవార్డు వరించింది. ‘పద్మ’ పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కువ మంది ‘సెలబ్రిటీస్’ ఉన్నారు. వీరిలో చాలామంది ‘అనాదృత’ వ్యక్తులు కారన్నది నిజం. ‘పద్మ’ అవార్డుల ఎంపిక తీరుపై చాలాకాలంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది అవార్డులు కూడా అందుకు భిన్నం కాదేమో! ‘పద్మ’ అవార్డు దక్కిన ఓ సంగీత ప్రముఖుడు తన స్థాయికి ఇది తక్కువే అని నిరసన ప్రకటించడం తాజాగా సంచలనం సృష్టించింది. తన కంటే తక్కువ స్థాయి వారికి ‘పద్మ విభూషణ్’లిచ్చి తనకు ‘పద్మశ్రీ’తో సరిపెట్టడం తగదని సంగీత విద్వాంసుడు ఉస్మాన్ ఉమ్రత్‌ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రతిభా పాటిల్ రాష్టప్రతిగా ఉన్నప్పుడు మహారాష్టక్రు భా రీగా ‘పద్మా’లు వడ్డించుకున్నారు. ఇదేమిటని అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయింది. గాయని లతా మంగేష్కర్‌కు ఉన్న గొప్పతనమేమిటో మన ఘంటసాల వెంకటేశ్వరరావుకు, రావు బాలసరస్వతికి కూడా ఉంది. కాకుంటే- తెలుగువాళ్లు దురదృష్టవంతులు. వీరు ‘సుందోప సుందుల’వలే కొట్టుకొని నశిస్తూ ఉంటారు. కాబట్టే ఎలాంటి గుర్తింపులేకుండా మరుగున పడిపోతున్నారు. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి జాతకాలు ఇంతే.
కూచిభొట్ల ఆనంద్ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యానికి ప్రచారం కల్పించి, లక్షలాది కళాకారులతో అమెరికాలో ప్రదర్శనలు ఇప్పించి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించాడు. కాకుంటే తెలుగువాడు కావటం ఇతనికి శాపమైంది. కోట సచ్చిదానందశాస్ర్తీ లాంటి హరికథా కళాకారుడు తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కావాలని చాలాసార్లు సభాముఖంగా వేడుకోవటం మనకు తెలుసు. అయితే, తెలుగువాడు కావడంతో ఈ శాస్ర్తీగారిని ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. జగ్గీ వాసుదేవ్ కన్నా తెలుగువారైన కమలానంద భారతి, పరిపూర్ణానంద, విశ్వయోగి విశ్వంజీ, చిన జీయర్ స్వామీజీలు చేసిన సేవలు ఏ విధంగా తక్కువ? కాకుంటే తెలుగువారు కావటం వారి ‘ఖర్మ’.
మనవాళ్లు మరీ తెలివైనవాళ్లు. బతికివున్న తండ్రికి తిండి పెట్టరు. కానీ, చచ్చాక ఘనంగా శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు జీవించి ఉన్నప్పుడు ఆయనను స్వపర పక్షీయులంతా విమర్శించారు. చనిపోయాక ఆయనకు ‘్భరతరత్న’ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. బతికుండగా ఆయన ప్రతిభను గుర్తించనపుడు, ఇపుడు తీరుబడిగా పురస్కారాలు ప్రకటించినా అర్థం లేదు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ‘్భరతరత్న’ ప్రకటించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించింది. ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే ఐదు రూపాయలకు భోజనం పెట్టడం. ఇక మిగిలిన ఉచిత పథకాలన్నీ ఏ ప్రభుత్వమైనా చేసే పనులే. పోనీ- ఆమె మహానటి కాబట్టి ఇద్దామా? అంటే సావిత్రి వంటి వారు కనీసం ‘పద్మశ్రీ’కి కూడా నోచుకోకుండానే కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ‘నటరత్న’ ఎన్‌టిఆర్‌కు ‘్భరతరత్న’ ఇవ్వాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. బతికి ఉండగా ఆయనను బలవంతంగా గద్దెదించినవారు ఇప్పుడు ఎన్‌టిఆర్‌ను ‘యుగపురుషుడు’ అని కీర్తిస్తున్నారు. ఇక, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాకు మరణానంతరం ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారం ప్రకటించారు. మహారాష్టక్రు చెందిన ఎన్‌సిపి అధినేత, మాజీ సిఎం శరద్ పవార్‌కు ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారం ప్రకటించడంలో ఆంతర్యం చాలామందికి అర్థం కాలేదు. లోక్‌సభ మాజీ స్పీకర్ విలియం సంగ్మాకు చనిపోయాక పురస్కారం ప్రకటించడంలో పరమార్థం ఏమిటో? ఒక మైనారిటీ వర్గానికి ‘పద్మ’ అవార్డు ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ‘తల్లికి చేనేత చీర లేదు.. పినతల్లికి పట్టుచీర’ అన్నట్టు దేశంలో వివిధ రంగాల్లో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవచేసే మహాపురుషులను పట్టించుకునే దిక్కులేదు కానీ, విదేశీయులకు పురస్కారాలు ప్రకటించడం ఎందుకో?
అలనాడు హరగోవింద ఖురానా అని ఒక ప్రముఖుడు ఉండేవాడు. ఆయనకు ఢిల్లీలో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. విదేశాలకు వెళ్ళి విశేష కృషిచేసి నోబెల్ పురస్కారం తెచ్చుకున్నాడు. ‘ఖురానా మావాడోయ్..’ అంటూ ఢిల్లీపెద్దలు చంకలు గుద్దుకుంటూ కేంద్ర పురస్కారం ప్రకటిస్తే దానిని ఖురానా తిరస్కరించాడు. ఈ సంఘటన ఈ తరం వారికి గుర్తుండకపోవచ్చు. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షఖ్ముఖశర్మ, మైలవరపు శ్రీనివాసరావు, బేతవోలు రామబ్రహ్మం, గరికపాటి నరసింహారావు, వద్దిపర్తి పద్మాకర్, గండ్లూరి దత్తాత్రేయశర్మ, శలాక రఘునాథశర్మ, రేమెళ్ల అవధాని, నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో విద్వన్మణులు, తెలుగు జాతి గర్వింపదగిన మహాపురుషులూ ఉన్నారు. వీరెవ్వరూ ప్రభుత్వం దృష్టిలోకి రాలేదు. ‘చో’ రామస్వామి తమిళ సినీనటుడు. ఓ పత్రిక (తుగ్లక్)ను కూడా నడిపాడు. ఆయనకు మరణానంతరం ‘పద్మ’ అవార్డు ప్రకటించారు.
ఇక, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఈ సంవత్సరం జరుగుతున్నది. ఆయన ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవతావాదం’ విశ్వానికి ఆశాజ్యోతిగా నిలిచింది. సాంస్కృతిక జాతీయవాద ప్రవక్తలు ఈ మహాపురుషుణ్ణి ఇప్పటికీ పట్టించుకోకపోవటం దుర్మార్గం. ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్, టంగుటూరి ప్రకాశం వంటి ఎందరో మహాపురుషులకు ‘్భరతరత్న’ రాలేదు. గత ప్రభుత్వాల కాలంలో ఈ స్వాతంత్య్ర సమరయోధులంతా నిర్లక్ష్యానికి గురయ్యారనే ఆరోపణ ఉంది. మరి ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వీరికి చేసిందేమిటి? ఇక్కడ కూడా మళ్లీ కుల,వర్గ సమీకరణలే పనిచేస్తే ఇక దేశానికి దిక్కెవరు? గుత్తా జ్వాల సుప్రసిద్ధ క్రీడాకారిణి. ఆమె ఈ పురస్కారాల ఎంపిక ప్రక్రియపై ప్రసార మాధ్యమాలలో తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసింది. మాంటిస్సోరీ సంస్థల కోటీశ్వరమ్మ (92) తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని పరిహసించింది. ‘నలభై ఏళ్లక్రితం వచ్చిన ఉత్తమ అధ్యాపకురాలి పురస్కారంతో పోలిస్తే దీనికి ఉన్న గౌరవం ఏమిటి? ఈ వయస్సులో ఇది వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే’ అని ఆమె నిరసించింది. ఇలా కొంతమంది కళాకారులు తమ స్థాయికి తగ్గ అవార్డులు సకాలంలో రాలేదని అసంతృప్తిని సహజంగానే వ్యక్తం చేశారు. నిరంజనానంద సరస్వతి సాధువు, జగ్గీ వాసుదేవ్ సన్యాసి. వీరికి ‘పద్మా’లెందుకు? లోగడ కూడా కొంతమంది సాధువులకు అవార్డులు ఇచ్చారు. అది కూడా వేరే రాష్ట్రాలకు చెందినవారికే ఇచ్చారు. తెలుగువారైన సద్గురు కందుకూరి శివానందమూర్తి, వెదురుపాక గాడ్, విశ్వయోగి విశ్వంజీ, కుర్తాళం పీఠాధిపతులు.. వీరికి పురస్కారాలు ఎందుకు రాలేదు?
ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులు నాలుగువేలు. అవార్డులు పొందినవారు 90 మంది. ఇందులో శరద్ పవార్, మురళీమనోహర్ జోషి, సంగ్మా లాంటి పొలిటీషియన్లకే పెద్ద పురస్కారాలు దక్కాయి. మహారాష్టల్రో శివసేన పార్టీ వల్ల బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోంది. అందుకని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిని దగ్గరకు తెచ్చుకోవాలనే వ్యూహంలో భాగంగా పవార్‌కు ‘పద్మవిభూషణ్’ ఇచ్చారన్న వ్యాఖ్యానాలు లేకపోలేదు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, గజల్ శ్రీనివాస్‌ల పేర్లను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి సిఫారసు చేసినా ఫలితం దక్కలేదు. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంపిన జాబితాలను కేంద్రం పరిశీలనలోకి తీసుకోలేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జాబితాలను పంపించవలసిందిగా కేంద్రం కోరడంలో అర్థం ఏముంది? తెలుగువాడైన సీనియర్ కేంద్రమంత్రి చెప్పిన పేర్లుకూడా బుట్టదాఖలయ్యాయి. పత్రికారంగానికి విశేష సేవలు అందించిన గురుమూర్తి మాటేమిటి? ‘పద్మ’ పురస్కారాల ప్రకటనపై తెలుగు చలనచత్ర పరిశ్రమ కూడా భగ్గుమంది. గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావును కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? అని కొందరు సినీ ప్రముఖులు ప్రశ్నించారు. ఇంకా ఎంతోమంది అలనాటి నటీనటులు, దర్శకులు గుర్తింపులేకుండా పోయారు. ‘పద్మం’ గుర్తుగల పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ‘పద్మాల’ పంపకాలు ఇలా జరగటం కళాసాంస్కృతిక రంగాలకు అవమానకరమైన విషయం. విచిత్రమేమంటే తెలుగు సాహితీరంగాన్ని అసలు పట్టించుకోకపోవటం. ఇదంతా ఒక దుర్మార్గపు ‘పద్మ’వ్యూహం. బెంగళూరులో ఉంటున్న అలనాటి సినీనటి భారతికి పద్మశ్రీ ఇవ్వడం ఆనందకరం. ఆమె ఎన్నో తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. అయోగ్యులకు అవార్డులు ఇచ్చినప్పుడు బాధపడాలి. యోగ్యులకు రానప్పుడు దుఃఖపడాలి. నటి భారతి యోగ్యురాలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. కాకుంటే ప్రథమశ్రేణి నటీమణులు అంజలి, జమున, సావిత్రి, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, కన్నాంబ, కాంచనమాల, విజయనిర్మల, వాణిశ్రీ, జయసుధ లాంటివారిని ఇప్పటికీ గుర్తించకపోవడం చూస్తే కళాసాహిత్య రంగాలకు ప్రభుత్వాలు పూర్తి న్యా యం చేస్తున్నాయని అనగలమా?

- ముదిగొండ శివప్రసాద్