మెయన్ ఫీచర్

‘సంక్షేమం’ మోతాదు మించరాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాల నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి దానికి డబ్బు డిమాండ్ చేయటం ఓ సంస్కృతిగా మారుతోంది. తెలంగాణలో ఇప్పుడు ఇది మరింత ఎక్కువగా కన్పిస్తోంది. ఈ సంస్కృతి నిజంగా ‘సంక్షేమం’ కిందకు వస్తుందా? ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి నెమ్మదిగానైనా దీనికి పగ్గాలు వేయటం అవసరం. లేనట్లయితే ఈ ధోరణి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉండవచ్చునన్నది ఒక ప్రశ్న కాగా, సంక్షేమం పేరిట ఈ ‘డబ్బుల డిమాండ్’ సంస్కృతి మితిమిరీపోయే అవాంఛనీయ దశ ఒకటి రావచ్చు. కనుక దీనిని పరిమితి దాటకుండా చూడాలి.
నిజమైన సంక్షేమానికి ఎటువంటి అభ్యంతరం ఉండనక్కరలేదు. సంక్షేమంలో రెండు విధాలున్నాయి. వాటిలో కొన్ని కేవలం ‘జనాకర్షక’ (పాప్యులిస్టు) దృష్టితో చేసేవి. కొన్ని పైకి పాప్యులిస్టుగా ఉన్నా వాటి ఫలితాలు సామాజికాభివృద్ధికి సైతం ఉపయోగపడతాయి. కొన్నింటిలో రెండూ కలగలిసి ఉం టాయి. ఉదాహరణకు పేదలకు చౌక బియ్యం. ఈ పథకాన్ని ఎన్టీఆర్ పెద్దఎత్తున అమలులోకి తేవటం ఓట్లను ఆకర్షించే పాప్యులిజం వల్లనే. పేదలకు చీరలు, ధోవతుల పేరిట జనతావస్త్రాల పథకం కూడా అటువంటిదే. ఆయన ఈ పథకాలను తెచ్చినపుడు పేదల కొనుగోలుశక్తి ప్రస్తుత స్థాయిలో లేదు. అందువల్ల వారికి బాగా ఉపయోగకరమైంది. పేదల పోషకాహార వినియోగ స్థాయిని చౌక బియ్యం పథకం పెంచింది. ఇది మానవాభివృద్ధిలో ఉపయోగపడింది. ప్రభుత్వం నుంచి ప్రతి సీజన్‌లో నిర్దిష్టమైన, నికరమైన విధంగా ధాన్య సేకరణ జరగటం వల్ల వ్యవసాయ రంగానికి లాభం కలిగింది. ఇదంతా ఇప్పటికీ కొనసాగుతోంది. జనతా వస్త్రాల విషయానికి వస్తే వాటి పంపిణీ ఒక పాప్యులిస్టు పథకంగా కొంతకాలం పేదలకు ఉపయోగపడింది. నేత రంగానికి ఆధరువునిచ్చింది. టిడిపికి రాజకీయ లాభాలు తెచ్చింది. కొంతకాలం తర్వాత ఆ పథకం దెబ్బతింది. దానిని ప్రభుత్వం సవ్యంగా అమలుచేసి ఉంటే దుస్తులు ఖరీదు చేసుకోలేని పేదలతోపాటు నేత రంగానికి, పత్తి రైతులకు నికరమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాలు కలిగేవి. కాని అది జరగలేదు. ఎందుకు జరగలేదు? వ్యవసాయ ఉత్పత్తితో సంబంధం గల బియ్యం పథకం సవ్యంగా కొనసాగి, నేత రంగంతో సంబంధం ఉన్న వస్త్రాల పథకం ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? అనే దానిపై రకరకాల వాదనలున్నాయి. వాటిలో కొన్ని ఆరోపణలే కావచ్చు కూడా. కాని పాప్యులిజాలు ఎట్లా పనిచేస్తాయనేందుకు ఇవి రెండు ఉదాహరణలు.
సంక్షేమం, పాప్యులిజం ఎన్టీఆర్‌తో మొదలైనవి కావని అందరికీ తెలుసు. ఆధునిక చరిత్రలో ఈ చర్యలను మొదట జర్మన్ పాలకుడు బిస్మార్క్ ప్రవేశపెట్టగా బ్రిటన్‌తో ఆరంభించి అవి విస్తరించాయి. భారత ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వాన (1937 ఎన్నికలు) స్వాతంత్య్రానికి ముందునుంచే ఈ తరహా చర్యలను ఆవిష్కరించింది. అయితే, వాటి వెనుకగల ఉద్దేశాలు, ఆ చర్యల స్వరూప స్వభావాలు, అందు గురించిన సైద్ధాంతిక చర్చలు తరచూ మారుతూ వచ్చాయి. బిస్మార్క్‌కు రాజకీయాలున్నాయి. అవేమిటో ఆయనే దాపరికం లేకుండా చెప్పాడు. బ్రిటన్‌కు తన పారిశ్రామిక - పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవటం కొంత, మానవతాభావనలు కొంత కలగలిసాయి. భారత పాలకులకు ఆరంభంలో ఉన్నది రాజకీయం అతి తక్కువ కాగా, రైతుల, పేదల సిసలైన సంక్షేమమే ఎక్కువగా ఉంది. ఇది 1947కు ముందటి మాట. తర్వాత నెహ్రూ ప్రభుత్వానికి కూడా రాజకీయం ఎంతోకొంత ఉండి ఉందనుకున్నా, ప్రధానంగా అది సంక్షేమ భావనలతో, సిద్ధాంతాలతో ఏర్పడింది. అపుడది వలస పాలన నుంచి బయటపడిన వర్ధమాన సమాజాల ఆదర్శం అన్నమాట.
తర్వాత సుమారు ఇరవయ్యేళ్లు గడిచేసరికి ఇందిరాగాంధీ నాయకత్వాన ఇది మరంతగా మారి, రాజకీయ అవసరాల కోసం పాప్యులిస్టు సంక్షేమంగా తయారైంది. అప్పటి నుంచి రెండు స్రవంతులు కన్పిస్తాయి. ఒకటి ఇందిరాగాంధీ తరహాది కాగా, రెండవది వివిధ బడుగుపార్టీలు, ఒక మేరకు ప్రాంతీయ పార్టీలు అటు రాజకీయ పాప్యులిజాన్ని, ఇటు నిజంగానే బడుగుల సంక్షేమాన్ని కలగలిపిన తరహాది. కాంగ్రెస్‌లోనూ ఈ వర్గాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఇందిరకు భిన్నంగా ఈ రెండవ మార్గాన్ని అనుసరించారు. ఈ రెండవ తరహాలోకి వచ్చే ప్రాంతీయ పార్టీలకు ఎన్టీఆర్‌తోపాటు తమిళనాడు పార్టీలు, బడుగుల పార్టీలకు యుపి, బిహార్ ప్రాంతపు సోషలిస్టు నేపథ్యపు నాయకత్వాలు, కాంగ్రెస్‌లోనే భిన్నత్వం గల వాటికి కర్నాటకలో దేవరాజ్ అర్స్ ప్రభుత్వం మొదలైనవి ఉదాహరణలు.
కొంతకాలం అట్లా గడిచిన తర్వాత, ఆర్థిక సంస్కరణల కన్నా ముందే, అభివృద్ధి గురించి సమీక్షలు జరిగినపుడు- పాప్యులిస్టు పథకాలు, కేవలం వినియోగానికి ఉపకరించే పథకాలకన్న, పేదలను తమ కాళ్లపై తమను నిలబెట్టే సహాయ కార్యక్రమాలు మంచిదన్న అభిప్రాయం ఏర్పడింది. ‘ఆకలిగొన్న మనిషికి చేప నివ్వటం కన్నా చేపలు పట్టే పద్ధతిని నేర్పటం అవసరమ’నే చైనీస్ సామెత మనదేశపు అభివృద్ధి చర్చలోకి వచ్చి చేరింది ఆ కాలంలోనే! ఈ కొత్త అభివృద్ధి ఫిలాసఫీ ప్రకారం చర్యలు తీసుకోవటం, అంతకుముందటి తరహా పాప్యులిస్టు చర్యలను నెమ్మదిగా తగ్గించటం అపుడు మొదలైంది. అంతలో ఆర్థిక సంస్కరణల దశ రావటంతో ఈ పరిస్థితి కొత్తమలుపు తీసుకుంది. పాప్యులిజం, సంక్షేమం వంటివన్నీ కాలం చెల్లినవని, అవి ఆర్థికాభివృద్ధిని భంగపరుస్తాయనే వాదన పశ్చిమరాజ్యాల నుంచి ఇతర వర్ధమాన దేశాలతోపాటు ఇండియాకు దిగుమతి అయింది.
ఈ దేశాలన్నింటి పాలకులు వివిధ కారణాల వల్ల ఈ కొత్త సిద్ధాంతాన్ని స్వీకరించారు. కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున రుణాల కోసం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల షరతులకు తలొగ్గారు. కొందరు నాయకులు తమ వ్యక్తిగత స్వార్థాలు, తమ దేశాలలోని పారిశ్రామికులూ వ్యాపారుల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయనుకున్నారు. కొందరు మల్టీనేషనల్ కంపెనీల ప్రలోభాలకు లొంగారు. మరికొందరిపై ఇవన్నీ కలగలిసి పనిచేశాయి. మొత్తానికి ఈ సరికొత్త సిద్ధాంతం ప్రకారం ఆర్థికాభివృద్ధి సాధన అన్నింటికన్న ముఖ్యం. అది జరిగినపుడు ట్రికిల్‌డౌన్ సూత్రం ప్రకారం సామాన్య జనమూ బాగుపడతారు. ఆర్థికాభివృద్ధి కోసం పనిచేయటానికి తగిన మనుషులు కావాలి గనుక, వారికి ‘మానవ వనరులు’ అనే పేరుపెట్టి, ఆ ‘వనరుల’ తయారీకి కావలసిన చర్యలు ఏమిటో చెప్పారు. ఆర్థికాభివృద్ధికి ‘వౌలిక సదుపాయాల’ నిర్మాణం జరగాలన్నారు. వర్ధమాన దేశాలలోని ప్రభుత్వ బాధ్యత ఇటువంటి సదుపాయాల నిర్మాణం, వనరుల సృష్టి మాత్రమేనని, బడ్జెట్లను అందుకోసమే ఖర్చుచేయాలని, పేదల సంక్షేమాలు, పాప్యులిజాలు అంటూ నిధులు ‘వృథా’ చేస్తే ‘అభివృద్ధి’ సాధ్యం కాదని భయపెట్టారు. దాంతో- సర్వజనులతో కూడిన సర్వతోముఖాభివృద్ధి మాట ఎట్లున్నా, తమ వ్యక్తిగత అభివృద్ధి, పారిశ్రామిక-వ్యాపార రంగాల వారి అభివృద్ధి మాత్రం వెనుకబడిపోగలదని జంకిన పాలకులు అన్ని షరతులకు అంగీకరించారు. ఆ విధంగా సబ్సిడీల కోత, ‘అర్హులైనవారికి మాత్రమే సంక్షేమం’ వంటివి ముందుకు వచ్చాయి. పాప్యులిజం ఒక ‘పాపపు మాట’గా మారింది.
తార్కికంగా చూసినా, మనకన్నా ముందే ఈ కొత్త విధానాల అమలును ఆరంభించిన దేశాల అనుభవాలను గమనించినా, ఈ మాటలన్నీ నెరవేరేవి కావన్నది ముందే అర్థమైన విషయం. ఇక్కడ అనుభవాలు కూడా ఈ కొత్త ఫిలాసఫీ సంపదలతోపాటు అసమానతలను, నిరుద్యోగాన్ని గతం కన్న పెంచుతున్నట్లు నిరూపించాయి. ట్రికిల్ డౌన్‌లు ఎంతమాత్రం సరిపోలేదు. ‘ఇండియా షైనింగ్’లు, ‘ఆమ్ ఆద్మీ’ నినాదాలు పనిచేయలేదు. ఒకవైపు సమాజంలో అసంతృప్తి ప్రబలుతుండగా మరొకవైపు రాజకీయ అస్థిరతలు కొనసాగాయి. ఈ పరిణామాల మధ్య సంక్షేమం, పాప్యులిజం అన్నవి తిరిగి ముందుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందుకన్న ఎక్కువ అవుతున్నాయేమో కూడా. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇవ్వజూపుతున్నవి, ఇతరత్రా ప్రవేశపెడుతున్న రకరకాల పథకాలు ఈ కొత్త ధోరణిని, లేదా తిరిగి ఆవిష్కారమవుతున్న వెనుకటి ధోరణిని సూచిస్తున్నాయి.
తెలంగాణలో జరుగుతున్నది ఏమిటో ఒక భిన్నమైన దృ ష్టితో కొంత జాగ్రత్తగా ఆలోచించటం అవసరం. ఇక్కడి సమాజంలోని వివిధ తరగతులకు తాము గత అరవయ్యేళ్లలో వెనుకబడ్డామనే భావన బలంగా ఉంది. నిజాం వ్యవస్థలోనూ వెనుకబడ్డామనే ఆలోచన ఉంది. ఇక్కడి ప్రజలలో ముప్పాతికకు పైగా బడుగు, బలహీన వర్గాలవారు. సామాజిక వర్గాల రీత్యానేగాక ఆర్థికంగా కూడా. కనుక వీటన్నింటి ప్రభావంతో వారిలో అసంతృప్తి, అశాంతి మామూలుకన్న ఎక్కువే. ప్రత్యేక రాష్ట్రం కోసమనేగాక ఇతరత్రా కూడా ఆర్థిక, సామాజిక ఉద్యమాలు అనేకం సాగించిన అనుభవాలు, చైతన్యం ఉన్నాయి. ఈ పరిస్థితులలో అభివృద్ధి డిమాండ్లు ఎంతున్నాయో, సంక్షేమం కోసం, పాప్యులిస్టు చర్యల కోసం డిమాండ్లుకూడా అంతున్నాయి. ఈ మూడు విధాలైన చర్యలలో ఎక్కడ లోటు జరుగుతున్నట్లు తోచినా వారు అసహనానికి గురవుతారు. ఇది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా సున్నితమైన పరిస్థితి.
మరొకవైపు చూస్తే, ఈ మూడు విధాలైన సున్నితమైన పరిస్థితుల వత్తిడి కెసిఆర్ నాయకత్వాన గల ప్రభుత్వంపై, ఆయన పార్టీపై ఉంటుంది. వీటిని తగినట్లు ఆదరిస్తూనే, అవి మితిమీరకుండా జాగ్రత్తపడటం, వాటికీ అభివృద్ధికీ మధ్య సమతులనం సాధించటం ముఖ్యమంత్రి వ్యూహానికి, పరిపాలనా కౌశలానికి పరీక్ష అవుతుంది. అభివృద్ధి వల్ల సంక్షేమం కూడా జరగటం సంక్షేమంలో ఈ వర్గాల అభివృద్ధి మిళితమై ఉండటం అందరూ గమనించవసిన మరొక కోణం. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగైనది కావటంతో ఒడిదుడుకులు పెద్దగా ఏర్పడటం లేదు. రాజకీయ సుస్థిరతతోపాటు ఆర్థిక సుస్థిరత ఉండటం ఒక గొప్ప వెసులుబాటు. దానితోపాటు సామాజిక సుస్థిరత సాధనకు జరగవలసింది అభివృద్ధికి- సంక్షేమానికి (లేదా పాప్యులిజానికి)మధ్య సమతులనాన్ని ఏర్పరచుకోవటం.
యథాతథంగా ఈ రెండున్నరేళ్ల పరిస్థితిని గమనించినప్పుడు ఇది ఇంచుమించు సజావుగానే సాగుతున్నట్లు తోస్తుంది. అదే సమయంలో పాప్యులిస్టు వత్తిడులు ఉండటమేగాక పెరుగుతున్నట్లు, అదొక ధోరణిగా నడుస్తున్నట్లు కన్పిస్తున్నది. ప్రభుత్వం నుంచి రకరకాల పేర్లతో నేరుగా డబ్బు డిమాండ్ చేయటం, నగదురూపంలో డబ్బు ఇవ్వటం కాకపోయినా డబ్బు ఖర్చుకాగల కోర్కెలు ముందుపెట్టటం వంటి సందర్భాలను పరిశీలిస్తే, వాటిలో తగినన్ని నిర్హేతుకమైనవని చెప్పడం కష్టం కాదు. ఆ కోర్కెలను తీర్చటం, తీర్చకపోవటం లేదా ఆర్థిక స్థితిని బట్టి తీర్చగలగటం, తీర్చలేకపోవటం అన్నవి ముఖ్యమేగాని ఇటువంటి నిర్హేతుకత డిమాండ్లు ఒక ధోరణిగా మారటమన్నది ఆలోచించవలసిన విషయం.
సూటిగా చెప్పాలంటే ఆమోదించకూడని ధోరణి. ఇది తొలి దశ సంక్షేమాలు, మలి దశ పాప్యులిజాలు, తర్వాతి కాలపు అభివృద్ధి చర్చలు, ఆర్థిక సంస్కరణల ఫిలాసఫీలు మొదలైన వాటితో నిమిత్తం లేని విషయం. దీనిని పాప్యులిస్టు పాప్యులర్ ధోరణి అనవచ్చునేమో. ఇందువల్ల కలిగే మేలులేకపోగా హాని ఉంది. కనుక, వత్తిడులను భరించైనా ఈ హానికర ధోరణులకు తలొగ్గక నిరుత్సాహపరచటం తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన పని. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767