మెయన్ ఫీచర్

స్వాతంత్య్ర కాంక్షకు స్ఫూర్తి.. చంపారణ్ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ దిశ, దశలను మార్చివేసిన రెండు చారిత్రాత్మక సంఘటనల శతాబ్ది ఉత్సవాలను జరుపుకొనడం ఈ తరం చేసుకున్న అదృష్టం. ఈ రెండు సంఘటనల మూల ధర్మం, సిద్ధాంతం ఒకటే. అణగారిన ప్రజల ఉద్ధరణకు కార్యరూపం ఒకటైతే, పీడిత శోషిత ప్రజల అభివృద్ధికి ‘ఏకాత్మ మానవతావాదం’, ‘అంత్యోదయ’ సిద్ధాంతాలను ప్రవచించిన మహానుభావుడు జన్మించి వందేళ్లు కావడం మరొకటి. ‘చంపారణ్ ఉద్యమం’తో స్వాతంత్య్ర సమరానికి గాంధీజీ నాంది పలికి శత వసంతాలైంది. సమస్త విశ్వంలోనూ ఏకాత్మను దర్శిస్తూ, అణగారిన వారిలో అట్టడుగుననున్న వ్యక్తి శ్రేయస్సు కోసం ప్రజలను ఉద్యమ రూపంలో కంకణబద్ధులను చేసిన వ్యక్తి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ.
ఆంగ్లేయుల కిరాతక పాలనలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అక్కడక్కడా పోరాటాలు జరుగుతున్న రోజులవి. మానవతాన్ని మంటగలుపుతూ తెల్లదొరలు బిహార్‌లోని చంపారణ్ జిల్లాలో రైతులపై అమానుష చర్యలకు తెగబడ్డారు. అన్నివిధాలా వెనుకబడ్డ చంపారణ్‌లో వేల సంఖ్యలో వ్యవసాయ కార్మికులున్నారు. కొద్ది సంఖ్యలో రైతులున్నా వారంతా చిన్న, సన్నకారు రైతులే. బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయోజనాల కోసం ఆంగ్లేయులు ఇక్కడి రైతులతో బలవంతంగా నీలిమందు వ్యవసాయం మొదలుపెట్టించారు. వరి, గోధుమ, ఇతర ఆహార పంటల స్థానంలో పొలాలన్నీ నీలిమందు, నల్లమందు తోటలతో నిండిపోయాయి. రైతుల నుంచి అత్యల్ప ధరలకు కొన్న నీలిమందును చైనాలో నల్లమందు తయారీకి ఎగుమతి చేసి భారీగా లాభాలు గడించేవారు. ఆంగ్లేయులు పంటలను స్వాధీనం చేసుకుంటూ దుర్భర దారిద్య్రంలోకి రైతుల్ని నెట్టివేశారు. ప్రకృతి కూడా రైతులపై చిన్నచూపు చూసింది. ఒకవైపు ఆంగ్లేయుల దాష్టీకాలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు. అవి చాలవన్నట్లు బ్రిటీష్‌వారు రైతులపై విపరీతమైన పన్నులు వేశారు. కష్టనష్టాలు భరిస్తున్న రైతులు కొన్ని సందర్భాలలో తిరగబడ్డా బ్రిటిష్ దమననీతి వారిని వెంటనే అణచివేసింది. కష్టాలకు తట్టుకోలేకపోయిన రైతులు తమకు సహాయం చేయాల్సిందిగా మహాత్మా గాంధీని అర్థించారు. 10 ఏప్రిల్ 1917న గాంధీజీ చంపారణ్‌లో అడుగుపెట్టారు. ఆయన వెంట డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య కృపలానీ, బ్రిజ్‌కిషోర్ ప్రసాద్, అనుగ్రహ నారాయణ్ సిన్హాలతోపాటు ప్రముఖ న్యాయవాదులు చంపారణ్ చేరుకున్నారు.
‘సామాజిక ధిక్కరణ అస్త్రం’గా సత్యాగ్రహ ఆయుధాన్ని గాంధీ రూపొందించిన చారిత్రాత్మక ఉద్యమ సంఘటన ఇది. బయటి వారి ప్రమేయం లేకుండా స్థానికులే తమ హక్కుల సాధనకు ఉద్యమించాలన్నది మహాత్ముడి సంకల్పం. చంపారణ్‌లో 1917లో రూపొందించిన ‘సత్యాగ్రహ’ విధానమే తరువాతి రోజుల్లో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటానికి ఆయువుపట్టుగా మారింది. చంపారణ్‌లో గాంధీజీ ఆశ్రమాన్ని నెలకొల్పి, సహచరులను వెంటబెట్టుకుని ఊరూరా తిరిగి సర్వేలు నిర్వహించారు. అక్కడి ప్రజలు అనుభవిస్తున్న దుర్భర దారిద్య్రాన్ని, సాధక బాధకాలను కళ్లారా చూశారు. స్థానికుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చర్యలు మొదలుపెట్టారు. మొట్టమొదటగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను ప్రచారం చేశారు. ఇళ్లతోపాటు గ్రామాలనూ స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశక్యతను వివరించారు. చిన్న చిన్న పాఠశాలలు, వైద్యాలయాలు నిర్మించడం మొదలుపెట్టారు. గ్రామాల్లో నాయకత్వ లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి వివిధ కార్యక్రమాలు అప్పజెప్పారు. ముస్లిం మహిళల ‘పర్దా’ పద్ధతిని విడనాడేలా ప్రోత్సహించారు. అస్పృశ్యతను పాటించనీయకుండా, మహిళలపై పురుషులు పెత్తనం చెలాయించకుండా మానసిక పరివర్తన తీసుకువచ్చారు.
నెమ్మదిగా గ్రామాలు చైతన్యస్ఫురితమయ్యాయి. బ్రిటీషు వారి దుర్మార్గాలను స్థానికులు ధైర్యంగా ఎదుర్కొనడం ప్రారంభించారు. జీవన ప్రమాణాలను మెరుగుపరచుకునే చర్యలను తామే స్వీకరించి, ఇతరులపై ఆధారపడడం మానివేశారు. తమ ప్రాబల్యం తగ్గుతోందన్న అక్కసుతో ఆంగ్లేయులు తమ దౌర్జన్యాలను మరింత ఉద్ధృతం చేసి, చివరికి గాంధీజీని నిర్బంధించారు. ఆయనను విడుదల చేయాలంటూ వేల సంఖ్యలో ప్రజలు పోరుబాట పట్టడంతో జైళ్లు, పోలీసు స్టేషన్లు ఉద్యమకారులతో నిండిపోయాయి. వీధివీధినా నిరసన జ్వాలలు ఎగసిపడడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గాంధీని విడుదల చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు పెంచారు. రైతులు తమ ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చని అంగీకరించి, పెంచిన పన్నులను తగ్గించారు. కరవు సమస్య తీరేవరకూ కొత్త పన్నులు వేయబోమని చెప్పారు. ప్రజలు గెలిచారు. బ్రిటిష్ ప్రభుత్వం ఓడిపోయింది.
ఈ ఉద్యమ సందర్భంలోనే గాంధీజీని ‘బాపూ’ అని ప్రేమగా, ‘మహాత్మా’ అని గౌరవంగా జనం పిలవడం మొదలుపెట్టారు. అహింసాయుత స్వాతంత్య్ర సంగ్రామానికి నాందీప్రస్తావన చంపారణ్‌లోనే జరిగింది. ఈ ఉద్యమం విజయవంతమై నేటికి వందేళ్లయింది. ఆనాడు, నేటికి, ఏనాటికైనా స్ఫూర్తిదాయకమైన ప్రజా ఉద్యమం చంపారణ్ ఆందోళన. ‘సత్యాగ్రహం’ అన్న పదం- రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమకాలంలో పుట్టినా అసలు సత్యాగ్రహం 1917లో ప్రారంభమైంది. వందేళ్లకు పూర్వం రైతులు జరిపిన చంపారణ్ ఉద్యమం మనకూ, మన భవిష్యత్ తరాలకూ స్ఫూర్తిదాయకం.
దిశా నిర్దేశనం చేయగలిగినవారే దార్శనికులు. సమకాలీన చరిత్రలో ప్రముఖ దార్శనికులు, కర్మయోగులలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ అగ్రగణ్యులు. 25 సెప్టెంబర్ 1916లో జన్మించిన దీన్ దయాళ్ ప్రముఖ తత్వవేత్త, ఆర్థిక నీతిజ్ఞుడు, చారిత్రకారుడు, జర్నలిస్టు, సామాజికవేత్త, రాజకీయ దురంధరుడు. ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం నెలకొన్న రోజుల్లో ఉద్భవించిన జాతీయవాద రాజకీయ పార్టీ ‘్భరతీయ జనసంఘాన్ని’ పెంచి పోషించడంలో కీలకపాత్ర వహించినవారు ఉపాధ్యాయ. బడుగుల క్షేమానికి కృషిచేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకూ పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతాబ్ది సందర్భంగా ‘అంత్యోదయ’ పేరిట పెద్ద సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. స్వయంశక్తిపై నిలబడ్డ సమగ్ర, సమృద్ధ భారత నిర్మాణానికి అహరహం కృషిచేసిన వ్యక్తి దీన్‌దయాళ్. మిగిలిన దేశాలు అనుసరిస్తున్న సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం తదితర సిద్ధంతాల వల్ల శ్రేయోదాయక సమాజ నిర్మాణం సాధ్యం కాదని, చిరంతనమైన ‘్భరతీయ సనాతన ధర్మం’ ఆధారంగానే సమాజ శ్రేయస్సు సాధ్యమని ఆచరణయోగ్యంగా నిరూపించిన వ్యక్తి దీన్‌దయాళ్‌జీ. వ్యష్టి, సమష్టిలను సరైన రీతిలో సమన్వయం చేసినపుడే సమర్థవంతమైన సమాజం రూపొందుతుందని సిద్ధాంతీకరించిన వ్యక్తి ఆయన. సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ ఆలోచనతో సమన్వయపరిచి దేశ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలంటూ భారతీయ జన సంఘ్, తదనంతర కాలంలో భారతీయ జనతాపార్టీ సిద్ధాంతాలను రూపొందించిన వ్యక్తి.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా దీన్‌దయాళ్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ‘అంత్యోదయ’ పేరిట బడుగుల కోసం పెద్ద సంఖ్యలో పనులు చేపట్టింది. దారిద్య్ర నిర్మూలన జరగాలంటే ప్రజలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలి. ఈ దిశగా మోదీ చేపట్టిన ‘జనధన్ యోజన’లో బ్యాంకింగ్ అంటే తెలియని 26 కోట్లమంది ప్రజలు ఖాతాలు తెరిచారు. దాదాపు 20 కోట్లమంది పేదవర్గాల ప్రజలు వివిధ సాంఘిక రక్షిత పథకాల కింద ప్రయోజనం పొందారు. ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన’ కింద పట్టణ, గ్రామీణ పేదలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో దాదాపు 5.70 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. ఏటా దేశంలో దాదాపు కోటి 20 లక్షలమంది ఉపాధి మార్గాల్లో చేరుతున్నా, వీరిలో 10 శాతం మంది మాత్రమే నైపుణ్యం కలిగినవారు. చైనాలో ఏటా ఉద్యోగాలు చేపడుతున్నవారిలో 50 శాతంమంది నైపుణ్యం కలిగినవారు కాగా మన దేశంలో నైపుణ్యం కలిగినవారు లభించటం లేదు. అందుకే దీన్‌దయాళ్‌జీ ప్రవచించిన ఆర్థిక సామాజిక సిద్ధాంతాల ఆధారంగా మోదీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నది. నగరాల్లో దారిద్య్ర నిర్మూలనకు ప్రభుత్వం 790 ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టింది. దీన్‌దయాళ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాలను మిగిలిన 4,041 పట్టణాలకు కూడా అమలు చేస్తున్నారు. కార్యక్రమాల లక్ష్యం దారిద్య్ర నిర్మూలన, పేదరికం నిర్మూలన. మహిళలు, దళితులు, గిరిజనుల సాధికారిత కోసం చేపట్టిన ‘ముద్రా యోజన’ కింద లక్షా 33 వేల కోట్ల రూపాయలను అందించారు. ఈ పథకం కింద 3 కోట్ల 48 లక్షలమంది లబ్ది పొందగా కోటి 25 లక్షలమంది కొత్త కంపెనీలు తెరిచారు.
‘అంత్యోదయ’ కింద పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం రక్షిత మంచినీటి పథకాలు, చౌకగా విద్యుత్, పక్కా ఇళ్లు, కనీస వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ‘స్వచ్ఛ్భారత్’ కింద పేద ప్రజల ప్రాంతాల్లో దాదాపు మూడు కోట్ల మరుగుదొడ్లను కట్టించారు. ‘స్వచ్ఛ భారత్’ విజయవంతమైందనడానికి మూడు రాష్ట్రాల్లోని 77 జిల్లాల్లోని లక్షా 46 వేల గ్రామాల్లో బహిరంగంగా మల విసర్జన ఆగిపోయింది.
చంపారణ్ సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీ పారిశుధ్యానే్న ఒక ఆయుధంగా మలుచుకున్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత పండిత్ దీన్‌దయాళ్ ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మోదీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తున్నది. మహిళా సాధికారతలో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున వంటగ్యాసు కనెక్షన్లను అందిస్తున్నది. గ్రామీణ సాధికారిత, అభివృద్ధి కోసం చేపట్టిన ‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన’ కింద కేవలం సంవత్సరకాలంలో 11 వేల గ్రామాలకు విద్యుదీకరణ చేశారు. పేద ప్రజలపై అధిక భారం పడకుండా ఉండేందుకు 20 కోట్ల ఎల్‌ఇడి దీపాలను పంపిణీ చేసింది. దీంతో దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఇందులో అధికశాతం పేదలే.దీన్‌దయాళ్‌జీ ప్రేరణతో లభించిన కార్యక్రమాల ఫలితంగా గత ఏడాది రబీ కాలంతో పోలిస్తే ఈ ఏడాది రబీలో దేశం మొత్తంమీద ఆరు శాతం వ్యవసాయ విస్తీర్ణత పెరిగింది. రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంతోపాటు విద్యుత్, నీటి అవసరాలు తీర్చడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. భూసార పరీక్షలు, సకాలంలో రుణాలు, బీమా పథకాలు, సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేశాయి.
నదులన్నీ సముద్రంలో కలిసినట్లే పథకాలన్నీ పేదల సముద్ధరణకే ఉపయోగపడాలి. అలనాడు గాంధీజీ చెప్పినా, ఆ తరువాత దీన్‌దయాళ్‌జీ ప్రవచించినా మూల సిద్ధాంతం ఇదే. ప్రజా సాధికారిత లక్ష్యంగానే ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాక్రమాలన్నీ జరగాలి. మన ఆలోచనలు, నడవడి, లక్ష్యాలు అన్నీ ప్రజా సముద్ధరణకోసమే అన్న భావన నిరంతరం మెలుగుతూ ఉండాలి. ఒకరి కోసం మరొకరు జీవించడమే సంస్కారవంతమైన సమాజ లక్షణం. ఈ భావనను నిరంతరం మనకు గుర్తుండేలా, మనం ఆచరించేలా తమ జీవితాలనే ఉదాహరణలుగా గాంధీ , దీన్‌దయాళ్ మన ముందుంచారు. ఆ వారసత్వాన్ని మనం అందిపుచ్చుకోవాలి. భవిష్యత్ తరాలకు అందించాలి.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113