మెయన్ ఫీచర్

ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హరీష్ రావత్ ప్రభుత్వానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న చర్య ద్వారా తీరని అన్యాయమే చేసింది. ప్రజాభిప్రాయానికి, ప్రభుత్వ చర్యకు మధ్య లంకె కుదరినిది సరీగ్గా ఇక్కడే. ప్రజామోదంతో తీసుకున్న నిర్ణయానికి, హక్కుగా తీసుకునే నిర్ణయానికి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తనకు హక్కు ఉన్నది కదా అని నిర్ణయం తీసుకోవడాన్ని ఎవ్వరూ సమ్మతించరు. తాను నిర్ణయం తీసుకొనబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అందుకనుగుణంగా వ్యవ హరించడమే సర్వసమ్మతమైన విధానం.
-----
గర్వాతిశయం లేదా మితిమీరినవిశ్వాసం.. అది ఏదైనా సరే మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటున్నాయన్నది మాత్రం నిష్ఠుర సత్యం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తనను తాను సమర్థించుకుంటూ ఎలాంటి వాదన అయనా చేయవచ్చు కానీ విశ్వాస పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం అప్రజాస్వామికమన్న ప్రజాభిప్రాయాన్ని ఎట్టిపరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తోసిపుచ్చలేదు.
నిజానికి ప్రస్తుతం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చిక్కుముళ్లన్నింటికీ హరీష్ రావత్ స్వయంకృతాపరాధమే కారణం. లెజిస్లేచర్ పార్టీలో అసమ్మతి వర్గం క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఆయన ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నది స్వయంగా ముఖ్యమంత్రే అంగీకరించిన సత్యం. ఇక ద్రవ్యవినిమయబిల్లు అమోదం పొందడంపై తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఇవి చాలవన్నట్టు, ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రే స్టింగ్ ఆపరేషన్‌కు అడ్డంగా దొరికిపోవడంతో ఇక బయటపడటానికి ఏ ఒక్క అవకాశమూ లేకుండా పో యింది. ఇక్కడ స్టింగ్ ఆపరేషన్‌లో నిజానిజాలెలావున్నా ముఖ్యమంత్రి పట్టుబడటం ప్రభుత్వ పరువును నట్టేటముంచింది. ఇదిలావుండగా విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు అనైతికంగా, అమోదయోగ్యం కాని రీతిలో స్పీకర్ తొమ్మిదిమంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను డిస్మిస్ చేయడం మరో విచిత్రం!
మరి ఈ పరిణామాలన్నీ రాష్టప్రతి పాలన విధింపునకు అవసరమైన భూమికను తయారుచేసాయి. ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిశీలనలో ఉన్నందువల్ల, దీని ఔచిత్యంపై కోర్టే నిర్ణయం తీసుకోగలదు. అయితే ఇక్కడ సాధారణ ప్రజలు జీర్ణించుకోలేనిది ఏదైనా ఉందంటే, అది రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ప్రయోగించడం. ఈ అధికరణాన్ని నెహ్రూ కాలంనుంచి ఇష్టం వచ్చిన రీతిలో దుర్వినియోగం చేశారు. ఆయన కుమార్తె ఇందిర రాజ్యాంగాన్ని ఎగతాళి చేసే స్థాయిలో ఈ అధికరణాన్ని అనేకసార్లు ప్రయోగించడం ద్వారా ప్రజల్లో తనపట్ల ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో ఆ అధికరణ అంటేనే ప్రజల్లో ఒకరకమైన ద్వేషభావం వ్యక్తమవడం మొదలైంది. ఫలితంగా వివాదాస్పదమైన ఈ అధికరణను ఎత్తివేయాలన్న వాదన మొదలైంది. 1994లో ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. ప్రభుత్వం కొనసాగాలా వద్దా అనేదానికి అసెంబ్లీలో బలపరీక్ష మాత్రమే పరిష్కారమన్నది ఆ తీర్పు సారాంశం. అందువల్ల ఆ విషయంలో మనం ఎటువంటి పొరపాట్లు చేయరాదు. ప్రజలు రాజ్యాంగంలోని ఈ అధికరణం పట్ల తీవ్ర వైముఖ్యంతో ఉన్నారు. అందువల్ల కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా ఈ అధికరణను ప్రయోగించాలని చూసినా లేక ప్రయోగించినా ప్రజలు ఆ చర్యను సమర్థించరు. ఒకవేళ ఆ అధికరణను ప్రయోగించడం చట్టబద్ధమైనా లేక దీన్ని ప్రయోగించక తప్పని పరిస్థితులు ఏర్పడినా దాన్ని అప్రజాస్వామికంగానే పరిగణిస్తారు. ఒకవైపు ఉత్తరాఖండ్ సమస్య రావణకాష్టంలా మండుతుండగానే తర్వాతి వంతు హిమాచల్‌ప్రదేశ్‌దే నంటూ భాజపా ప్రధాన కార్యదర్శి ఒకరు ప్రకటించి ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచారు.
ఉత్తరాఖండ్ ప్రహసనంలో రాష్ట్ర గవర్నర్ వ్యవహారశైలి కూడా ఆమోదయోగ్యంగా లేదు. మార్చి 28వ తేదీన బలపరీక్ష నిర్వహించమని ముఖ్యమంత్రిని ఆదేశించి కేవలం రెండు రోజుల తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతమాత్రం బాగోలేదన్న సాకుతో రాష్టప్రతి పాలనకు సిఫార్సు చేశారు. విశ్వాస పరీక్షకు కేవలం 24 గంటల ముందు ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడం ద్వారా కొన ఊపిరిపై కొట్టుమిట్టాడుతున్న హరీష్ రావత్ ప్రభుత్వ ఉసురు తీసి కేంద్ర ప్రభుత్వం పుణ్యం కట్టుకుంది. కేంద్రం తన చర్య న్యాయబద్ధమైనదేనని సమర్థించుకోవచ్చు గాక. కానీ సమస్యల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హరీష్ రావత్ ప్రభుత్వానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న చర్య ద్వారా తీరని అన్యాయమే చేసింది. ప్రజాభిప్రాయానికి, ప్రభుత్వ చర్యకు మధ్య లంకె కుదరినిది సరీగ్గా ఇక్కడే. ప్రజామోదంతో తీసుకున్న నిర్ణయానికి, హక్కుగా తీసుకునే నిర్ణయానికి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తనకు హక్కు ఉన్నది కదా అని నిర్ణయం తీసుకోవడాన్ని ఎవ్వరూ సమ్మతించరు. తాను నిర్ణయం తీసుకొనబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అందుకనుగుణంగా వ్యవ హరించడమే సర్వసమ్మతమైన విధానం. ఉత్తరాఖండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకాముందూ చూడకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రికి విశ్వాస పరీక్షకు అనుమతించడం వల్ల ఆకాశమేం ఊడిపడదు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనే అనర్హులను చేసిన తర్వాత కూడా విశ్వాసపరీక్షలో హరీష్ రావత్ నెగ్గివున్నట్లయితే అప్పుడు, కాంగ్రెస్ పార్టీకే పరిస్థితి ఇబ్బందికరంగా మారేది. అనర్హులుగా ప్రకటించిన వారి ఓట్లను ఏవిధంగా పొందారంటూ కాంగ్రెస్‌ను దెప్పిపొడిచే అవకాశం భాజపాకు దక్కి ఉండేది.
పాకిస్తాన్‌కు చెందిన జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీమ్(జెఐటి)ని పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించడానికి అనుమతించడం ఘోరమైన తప్పిదం. ముఖ్యంగా ఉమ్మడి విచారణ సంఘంలో, ఐఎస్‌ఐకి చెం దిన అత్యున్నతాధికారి ఉన్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సముచితం కాదు. పాక్ టీమ్‌ను ఆవిధంగా అనుమతించడానికి ప్రభుత్వానికి దౌత్యపరమైన కారణాలు ఉండవచ్చు. కాని పాకిస్తాన్, ఐఎస్‌ఐలు భారత్ పరంగా అత్యంత సున్నితమైనవి. పాకిస్తాన్ చరిత్ర పరిశీలిస్తే...ఈ విచారణ వల్ల కూడా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదన్నది సుస్పష్టం. భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోలేదని చెప్పడం దానికి అలవాటు. ఐఎస్‌ఐ సభ్యుడితో కూడిన పాక్ టీమ్ ఉగ్రవాద దాడి జరిగిన పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని సందర్శించడం సామాన్యుడు ఎంతమాత్రం జీర్ణించుకోలేని అంశం. భాజపాలోని కొన్ని వర్గాలు తమ విమర్శకులను, ‘‘మీరు సంప్రదాయ శక్తుల భావజాల ప్రభావంలో లేకపోవడం వల్ల మీరు కూడా ఏప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్‌కు వెళ్లవచ్చు. ఇక్కడేమో పాక్ టీమ్‌కు ఎర్రతివాచీ పరచే ప్రభుత్వం మాత్రం వస్తుంది’’ అని దెప్పిపొడుస్తున్నారు.
ఈ పరిణామానికి వ్యతిరేకంగా స్పం దించే వారిని మీరు తప్పుపట్టలేరు. టీమ్ సభ్యులను కేవలం సంఘటనా స్థలాన్ని మాత్రమే సందర్శించడానికి అనుమతించవచ్చుగాక. కాని ప్రభుత్వ చర్య సామాన్యుల్లో ఆగ్రహం కలిగిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కేంద్రప్రభుత్వం తన తప్పిదం ద్వారా విపక్షాల చేతికి ఏరికోరి ఆయుధాన్ని పళ్లెంలోపెట్టి మరీ అందిచ్చినట్టయింది. అయితే మన ప్రభుత్వం తీసుకున్న చర్యకు బదులుగా పాక్ మన ఎన్‌ఐఏ సభ్యులను భారత్‌లో బాంబుదాడులకు ప్రధాన కారకుడైన మసూద్ అజర్‌ను కలుసుకునేందుకు అనుమతించవచ్చునేమో? మనం ఇచ్చిన అవకాశానికి, పాక్ మనపరంగా చేసే సమాన ప్రతిక్రియ ఇది మాత్రమే. మరి ఇది జరగనూ వచ్చు, జరగకపోనూ వచ్చు. ఇవన్నీ కూడా నమ్మి చేసిన పనులు. అయితే కొన్ని చేయకూడని పనులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఇక భారత్ మాతా కీ జైయ్ నినాదం విషయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారం క్రితం జరిగిన కార్యనిర్వాహక సమావేశంలో భాజపా ఒక తీర్మానం చేసింది. దీని ప్రకారం ఎవరైనా భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని చేయడానికి ఇష్టపడకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అది రాజ్యాంగం పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అంటే దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈ నినాదాన్ని తప్పనిసరిగా చేయాల్సిందేనన్నది అంతర్లీనంగా స్ఫురిస్తున్న అర్థం.
గత సోమవారం ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ, ‘్భరత్ మాతా కీ జై’ నినాదాన్ని చేయాలని ఎవరిపై ఒత్తిడి లేదన్నారు. అదే మోహన్ భాగవత్ పదిహేను రోజుల క్రితం మాట్లాడుతూ, ‘‘ఈ నినాదాన్ని చేయాలని వర్తమాన తరానికి గుర్తు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అని అన్నారు తప్ప, ప్రతి ఒక్కరూ ఈ నినాదాన్ని తప్పనిసరిగా చేయాలని ఆయన అనలేదు. కేవలం విపక్షాలు,మీడియా దీనికి అనేక రంగులు పులమగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం దీనిపై విపరీతమైన రీతిలో స్పందించాడు. ఈవిధంగా ప్రతిపక్షాలు పన్నిన ఉచ్చులో ప్రభుత్వం పాక్షికంగా చిక్కుకున్నది. ఏదో ఒక ప్రత్యేక నినాదం చేస్తేనే నువ్వు దేశభక్తుడివని ప్రజస్వామ్యంలో ఏ ఒక్కరూ చెప్పలేరు. అసలు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ‘‘వికాస్’’పై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో, ఇటువంటి అనవసర సమస్యలు అవసరమా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
ఉద్దేశపూర్వకంగా ఋణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, లండన్‌కు తప్పించుకొని పోతున్నప్పుడు అతగాడిపై ఏవిధమైన చర్య తీసుకోకుండా ఉపేక్ష వహించడం కూడా ప్రభుత్వాన్ని స్వీయ రక్షణలో పడేసింది. ఈ విషయంపై విపక్షాలు చేసే విమర్శలకు సమాధానాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితికి ప్రభుత్వం దిగజారిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళా రైలు ప్రయాణికురాలు టిక్కెట్ కొనేందుకు నిరాకరించింది. అదేంటమ్మా? అని ప్రశ్నిస్తే..రూ.9వేల కోట్లు ఎగ్గొట్టిన వారు దేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి అనుమతించినప్పుడు, తాను చట్టాన్ని ఎందుకు ధిక్కరించకూడదని ప్రశ్నించింది. ఈమె వేసిన ప్రశ్న, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నది. అందువల్ల చేయకూడనివి చేసినా, చేయవలసినవి చేయకపోయినా, ప్రభుత్వం మాత్రం తప్పటడుగు వేసిందనేది సుస్పష్టం.