మెయన్ ఫీచర్

మాటలు కాదు.. చేతలు కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సమస్యలకు పరిష్కారం అనే్వషించేందుకు ఏపి సర్కారు మూడురోజుల పాటు ఆకాశమంత ‘డిజిటల్ పందిరి’ వేసి, స్కూలు పిల్లల పేరంటాలతో పవిత్రనదీ సంగమతీరాన ‘మహిళా పార్లమెంటు’ సమ్మేళనం జరుపుతోంది. అతివలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై చర్చించి వాటికి ఉపాయ మార్గాలు కనుగొంటే సంతోషమే. కానీ, ఈ మూడు రోజుల మహిళల ముచ్చట్లు ఆ దిశగా పయనించాయా? అసలు దానివల్ల ఏం సాధించారన్నది పక్కన పెడితే, ‘నవ్యాంధ్ర’కు ఈ సదస్సు ‘బ్రాండింగ్’ కోసం బహుచక్కగా పనికొచ్చింది. వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, దాడులు, కుటుంబ అవమానాలు, ఆర్తనాదాలు ప్రపంచం నలుమూలల నుంచి విషాదకరంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిపై ఏ స్థాయిలోనూ కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కాకపోతే ‘మహిళా దినోత్సవం’ నాడు పార్లమెంటో, అసెంబ్లీ సమావేశాలో జరిగితే ఆరోజు మాత్రం అన్ని పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులతో మాట్లాడించి, అప్పటికే అది ఎక్కువన్నట్లు వ్యవహరిస్తుండటం కొత్తేమీ కాదు.
అమరావతి సదస్సులో సమస్యల పరిష్కారం కోసం మేధోమథనం చేయాల్సిన పనిలేదు. ఎవరి రాష్ట్ర పరిథిలో ఆ పాలకులు మృగాళ్లపై చర్యల కొరడా ఝళిపిస్తే చాలు. మరి ఆ పని చేయకుండా ఇలాంటి సదస్సులు జరిపితే ఏమి ప్రయోజనం అన్నది ప్రశ్న. అయితే, ఇక్కడ నిర్వహకుల ప్రయత్నాలను తప్పుపట్టలేం. మహిళా సమస్యలపై వారిలో చైతన్యం తీసుకువచ్చి, లబ్ధప్రతిష్ఠులైన వారిని రప్పించి, వారి అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పాలన్న ఆకాంక్ష మెచ్చదగిందే. ఈ ఒక్క సదస్సుతోనే మహిళలకు న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే. ఎందుకంటే ఈ తరహా సదస్సు జరగడం ఇదే తొలిసారైనప్పటికీ, వివక్ష, అణచివేతకు ప్రత్యామ్నాయ మార్గాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోరుతూ జరిగిన సభలు మాత్రం ఇదే మొదలు కాదు. అయినా ఇప్పటివరకూ మహిళా సమస్యల పరిష్కారం కోసం పాలకులు ఒక్క చర్య కూడా తీసుకోలేకపోయారు.
అంతెందుకు? యుపీఏ సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన పదేళ్ల అధికార కాలంలో మహిళాబిల్లుకు ఎందుకు మోక్షం కల్పించలేకపోయారు? ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అదే మహిళా బిల్లుపై విమర్శనాస్త్రాలు సంధించిన బిజెపి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా బిల్లుకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? ఇదే సదస్సులో తెరాస ఎంపి కవిత మహిళా సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కుటుంబ వ్యవస్థ మహిళలను చిన్నతనం నుంచే ఏ విధంగా అణచివేస్తుందో ఆమె తన సునిశిత దృష్టితో చక్కగా చెప్పారు. నిలదీసే స్థాయికి ఎదగాలన్న ఆమె పిలుపు నారీలోకానికి స్ఫూర్తిదాయకమే. మరి ఇన్ని చెప్పిన కవితక్క.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక్క మహిళనూ ఎందుకు నియమించలేకపోయారు? దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోయారన్నది మాత్రం చెప్పలేకపోయారు.
తాజాగా సదస్సుకు హాజరయ్యేందుకు ఆహ్వానం పొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు రాకుండా అడ్డుకోవడం వల్ల, సదస్సులో మహిళలపై జరిగే దాడులకు సంబంధించిన అభిప్రాయాలు కలబోసుకునే చర్చలకు పరమార్థం ఏమిటి? ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక మిగిలిన మహిళల పరిస్థితి ఏమిటన్న చర్చలు, మహిళా సదస్సు జరుగుతున్న సందర్భంలోనే ఇలాంటి అవమానకర దృశ్యాలు చానెళ్ల ద్వారా చూసే ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయి? ఆమె ‘ట్రాక్’ తెలుసుకాబట్టే రోజాను అనుమతించలేదని, అండర్‌టేకింగ్ లెటర్ ఇస్తే రానిచ్చేవారమంటూ సాటి తెలుగుమహిళలే నోరు పారేసుకుంటే, ఇక వేదికపై వెళ్లబోసుకునే మహిళల ఐక్యతా నినాదాలకు అర్ధం ఏమిటి? ఒకవేళ రోజా హాజరై సదస్సు స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడి ఉంటే, అప్పుడే ఆమె ప్రతిష్ఠనే మసకబారి ఉండేది. అసలు ఏపి అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సుకు ఒక మహిళా ఎమ్మెల్యేను అనుమతించేందుకు ఇన్ని నిబంధనలు అవసరమా? అంటే ‘తెలుగుమహిళ’లు చెప్పినట్లు ప్రభుత్వానికి అనుకూల ప్రసంగాలు చేస్తేనే వేదికపై అనుమతిస్తారా? ఆ ప్రకారంగా ఇప్పుడు మాట్లాడిన వారంతా ఆ జాబితాలోని మహిళాశిరోమణులేనా? అన్న అనుమానాలు సామాన్యుల్లో తలెత్తవా?
సదస్సు జరిగిన తొలిరోజున కర్నూలు జిల్లాకు చెందిన ఒక అత్యాచార బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ రెండోసారి డిజిపి ఆఫీసు మెట్లెక్కింది. తనపై సామూహిక మానభంగం చేసి, మళ్లీ ఆ వీడియోలు చూపి ఇంకోసారి మానభంగం చేసిన మృగాళ్ల నుంచి రక్షించాలంటూ, ఆ బాధితురాలు ఒకసారి డిజిపి ఆఫీసును శరణువేడితే, ‘వెళ్లి మీ టౌన్ సీఐని కలవమ’ని చెప్పి పంపించేశారట. అక్కడికి వెళితే సదరు పోలీసాయన కూడా ఖాతరు చేయలేదు. దాంతో రెండోసారి పోలీసుబాసు శరణు వేడిన వైనం వెలుగుచూసింది. అది పత్రికల్లోనూ ప్రముఖంగానే వచ్చింది. అయితే, దానిపై ఏ ఒక్క మహిళ కూడా వేదికపై స్పందించకపోవడం బట్టి, వచ్చిన ప్రముఖుల్లో సామాజిక చైతన్యం ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు.
ప్రసంగించిన మహిళా వక్తలంతా సమానత్వం, హక్కులు, వేధింపులు, అణచివేత గురించి ఉపన్యాసాలిచ్చేరే తప్ప, కుటుంబ బంధం, అత్తమామలకు సేవచేయాలని గానీ, పోగొట్టుకున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనం గురించి గానీ, పేద మహిళల సమస్యలు గానీ, పనిచేసేచోట జరుగుతున్న వేధింపులపైగానీ, సామాన్య,మధ్య తరగతి మహిళలు, విద్యార్థినులపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచారాలు, కులపరమైన వేధింపుల గురించి గానీ చెప్పిన మహిళామూర్తి ఒక్కరూ తారసపడలేదు. ఖరీదైన స్టార్ హోటళ్లలో బస చేసిన వారి సందేశాలు సామాన్యులకు అనుకూలంగా ఉంటాయని ఆశించటం కూడా అత్యాశనే. ఒక సామాజికసేవా సంస్థ నిర్వహించిన సర్వేలో అసలు 47 శాతం పెద్ద కుటుంబాలు, పలుకుబడి ఉన్న కుటుంబాల్లోనే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని తేలింది.
మరి ఆ కుటుంబాల వరండాల్లోకి వెళ్లి విచారించే ధైర్యం ఏ ప్రభుత్వాలకైనా ఉందా? ఇలాంటి అంశాలపై ఏ ఒక్క మహానుభావురాలూ మాట్లాడలేదేం? కాబట్టి ఒకరికి ధర్మం చెప్పేముందు వాటిని తాము పాటిస్తున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. అంటే.. చేతిలో బిడ్డను పెట్టుకుని దేశమంతా తిరిగినట్లు, పరిష్కారమార్గం మన చేతుల్లోనే ఉంచుకుని దానికోసం మరొకరి సలహా కోరడం, అది కూడా కోట్ల రూపాయలు పోసి సలహాలు స్వీకరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న.
* * *
ముందే చెప్పినట్లు ఈ సదస్సు వల్ల ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా, అది ఎవరికి ఉపయోగమనేది పక్కనపెడితే.. ఏపిని మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. గత రెండున్నరేళ్ల నుంచి ‘అమరావతి బ్రాండ్ ఇమేజ్’ కోసం మార్కెటింగ్ చేస్తున్న చంద్రబాబునాయుడు.. ఆ ‘ఈవెంట్ల’ ఖర్చు ఎంత? కాంట్రాక్టులు ఎవరికి దక్కాయి? ఎవరికి ఎంత మిగిలిందనేది పక్కనబెడితే, ఈ సదస్సునూ ఆయన రాష్ట్రం కోసం మార్కెటింగ్ చేసినట్లు కనిపించింది. ఈ విషయంలో బాబు ఓపికను మెచ్చుకోవలసిందే.
మనం ఒక బట్టలషాపులో అడుగుపెట్టి, వంద రకాలు తీయించి అందులో ఒక్కటీ ఎంచుకోకపోయినా షాపు యజమాని నిరుత్సాహపడడు. ఇంకొన్ని రకాలు చూపించే ప్రయత్నాలు చేస్తాడు. బాబు కూడా అదే ఓపికతో రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో బాబు శ్రమ కొంతవరకూ ఫలించినట్లే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పేరు మార్మోగేందుకు బాబు చాలా కృషి చేశారు. విభజన తర్వాత ఏర్పడ్డ అమరావతికి ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారి రావడం అసాధ్యం. కానీ, బాబు ఈ రెండున్నరేళ్లలో చేసిన భారీ ఈవెంట్లు, భాగస్వామ్య సదస్సు, పుష్కరాల నిర్వహణ వేరైనప్పటికీ, దాని లక్ష్యం మాత్రం దేశ, విదేశాల్లో అమరావతి అంటూ ఒకటుందన్నది చాటి చెప్పడమే. ఇందులో బాబు విజయుడయ్యారు. ఈ వయసులో ఆయనకు ఉన్న ఓపిక, సహనం, ఆత్మస్థైర్యం అన్నీ కలసివచ్చాయి. అదే స్థానంలో మరొకరుంటే విభజన చేసిన కేంద్రాన్ని తిట్టుకుంటూ గడిపేవారేమో?!
* * *
ఇక ఈ సదస్సు నిర్వహణతో స్పీకర్ కోడెల తన నాయకత్వ సత్తాను చాటుకున్నారు. తన ప్రాధాన్యాన్ని ఇతరులు గుర్తించేలా చేయడం, తన అవసరం, సమర్ధతను గుర్తించేంతవరకూ నిరంతరం పనిచేసి ఒప్పించి మెప్పించే నైజం ఉన్న కోడెల, ఈ సదస్సుతో బాబు తర్వాత రెండోస్థానానికి చేరుకున్నారన్న భావన కల్పించగలిగారు. చాలామంది స్పీకర్లుగా పనిచేసినా, వారెవరూ తమ నియోజకవర్గ పరిథి దాటలేదు. కానీ కోడెల జిల్లా, రాష్ట్రం, దేశం దాటి వెళ్లారు. ఈ దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రికి మించి విదేశీ పర్యటనలు చేసిన స్పీకర్‌గా రికార్డు సృష్టించారంటే, వచ్చిన అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకున్నారో అర్థమవుతోంది. ఈ సదస్సుతో మహిళలకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా, కోడెల ప్రాధాన్యం మాత్రం ఊహించనంత పెరిగిందనేది నిర్వివాదం.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144