మెయన్ ఫీచర్

దిశలేని బడ్జెట్‌తో జనం దశ తిరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానుగుణంగా పాలకుల స్వరం మారుతుందనడానికి ఈసారి బడ్జెటే చక్కని ఉదాహరణ. గత మూడు సార్లు స్మార్ట్ సిటీల చుట్టూ, మేక్ ఇన్ ఇండియా చుట్టూ, స్టార్టప్‌ల చుట్టూ తిరిగిన బడ్జెట్ ఈసారి గ్రామాలవైపు, పేదవారివైపు, రైతుల వైపుగా దృష్టి సారించింది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్, రాబోయే సాధారణ ఎన్నికల నజరానాగా ప్రవేశపెట్టడం జరిగిందనేది కాదనలేని సత్యం. బడ్జెట్‌లో ప్రస్తావించిన పది రంగాలలో వ్యవసాయదారులకు, పేదవారికి, యువతకు పెద్ద పీట వేసినట్లు కనపడుతున్నది.
సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి 28 నాటికి బదులుగా ఒకటో తేదీన, ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు బదులుగా ప్రధాన బడ్జెట్‌లోనే మిళితం చేయడం తప్ప కొత్త విధానంతో బండ్లు ఓడలయ్యే పరిస్థితి ఏమీ లేదు. అలాగే గతంలో ప్రస్తావించే ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయాలకు భిన్నంగా ఈసారి ఆదాయ, వ్యయాల పద్దుల బడ్జెట్‌గా రూపాంతరం చెంది యంత్రాలపై (్భరీ కాదు డిజిటల్ టెక్నాలజీ), రోడ్ల విస్తరణపై నిర్మాణ రంగాలపై పెట్టుబడులు పెట్టాలనేది ఈసారి బడ్జెట్ సారాంశం. వీటికి నీడలా పెరుగుతున్న పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా ఆర్థిక వనరులను పెంచుకోవాలనే ఆరాటం, బడ్జెట్ రూపం మారినా, సారం మారలేదని తెలుస్తున్నది.
బడ్జెట్‌కు ముందు జరిగే సామాజిక సర్వేలో అర్హులందరికి సార్వత్రికంగా నగదును అందించాలనేది జనాల డిమాండుగా తేలింది. కారణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయనేది ఒకటి కాగా, అర్హులకు కాకుండా అనర్హులకే ఈ పథకాలు అందుతున్నాయనేది మరో ఆరోపణ. పైగా పైకి చెపుతున్నట్లుగా ఈ పథకాలకు జిడిపిలో చేస్తున్న ఖర్చు అయిదు శాతానికి మించడంలేదు. దాదాపు 850 దాకా గల ఇలాంటి పథకాల్లో వంట గ్యాసుకు ఇస్తున్న సబ్సిడీ 0.21 శాతం కాగా, యూరియా లాంటి ఎరువులకు ఇస్తున్నది 0.04 శాతమే! ఇలా ప్రజాపంపిణీ వ్యవస్థకు, తిండి గింజలకు, ఎరువులకు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీ 3 శాతానికి మించడం లేదు. అదేవిధంగా గత బడ్జెట్ వరకు వివిధ రకాల ఉత్పత్తులపై (పారిశ్రామిక), వాటి అమ్మకాలపై (ఎక్సైజ్, కస్టమ్స్, వాట్) పన్నుల్ని విధించి ఆర్థిక వనరుల్ని పెంచుకోవడానికి బదులుగా వ్యక్తుల ఆదాయంపై, వినియోగంపై పన్నుల్ని విధించాలనడమే ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేకత. దీనే్న అందరు పేదవారి అనుకూల బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నారు. ఇదే కాలంలో గణనీయంగా పెరుగుతున్న సేవారంగ పన్నుల్ని ఎవరు గమనించడంలేదు. 1996లో పేదల చర్మాన్ని వలడానికి ప్రవేశపెట్టిన ఈ సేవాపన్ను వసూలేయ్య మొత్తం పన్నులో కేవలం 0.7 శాతంగా వుండేది. నేడు ఇది 14.2 శాతానికి చేరుకుంది. నిజానికి ఈ సేవలన్నింటినీ గతంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా, బీమా సంస్థల ద్వారా, బ్యంకుల ద్వారా దాదాపుగా ఉచితంగానే అందేవి. అలా అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే!
కంప్యూటర్ అందుబాటులోకి రావడంతో, ఆన్‌లైన్ సేవలంటూ మీ సేవాకేంద్రాల్ని ఏర్పాటుచేసి, ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నింటినీ వీటికి అనుసంధానం చేసి సేవాపన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇలా బీమా, కరెంటు బిల్లులతో సహా, గతంలో ఉచితంగా పొందిన కుల, ఆదాయ, పుట్టిన, జనన, మరణ ధృవీకరణ పత్రాలను పొందడానికై రోజురీగా ప్రజలు భారీగా చెల్లిస్తూనే వున్నారు. ఇలా సేవా పన్నులను పెంచుకుంటూపోతూ, ఉన్నతవర్గాలనుంచి, విదేశీ మారకం ద్వారా వసూలయ్యే కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలకు భారీగా కోత విధిస్తున్నారు. 1996లో 34.9 శాతంగా వున్న ఎక్సైజ్ డ్యూటీ 19.5 శాతానికి 33.4 శాతంగా వున్న కస్టమ్స్ డ్యూటీ 14.1 శాతానికి కుదిరించారు. ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నులు 22 రెట్లు, పరోక్ష పన్నులు 8 రెట్లు, కస్టమ్స్ 5 రెట్లు, ఎక్సైజ్ సుంకం 7 రెట్లు పెరగ్గా సేవా పన్ను ఏకంగా ఇదే కాలంలో 239 రెట్లు పెరగడం గమనించాలి. ఇలా తాగేనీటికి, పీల్చే గాలికి, బ్యాంకు లావాదేవిలైన ఎస్‌ఎంఎస్‌లకు, ఎటిఎం వినియోగానికి, చెక్కుబుక్కు వాడకానికి, పాసు పుస్తకం తీసుకున్నందుకు సేవా పన్నుల్ని కడుతూనే ఉన్నాం. మనం చెల్లించే ప్రత్యక్ష పన్నులతో పొందాల్సిన ఉచిత సేవలన్నింటికి గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సేవ పేరున పరోక్ష పన్నును ముక్కు పిండి వసూలు చేస్తూనే ఉన్నాయి.
బడ్జెట్‌లో బాహ్యంగా కనపడనిది సెస్సు పన్ను. 2001కి ముందు లేని ఈ సెస్సు పన్ను నేడు వసూలయ్యే పన్నులలో 15 శాతం వాటాను కలిగి వుంది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంపై, విద్యారంగం పేరున, పరిశుద్ధ వాతవరణం పేరున, స్వచ్ఛ భారత్ పేరున, వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్నుపైన ఈ సెస్సుల్ని విధించడం జరుగుతున్నది. ఇలా దాదాపు 20 రకాల సెస్సుల ద్వారా 2009-10లో వసూలైన సొమ్ము రూ.57,843 కోట్లు కాగా, నేడు 3.3 రెట్ల పెరుగుదలతో రూ.1,93,893 కోట్లకు పెరగడం జరిగింది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులపై, విద్యారంగంపై, పరిశుద్ధ వాతావరణంపై అధిక మొత్తంలో సేకరించడం జరుగుతున్నది. ఇలా మేక తోలు కప్పుకొన్న పులిలా వసూలు చేస్తున్న ఆదాయాల్ని సంబంధిత రంగాలకు ఖర్చు చేస్తున్నారా అంటే, కునారిల్లుతున్న విద్యారంగం, కాలుష్యంగా ఎదుగుతున్న పట్టణాలే దీనికి నిదర్శనం. ఈసారి బడ్జెట్‌లో విద్యరంగానికి 8 శాతం కేటాయింపులు పెరిగినా వ్యయంలో 3.7 శాతానికి మించడం లేదు. గత 3 సంవత్సరాలుగా ఈ తగ్గింపులు వుంటూనే ఉన్నాయి. 2013-14లో మొత్తం బడ్జెట్ వ్యయంలో 4.57 శాతంగాగల విద్యారంగం వాటా నేడు 3.65 శాతానికి పడిపోయి మొత్తం జిడిపిలో 0.63 నుంచి 0.45 శాతానికి దిగజారింది.
వైద్యరంగం పరిస్థితి ఇంతే. యావత్ దేశ ప్రజలందరికి ఒకే విధమైన వైద్యాన్ని ఉచితంగానే అందించాల్సిన బాధ్యతలనుంచి ప్రభుత్వాలు మెల్లిమెల్లిగా తప్పించుకుంటూ బీమా రంగాలు బలిసేలా పథక రచనలు చేస్తూ, ఉద్యోగులకు, ఉన్నత అధికారులకు, రాజకీయ నాయకులకు, ఈసారి సీనియర్ సిటిజన్స్‌కు ఆరోగ్య సేవల్ని అందించి, నిజాయితీతో పన్నులు కట్టి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తున్నది. గృహ నిర్మాణ కథ కూడా ఇలాంటిదే! నిజంగా ఇళ్ళు లేని వారెందరో గత అర్థ శతాబ్దంగా తేలలేదు. నెహ్రూ కాలంనుంచి నేటి నేతలదాకా కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు నిర్మిస్తూనే వున్నా, గ్రామాలకు గ్రామాలే ఇండ్లు లేని వారిగా గణాంకాలు చూపడం గమనార్హం. కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరే పథకంగా ఇది అన్ని కాలాల్లో కొనసాగుతూనే వుంది.
ఎలాంటి పన్నులు లేకుండా బడ్జెట్‌ను తయారుచేయడం ఎలా అనే వారు వున్నారు. కాని ఈ బడ్జెట్ మాయాజాలంలో ప్రజల రెక్కల సొమ్ము, సృష్టిస్తున్న సంపదలు అతి కొద్దిమందికే దక్కుతున్న వైనం కూడా కాదనలేని సత్యం. స్థూలంగా చూసినప్పుడు, జైట్లీ ఆదాయం 12 లక్షలనుకుంటే, ఖర్చులు 15 లక్షలుగా వున్నప్పుడు, అదనపు ఖర్చు 3 లక్షలుగా తేలుతుంది. కారు కొనడానికో, మరో ఎలక్ట్రానిక్ వస్తువు కొనడానికే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఓ 5 లక్షల అప్పు ఇస్తే, గతంలోనే ఓ 50 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే, జైట్లీ సంసారం ఎలా సాగుతుందో గుర్తిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఇందుకు భిన్నంగా లేదనేది తెలుసుకుంటాం. ఈ సందర్భంగా అన్ని దేశాల పరిస్థితి ఇలాగే వుంటుందేమో అనే అనుమానం రావచ్చు!
కాని, మనకన్నా ఓ సంవత్సరం ఆలస్యంగా విముక్తి పొందిన చైనా అనుభవాన్ని ఈ సందర్భంగా చూడడం సమంజసంగా వుంటుంది. 1952 నాటికి భారత్‌లో 54,600 కి.మీ. రైలు మార్గముంటే చైనాలో కేవలం 22,161 కి.మీ మాత్రమే వుండేది. చైనా నేడు లక్ష కి.మీ. రైలు మార్గం కలిగి వుంటే భారత్ 65 వేల కి.మీ. దగ్గరే వుండిపోయింది. ఢిల్లీ, ముంబాయిలమధ్య దూరాన్ని మన రైళ్ళు 16 గంటలకు చేరుకుంటుంటే, ఇంతే దూరంగల బీజింగ్, షాంఘై మధ్య దూరాన్ని చైనా రైళ్లు కేవలం 5 గంటలకే చేరుకుంటాయి. పైగా చైనాలో ప్రత్యేకంగా ఓ రైల్వే మంత్రి లేకపోగా, చైనాకన్నా ముందే భారత్‌లో రైలు మార్గం ఏర్పడడం గమనించాలి.
అలాగే, 1960లో భారత్ తలసరి ఆదాయం 84 డాలర్లు కాగా, చైనాది 90 డాలర్లుగా వుండేది. నేడు మనది 1,598 కాగా, చైనాది 8,028 డాలర్లకు పెరగడం గమనార్హం. ఇదే కాలంలో మన జిడిపి 37.7 బిలియన్ డాలర్ల నుంచి 56 రెట్లు పెరిగి 2.096 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జైనాది 184 రెట్లలో పెరిగి 59.7 నుంచి 11.008 బిలియన్ డాలర్లకు ఎదిగింది. 1980లో 402.6 మిలియన్ల పేదల్ని కలిగిన భారత్ 268.2 మిలియన్లకు తగ్గిస్తే, చైనా 785.5 నుంచి ఎకాఎకిన 25.2 మిలియన్లకు తగ్గించుకోవడం జరిగింది. 1969లో ప్రతి వెయ్యిమంది శిశువులకు భారత్‌లో మరణాల సంఖ్య 144.8 కాగా, బంగ్లాదేశ్‌ది 150.4గా, చైనాది 84.1గా వుండింది. నేడు భారత్‌లో 37.9 మరణాలుండగా, చైనాలో కేవలం 9.2లు, బంగ్లాలో 30.7గా వుండడం గమనార్హం.
ఇక మానవాభివృద్ధి సూచికలో మన పక్క దేశం శ్రీలంక 73వ స్థానంలో వుంటే మనం 130 స్థానంలోనే వుండడం మన పాలకులకు చీమ కుట్టినట్లుగా అనిపించడంలేదు. ఏడు దశాబ్దాలకు కూడా వేలాది గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించని దుస్థితి మనది. ఇలాంటి 28 వేల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించడానికి మన పాలకులకు మరో నాలుగు సంవత్సరాలు కావాలట! పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మరో వెయ్యి సంవత్సరాలకు కూడా మన బడ్జెట్లు లక్ష్యాల్ని నెరవేర్చలేవు. విదేశాలకు వలస వెళ్లడం, విదేశాల్లో పర్యటించడం, పెట్టుబడులపై పాకులాడడం, అప్పులకై వెంపర్లాడినంతకాలం మనం మనంగా ఎదగలేమని పాలకులు గ్రహిస్తే తప్ప దేశానికి విముక్తి లభించదు.

- డా జి.లచ్చయ్య 9440116162