ఎడిట్ పేజీ

ఈ గందరగోళానికి జయదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో రాజకీయ అస్థిరతకు, అధికార అన్నాడిఎంకె పార్టీలో ఆధిపత్య పోరాటానికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాలే కారణమని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఇంతటి సుదీర్ఘ గందరగోళం తలెత్తటానికి కారణం- జయలలిత తన తర్వాతి నాయకత్వాన్ని ముందుగా తయారు చేయకపోవడమే. కనీసం తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలోనైనా ఆమె తన రాజకీయ వారసులెవరో చెప్పలేదు. ఈ రెండు వైఫల్యాల వల్లనే తమిళనాడులో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ‘అమ్మ’కు అత్యంత నమ్మకస్తులైన పన్నీర్ సెల్వం, శశికళ వల్ల కొద్దిరోజులుగా కొనసాగిన అయోమయ పరిస్థితికి సుప్రీం తీ ర్పుతో తెరపడిందని పూర్తిగా చెప్పలేం. సిఎం పదవిని ఎవరు చేపట్టినా తమిళనాట భవిష్యత్ రాజకీయాలు సాఫీగా జరుగుతాయన్న గ్యారంటీ లేదు.
‘నేనే లేనప్పుడు ఈ పార్టీ ఏమైపోతే నాకేమిటి’- అని జయలలిత అంటుండేవారని ఒక మాట ప్రచారంలో వుంది. ఈ మాట తన మరణానంతరం గాక, జీవించి వున్నపుడే వినిపించింది. దానిపై ఖండనలు లేవు గనుక నిజమే అని భావిస్తే- అది పొరపాటు కాకపోవచ్చు. ఆమె వంటి కీలక వ్యక్తి ఈ విధంగా ఆలోచించటం ఒక స్థాయిలో సహజం కావచ్చుగాని, అందులో ఎలాంటి విజ్ఞత లేదని తేలికగా చెప్పవచ్చు. సహజమనిపించటం ఎందుకంటే- ఆమె నాయకత్వం క్షేత్రస్థాయి సామాజిక, రాజకీయ పరిస్థితుల నుంచి గాని, పార్టీ కార్యక్రమాల నుంచి గాని ఆవిర్భవించినది కాదు. కుటుంబ వారసత్వం కూడా కాదు. కేవలం తన వ్యక్తిత్వం, వ్యక్తిగత సంబంధాలు ఆమెను ఆ స్థానంలోకి తెచ్చాయి. ఒకవేళ ఆరంభం ఆ విధంగా ఉండినప్పటికీ ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలలో, అది కూడా అధినేతృత్వ స్థానంలో కొనసాగినపుడు, పార్టీని నికరమైన రీతిలో నిర్మించవలసిన బాధ్యత ఆమెపై ఉంటుంది. అది జరగలేదు.
ఒక పార్టీ నికరమైన విధంగా ఉండటమంటే దానికి ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథం ఉండటం. అందుకు అనుగుణమైన పునాది ఏర్పడటం. పార్టీ యంత్రాంగ నిర్మాణంతోపాటు తగిన నాయకత్వం ఉండటం. నాయకత్వ మార్పు అనివార్యమైతే- కొత్త నాయకత్వం ఎవరిదనే ప్రశ్నపై కొద్ది సమస్య ఏర్పడినా తీవ్రరూపం తీసుకుని చీలికలు, దీర్ఘకాలిక అయోమయాలకు దారితీయకపోవటం. తమిళనాడులోని ద్రవిడ పార్టీలు అన్నాదురై అనంతర దశలలో చీలికలకు గురవుతూ రావటం నిజమే అయినా, ఆయా చీలిక పార్టీలకు నాయకత్వం సమస్య తలెత్తలేదు. చీలిక పార్టీలకు నాయకులైనవారు అంతకుముందు నుంచే సామాజిక, రాజకీయ క్షేత్రస్థాయి నుంచి, పార్టీ కార్యకలాపాల నుంచి ఎదిగివచ్చినవారు కావటం అందుకు ప్రధాన కారణం. కనుక చీలిక పార్టీలను స్థిరంగా నడపగల అనుభవం, సమర్థతలు వారికుండేవి. ఆ తరం గడిచిన వెనుక, లేదా గడిచిపోతున్న స్థితిలోనూ పార్టీ సుస్థిరతలు కొనసాగాలంటే అందుకు తగిన నాయకత్వాలు కావాలి. ఈ సమస్య ఇపుడు డిఎంకె పార్టీకి లేకపోగా, అన్నాడిఎంకెకు ఎదురైంది. నికరమైన పార్టీకి అవసరమని పైన చెప్పుకున్న లక్షణాలలో ఒక్క నాయకత్వమన్నది మినహాయించి తక్కినవన్నీ డిఎంకె వలెనే అన్నాడిఎంకెకు కూడా ఉన్నాయి. తన సామాజిక పునాదులు, కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం వంటివాటికి కొరత లేదు. కాని వీటితోపాటు నాయకత్వం తప్పనిసరి. అది లేనపుడు పరిస్థితి బండివాడు లేని బండివలె తయారవుతుంది. జయలలిత తన వ్యక్తిగత నాయకత్వ అవసరాల కోసం తక్కినవన్నీ సజావుగా వుండేట్లు జాగ్రత్తపడ్డారు. కాని తన నిష్క్రమణ అనంతరం పరిస్థితి ఏమిటనే ఆలోచనను చేయవలసిన పద్ధతిలో చేయలేదు. అన్నాడిఎంకెను సమాజంలో, రాజకీయ వ్యవస్థలో, ఒక సుస్థిరతలో, దీర్ఘకాలికతలో భాగం చేసి చూడటం ఒక పద్ధతి. అట్లాగాక కేవలం తన వ్యక్తిగత నాయకత్వం, దాని అవసరాలు, సుస్థిరతలతో ముడిపెట్టి చూడటం మరొక పద్ధతి. జయలలిత ఈ రెండవ పద్ధతిని అనుసరించినట్లు అర్థమవుతున్నది. ‘నేనే లేనపుడు ఈ పార్టీ ఏమైపోతే నాకేమిటి’ అనే దృక్పథం ఏర్పడేది అటువంటప్పుడే. ఈ దృష్టి ఉన్నప్పుడు, పార్టీలో మరెవరు ఒక మోస్తరు స్థాయికి మించి ఎదిగినా వారు పరిస్థితులను బట్టి స్వంతంగా ఎదగవచ్చునని, తనకు సవాలు కావచ్చుననే జంకు అధినాయకత్వానికి కలుగుతుంది. వైయక్తిక దృష్టి, ప్రయోజనాలు ఎంత తీవ్రంగా వుంటే ఈ జంకు కూడా అంత తీవ్రమవుతుంది. అందరినీ ఒక నిమ్న స్థాయికి పరిమితం చేయటం మినహా అంతకన్నా ఎదగనివ్వికపోవటం, ఇతర నియంతృత్వ లక్షణాలు ఇందుకు పొడిగింపు వంటివి. ఇదంతా జయలలిత వ్యక్తిత్వ నిర్మాణం, మానసిక తత్త్వం అన్నమాట. ఆమె బాగా చదివిన, మంచి అవగాహన గల వ్యక్తి. తన నాయకత్వానికి తొలి దశలో తప్పితే తర్వాత ఎటువంటి సవాలు కూడా అన్నాడిఎంకెలో ఎదురవలేదు. అట్లా ఎదురులేని స్థితి కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. అటువంటపుడు ఆమె తన తర్వాతి శ్రేణుల నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేయవలసింది. ఒక వేళ అట్లా తయారయే వారిలో ఎవరైనా తనకు సమస్యగా మారవచ్చుననే అనుమానం కలిగితే ఆ వ్యక్తులపై చర్య తీసుకునే వీలు, అధికారం ఎప్పుడూ ఉంటాయి. కాని అటువంటి అనుమానం వల్ల అసలు నాయకత్వానే్న తయారుచేయకపోవటం వైఫల్యమవుతుంది. తన ఉనికిని, పాత్రనూ వ్యక్తిగతంగా తనకు, తన అధికారానికి, తన కాలానికి పరిమితం చేసి చూడటమవుతుంది. అటువంటి సంకుచిత ధోరణి తను జీవించి ఉన్న కాలంలోనే ఒక శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యం తన చుట్టూ ఆవరించి ఉంటుంది. తన ఉనికి కారణంగా, అటువంటి శూన్యమేమీ లేనట్లు భ్రమ కలుగుతుంది. బయటినుంచి గమనించే పరిశీలకులు ఆ శూన్యాన్ని చూడగలరు. అది ఆమె నాయకత్వం అకస్మాత్తుగా లేకుండా పోయినపుడు ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా బయటపడుతుంది.
చివరకు జయలలితను ఇపుడు అంచనా వేయాలంటే, ఆమె కేవలం ఒక రాజకీయవాదే తప్ప రాజకీయవేత్త లక్షణాలను చూపలేదు. తను, తన అధికారం గురించి తప్ప, తన సమాజంలో, రాజకీయ వ్యవస్థలో ఆ పార్టీ ఒక సుస్థిరమైన, దీర్ఘకాలికమైన పాత్రను నిర్వహించటం గురించి ఆలోచించలేదు. అందుకు అవకాశాలు, సమర్థతలు ఉండి కూడా ఆ పని చేయలేదు. దాని ఫలితమే ఈ గందరగోళం. కనుక, తన కాలంలో తనెంత శక్తివంతురాలైన నాయకురాలు అయినప్పటికీ, తన పరిపాలనా సమర్థతలు, సంక్షేమ చర్యల కారణంగా ఎంత విజయవంతురాలైనప్పటికీ, తన తదనంతర కాలానికి పైన చెప్పుకున్న శూన్యాన్ని మిగిల్చిపోయిన వ్యక్తి అవుతున్నారు. అది స్వయంగా ఆమె పార్టీకే నష్టదాయకం కాగల ప్రమాదం ఉంది. ఈ అయోమయం, నష్టం తాత్కాలికమా? దీర్ఘకాలికమా? పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల్లో ఎవరో ఒకరిది అంతిమంగా పైచేయి అయినా, తర్వాత వారు స్థిరపడి పరిస్థితులను యథాతథ స్థితికి తేగలరా? లేరా? అనే ప్రశ్నలు ఇప్పటికిప్పుడు తేలేవి కావు. ఎవరో ఒకరిది పైచేయి అయినంత మాత్రాన వారు స్థిరపడిపోయి, పార్టీకి మునుపటి స్థితిని తేగలరన్న హామీ ఏదీ వుండదు. అది వారి పరిపాలనా సమర్థతలు, నాయకత్వ బలంపై ఆధారపడి వుంటుంది. ఇపుడే ఊహాగానాలు చేయటం తొందరపాటు అవుతుంది.
అదెట్లా జరిగినా ప్రస్తుత చర్చకు సంబంధించి గుర్తించవలసింది ఒకటున్నది. ఒకవేళ పన్నీర్ సెల్వం లేదా మరో నేత గాని చివరకు స్థిరపడినా దాని అర్థం జయలలిత విఫలం కాలేదని కాబోదు. ఆమె అటువంటి స్థిరత్వం కోసం చేయవలసింది చేయలేదనే లోటు నిలిచే ఉంటుంది. అది తన వైపునుంచి కన్పించే కొరత. అయినప్పటికీ ఆ శూన్యంలోకి ఎవరో ఒకరు ప్రవేశించటమన్నది పరిస్థితులను బట్టి జరిగే సహజ క్రమం అవుతుంది. సమాజం శూన్యాలను అదే విధంగా వదలివేయదు. పైగా అన్నాడిఎంకెకు ఒక పార్టీగా తన పునాది, తన వర్గాలు, తన యంత్రాంగం తనకు ఉన్నపుడు. శూన్యమనేది అగ్రనాయకత్వ స్థాయిలో ఉంది తప్ప కింది స్థాయిలో కాదు. అగ్రస్థాయి శూన్యతను పూడ్చేందుకు కింది స్థాయి సమాజం ప్రయత్నించటం సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే అది ప్రతిసారీ నెరవేరదు. వివిధ కారణాల వల్ల అట్లా జరగనపుడు మాత్రం కింది స్థాయిలోనూ క్రమంగా శూన్యం ఆవరిస్తుంది. ప్రస్తుత సందర్భంలో ఏమి జరగనున్నదనేది వేచి చూడవలసిన ప్రశ్న.
ప్రస్తుతం తమిళనాట జరుగుతున్న పరిణామాలు ఈ కోణం నుంచి చాలా ఆసక్తికరమైనవి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులలో అధికులు శశికళ శిబిరంలో ఉండగా, అన్నాడిఎంకె శ్రేణులు, పార్టీకి బయటి సమాజం పన్నీర్ సెల్వంను బలపరుస్తుండటం గమనార్హమైన పరిస్థితి. శశికళ వల్ల తమ అధికార ప్రయోజనాలు నెరవేరగలవని ఎమ్మెల్యేలు భావిస్తున్నారన్నది స్పష్టం. కాని పార్టీ శ్రేణులు, పార్టీకి బయటి వర్గాలు మనం పైన అనుకున్న శూన్యాన్ని పూరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారికి కావలసింది అధికారం కాదు, అన్నాడిఎంకె నిలవటం. ఆ లక్ష్య సాధనకు పన్నీర్ సెల్వం తగిన నాయకుడో కాదో బహుశా వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. యధాతథంగా పన్నీర్ సెల్వంకు శక్తివంతుడనే పేరు లేదు. శశికళతో పోల్చినపుడు అంతకన్నా లేదు. కాని ప్రతిష్ఠ విషయంలో ఆయనది పైచేయి. జయలలిత రెండుమార్లు తనను నమ్మి తాత్కాలిక ముఖ్యమంత్రిని చేయటం అందుకు అదనపు అర్హత అవుతున్నది. ఇరువురిమధ్య పోల్చినపుడు పార్టీ శ్రేణులకు, పార్టీ బయటి వర్గాలకు ‘సమర్థత’ అనే దానికన్నా ప్రతిష్ఠ, జయ దృష్టిలో విశ్వసనీయత అన్నవి ముఖ్యమైనట్లు తోస్తున్నది.
పార్టీ బయటి తమిళ సమాజం గురించి ఒక మాట చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మాట్లాడుతున్నవారంతా జయలలితకు, పన్నీర్ సెల్వంకు అభిమానులు కావచ్చు, కాకపోవచ్చు. వారిలో ప్రజాస్వామిక వాదులు, ఉదారవాదులు, రాష్ట్రంలో పార్టీ వ్యవస్థ ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలనుకునేవారు, నైతికవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కన్పిస్తున్నది. వారు గతంలో జయకు ఓటు చేయకపోవచ్చు, మునుముందు పన్నీర్ సెల్వంకు వేయకపోవచ్చు. కాని ప్రస్తుత సందర్భంలో కొన్ని విలువలను కాపాడాలన్నది వారి ఆలోచన. అట్లా కాపాడటం శశికళ కన్నా పన్నీర్ సెల్వంను బలపరచటం ద్వారా జరుగుతుందన్నది వారి నమ్మకం అయి ఉండాలి. మొత్తానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, పార్టీకి బయటి ఈ తరహా వర్గాలు కలిసి తమిళనాడులో జయ వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది ఒక సమాజం తన పట్ల తాను నిర్వర్తించుకునే చారిత్రక బాధ్యత అనాలి. మనం కూడా జయలలిత పట్ల, పన్నీర్ సెల్వం పట్ల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయ అయోమయం నుంచి తమిళనాడు బయటపడాలని కోరుకోవటమే సముచితమవుతుంది.
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767