మెయన్ ఫీచర్

బాలకార్మిక వ్యవస్థకు ముగింపు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ ప్రపంచం దుఃఖమయం కావడానికి అజ్ఞానం, దారిద్య్రం, దోచుకునే ప్రవృత్తి కారణాలు’- అని అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త బెర్‌ట్రాండ్ రసెల్. అభివృద్ధి చెందుతున్న దక్షిణ ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో బాలకార్మిక వ్యవస్థ సవాల్‌గా మారడానికి అజ్ఞానం, పేదరికం వంటివి కారణాలు. పారిశ్రామిక విప్లవ విషఫలాల్లో ఒకటి- బాల కార్మికుల చేత కర్మాగారాలలో పనిచేయించడం. ప్రఖ్యాత రచయిత ఛార్లెస్ డికెన్స్ రాసిన ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’ నవల చదివినవారు బాలకార్మికుల కష్టాలను మరచిపోలేరు. చిన్న వయస్సులో చినీలపైకి ఎక్కి వాటిని శుభ్రపరచడం, ఆ వయస్సులో వున్నవారు చేయరాని పనులు చేయడం.. వీటినన్నింటినీ తన నవలలో అద్భుతంగా వర్ణించాడు డికెన్స్. ఆట పాటలతో, విద్యాభ్యాసంతో గడవాల్సిన బాల్యం కర్మాగారాలకు పరిమితమైతే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉంటాయి. 19వ శతాబ్దంలో బాలకార్మికులు అనుభవించిన బాధలే ఇప్పుడూ కనిపించడం విషాద వాస్తవం.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక మానవ హక్కులు, బాలల హక్కుల గురించి ఆలోచన ప్రారంభమైంది. ఫ్యాక్టరీ కార్మికుల కనీస వయస్సుకు సంబంధించి 1959లో జరిగిన సమావేశం నాటినుండి, బాల కార్మికుల సమస్యపై ఆలోచన ఆరంభమైంది. ఆ తర్వాత పారిశ్రామిక, పారిశ్రామికేతర రంగాలకు సంబంధించి- కనీస వయస్సు విషయమై వివిధ సందర్భాల్లో ‘అంతర్జాతీయ శ్రామిక సంస్థ’ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) 21 సిఫారసులను చేసింది. మొదట్లో 14 ఏళ్లలోపువారిని ‘బాలలు’ అని భావించగా, ఆ తర్వాత 16 ఏళ్లలోపువారిని ‘బాలలు’గా నిర్ధారించారు. ఇప్పడు బాల కార్మికులంటే 18 ఏళ్లలోపు వారిగా పరిగణిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి బాల కార్మికుల సమస్యలపై వివిధ దేశాధినేతల సమక్షంలో 18సార్లు సమావేశాలను నిర్వహించింది. గరిష్ట వయస్సు, కనీస వేతనం, వైద్యపరీక్షలు, పనిచేసేచోట సౌకర్యాలు, పనిలో శిక్షణ, చదువుకోడానికి అవకాశాలు, రాత్రివేళ పని చేయించకపోవడం వంటి అనేక అంశాలపై ఈ సమావేశాల్లో తీర్మానాలు చేశారు. ఇలాంటి తీర్మానాలు, సిఫార్సులు, ప్రతిపాదనలు ఎన్నివున్నా ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో బాల కార్మికులను యథేచ్ఛగా వినియోగించుకుంటున్నారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునిసెఫ్’ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) 2012లో వెలువరించిన ‘స్టేట్ ఆఫ్ చిల్డ్రన్స్ రిపోర్టు’ (బాలల పరిస్థితి నివేదిక) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5-17 ఏళ్ల మధ్య వయసుగల 215 మిలియన్ల మంది బాలలు పనిచేస్తున్నారు. అందులో 115 మిలియన్ల మంది ఆరోగ్యానికి భంగం కలిగించే ‘ప్రమాదకరమైన’ పనులు చేస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 18 ఏళ్ల వయసులోపు బాలబాలికలు 33 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. ప్రతి 11 మంది బాలల్లో కనీసం ఒకరు బాలకార్మిక వ్యవస్థలో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం మీద అత్యధిక బాల కార్మికులున్న దేశం మనది. 2001-11 మధ్యకాలంలో 5-9 ఏళ్ల మధ్యగల బాలశ్రామికుల సంఖ్య 154 శాతం పెరిగితే, బాలికల సంఖ్య 240 శాతం పెరగడం మరొక చేదు నిజం.
1948 నాటి ఫ్యాక్టరీల చట్టం నుండి, 1986 నాటి ‘చైల్డ్ లేబర్’ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం నుండి, 2016లో ‘చైల్డ్ లేబర్’ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు వరకూ బాల శ్రామికులకు రక్షణ కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినప్పటికీ బాల కార్మికుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఎందుకు నిలిచింది? అని ప్రశ్నించుకుంటే అనేక కారణాలు కనిపిస్తాయి. చదువు మాన్పించి పనికి పంపితే- అది బాలల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులకు తెలియకపోవడం. గ్రామాల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విషయంలో ఇది అధికంగా ఉంటోంది. వ్యవసాయ పనుల్లో పిల్లల అవసరం కూడా వుంటుంది. కొన్ని కుల వృత్తులను కుటుంబ సభ్యులంతా కలసి చేస్తుంటారు. దీంతో పిల్లలకు చిన్నతనం నుంచే పనిచెయ్యడం అలవాటవుతుంది. చదువుకోడానికి ఎక్కువగా అవకాశం వుండదు. సమీపంలో పాఠశాల లేకపోవడం, ఉన్నా అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలు, తల్లిదండ్రులు చదువుపై ఆసక్తి చూపడం లేదు.
వ్యవసాయ రంగం సంక్షోభంలో పడి గ్రామీణులు పట్టణాలకు వలసపోవడంతో పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు. జీవనోపాధికి వలస పోయే కుటుంబాల్లో పిల్లలను సైతం పనిలోకి పెడతారు. కనీస వయస్సు రానిదే పిల్లలను పనులకు పంపరాదన్న విషయమై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన లేదు. కార్మిక చట్టాలను అమలు చెయ్యాలన్న ఆలోచన కర్మాగారాల యజమానులకూ వుండదు. వారికి కావలసిందల్లా- బాలల చేత ఎక్కువ పనిచేయించుకుని, తక్కువ జీతం యిచ్చి అధిక లాభాలను పొందడం. బాల కార్మికులకు కనీస సదుపాయాలు సమకూర్చాలని, వారు బడికి వెళ్లి చదువుకోడానికి కొంత సమయం ఇవ్వాలని, 5 గంటలు మించి పనిచేయించ కూడదని ఎన్నో ఆంక్షలు వున్నప్పటికీ- రోజుకు 10, 12 గంటలు వారిచేత పనిచేయిస్తూ వుంటారు. రాత్రిళ్లు కూడా పనిచేయిస్తూ వుంటారు. వారి ఆరోగ్యానికి హానికలిగించే పనులను చేయిస్తూ వుంటారు. ఇదంతా కార్మిక శాఖ ఉద్యోగులకు తెలిసినా వారు పట్టించుకోరు.
బాల కార్మికులను ఎక్కువగా- అగ్గిపెట్టెల తయారీ, బాణసంచా తయారీ, గాజు పరిశ్రమ, తివాచీ పరిశ్రమ, బీడీల తయారీ, పట్టు పరిశ్రమ, తాళాల తయారీ పరిశ్రమ, ఇత్తడి వస్తువుల తయారీ మొదలైన పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ పనులు చెయ్యడం వల్ల బాలలకు ఊపిరితిత్తుల వ్యాధులు, దృష్టి లోపం, ఆకలి మందగించడం, చర్మంపై దద్దుర్లు , కణుతులు ఏర్పడడం, నిస్సత్తువ వంటి రోగాలతో పాటు మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాల తయారీ, ఇటుకల తయారీ పరిశ్రమలో బాలలు పనిచేస్తే వారి ఆరోగ్యానికి హాని తప్పదు. తివాచీల తయారీ, ఎంబ్రాయిడరీ పనుల్లో గంటల తరబడి పనిచేస్తే దృష్టిదోషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక, పనిచేసే చోట బాలికలపై జరిగే లైంగిక దాడులు మరింత తీవ్రమైన సమస్య.
1986లో రూపొందించిన ‘చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్టు’లో 18రకాల పనులు బాలల ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. కానీ, ఈ ప్రమాదకర పనులలో బాల కార్మికుల వినియోగం సాగిపోతూనే వుంది. ఇటీవల ప్రభుత్వం ‘బాల శ్రామిక చట్టాని’కి చేసిన సవరణలో ఈ ‘ప్రమాదకరమైన’ పనుల సంఖ్యను తగ్గించడం మరింత ముచ్చటైన విషయం! గనులు, పేలుడు పదార్థాల తయారీ వంటి కొన్ని పనుల్లో పనిచెయ్యడం మాత్రమే బాలలకు ప్రమాదం అని ఈ సవరణ చెబుతోంది.
బాల శ్రామిక వ్యవస్థను రూపుమాపాలనే శ్రద్ధ ఏ స్థాయిలోనూ లేదు. దేశంలో బాల కార్మికుల సంఖ్య ఎంత అనే విషయంలో కచ్చితమైన నిర్ధారణ లేదు. కొన్ని పాశ్చాత్య దేశాలలో కంటే భారత్‌లో ఈ సమస్య అధికంగా ఎందుకు వుంటున్నది?- పేదరికం, అజ్ఞానం, అవిద్య ఇందుకు కారణాలు. పేదరికం రూపుమాపాలంటే వ్యవసాయ రంగాన్ని అనివృద్ధిపరచాలి. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా మనది వర్షాధార వ్యవసాయమే. పంట పండినా గిట్టుబాటు ధర వుండదు. ఇట్లాంటి స్థితిలో గ్రామీణ కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్లిపోవడం వల్లనే బాలలకు విద్యావకాశాలు సన్నగిల్లి, కూలి చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. కొందరు బాల కార్మికులవుతుంటే, తల్లిదండ్రులను కోల్పోయినవారు వీధి బాలలుగా మిగిలిపోయి- మాఫియాల చేతిలో కీలుబొమ్మలైపోయి దుర్భరంగా బతుకుతున్నారు.
వలస పోకుండా పల్లెటూళ్లల్లోనే వున్నా- భూ కామందుల వద్ద బాలలు వెట్టిచాకిరీ చేయవలసి వస్తున్నది. వారి కుటుంబ పెద్దలు చేసిన రుణాలు తీర్చలేకపోవడమే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలే తమ పిల్లలను వెట్టిచాకిరీకి తాకట్టుపెట్టిన సందర్భాలున్నాయి. వెట్టిచాకిరీ వ్యవస్థ రద్దయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇది మిగిలే వుంది. బాల కార్మికులకు సంబంధించిన చట్టాలు అమలు కాకపోవడమే ఇందుకు కారణం. తమిళనాడులోని శివకాశిలో బాణసంచా తయారీ పరిశ్రమల్లో బాలలను ఇప్పటికీ యథేచ్ఛగా వినియోగిస్తుంటారు. ఆ పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లినప్పుడు ముక్కుపచ్చలారని బాలలు మాడి మసైపోతున్నపుడు మన హృదయాలు ద్రవిస్తాయి. నగరాల్లో బాలలు ఇంటి పనులుచేసే విషయంలో ఎదుర్కొనే ఇబ్బందులు, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలు వున్నాయి. వీరి సమస్యలను తీర్చకుండా బాలల దినోత్సవాలు చేసుకున్నందువల్ల ఒరిగేదేముంది?
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969