మెయిన్ ఫీచర్

కల్తీపై కత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఐఎఎస్ కావాలనుకుంది..
మొదటి ప్రయత్నం విఫలమైంది...
రెండోసారీ ఫలితం దక్కలేదు...
అయినా కుంగిపోలేదు..
పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉంది..
చివరకు సాధించింది...
అఖిల భారత స్థాయిలో నాలుగోర్యాంకు..
అప్పుడుగానీ తృప్తిపడలేదు...
అదే పట్టుదల, అదే దీక్ష...
ఏ బాధ్యత చేపట్టినా నీతినిజాయితీలే
ఆయుధంగా అడుగులు...
**
ఎవరూ పెద్దగా పట్టించుకోని శాఖలో తొలి బాధ్యతలు చేపట్టాల్సి రావడం, అక్కడే తనేంటో నిరూపించుకోవడం ఆమెకు పెద్ద యుద్ధమే అయింది. కల్తీపై యుద్ధంలో ఆమే విజేతగా నిలిచింది. ప్రజల మనసులో చోటు సంపాదించింది. ఆమె పేరు టి.వి. అనుపమ. కేరళలో ఫుడ్‌సేఫ్టీ విభాగం కమిషనర్‌గా సంచలనం సృష్టించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కల్తీరాయుళ్లను గడగడలాడించిన ఐఎఎస్ అనుపమ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి. రాజకీయ ఒత్తిళ్లను తోసిరాజంటూ అడుగులు వేసిన ఆమె పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో దడ. నిజాయితీతో ఏ పనిచేసినా దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని నిరూపించిన అధికారిణి అనుపమ. తిరువనంతపురంలో బాధ్యతలు చేపట్టిన ఆమెకు చేతినిండా పనే. గుట్టలుగా పేరుకున్న ఫైల్స్ ఒకవైపు. ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలు, పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న దస్త్రాలు. మరోవైపు సమావేశాల్లో పాల్గొనాలంటూ ఆదేశాలు, ఆహ్వానాలు. ఇలా ప్రతి రోజూ ఊపిరి సలపని పనులు ఎన్ని ఉన్నా.. వాటన్నింటినీ అవలీలగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్నన అందుకున్నారు.
గోవాలోని బిట్స్‌పిలానీ నుంచి ఆమె ప్రయాణం మొదలైంది. చదువుకునే వయసులోనే అంకితభావం, కష్టపడేతత్వం వేలాది మంది విద్యార్థులలో ఆమెను విభిన్నంగా తీర్చిదిద్దింది. ఐఏఎస్ కావాలనే తన కలను నిజం చేసుకునేందుకు బిట్స్‌పిలానీ నుంచే ప్రయత్నాలు ఆరంభించింది. క్రింద పడ్డ ప్రతిసారి కెరటం ఎలా పైకిలేస్తుందో అలానే ఐఏఎస్ అవ్వాలనే తపనతో పరీక్ష ఫెయిలైనా నిరుత్సాహపడకుండా మళ్లీ మళ్లీ రాసి 2009 బ్యాచ్‌లో జాతీయస్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించింది. శిక్షణ పూర్తిచేసుకున్న ఆమెకు కేరళలోనే పోస్టింగ్ ఇచ్చారు. కేరళ ప్రభుత్వం ఆమెను ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమించింది. దాదాపు15 నెలలు ఆ శాఖలో పనిచేసిన అనుపమ నిరుపమాన సేవలను అందించారు.
కేరళలో కల్తీదందా
కేరళలో ఆహార పదార్ధాల కల్తీ దందా చాపకింద నీరులా సాగేది. దశాబ్దాలుగా అదే తంతు. ఆహార పదార్థాలలో పురుగుమందుల అవశేషాల ఆనవాళ్లు కనిపిస్తున్నా అడిగేవారు లేరు. 2015 వరకు వీరి వ్యాపా రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. ఎపుడైతే అనుపమ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి వీరిపై యుద్ధం ప్రకటించింది. చార్జ్ తీసుకున్న వెంటనే దాడులు ఆరంభించింది. ఎవ్వరికీ బెదరలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆగలేదు. హానికారక ఆహార పదార్థాల అవశేషాలు కనిపిస్తే చాలు అందుకు కారణమైన క్షేత్రంపై దాడి చేసేవారు. ఆమె పథకం పన్ని చేసిన ప్రతిదాడీ గురితప్పలేదు.
ఏడాదిలోనే మార్పు
2015 సంవత్సరం ఆమెకు సమర్థ కార్యాచరణకు అద్దం పట్టే కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడు నుంచి ప్యాకింగ్‌లో వచ్చే కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటాన్ని గమనించి మార్కెట్లపైన, చెక్‌పోస్టుల వద్ద విపరీతంగా దాడులు నిర్వహించి కల్తీ ఉత్పత్తులను పట్టుకున్నారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్షేత్రాల నుంచి 6000 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపిందంటే దాడులు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ట్రేడర్స్ మీద 750 కేసులు సైతం నమోదు చేసింది. ఒక్కొక్కరి మీద దాడులు ఎక్కువయ్యాయి. అక్రమార్కులు ఊరుకోలేదు. బెదిరించారు. భయపెట్టారు. రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చారు. వీటన్నింటిని ఆమె లెక్కచేయలేదు. భర్త, కుటుంబంతో పాటు ప్రజల అండదండలు వెన్నంటే ఉండటంతో అడుగు వెనక్కివేయలేదు.
కొత్త బాధ్యతలూ కీలకమే
అనుపమ 2011లో ఫుడ్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకునేటప్పటికీ కనీ సం సరైన ఆఫీసు కూడా లేదు. అంతేకాదు సరిపడా అధికారులు కూడా లేరు. దాడులు నిర్వహించాలంటే అధికారులకు వాహనాలు ఉండేవి కావు. అలాంటి సమయంలో ఈ డిపార్ట్‌మెంట్‌కు జవజీవాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఏడాదిన్నరపాటు పనిచేసిన తరువాత మెటర్నిటి లీవు పెట్టారు. ఆ తరువాత వచ్చాక వేరేశాఖకు బదలీ అయ్యారు. ఇపుడు ఆమె డైరెక్టర్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యారు. ఈ శాఖ కూడా ఎంతో బాధ్యతాయుతమైందే. పసి పిల్లల నుంచి పండు వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలి. ముఖ్యంగా పసిపిల్లలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, వృద్ధులు వంటివారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. అంగన్వాడీ సహా ఎన్నో ప్రాజెక్టులు ఈ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రజాసేవే లక్ష్యంగా, కర్తవ్య నిర్వహణే పరమావధిగా పనిచేసే అనుపమ ఈశాఖలోనూ దూసుకుపోతారన్నది అందరి నమ్మకం.

ఆ కూరగాయలు బంద్
తమిళనాడు, కేరళ నుంచి వచ్చే ఇలాంటి కల్తీ కూరగాయల సరఫరా తగ్గిపోయింది. దాదాపు 70 శాతం కూరగాయల సరఫరా ఆగిపోయిందంటే అనుపమ చేసిన ప్రయత్నం ఎం త బాగా ఫలించిందో చెప్పవచ్చు. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ అని త్రికరణశుద్ధిగా నమ్మిన ఈ యువ అధికారిణికి ప్రచారానికి దూరంగా ఉంటుంది. కనీసం పర్సనల్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అక్కౌంట్స్ లేవు. ఎలాంటి అఫీషియల్ పేజీ కూడా లేదు. దటీజ్ అనుపమ.

పేరున్న బ్రాండ్ బ్యాన్!
అన్నింటి కంటే ముఖ్యం కేరళలో పేరున్న ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన సం స్థలపై దాడులు నిర్వహించి పురుగు మందుల అవశేషాలున్నట్లు కోర్టులో నిరూపించి మరీ ఆ బ్రాండ్‌ను బ్యాన్ చేయించటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగుపెట్టాయి. మార్కెట్లు, చెక్‌పోస్టులు మీద ముప్పేట దాడి చేస్తూనే మరోవైపు ఇలాంటి కూరగాయలు, పండ్లు ప్రజలు కొనుగోలు చేయకుండా వారిలో చైతన్యం తీసుకురావాలని భావించింది. అనుకున్నదే తడవుగా సభలు, సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చైతన్య ర్యాలీలు సైతం నిర్వహించారు. పురు గు మందులు లేకుండానే కాయగూరలు ఎలా పండించుకోవాలో నేర్పించారు. ప్రభుత్వం నుంచి సబ్బిడీ విత్తనాలు సరఫరా చేయించారు. ఫలితంగా రైతన్నలు పురుగుమందులు వాడకుండానే కూరగాయలు పండించసాగారు. ఒక్క సంవత్సరంలోనే రైతుల్లోనూ, ప్రజల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. యువ ఐఏఎస్ అధికారులు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. ప్రజల నుంచి కూడా ఆమెకు అద్భుతమైన మద్దతు వచ్చింది. అలాంటి స్పందన వస్తుందని ఊహించలేదని ఆమే స్వయంగా పేర్కొన్నారు.

- హరిచందన