మెయన్ ఫీచర్

‘రాతియుగం’ రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్‌లో ‘రాళ్లు రువ్వేవారి’ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించడంపై అనవసర రాద్ధాంతం చేయడం కన్నా, ఈ విషయంలో దేశభక్తిగల భారతీయ పౌరులంతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాలి. అధికారం కోసం ఆకాంక్ష తప్ప మరో ఆలోచన లేని, వారసత్వం పేరిట అసమర్ధ నాయకుడిని జాతిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తూ నరేంద్ర మోదీ ఏదీ చెప్పినా, చెప్పక పోయినా గుడ్డిగా వ్యతిరేకిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘రెయిన్ కోటు ధరించి స్నానం చేస్తుంటార’ని మోదీ పరిహాసం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కాంగ్రెస్ శ్రేణులకు మనం ఎలా వివరించాలి? పార్లమెంటులో జరిగే చర్చల్లో ముళ్లులాంటి విమర్శలే కాదు, వాక్చాతుర్యమూ ఉండాలి. ‘సూటు, బూటు సర్కారు’ అని, ‘ఫెయిర్ అండ్ లలీ క్రీమ్’ అని రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నపుడు ఎవరూ వ్యతిరేకించలేదు.
ఇక ప్రస్తుతానికొస్తే, కాశ్మీర్ ప్రజల మనోభావాలను పరిరక్షించేది తామే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తుండగా, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు కాశ్మీర్ యువత విషయంలో సైన్యం సున్నితంగా వ్యవహరించాలని చాలా మాటలు చెప్పారు. మాజీ హోం, ఆర్థికశాఖల మంత్రి పి.చిదంబరం ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ‘హద్దుమీరినవి’గా అభివర్ణించారు. ‘్భరత్ కాశ్మీర్‌ను దాదాపు కోల్పోయినట్లేన’ని ఆయన వ్యాఖ్యానించడం యావత్ జాతిని నివ్వెరపరుస్తుంది. ఈ దేశానికి హోం మంత్రిగా పనిచేసిన చిదంబరం ఇంత బాధ్యతారాహిత్యంగా, జాతి వ్యతిరేకంగా మాట్లాడడం విస్మయకరం. కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గత రెండున్నరేళ్ల క్రితం ఏర్పడిందా? అంతకుముందు నుంచే అలా ఉందా? అన్న విషయమై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
చిదంబరంలా మాట్లాడే ఎంతోమంది నేతలను, ‘ఉదారవాదుల’ను మనం చూస్తున్నాం. వీరంతా పాకిస్తాన్‌కు, కాశ్మీర్‌లోని జిహాదీలకు క్షమాపణలు చెప్పుకునేవారిగా కనిపిస్తారు. వీరంతా భారత ఆర్మీ చీఫ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఆగ్రహం కురిపిస్తారు. భారత్‌ను ఇబ్బందుల పాలుచేసేందుకు వీరు ఎంతవరకైనా తెగిస్తారు. వీరంతా పాకిస్తాన్ ఇంటెలిజన్స్ ఏజన్సీ ‘ఐఎస్‌ఐ’ నుంచి బహుమానాలు పొందుతున్న వారే.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టులు, ‘ఉదారవాదులు’ దిల్లీ జెఎన్‌యులో జాతి వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడాన్ని మనం గమనించాలి. దేశ సరిహద్దుల్లో అశాంతి రగిలించడం, కాశ్మీర్‌కు ‘స్వేచ్ఛ’ కావాలనడం ఈ జాతి వ్యతిరేకశక్తుల ప్రధాన ఎజెండా. ఈ పార్టీలకు, శక్తులకు ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రత్యర్థి కాదు. రాజకీయ వివాదాల్లోకి, చర్చల్లోకి సైన్యం ప్రస్తావన తేవడం తీవ్ర అభ్యంతరకరం. ఇదే వ్యక్తులు, ఇవే శక్తులు మన ఆర్మీ ‘సర్జికల్ దాడులు’ జరిపినపుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితంగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో వారు కావలసినంత ప్రచారం పొందారు.
ఇంతకీ ఆర్మీ చీఫ్ రావత్ ఏమన్నారు? ‘కాశ్మీర్‌లో స్థానిక యువకులు ఆయుధాలను ఎక్కుపెడుతున్నారు. వారు అలా చేయకుండా చూడాలని ప్రజలను మేం కోరుతున్నాం. ఐసిస్, పాకిస్తాన్ జెండాలను ఎగురవేస్తూ ఉగ్రవాదుల్లా ప్రవర్తించడాన్ని వారు మానుకోకుంటే - వారిని జాతి వ్యతిరేక శక్తులుగా మేం పరిగణిస్తాం. సైనికులపై రాళ్లు రువ్వే వారంతా మా దృష్టిలో ‘బహిరంగంగా పనిచేస్తున్న ఉగ్రవాద కార్యకర్తలే’. కాశ్మీర్ యువతకు మేం ఒక అవకాశం ఇస్తున్నాం.. వారు పంథా మార్చుకోని పక్షంలో మేం కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం’. ఆర్మీ చీఫ్ రావత్ ఇంతటి దృఢమైన హెచ్చరిక చేయడానికి దారితీసిన కారణాలేమిటి?
గత ఏడాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీని సైన్యం హతమార్చిన తర్వాత కాశ్మీర్ లోయలోని పది జిల్లాల పరిధిలో 2,347 ‘రాళ్లు రువ్విన’ సంఘటనలు జరిగాయి. అంతకుముందు ఎప్పుడూ ఇన్ని హింసాత్మక సంఘటనలు వరుసగా జరగలేదు. అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు అటవీ భూములను కేటాయించిన సందర్భంగా 2008 నుంచి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలిపేందుకు ‘రాళ్లు రువ్వడం’ అనేది ఓ ఆయుధంగా మారడంతో 2009, 2010, 2016లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్థానికంగా సెలవులు ప్రకటించినా హింస ఆగడం లేదు.
2015లో ‘ఈద్’ సందర్భంగా ప్రార్ధనలు ముగిశాక స్థానిక పోలీసులపై, భద్రతా దళాలపై యువకులు రాళ్లు రువ్వారు. తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు, సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను నివారించేందుకు సైన్యం ప్రయత్నించగా- ఆ చర్యలను అడ్డుకోవడమే ధ్యేయంగా కొందరు యు వకులు నిరసనల పేరిట రాళ్లు రువ్వారు. పాకిస్తాన్ ఆడుతున్న నాటకంలో భాగంగా ‘దారితప్పిన యువకులు’ కొందరు కాశ్మీర్‌లో సంక్షోభం కొనసాగేలా పనిచేస్తున్నారు. కాశ్మీర్‌లో ఐసిస్, పాకిస్తాన్ జెండాలను ఎగురవేసే ప్రాంతాల నుంచి భారతీయ సైనికులు తొలగిపోవాలన్నది వారి డిమాండ్. కాశ్మీర్‌లో ‘స్వేచ్ఛ కోసం పోరాడే యోధుల’ను భారత్ అణచివేస్తోందని ప్రపంచానికి చాటిచెప్పడమే వారి ధ్యేయం.
కాగా, ఆర్మీ చీఫ్ ఇలా హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. 2016 మార్చిలో రక్షణశాఖ ప్రతినిధి ఇలాంటి హెచ్చరికనే జారీ చేశారు. ‘అల్లరి మూకలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇతరుల మానప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించినా, భద్రతాదళాలపై దాడి చేసినా తగు చర్యలు తప్పవు’ అన్న హెచ్చరిక అప్పట్లో చేశారు. ఓ సైనిక ఆపరేషన్ సందర్భంగా వెయ్యి మందికి పైగా స్థానికులు గుమికూడడంతో ఈ హెచ్చరికను చేశారు.
ఇంతకీ రాళ్లు రువ్వడం దేనికి? కేవలం భద్రతా దళాలను బెదిరించడానికో, భయపెట్టడానికో కాదు. ఎన్‌కౌంటర్లు జరిగినపుడు జిహాదీ ఉగ్రవాదులు సైనికుల నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు యువకులు సహకరిస్తున్నారు. రాళ్లు విసురుతూ యువకులు అడ్డుగోడగా నిలబడడంతో సైనికులు కాల్పులు జరపలేక పోతున్నారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారు. రాళ్లు రువ్వుతూ యువకులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఐసిస్, పాకిస్తాన్ జెండాలను చేతపట్టుకుని ఊపుతున్నారు. కాశ్మీర్‌లో దారితప్పిన యువకులు ఇలా ఐసిస్ జెండాలు ఊపుతుండగా, పాకిస్తాన్‌లో ఐసిస్ తీవ్రవాదులు మసీదులను పేల్చేస్తూ వందలాది అమాయకులను బలితీసుకుంటున్నారు. ఈ మారణకాండను చేస్తున్నది తామేనని ఐసిస్ గర్వంగా ప్రకటిస్తోంది కూడా.
‘రాళ్లు రువ్వడం’ ఇప్పటి సంగతి కాదని, చరిత్రలోనూ ఇందుకు ఆధారాలున్నాయని ఇపుడు డిజిటల్ మీడియాలో ప్రచారమవుతోంది. చరిత్రకారుడు ఆషిక్ హుస్సేన్ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి ముందు- కాశ్మీర్‌పై దాడి చేసిన సందర్భంగా మొఘల్ సైనికులపై- ఇళ్లలో నుంచి బయటకు వచ్చే యువకులు రాళ్లు రువ్వేవారట! అప్పటి నుంచి రాళ్లు రువ్వడం నిరసనకు ప్రతిరూపంగా కొనసాగుతోంది. డోగ్రా పాలకులు 30 మందిని హతమార్చినపుడు 1931లో ఇలాంటి సంఘటనల్లో భారీగా నిరసన వ్యక్తమైంది. చరిత్ర సంగతెలా ఉన్నా, ఇటీవలి కాలంలో హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఏదో ఒక విధంగా కాశ్మీర్‌ను కబళించాలని చూస్తోంది. అయితే, ఈ సంఘటనల నేపథ్యంలో ఇపుడు కాంగ్రెస్ అసలు వైఖరి, రాజకీయ వ్యూహం బట్టబయలైంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలా ప్రధాన రాజకీయ పక్షాలు ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను రాజకీయం చేయడం జరగదేమో! దేశరక్షణ, పౌరుల భద్రతను ఆశించి ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనపై ఇంత రాద్ధాంతమా? విభజనవాదుల గళాన్ని మన దేశంలోని కొన్ని పార్టీలు ఇలా వినిపిస్తున్నాయా?

*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206