మెయన్ ఫీచర్

అవినీతిని ప్రశ్నించే గళాలు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1967 నాటి వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా దాష్టీకాన్ని ప్రశ్నిస్తూ ‘న్యూయార్క్ రివ్యూ’లో నోమ్ చామ్‌స్కీ రాసిన ‘మేధావుల పాత్ర’ అనే వ్యాసంలో బాధ్యతలున్న వ్యక్తులు, రచయితలు, సామాజిక వేత్తలు, న్యాయాధీశులు లాంటి వారందరూ ప్రభుత్వాలకు సంబంధించిన వాస్తవాలను మాట్లాడాలని, వారు చెప్పే అబద్ధాలను బాహ్య ప్రపంచానికి తెలియచెప్పాలని పేర్కొన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఎన్నిక సందర్భంగా ఈ వ్యాసం మళ్లీ ప్రస్తావనకు రావడం గమనార్హం. ట్రంప్ గెలుపును నిరసిస్తూ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు నిరసన ర్యాలీలు చేయడం గమనించాలి. అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ట్రంప్ మాట్లాడిన తీరు, గెలిచిన తర్వాత చేపడుతున్న చర్యలు వారి నిరసనకు కారణమవుతున్నాయి. అలాంటి స్థితి భారత్‌లో వున్నా, అలా నిరసన తెలపడం ఈ దేశ ప్రజలకు ఇంకా అబ్బలేదు. పైగా సంబంధిత నాయకుల్ని దైవాంశ సంభూతులుగా భావించడం, భుజాలపై మోయడం జరుగుతుంది.
జల్లికట్టు క్రీడపై నినదించిన తమిళజనం, అక్కడ వేళ్లూనుకున్న అవినీతి, అక్రమార్జనపై గొంతు విప్పక పోవడం చూస్తూనే వున్నాం. టునీషియాలో జరిగిన ‘జాసిమిన్’ విప్లవంలా జల్లికట్టుపై కదిలిన తమిళ యువతకు సినీ పరిశ్రమ, ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చిన మద్దతు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కనిపించింది. అవినీతి, అక్రమార్జనలో కూరుకుపోయిన అమ్మకు, చిన్నమ్మకు తెలిపే మద్దతు, జయమ్మకు ‘్భరతరత్న’ ఇవ్వాలనే నినాదం అక్కడి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్రం జయకు ‘్భరతరత్న’ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అక్రమాస్తుల కేసులో తీర్పు రిజర్వు అయివున్నా జయలలిత మృతికి ముందు సుప్రీంకోర్టు ప్రకటించకపోవడం, కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామే చిన్నమ్మకు మద్దతు తెలపడం, ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం రాజీనామా చేసి దాన్ని వెనక్కి తీసుకుంటాననడం, చిన్నమ్మకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడం.. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆడిన రాజకీయ చదరంగానికి అద్దం పడుతున్నది. చివరికి శశికళ జైలుకు చేరినా, ఆమె కోరుకున్న పళనిస్వామికే అధికారం దక్కడం భ్రష్టుపట్టిన రాజకీయాలకు నిదర్శనం. మన ఎన్నికల విధానం, ఎంఎల్‌ఎల అవకాశవాద రాజకీయాలు, శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడానికి ముందు జరిగే కిడ్నాప్ లాంటి క్యాంపు ఎత్తుగడలు ఇంతకన్నా మెరుగైన ఫలితాల్ని ఇవ్వలేవు. ఇలాంటి క్యాంపు రాజకీయాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, బిహార్‌లో, మొన్నటికి మొన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది.
అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ‘అమ్మ’ జయలలిత మృతికి ముందే ప్రకటించినట్లయితే తమిళనాట పెనుమార్పులు జరగడమే కాక అంతిమయాత్ర సందర్భంగా అధికార లాంఛనాలపై సందిగ్ధత ఏర్పడేది. ‘చిన్నమ్మ’ అమ్మగా పరకాయ ప్రవేశం చేసేదికాదు. పన్నీరే ముఖ్యమంత్రిగా కొనసాగినా, సుప్రీం తీర్పు వేనోళ్ల కొనియాడబడేది. చచ్చినవారి కళ్లు చారడేసి అన్నట్లు ‘అమ్మ’ బొమ్మ తమిళ జనం గుండెలపై శాశ్వతంగా ముద్రించబడేది కాదు. దేశవ్యాప్తంగా అవినీతిపరులైన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. న్యాయ వ్యవస్థకు ఉండే ఇబ్బందులు, ప్రాసిక్యూషన్ వారు ఆధారాల్ని చూపకపోవడం, పుష్కరాల పాటు తీర్పుల్ని పెండింగ్‌లో పెట్టడం.. వంటి పరిస్థితుల్లో నేరగాళ్లకు, అక్రమార్జనా పరులకు చట్టసభలు స్వర్గ్ధామాలుగా మారాయి. ఈ పుణ్యకాలంలో ఈ బాపతు నేరగాళ్లు మరింతగా బలుపెక్కడం, రాజకీయాల్ని శాసించడం, కేసుల్ని తారుమారు చేయడం, చివరికి కొంతమంది న్యాయమూర్తుల్నే తమకు అనుకూలంగా మార్చుకొని కేసుల నుంచి తప్పించుకోవడం ఈ దేశంలో మామూలైపోయింది. జయమ్మ అండ్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జాన్‌మైకేల్ డీ కూన్యా 2014 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తిపట్టిన విధంగా కర్ణాటక హైకోర్టు ఎత్తిపట్టినా బాగుండేది. ఈ కేసు విచారణ తమిళనాట జరిగితే, ఆధారాలు బలంగా చూపలేరని, ప్రాసిక్యూషన్ బలహీనంగా వుంటుందని భావించి కర్నాటకకు బదిలీ చేశారు. కర్నాటక హైకోర్టు చిన్న సూత్రీకరణతో (10 శాతం ఆస్తుల పెరుగుదలకు లోబడి) జయకు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రి కావడం, గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలవడం అందరికీ తెలిసిందే. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా, ఆ పరిస్థితులను శశికళ బృందం రాజకీయాలకు వినియోగించుకోవడం పతనమవుతున్న రాజకీయాలకు నిదర్శనం.
భారత ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు వేగుచుక్కలా కనిపించే కోర్టు తీర్పులు మనకు గుణపాఠాలను మాత్రం నేర్పడం లేదు. చట్టసభలు గాడిలో పడకపోగా అసాంఘిక శక్తులు, అవినీతిపరులు వాటిల్లో చొరబడుతూనే ఉన్నారు. పెరుగుతున్న అవినీతికి, పోగుపడుతున్న ఆస్తులకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పార్లమెంటు ఉగ్రవాదాన్ని బూచిగా చూపి ప్రజల దృష్టికి మరల్చి, అవినీతిని పెంచి పోషిస్తున్నది. ఉగ్రవాదానికన్నా దేశ అంతరంగ భద్రతకు ఈ అవినీతే పెనుప్రమాదం అని గుర్తించడానికి నిరాకరిస్తున్నది.
నిజానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో అవినీతి నిరోధక శాఖలున్నా అవి ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తిగా దృష్టి సారించని స్థితి ఉంది. తిమింగలాల్ని వదిలేసి చిన్నచేపల్ని వలవేసి పట్టడమే వాటికున్న పరిధి. పైగా ఈ శాఖల అధిపతులే కోట్లకు పడిగెత్తడం మరో వింత! ఈ శాఖతో దేశంలో అవినీతికి తావులేకుండా చేస్తున్నామని భ్రమింప చేస్తున్న పాలకులు రాజకీయాలో, పాలనలో అవినీతిపై దృష్టి సారించడం లేదు. 2012లో సామాజిక కార్యకర్త అన్నా హజారే లేవదీసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా కదలిక తెచ్చినా, రాజకీయ లాబీ జనలోకపాల్ బిల్లుకు మార్గాన్ని సుగమనం చేయలేకపోయింది. పార్లమెంట్‌లో చర్చలకే పరిమితం చేసింది. నల్లడబ్బు గూర్చి, అవినీతి గూర్చి, విదేశాల్లో దాగిన సొమ్ము గూర్చి పదేపదే మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ జనలోకపాల్ బిల్లు విషయమై ఆలోచించడం లేదు. జనలోకపాల్ బిల్లు రూపొందినట్లయితే దేశంలో నేడీ దుస్థితి ఉండేది కాదు. జయలలిత బతికుండగానే శిక్ష పడేది. అవినీతి పరులుగా ముద్రపడి, జైలు గోడల్ని చూసిన ముఖ్యమంత్రులైన లల్లు ప్రసాద్ యాదవ్, చౌతాలా, మధుకోడా లాంటి వారు తిరిగి రాజకీయాలు చేసేవారు కాదు. యడ్యూరప్ప, ప్రేమ్‌ఖండ్, వీరభద్రసింగ్ లాంటి వారు రాజకీయాల్లో తిరిగేవారు కారు. ఇక తమ అక్రమాలు బయట పడకుండా రాజ్యాలు ఏలుతున్నవారు, ఆరోపణల్ని ఎదుర్కొంటున్న మాయావతి లాంటి వారు రాజకీయాలకు స్వస్తి పలికేవారు.
నిజానికి దేశంలో వున్న అవినీతి చక్రవర్తులకంటే, జయ కూడబెట్టిన అక్రమ ఆస్తులు పెద్ద ఎక్కువేమి కావు. 1991లో ముఖ్యమంత్రి కావడానికి ముందు జరిగిన ఎన్నికల సందర్భంగా తానోమారు చీర లేనిదానినని, నెలానెలా ఎన్టీఆర్‌లా ఒకే ఒక్క రూపాయి తీసుకుంటానని ప్రకటించి కోట్లాది రూపాయల్ని పోగు చేసుకోవడమే ఆమె అవినీతిపరురాలిగా ముద్రపడడానికి కారణమైంది. దీనికి తోడు పట్టువదలని విక్రమార్కుడైన సుబ్రహ్మణ్య స్వామి తమిళనాట వుండడం మరోకారణం! ఇలాంటి సుబ్రహ్మణ్య స్వాములు ప్రతి రాష్ట్రంలో లేకపోవడం వల్లనే అవినీతిపరులు రాజకీయాల్లో చక్రాలు తిప్పుతూనే వున్నారు. సామంతరాజుల్లా, రాజుల్లా వెలుగుతూనే వున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వారి చేతుల్లో పోగుపడి, విదేశాలకు చేరిన నల్లధనం సుమారుగా రూ.80 లక్షల కోట్లకు పైగాననేది బహిరంగమే! అంటే, మన దేశ బడ్జెట్‌కు నాలుగు రెట్లన్నమాట. అందుకే పేదలు మరింత పేదలుగా దిగజారుతుంటే, ఒకే ఒక శాతం ధనవంతులు దేశ సంపదలో 58 శాతాన్ని స్వంతం చేసుకున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, మొత్తం దేశ సంపద వీరి చేతుల్లోకే పోతుంది. వీరి రక్షణకోసమే చట్టసభలు కూడా పని చేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! అందుకే, బయటకు విమర్శించుకున్నా రాజకీయ నాయకులంతా అంతర్గంతంగా కలిసి వుంటారు. ఈ సూత్రీకరణతోనే పార్టీలకతీతంగా, పదవులకు, హోదాలకు అతీతంగా జయమ్మకు నివాళులు అర్పించారు.
ఎడారిలో ఒయాసిస్‌లా కనపడే ఇలాంటి తీర్పులకు రాజకీయ కోణాలే ఎక్కువ అనేది రాజకీయం తెలిసిన వారికి తెలుసు. ఆలస్యంగానైనా న్యాయవ్యవస్థ సజీవంగా ఉందని తీర్పును వెల్లడించిన పినాకి చంద్రఘోష్, అమితవ రాయ్‌లు ఇందిరాగాంధీ అక్రమ ఎన్నికను ప్రశ్నించి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు దారిలో నడవడం కొంత ఊరటనే! ఈ తీర్పులు మరింత నిష్పక్షపాతంగా, కాలయాపన లేకుండా సకాలంలో, రాజకీయ హోదాలకు అతీతంగా జరిగితే దేశ ముఖచిత్రమే మారిపోతుంది. పార్లమెంటు సహా, అన్ని అసెంబ్లీలలో ప్రకంపనలు లేస్తాయి. కాని, నాణానికి మరోవైపులా ఇలాంటి ఆశలు రోజురోజుకు సన్నగిల్లి పోతున్నాయి. న్యాయవ్యవస్థ ద్వారాలు పూర్తిగా మూసుకపోకముందే, జనాలు అప్రమత్తమైతే తప్ప దేశం బాగుపడని స్థితి నెలకొంది. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా మిన్నకుండడం మాత్రం దేశభవిష్యత్తుకు పెను ప్రమాదమే! ఈ దిశగా పని చేయాల్సింది, సమాజాన్ని మేల్కొల్పాల్సింది మేధావి వర్గమేనన్న నోమ్ చామ్‌స్కీ మాటలు మనకు కూడా వర్తిస్తాయని గ్రహిస్తే దేశ భవిష్యత్తుకు బంగారుబాట వేసిన వారం అవుతాం. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162