మెయన్ ఫీచర్

ఈ లెక్కలకు సమాధానమేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం, ఉపాధి, మరో పేరు ఏదైనా కావచ్చు. మనిషికి కావలసింది నిత్య జీవితావసరాలు తీరి, గౌరవంగా జీవించేందుకు సరిపోయే ఆదాయం. కాని జనాభాలో సగానికన్నా ఎక్కువ మందికి ఇందుకు హామీలేని పరిస్థితులు ఏర్పడటం చాలాకాలం క్రితమే మొదలైంది. ఎప్పుడు, ఎందుకన్నది ఆర్థిక శాస్తవ్రేత్తలు మాత్రమే చెప్పగలరు గాని, మనకు తెలిసి పెద్దఎత్తున ఉపాధి రాహిత్యం, కరువులు, ఆకలి చావులు బ్రిటిష్‌వారు పాలించిన 19వ శతాబ్ది నుంచే మొదలయ్యాయి. అందుకు కారణం ఆర్థిక, అభివృద్ధి విధానాలు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు స్వాతంత్య్రం వచ్చాక ప్రయత్నాలు జరిగాయి గాని వివిధ కారణాలవల్ల ఎక్కువ ఫలితాలనివ్వలేదు. ఆ లోపం అలా మిగిలి ఉండగానే ఆర్థిక సంస్కరణల దశ వచ్చి ఉద్యోగ-ఉపాధి రంగాలను గందరగోళంలో పడవేసింది. ఇందు గురించిన చర్చ ఇంకా సాగుతుండగానే ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇపుడు ఉధృత స్థాయిలో ‘ఆటోమేషన్’ అనే మాట వినవస్తున్నది. కంప్యూటర్లు, రోబోలే చాలా పనులు చేస్తుండగా ఉద్యోగుల అవసరం వేగంగా తగ్గిపోతోందన్న భయాలు ఇప్పటికే పాశ్చాత్య ప్రపంచంలో మొదలయ్యాయి. భారత్ వంటి వర్ధమాన దేశాల మేలుకోరే ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ విషయమై ఆయా దేశాల యువతకు తగిన హెచ్చరికలు చేయటం కనిపిస్తున్నది.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్లేముందు, ప్రస్తుతం కొద్ది వారాలుగా ‘ఉద్యోగాలు’ అనే సమస్యపై తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూడాలి. తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి సమస్యలుండటం ఎవరూ కాదనలేనిది. ఉద్యోగాలు వేరు, ఉపాధి వేరని తెలిసిందే. ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఉపాధి అన్నది వ్యవసాయం, వివిధ వృత్తుల వంటి నిర్దిష్ట రంగాలతోపాటు సాధారణ రూపంలో ఉండే ఇతర పనులు కావచ్చు. అవి ఇతరుల వద్ద పనిచేయటంవల్ల లభించేవి గావచ్చు, ఎవరికివారు కల్పించుకునే స్వయం ఉపాధిగావచ్చు. ప్రస్తుతం తెలంగాణలో చర్చ అంతా ప్రభుత్వరంగంలో పరిమితమైన ‘ఉద్యోగాల’ చుట్టూనే జరుగుతున్నది. ఇందుకు ఒకటి కారణమై ఉంటుంది. నిరుద్యోగం లేదా నిరుపాధి స్థితికి బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వాన్ని గుర్తించటం తేలికగా జరిగే పని. ప్రజలు ఎన్నుకుని పాలించే వ్యవస్థగా ప్రభుత్వానికి తగు బాధ్యత ఉండేమాట నిజం కూడా. ఆ కారణంగా ప్రభుత్వాన్ని వేలెత్తిచూపటం ఒకటికాగా, అందుకు తోడుగా దానిలో రాజకీయాలను కలగలపటం ఎప్పుడూ జరిగేదే. ఈ విధంగా విషయాన్ని ‘ప్రభుత్వ ఉద్యోగా’లకు మాత్రమే పరిమితం చేసి, పుణ్యం పురుషార్థం కలిసి రావటమనే పద్ధతిలో, ఒకవైపు నిరుద్యోగ యువత పట్ల ఆందోళన చూపుతూ మరొకవైపు రాజకీయ ప్రయోజనాలకు ఆ విషయాన్ని ఉపయోగించుకోచూడటం అన్ని పార్టీలూ ఎల్లప్పుడూ చేస్తూ వస్తున్నదే.
అది పార్టీల ‘రాజకీయ ధర్మం’ అవుతుందేమోగాని, ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్నది అదే. యువకులతోపాటు సాధారణ ప్రజానీకపు నిరుద్యోగం, ఉపాధి రాహిత్యం, అర్ధాకలి, ఉపాధి వంటివన్నీ తీవ్ర సమస్యలు కాగా ఆ సమస్యలపై పార్టీలు, ఇతరులు అసలు మాట్లాడకపోవటం లేదా ఎపుడో ఒకసారి అర్ధోక్తులు మాట్లాడటం గమనించదగ్గది. వాస్తవానికి ప్రభుత్వేతర రంగాల ఉద్యోగాలు, ఉపాధుల కల్పనలో ప్రభుత్వాలకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదు గాని, విధానపరమైన నిర్ణయాలు, వాటి అమలురూపంలో పరోక్ష పాత్ర చాలానే ఉంటుంది. ఉదాహరణకు ప్రైవేటు పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తులు వంటివి బాగుండటం, ఉపాధి కల్పించటంలో ప్రభుత్వ విధానాల పాత్ర గురించి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడటం ఒక ‘హాట్ టాపిక్’ స్వభావాన్ని సంతరించుకుంది. అందులో గ్లామర్, రాజకీయ ప్రయోజనం ఎక్కువై ఉంటుంది. చదువుకుని పట్టణాలలో నివసిస్తూ, పాదరస స్వభావంగల యువతరాన్ని కదిలించటం లేదా రెచ్చగొట్టటం తేలిక కావటం ఇందుకు కారణం కావచ్చు. ఈ విధమైన గ్లామర్, ఫాస్ట్ఫుడ్ రాజకీయ ప్రయోజనం ఇతర రంగాలకు చెందిన సాధారణ ప్రజానీకపు ఉపాధి గురించి మాట్లాడటంలో ఉండదు. రెండింటిని కలిపి ఒక సమగ్ర దృష్టి తీసుకునే సంస్కృతి మన పార్టీలకు గాని, ఈ అంశంపై మాట్లాడే ఇతరులకు గాని లేదు. వారి పరమోద్దేశం రాజకీయమే తప్ప అందరి మేలు కాదు గనుక. తెలంగాణలోని ప్రస్తుత నిర్దిష్ట పరిస్థితిని మరికొంత చూద్దాము. ప్రభుత్వంలో లక్షా ఏడువేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించారు. అవన్నీ భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ విమర్శకులు ఒకసారి రెండున్నర లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. మరొకసారి లక్షా డెబ్బయివేలన్నారు. వేర్వేరు విమర్శకులు వేర్వేరు లెక్కలు చెప్తున్నారు. ఈ అంకెలు అట్లుండగా, ఇంతవరకు భర్తీ అయినవెన్ని? భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైనవెన్ని? షెడ్యూళ్లు ప్రకటించినవెన్ని? అనే లెక్క ఒకటున్నది. ఈ మూడు విధాలైన సంఖ్యలను కూడా ప్రభుత్వం చెప్తున్నది. ఇందులో పార్టీలు, ఇతరులు ఇప్పటికే భర్తీఅయిపోయిన వాటిని మాత్రమే పేర్కొంటూ, ప్రక్రియ మొదలైన వాటిని, షెడ్యూళ్లు ప్రకటించిన వాటిని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. నిష్పాక్షికంగా ఆలోచించినపుడు ఇది సహేతుకమవుతుందా? అన్నది ప్రశ్న. ఉదాహరణకు ఒక విందు భోజనం వద్ద అతిథులలో మూడు విధాలైనవారు కన్పిస్తారు. కొందరు అప్పటికే భోజనం ముగించి పంక్తిలోంచి లేచి వెళతారు. కొందరు ఇంకా పంక్తిలో ఉండి భోజనం చేస్తుంటారు. మరికొందరు ఆ పంక్తి ఖాళీ కావటం కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులో ఇంకా పంక్తిలో కూర్చుని ఉన్నవారి కోసం, కూర్చునేందుకు వేచిచూస్తున్న వారికోసం కూడా వంటలు సిద్ధం అయి ఉంటాయి లేదా అవుతుండి ఉంటాయి. ఈ మూడువిధాలైన వారిలో ఆ ఇంటి యజమాని ఎవరికి భోజనం పెట్టినట్లు? ఎవరికి పెట్టనట్లు? అప్పటికే పంక్తినుంచి వెళ్లినవారికి విందు ఇచ్చి, తక్కిన రెండు విధాలైన వారిని ‘ఉపవాసం’ ఉంచినట్లవుతుందా?
ఇందులో అర్థం కాని నిగూఢత ఏమీలేదు. విషయం ఏమిటన్నది మామూలు వారికి వేరే వివరణలు అక్కరలేకుండానే అర్ధమవుతున్నది. కాని రాజకీయ ప్రయోజనాలు రెండురెళ్లను నాలుగు గాక నలభై చేయగలవు. కనుక వారు విషయాన్ని ఇతరులకు నిగూఢంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అకస్మాత్తుగా మెరుపులు మెరిసినపుడు కళ్లు జిగేల్మనటం, తర్వాత మన పరిసరాలు యథాతథంగా గోచరించటం మామూలే. ప్రస్తుతం అటువంటిదే జరుగుతున్నట్లుంది. కొద్దిపాటి లెక్కలను చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదిహేను సంవత్సరాల కాలంలో అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు కలిపి తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు 11,730 మాత్రమేనని లెక్కలు చెప్తున్నాయి. దాంతో పోల్చితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీలలో ఇప్పటికే 17,071 మంది చేరిపోయారు. ఇవే మూడింటిలో రాగల ఆరుమాసాలలో చేరనున్నవారు మరొక 99,685 మంది. రెండింటిని కలిపితే 1,16,756 అవుతున్నది. ఇదికాకుండా డిఎస్సీ, రెసిడెన్షియల్ స్కూళ్లు, సింగరేణి, ప్రభుత్వ శాఖలోల పెద్దసంఖ్యలోనే నియామకాలు జరుగనున్నట్లు అధికారికంగా సూచిస్తున్నారు.
పైన పేర్కొన్న గత 15 సంవత్సరాల నియామకాలకు, ఈ రెండేళ్ల నియామకాలకు పోలిక ఏమిటో ఆ కాలమంతా పరిపాలించిన పార్టీలు, ఇతర ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల నుంచి, ఈ లెక్కలు వెల్లడై ఇప్పటికి వారం రోజులు గడిచినా సమాధానం వినరావడం లేదు. వారి వౌనానికి కారణాన్ని ఊహించటం కష్టం కాదు. వారెవరి వద్దా సమాధానాలు లేవు. తమ వైఫల్యాలు వారికి తెలుసు. తమ ప్రస్తుతపు మాటలన్నీ రాజకీయ ప్రయోజనం కోసం చెప్తున్నవని కూడా తెలుసు. అందువల్ల వారినుంచి జవాబును ఆశించటం ఒక వృథాప్రయాస.
పైన ప్రభుత్వోద్యోగులతోపాటు ‘ఉపాధి’ గురించి కూడా చెప్పుకున్నాము. ఒక విధంగా ఈ ఉద్యోగాలకన్న ఉపాధి సమస్య ఇంకా విస్తృతమైనది, తీవ్రమైనది. అది జీవితాలను ‘సెనే్సషన్’ లేకుండా కబళిస్తుంది. అట్లా కబళించే ప్రభుత్వ విధానాలు ఆయా రంగాలలోని పరిస్థితులకుతోడై తమపని తాము చేస్తుంటాయి. ఇటువంటి భయంకర స్థితి తెలంగాణలో తక్కువ కాదు. మరి తెలంగాణలో, మొత్తం దేశంలో దశాబ్దాల తరబడి పాలించి, ఉపాధి కల్పన విషయంలో ఇటువంటి భయంకర, ప్రాణాంతక స్థితిని సృష్టించినదెవరు? ఎవరి విధానాలు, దారుణ వైఫల్యాల ఫలితంగా ఈ దుస్థితి ఏర్పడింది? తెలంగాణలో గత కొన్ని వారాలుగా నానాయాగీ చేస్తున్న వివిధ పార్టీలు, ఇతర విమర్శకులు ఈ విషయం ఎపుడైనా ఆలోచించారా? చేసుకోవలసిన వారు ఆత్మవిమర్శలు చేసుకున్నారా? అటువంటి నిజాయితీని ఇప్పటికైనా చూపగలరా? ఈ ఆలోచనలు, ఆత్మవిమర్శలతో నిజాయితీని చూపదలచుకుంటే, అందుకు మొదటగా పైన పేర్కొన్న లెక్కలకు సమాధానం ఇవ్వాలి. వాస్తవాలు ఏమిటో తెలంగాణ యువతీ యువకులకు, ప్రజలకు తెలియాలి.
పోతే, ఈ చర్చ మరొక స్థాయిలో కూడా జరగటం అవసరం. అది స్థానిక జాతీయ- అంతర్జాతీయ స్థాయిలలోగల ఆర్థిక, పారిశ్రామిక, వ్యాపార, వ్యవసాయిక, వృత్తిరంగాల విధానాలకు సంబంధించినటువంటిది. వేర్వేరు స్థాయిలలో రూపొంది అమలయే ఈ విధానాల ప్రభావం ఉద్యోగాలు, ఉపాధి రంగాలపై ప్రపంచమంతటా ఉంటున్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత మరింత స్పష్టంగా, తీవ్రంగా కన్పిస్తున్నది. కాని ఈ సమగ్ర దృష్టి, చర్చగానీ, అందుకు పరిష్కారాలేమిటని గాని, అదే క్రమంలో తెలంగాణకు పరిష్కారం ఏమిటని గాని వీరెవ్వరూ ఆలోచించటం లేదు. చర్చలు స్వప్రయోజనాలతో ముడివడి సంకుచితంగా సాగుతున్నాయి తప్ప, వాటిస్థాయి పెరగటం లేదు. తెలంగాణ ఉద్యోగ- ఉపాధి సమస్య గురించి చర్చిస్తూనే, దానిపై విస్తృత స్థాయిలో ఆవరించుకుని ఉన్న జాతీయ, అంతర్జాతీయ విధానాలు, వాటి అమలు ప్రభావాలపై కూడా చర్చ జరగటం అవసరం. ప్రజలకు అదికూడా తెలిస్తేనే సమస్య అర్థం కావటంతోపాటు పరిష్కారాలను వెతకటం సులభమవుతుంది. ఈ పరిస్థితులకు తెలంగాణ పరిధిలో కనుగొనగల ప్రత్యామ్నాయ విధానాలు ఏవైనా ఉన్నాయా? అన్నది అనే్వషించటం అసలైన సవాలు. ఆ పని చేయగలవారే తెలంగాణకు మేలుచేయగలరు తప్ప అధికారం కోసం రాజకీయాలు నడిపేవారు కాదు.
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767