మెయన్ ఫీచర్

‘చిన్నారి పెళ్లికూతుళ్లు’ ఇంకా ఉన్నారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెళ్లి అనేది మంచిదైతే అధికస్య అధిక ఫలం’ అన్నారు గనుక- చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడు చస్తే మరొకడికి, మరోడు చస్తే మరోడికి.. ఇలాగ పెళ్లిమీద పెళ్లి అయి- వీడి దగ్గరో వెయ్యి, వాడి దగ్గిరో వెయ్యి- రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టెలాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధిమంతుణ్ణి పెళ్లాడితే ఇహ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యం వుంటే పరసౌఖ్యం కూడా సా ధించావే అన్నమాట’- ఏ మాత్రం సాహిత్య ప్రవేశం ఉన్నవారయినా ఈ ఉవాచ ‘కన్యాశుల్కం’లో గిరీశం సెలవిచ్చిందని సులువుగా గుర్తుపట్టేస్తారు. ఎప్పుడో 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు, దాని కారణంగా బాల వితంతువుల సమస్య, కన్యాశుల్కం దురాచారం విస్తృతంగా వుండే రోజుల్లో గురజాడ అప్పారావు గారు గిరీశం వంటి కుహనా సంస్కర్త పాత్రను ‘కన్యాశుల్కం’ నాటకంలో సృష్టించి, అతడిచేత పలికించిన పలుకులివి.
‘కన్యాశుల్కం’ నాటకం మొదటి ప్రతిని గురజాడ 1897లో ప్రచురించారు. దాని పీఠికలో ఆయన- విజయనగరం మహారాజావారు తమ సంస్థానంలో కన్యాశుల్క వివాహాలు ఎన్ని జరుగుతున్నాయని చేయించిన సర్వేలో ఏడాదికి సగటున 344 బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, అందులో అయిదేళ్లలోపు బాలికలకు జరిగిన వివాహాలు 99, మూడేళ్లలోపు బాలికలకు జరిగిన వివాహాలు 44, రెండేళ్లలోపు ఆడపిల్లలకు జరిగిన వివాహాలు 36, ఏడాది లోపు ఆడశిశువులకు వివాహాలు 3 అని తేలిందట! వరుడికి కన్యాదానం చేసేటప్పుడు బాలిక తండ్రికి లభించే ‘కన్యాశుల్కం’కు ఆశపడి చేసిన వివాహాలివి. ఇది 19వ శతాబ్దం నాటి మాట!
ఇవాళ మనం 21వ శతాబ్దంలో- అంతరిక్ష యుగంలో వున్నాం. వరశుల్క సమస్యే గాని, కన్యాశుల్క సమస్య లేదు. బాల్య వివాహాలు మాత్రం చెప్పుకొనదగ్గ సంఖ్యలో జరుగుతూ వుండడం- అందునా ఆంధ్రదేశం నడిబొడ్డులో జరుగుతూ వుండడం గురించి తెలుసుకుంటే విషాదమూ, ఆశ్చర్యమూ కలుగుతాయి. 19వ శతాబ్దిలోనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్తలు బాల వితంతువుల సమస్యలపై దృష్టి సారించి, బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేశారు. మరి నేటి ఆధునిక కాలంలో ఈ దురాచారాన్ని ఎవరు రూపుమాపుతారు? పిల్లల హక్కులకు సంబంధించిన జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం- మనదేశంలోని బాలబాలికల్లో 47 శాతం మందికి యుక్తవయసు రాకుండానే వివాహాలు జరుగుతున్నాయి. ‘బాల్య వివాహం’ అంటే మైనారిటీ తీరకుండానే (18ఏళ్లలోపు) జరిగిన వివాహాలని అర్థం. యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు నిండకుండా పెళ్లి చేయడం చట్టవిరుద్ధం.
ప్రపంచం మొత్తమీద అత్యధిక బాల్య వివాహాలు జరిగే దేశాల్లో నైజీరియా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ 11వ స్థానంలో వుంది. మన దేశంలో చిన్నారి పెళ్లికూతుళ్లు రాజస్థాన్‌లో అధికంగా వున్నారు. 2011 నాటి గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లో మొత్తం బాలికల్లో 15.88 శాతం బాలికా వధువులు వున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చూస్తే బాలికా వధువులు ఉత్తరప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సమస్య మిగతా రాష్ట్రాల్లోనూ ఉంది. శతశాతం అక్షరాస్యత సాధించామని ఘనంగా చెప్పుకునే కేరళలోనూ 2011 సంవత్సరంలో 30,000 బాల్య వివాహాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ బాల్యవివాహాల జోరు కనిపిస్తూనే ఉంది. అక్షరజ్ఞానం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో గత అయిదేళ్లలో 20,589 మంది బాలికా వధువులకు వివాహాలు జరిగాయి. ఇది ఆ జిల్లాలోని మొత్తం బాలికల సంఖ్యలో 3.3 శాతం. ఈ విషయంలో విశాఖ జిల్లా రెండో స్థానంలో వుంది. పట్టణ ప్రాంతాలలో కన్నా గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి.
బాల్య వివాహాలకు కారణాలేమిటని విశే్లషిస్తే మనకు ప్రధానంగా- సంప్రదాయం, ఆడపిల్లలు చదువు ఆపేయడం వంటివి కనిపిస్తాయి. బాలికల విద్యపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధలేకపోవడం. పాఠశాలల్లో చేరినా వివిధ కారణాలతో చదువు ముగించడం, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివించడానికి చాలా కుటుంబాల్లో ఆర్థిక స్థోమత లేకపోవడం, బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన లేకపోవడం మొదలైన కారణాలు కనిపిస్తాయి. మన సంప్రదాయం ప్రకారం ఎనిమిదేళ్లు వచ్చిన ఆడపిల్ల ‘కన్య’ అవుతుంది. ఆమెను ఎవరో ఒక మగవాడికి ఇచ్చి పెళ్లిచేస్తే ‘కన్యాదాన’ పుణ్యం లభిస్తుందని నమ్మకం. ‘మనవరాలి పెళ్లిచూచి చచ్చిపోదామని వుందం’టూ మూలకూర్చున్న ముసలమ్మల గోల వుండనే వుంది. ‘కన్యాదానం’ అనే మాటను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించేవారు. ‘కన్యాదానం అనే మాటకు అర్థం ఏమిటి? ఆడపిల్లలపై వారి కన్నతండ్రి ఎలాంటి హక్కుదారు కాదు, యజమాని కాడు. సంరక్షకుడు మాత్రమే. ఆడపిల్లల్ని ఇతరులకు దానం చేసే హక్కు లేదు.’ అన్నారు గాంధీజీ.
బాల్యవివాహాలకు కారణం బాలికల విద్య తక్కువగా వుండడం అని మొట్టమొదటిగా గ్రహించినవాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అతను ప్రతి ఇంటికీ వెళ్లి బాలికలను బడికి పంపించమని ప్రాధేయపడేవాడు. కళాశాల ఉపన్యాసకుడిగా పరిమితమైన ఆదాయం వున్నవాడే అయినా, తన ఖర్చులను తగ్గించుకుని బాలికా పాఠశాలలను స్థాపించాడు. ఆడపిల్లలకు ఇంగ్లీషు నేర్పించేది లేదని ఆనాటి తల్లిదండ్రులు అంటే- వారికి తన పాఠశాలల్లో సంస్కృతం నేర్పించేలా విద్యాసాగర్ కృషి చేశాడు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు నడచి రాలేని బాలికల కోసం పల్లకీలను ఏర్పాటు చేశాడు. ఆ పల్లకీ మీద- ‘మగ పిల్లల మీద చూపుతున్న శ్రద్ధే ఆడపిల్లల మీద కూడా చూపాలి. వాళ్లకు కూడా మగ పిల్లలతో సమానంగా చదువు చెప్పించాలి’ అనే అర్థంతో ఒక శ్లోకం కనిపించేది. ఇవాళ కార్పొరేట్ స్కూళ్లు భారీమొత్తంలో ఫీజులు గుంజుతూ మినీబస్సులు, వ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టే, ఆనాడు స్వంత ఖర్చుతో విద్యాసాగర్ పల్లకీలు పంపేవాడు. ఇవాళ విద్యాసాగర్‌లూ లేరు. పల్లకీల అవసరమూ లేదు. నేటి పాలకులు బాలికల విద్యాభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. బాల్య వివాహాలు తగ్గించడానికి, పెళ్లి వయసు వచ్చేదాకా బాలికల విద్యాభ్యాసం కొనసాగడానికి ప్రభుత్వాలు ‘కేరట్ అండ్ స్టిక్’ విధానాన్ని అమలుచేస్తున్నాయి. కొన్ని పథకాలు బాలికల విద్యకు ప్రోత్సాహకాలు ఇస్తుండగా, మరికొన్ని కార్యక్రమాలు బాల్య వివాహాలు జరిపించే వారిని శిక్షించడానికి నిర్దేశించినవి.
బాల్య వివాహం జరిగితే- బాలికలకు వచ్చే అనర్థాలు అన్నీయిన్నీ కావు. చిన్న వయస్సులోనే బాలికలు గర్భవతులైతే ప్రసూతి సమస్యలు ఎన్నో తలెత్తే అవకాశం వుంది. తల్లికి గాని, బిడ్డకు గాని అనారోగ్యం చెయ్యవచ్చు. మృతి చెందే సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే వుంటాయి. అయిదేళ్లలోపు మరణించే శిశువుల సంఖ్య అధికంగావున్న బీద దేశాలలో ఈ ధోరణి అత్యంత ప్రమాదకరం. ఆడపిల్లలను బడులకు పంపించి వివాహాన్ని వాయిదా వేయించడానికి కొన్ని పథకాలు వున్నాయి. హర్యానాలో అమలుజరుగుతున్న ‘అప్నీ బేటీ అప్నా ధన్’ వంటి పథకాలలో నమోదైన బాలికల తల్లిదండ్రులకు పొదుపుపత్రాలు ఇస్తారు. ఈ పథకం కింద బాలికలకు 18 ఏళ్లువచ్చేవరకు విధిగా బడికి పంపాలి. 18 ఏళ్లు వచ్చేవరకూ వారికి వివాహం చెయ్యకూడదు. ఈ రెండు నిబంధనల్లో దేనిని అతిక్రమించినా, పొదుపుపత్రం ద్వారా నగదు చెల్లింపు జరగదు. ఇట్లాంటి పలు పథకాలు ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అమలులోవున్నాయి. కానీ, గిరిజన ప్రాంతాలలో చెప్పుకొనదగ్గ ఫలితాలు రావడం లేదు. కొందరు సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరుపుకొని వివాహాలు వాయిదా వేసుకొంటున్నారు. కొన్నిచోట్ల బాలికలను బడికి పంపించినా హాజరు తక్కువగా వుండడమో, సరిగా చదవకపోవడమో వంటి సమస్యలున్నాయి.
2006లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారుల చొరవ ఫలితంగా 2,322 బాల్య వివాహాలు ఆగిపోయాయి. 25 మంది తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 2014-15లో అనంతపురం జిల్లాలో 28 బాల్య వివాహాలను అరికడితే, 2016-17 నాటికి అది 267గా వుంది. ఇలా ప్రతి జిల్లాలోనూ బాల్య వివాహాలను కొంతవరకూ అరికడుతున్నారు. కొన్ని సందర్భాల్లో శిక్షిస్తున్నారు. అయితే- ఈ ‘కేరట్ అండ్ స్టిక్’ విధానం ఆశించిన విధంగా విజయవంతం కావడానికి- పథకాలను అమలు చెయ్యడంలో అధికారుల్లో నిరాసక్తత, అవినీతి వంటివి ముఖ్యకారణాలు. పేదరికం అంతం కానిదే ఈ సమస్యకు ముగింపురాదు. పట్టణ ప్రాంతాల్లో మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో బాలికల విద్య గణనీయంగా పెరుగుతూండగా, వ్యవసాయ కుటుంబాలలో, పట్టణాలకు వలస వచ్చిన వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ సమస్య ఆందోళనకరంగా వుండడానికి కారణం పేదరికమే! 2016లో ‘యునిసెఫ్’ వెలువరించిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్- 2016’ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే- పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, ధనిక కుటుంబాల్లో కన్నా ఈ సమస్య అనేక రెట్లు అధికంగావున్నది’ అనేది విస్మరించరాని సత్యం.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969