మెయన్ ఫీచర్

మోదీ చికిత్సతో ఆర్థిక స్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతి తప్పుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా నడిపించేందుకు గత రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. విశృంఖలంగా పెరిగిపోతున్న అవినీతి, లెక్కకు అందని నల్లధనం, దేశ సరిహద్దులు దాటి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న జాతి సంపద, బ్యాంకింగ్ వ్యవస్థకు పోటీగా హవాలా వ్యాపారం, జాతి జీవనాడిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పెట్టుబడులు, దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే తీవ్రవాద సంస్థలకు భారీగా విరాళాలు, ఆర్థిక వ్యవస్థను బలహీనపరచే దుష్టబుద్ధితో పొరుగున ఉన్న శత్రుదేశాలు చెలామణీలోకి తెచ్చిన దొంగనోట్లు తదితర కారణాలతో దేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ బలహీనపడడం తెలిసిందే. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో సమాంతర ఆర్థికవ్యవస్థ అసలు వ్యవస్థను దాటిపోయింది. బ్యాంకుల్లో, ప్రభుత్వ ఖజానాల్లో ఉన్న డబ్బుకంటే అధిక రెట్లు డబ్బు సంపన్నుల బీరువాల్లో, పరుపుల కింద, బాత్రూముల్లో, గోడల్లో నిక్షిప్తమైపోయింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతలు స్వీకరించిన మోదీ ప్రభుత్వం తొలిరోజు నుంచే అవినీతి, నల్లధనంపై యుద్ధం ప్రకటించింది. 26 మే 2014న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఆ మరునాడే 27 మే 2014న నల్లధనం వెలికితీతపై ‘ప్రత్యేక నిఘా బృందం’ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పన్నులు ఎగ్గొట్టి- ఆ డబ్బును విదేశాల్లో దాచిపెట్టడం కొంతమంది వ్యక్తులకు, సంస్థలకు పరిపాటైంది. మరోవైపు అధికార యంథ్రాంగం కనుసన్నల్లో అవినీతి పెచ్చరిల్లింది. 2009లో ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రాం జెఠ్మలానీ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ న్యాయవాదులు సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ విదేశీ బ్యాంకుల్లో, స్వదేశంలో పేరుకున్న నల్లధనాన్ని వెలికితీసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వవల్సిందిగా కోరారు. భవిష్యత్తులో నల్లధనం ఉత్పత్తి జరగకుండా ఉండేలా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని కోరారు. 4 జూలై 2011న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేస్తూ నల్లధనం వెలికితీతకై ‘స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం’ (సిట్)ను నియమించమని అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. నాలుగేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ‘సిట్’ను నియమించకపోయినా, అధికారంలోకి వచ్చిన మర్నాడే మోదీ ప్రభుత్వం ఆ పనిని నెరవేర్చింది. దీంతో అవినీతి, నల్లధనంపై అధికారిక పోరు ప్రారంభమైంది.
కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం సాక్షిగా కొనసాగిన లక్షల కోట్ల రూపాయల బొగ్గు గనుల పంపిణీ కుంభకోణానికి స్వస్తిపలుకుతూ మోదీ ప్రభుత్వం 14 ఫిబ్రవరి 2015న బొగ్గు గనులను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించడం అవినీతి నిరోధక చర్యల్లో మరొక కీలక ఘట్టం. 2004-2009 మధ్యకాలంలో అత్యంత విలువైన బొగ్గు గనులను అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ తన అస్మదీయులకు ఇచ్చేసింది. దీంతో ప్రభుత్వానికి దాదాపు లక్షా 80వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. భాజపా దాఖలు చేసిన పిటిషన్‌తో సిబిఐ జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఊరూ పేరూ లేని కంపెనీలకు సైతం బొగ్గు గనులు ఇచ్చేశారు. ఆగస్టు 2014లో సుప్రీం కోర్టు 214 బొగ్గు గనుల పంపిణీని ఒకే ఆదేశంతో రద్దుచేసింది. మోదీ ప్రభుత్వం కొన్ని గనులను బహిరంగ వేలం వేయడం వల్ల ఇప్పటికే అయిదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
11 మే 2016న మారిషష్ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో ‘చట్టబద్ధమైన డబ్బు’గా మార్చే ప్రక్రియ ఆగిపోయింది. కొన్ని విదేశీ కంపెనీలు మారితోష్ ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతూంటాయి. మన దేశం దాటిపోయిన మన డబ్బే తిరిగి విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి దర్జాగా దేశంలోకి వస్తూండేది. దాదాపు 35 శాతం నల్లధనం ఇలా తిరిగి మన మార్కెట్‌లోకి ప్రవేశించేది. మోదీ ప్రభుత్వం చూపిన చొరవ, మారిషష్‌తో ఒప్పందం కారణంగా మూడు దశాబ్దాలపాటు అమలులో ఉన్న ఇండో-మారిషస్ డబుల్ టాక్సేషన్ అనాయిడెన్స్ అగ్రిమెంట్ (డిటిఎఎ) రద్దు అయింది. ఈ ఒప్పందాన్ని రద్దుచేయించడానికి గత ప్రభుత్వాలు సాహసించలేకపోయాయి. ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని హవాలా రూపంలో 2001-2011ల మధ్య 39 శాతం విదేశీ పెట్టుబడులు భారత్ చేరాయి. అతి చిన్న దేశమైన మారిషష్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఎలా పెట్టుబడి పెడుతున్నదన్న అనుమానం గత పాలకులకు ఎందుకు కలగలేదన్నది భేతాళ ప్రశ్న. మారిషష్‌లో ప్రతి ఇంట్లో ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటుంది. ఇంటికో లాయర్ ఉంటాడు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛ్‌ంజీని నిర్దేశించగలిగే దమ్ము ఒకప్పుడు మారిషష్‌కు ఉండేది. మోదీ ప్రభుత్వ చర్యతో హవాలా అవినీతి బాగోతం ఆగిపోయింది.
భారత ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే చర్యల్లో 5 సెప్టెంబర్ 2016న జి-20 వేదికపై మోదీ చేసిన ప్రకటన అత్యంత కీలకం. ఐరోపా ఖండంలోని వివిధ దేశాలతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని ‘టాక్స్ హెవెన్స్’ను అంతమొందించాలంటూ మోదీ సంచలనాత్మక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని నిర్మూలించాలంటే ‘టాక్స్ హెవెన్స్’ రద్దుతో పాటు ఆర్థిక నేరస్థులకు కఠిన శిక్షలు వేయాలని, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచాలంటూ మోదీ చేసిన ప్రకటనకు ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందించాయి. దృఢమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవినీతిని నిరోధంచడం, పన్నుల ఎగవేతను అరికట్టడం, నల్లధనాన్ని వెలికి తీయడం అత్యవసరం అని మన ప్రధాని చేసిన ప్రకటనతో జి-20 దేశాలు అంగీకరించాయి. అవినీతి,నల్లధనంతోపాటు తీవ్రవాద సంస్థలకు విరాళాలు అందకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు కలలో కూడా సాహసించని పనులను మోదీ ప్రభుత్వం అలవోకగా చేసేసింది. గత 18 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ళ మధ్య నలిగిపోతున్న ‘బినామీ వ్యవహారాల సవరణ చట్టా’న్ని ఆమోదింపచేసి గెజిట్‌లో ప్రకటించింది. ఈ చట్టాన్ని 18 ఏళ్ల క్రితం తీసుకువచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు నోటిఫై చేయలేదు. అవినీతి పరులు, నల్లకుబేరుల కొమ్ముకాసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయలేదు. మోదీ ప్రభుత్వం చేసిన కృషితో 1 నవంబర్ 2016 నుండి బినామీ వ్యవహారాల చట్టం అమలులోకి వచ్చింది. కొత్తగా సవరించిన చట్టం ప్రకారం బినామీ వ్యవహారాలను నిర్వహించే వారికి ఏడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. బినామీ దారుడి నుంచి ఆస్తులను అసలు యజమాని తిరిగి స్వాధీనపర్చుకోకుండా ఉండేలా నిబంధనలు విధించారు. ఆస్తులు బినామీదార్ల పేర్ల మీద ఉన్నాయని తేలితే ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వాటిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవచ్చు.
మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విప్లవాత్మకమైన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం 8 నవంబర్ 2016న తీసుకున్నది. వేయి, 500 రూపాయల నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలలో అత్యంత వివాదాస్పదమైనది కూడా. దేశంలో చెలామణిలో ఉన్న నగదులో 86 శాతం వాటా ఈ పెద్ద నోట్లదే. ప్రభుత్వ నిర్ణయంతో అవినీతి పరులు, నల్లధనం యజమానులు, హవాలా వ్యాపారస్తులు, తీవ్రవాద సంస్థలు, దొంగనోట్ల చలామణీదారులు ఒక్కసారిగా కుదేలు అయిపోయారనడంలో ఎటువంటి సందేహం లేదు. నగదు లభించక ప్రజలు కొన్ని ఇబ్బందులు పడ్డా, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. యుద్ధ సహాయాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినపుడు మినహా సాధారణ పరిస్థితుల్లో ప్రజలు ఇలా ఇష్టపూర్వకంగా ఇబ్బందులు పడడం ప్రపంచంలోనే అరుదైన సంఘటన. పెద్దనోట్ల రద్దుతో ఇనుప బీరువాల్లో మూలుగుతున్న 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి పడ్డాయి. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడడం కారణంగా ప్రజల జీవనోపాధి మెరుగుపరచడానికి, సంక్షేమ పథకాలు భారీ ఎత్తున నిర్వహించడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ పరంపరలో 22 నవంబర్ 2016న అన్ని బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించేలా భారత్- స్విట్జర్లాండ్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మరొక కీలక ఘట్టం. ఈ ఒప్పందం ప్రకారం 2019 నుంచి ఏ వ్యక్తికానీ, సంస్థ కానీ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దొంగతనంగా డబ్బు దాచుకోవడం సాధ్యం కాదు. ఈ ఒప్పందం ప్రకారం ఎవరు ఎంత మొత్తాన్ని ఏ బ్యాంక్ ఖాతాలో జమ చేశారన్న వివరాలను ఎప్పటికప్పుడు స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందచేస్తుంది.
2 డిసెంబర్ 2016న ప్రభుత్వం ప్రకటించిన ‘ఐచ్ఛిక ఆదాయ వివరాల ప్రకటన’ పథకం కింద దాదాపు 64,200 మంది సుమారు 65వేల కోట్ల రూపాయలు బయటపెట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు 29వేల కోట్ల ఆదాయం లభించింది. 30 డసెంబర్ 2016న భారత్, సింగపూర్‌ల మద్య జరిగిన ఒప్పందం కారణంగా సింగపూర్ మీదుగా నల్లధనం భారత్‌లోకి చేరడం ఆగిపోయింది. 2016లో మారిషష్, సైప్రస్, సింగపూర్‌లతో ఒప్పందాలను కుదుర్చుకుని భారత్ అనేక చట్టపరమైన అడ్డంకులను అధిగమించగలిగింది. పెద్దనోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేశారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు ఒక్కొక్క ఖాతాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులు, ఆదాయం మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించి వీటి మధ్యన తేడాలు ఎందుకు వచ్చాయో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిగా నోటీసులు జారీచేస్తున్నారు. ఒకవేళ ప్రకటించిన సొమ్ముకు సరైన ఆధారాలను చూపని పక్షంలో శిక్షలు విధించే అవకాశం ఉంది. అవినీతి పై దాడుల పరిధులను మరింత విస్తృతపరుస్తూ మోదీ ప్రభుత్వం గత నెల 1న బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు అవినీతిపరుల ద్వారా, హవాలా ద్వారా అందుతున్నాయన్న ఆ వాదనలను నిలువరించేందుకు- రెండు వేల రూపాయల పైన వచ్చే విరాళం వివరాలను ఆయా పార్టీలు ప్రకటించాలంటూ నిబంధన విధించారు. గతంలో ఈ పరిధి 20వేల రూపాయలు వరకూ ఉండేది.
అవినీతి నిరోధానికి, నల్లధనం వెలికితీతకు చర్యలు చేపట్టడం లేదంటూ విమర్శకులు చేస్తున్న ఆరోపణలకు మోదీ ప్రభుత్వం ఆచరణలో సమాధానం చెబుతున్నది.అవినీతిపై పోరాటం చేస్తున్న మోదీ ప్రభుత్వం పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ముందుకు పోతున్నది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ప్రారంభించిన ‘జన్‌ధన్ యోజన’ అద్నుత ఫలితాలు ఇచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న దాదాపు 25 కోట్ల మంది ఇప్పుడు ఖాతాలు తెర్చుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇపుడు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి. దళారీ వ్యవస్థ తగ్గుతోంది. దీనివల్ల ప్రభుత్వాన్ని కూడా 46వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి.
మన దేశంలో అవినీతి నల్లధనంపై ఇంత పెద్దఎత్తున పోరాటం ఇంతవరకు జరగలేదు. పేదరికం నిర్మూలన కోసం నిబద్ధతతో ఇన్ని ప్రణాళికలూ రచింపబడలేదు. వీటి పర్యవసానమే 2017 బడ్జెట్‌ను ప్రజలు ఆమోదించడం. ఈ పరంపర ఇలాగే కొనసాగితే అనతి కాలంలోనే భారత్ అగ్రరాజ్యంగా మారుతోందనడంలో సందేహం లేదు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113