మెయిన్ ఫీచర్

ఏది ప్రయోగం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా హీరోల నుంచి కొద్దికాలంగా కొత్తగా వినిపిస్తోన్న పదం -ప్రయోగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇది -పరిశ్రమకు వైరస్‌లా పట్టింది. హీరోలెవరైనా కావొచ్చు. కథలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కామన్‌గా వినిపిస్తోన్న పాస్‌వర్డ్ -ప్రయోగం. అంటే -తెలుగు పరిశ్రమలో ఇప్పుడే ప్రయోగాలు
మొదలయ్యాయన్నంత బిల్డప్. ఇంతకుముందెన్నడూ ఎవ్వరూ ఇలాంటి సాహసాలు
చేయలేదన్నంత -హీరోయిజం. ఇంతకుమించి ప్రచారంలో
‘నిజమైన ప్రయోగం’
కనిపించదు.
కొత్తగా ఆలోచిస్తున్నా. కొత్త కథల్ని ఎంచుకుంటున్నా. అందుకిది సరైన టైం. ఇంతదూరం ప్రయాణించిన తరువాత -ఇంకా ట్రెండ్ అనో, ఇమేజ్ చట్రాన్నో చూసుకుంటే కుదరదు. అందుకే ప్రయోగాల వైపే నా చూపు.
దాదాపు -తొమ్మిది పదుల సినిమాలు దాటిన తరువాత కింగ్ నాగార్జునకు వచ్చిన కొంగొత్త ఆలోచన ఇది. నాగ్ జనరేషన్ స్టార్ హీరోలెవరూ చేయని జోనర్ చేయబోతూ చెప్పిన మాటలివి. ఆ సినిమా.. రాజగారి గది -2.
‘తెలుగు సినిమా కమర్షియల్ చట్రంలో ఇరుక్కుంది. దాన్ని చేధిస్తూ కొత్త హీరోలు సరికొత్త కథలు ఎంచుకుంటున్నారు’ -అంటూ ఒక కథనం కళ్లముందుకొస్తుంది. ‘అంచనాల లెక్కలు, ఇమేజ్ ఈక్వేషన్లు పక్కనపెట్టేసి అగ్రహీరోలంతా ‘ప్రయోగ’శాలల్లో కొత్తదారులు కనిపెడుతున్నారు’ -అంటూ మరో స్టోరీ చెవుల్లోకి దూరిపోతుంది. నిర్మాతలు ధైర్యంగా ముందుకొచ్చేస్తున్నారని ఒక కత. అభిమానులు ఆస్వాదించేస్తున్నారంటూ ఇంకో కితకిత. వీటన్నింటినీ చూసి, విని, ఆస్వాదించేసి -మనం మురిసిపోవాలి. ఫార్మాట్‌ను వదిలేసి ప్రయోగాల బాట పట్టేశామంటూ చంకలు కొట్టేసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ వాతావరణం చూస్తుంటే అదే అనిపిస్తుంది. అనుమానం పుట్టుకొస్తుంది. అది భయంగామారి -‘ఈ ప్రయోగాలు ఎలాంటి ఫలితాలిస్తాయో’నన్న ఆందోళన కలుగుతుంది.
***
మొన్నటికి మొన్న..
‘ప్రయోగాలు చేయాలన్న ఆలోచన నాకూ ఉంది. కాకపోతే -్ఫ్యన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోనన్న ఆలోచన. నిర్మాత ఏమైపోతాడోనన్న భయం. అందుకే -అలాంటి కథల జోలికి పోలేను’ -అంటాడు నాలుగైదు సినిమాల అనుభవం కూడా లేని ఓ కుర్ర హీరో.
‘రొటీన్ కథలనే ఎంచుకోక తప్పదు. ఎందుకంటే -నన్ను అలాగే చూడ్డానికి అలావాటుపడ్డారు ప్రేక్షకులు. అలాంటి పాత్రల్నే ఆశిస్తున్నారు అభిమానులు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే -్ఫర్మాట్‌కు ఫిక్సవుతున్నా. లేదంటే -ప్రయోగాలకు వెనుకాడేవాడిని కాదు’ -అంటాడు ఇంకో సీనియర్ హీరో. తెలుగు సినీ పరిశ్రమలో చాలాకాలంపాటు వినిపించిన రొటీన్ డైలాగులివి. ఆడియన్స్ అలవాటుపడిపోయారు కూడా. సడెన్‌గా వర్షన్ మార్చి హీరోలు చెప్తున్న ‘ప్రయోగాల’ డైలాగులు విని విస్తుపోతున్నారు. తెలుగు పరిశ్రమ ఎటుపొతోందని కంగారుపడుతున్నారు.
తాజాగా...
‘మారుతోన్న ట్రెండ్‌కు అనుగుణంగా మనమూ మారాలి. ప్రయత్నిస్తే పోయేదేముంటుంది? మహా అయితే ప్రయోగం చేశాడన్న కీర్తి తప్ప! అందుకే -కొత్త కథలు వెతుకుతున్నా. కొత్తతరహా పాత్ర చేయాలని తహతహలాడుతున్నా. పూర్తిగాకాకున్నా -్ఫ్యన్స్‌ను సంతృప్తిపరుస్తూనే కొత్తగా కనిపించాలని కృషిచేస్తున్నా’. ఇవీ ఫ్రెషర్స్, సీనియర్ల నుంచి వినిపిస్తున్న డైలాగులు.
***
నిజానికి తెలుగు సినిమా ‘ప్రయోగాల’ మాటెప్పుడో మర్చిపోయింది. కాదు, వదిలిపెట్టేసింది. ఆరు పాటలు మూడు ఫైట్లకు బదులు మూడు పాటలు ఆరు ఫైట్లు పెట్టుకోవడమే ప్రయోగమనుకునే స్థాయికి వచ్చేసింది. ఇంట్రొవెల్ బ్యాంగ్, ట్విస్టెడ్ క్లైమాక్స్ ఎలాగూ ఉండితీరాల్సినవే. ఫార్ములాను తిరగ మరగ చేయడమే ప్రయోగం అనుకుంటున్నారు. మేకోవరే ప్రయోగమని ఒకరంటుంటే, ప్రతినాయక నీడ చూపించడమే ప్రయోగాత్మకమని ఇంకొకరు అనేస్తున్నారు. ఇవే కొత్త కథలంటూ ప్రచారం చేస్తుంటే -నిజమేనేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి ప్రేక్షకుడికీ వచ్చేసింది.
***
అటు మళయాలం, ఇటు హిందీలో ఈమధ్య అంధుడి పాత్రలో ఇద్దరు హీరోలు కనిపించారు. ఒకరు విలక్షణ నటుడు మోహన్‌లాల్ (ఓప్పం). ఇంకొకరు క్రిష్ సిరీస్ హీరో హృతిక్ రోషన్ (కాబిల్). పక్షవాతానికి గురైన వ్యక్తిగా, జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిగా ఇప్పటికే ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించిన మోహన్‌లాల్ -ఓప్పంలో అంధుడి పాత్రనూ ప్రయోగమని ఎక్కడా ప్రస్తావించలేదు. బుద్ధిమాంద్యమున్న వ్యక్తిగా, అచేతనానికి గురైనవాడిగా పాత్రలు పోషించి మెప్పించిన హృతిక్ కూడా కాబిల్ పాత్రను ప్రయోగమనలేదు. ఆ పాత్ర కోసం తపన పడ్డారు తప్ప, ప్రయోగమంటూ ప్రచారం సంపాదించలేదు. ఈ పాత్రలు చేయడానికి ఇద్దరూ వాళ్లవాళ్ల స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టిన వాళ్లే.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే..
ట్రెండ్‌ని, ఇమేజ్ చట్రాన్ని వదిలేసి కొత్తతరహా పాత్రలు చేస్తానని నాగ్ ప్రకటించటం హర్షించదగ్గ అంశమే. అందుకు -కొత్తకాలంగా నాగ్ ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలను ప్రస్తావించుకోవచ్చు. ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌లో ‘మనం’, క్లాసిక్‌లైన్‌లో ‘ఊపిరి’, కమర్షియల్ పాయింట్‌లో ‘సోగ్గాడే చిన్నానాయనా’, తాజాగా హారర్ జోనర్‌లో ‘రాజుగారి గది -2’. తరువాత ‘బంగార్రాజు’ కథనే సినిమా చేయాలన్న తలంపుతో ఉండటం. ఈ ట్రాక్ మీదకు మిగిలిన హీరోలూ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమధ్యే పట్టాలెక్కిన హీరో రవితేజ సినిమా -రాజా ది గ్రేట్. ఇందులో మాస్ మహారాజా అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. సుకుమార్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. అందులో చెర్రీ వినికిడి సమస్యవున్న పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. హీరోకి యాంటీ షేడ్‌లో ‘టెంపర్’, డిఫరెంట్ మేకోవర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ సమాజ వినాశకులపై పగబట్టిన ప్రకృతి ప్రేమికుడిగా ‘జనతా గ్యారేజ్’ సినిమాలు చేసిన ఎన్టీఆర్.. దర్శకుడు బాబితో కలిసి డిఫరెంట్ ట్రాక్‌తో మరో చేయబోతున్నాడని గట్టిగా వినిపిస్తోంది. డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఎన్టీఆర్, ఈసారి త్రిపాత్రాభినయాన్ని ప్రదర్శించనున్నాడని అంటున్నారు. అందులో ఒక పాత్ర పూర్తిగా విలనిజాన్ని చూపించనుందని టాక్. వయసుతగ్గ పాత్రలో ‘దృశ్యం’తో మెప్పించిన వెంకటేష్ సైతం, ఈసారి ‘గురు’ హోదాలో డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. బాక్సింగ్ కోచ్‌గా తనదైన స్టయిల్‌తో మెప్పించగలనన్న నమ్మకంతో ఉన్నాడని అంటున్నారు. ఇక్కడ ప్రస్తావించుకున్న ప్రాజెక్టులన్నీ ‘ప్రయోగాలే’నని గట్టిగా చెప్పలేని పిరిస్థితి. ఇది ‘ప్రయోగాత్మక పాత్ర’ అని గట్టిగా ప్రచారం చేసుకుంటే -కమర్షియల్‌గా ప్రాజెక్టు గ్రాఫ్ కిందికి దిగిపోతుందన్న భయాలు లేకపోలేదు. అందుకే -కమర్షియల్ కోణంలో చెప్పే వైవిధ్యమైన కథలని అంటూనే ‘ప్రయోగాత్మక పాత్ర’ అంటూ టాగ్‌లైన్ తగిలిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో రాబోయే సినిమాలన్నీ ఇదేతరహా ట్రాక్‌మీద వస్తున్న చిత్రాలుగా చెప్పుకుంటున్నా -మళ్లీ ఇమేజ్ వదిలిపెట్టడానికి తెలుగు హీరోలు మాత్రం సిద్ధంగా లేరు. ‘ప్రయోగాలు చేస్తున్నాం’ అని గట్టిగా ప్రకటిస్తూనే ‘కమర్షియల్ యాంగిల్‌లో’ అనడాన్ని చూస్తుంటే ‘అశ్వాత్థామ అతః.. కుంజరహ’ అన్న కురుక్షేత్రం డైలాగ్ గుర్తుకొస్తుంది.
ఏది ప్రయోగం?
టాలీవుడ్ స్క్రీన్‌మీద స్టార్ హీరోలు ప్రయోగాత్మక పాత్రలు చేయడం ఇప్పుడే మొదలైంది కాదు. స్టార్ హోదాను పట్టించుకోకుండా -కధానుగుణంగా డీగ్లామర్ పాత్రలు పోషించి మెప్పించడం 50వ దశకం నుంచే ఆరంభమైంది. నటనలో సినీ ప్రపంచానికి పాఠాలు చెప్పగలిగే స్థాయిలో ఉండికూడా -అనూహ్యమైన పాత్రల్ని పోషించి ‘ఇదీ ప్రయోగం అంటే’ అనిపించుకున్న ముందుతరం ఉంది. అలాగని వాళ్లెప్పుడూ ఆయా పాత్రల్ని ప్రయోగాలుగా చూడలేదు. హీరో ఇమేజ్ గురించి ఆలోచించలేదు. కథానుగుణమైన పాత్రను పోషించి మెప్పించి ‘హీరో’ నుంచి ‘స్టార్’ హోదాకు ఎదిగారు.
తెలుగు సినీలోకంలో దిగ్గజ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లనే తీసుకుందాం. ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రంలో వెర్రిబాగులోడి పాత్రలో ఎన్టీఆర్‌ని ఎలామర్చిపోతాం. ‘రాజుపేద’లో బిచ్చగాడిలా, ‘చిరంజీవులు’లో గుడ్డివాడిగా, ‘గుడిగంటలు’లో కుంటివాడిగా, ‘తిక్కశంకరయ్య’లో పిచ్చోడిగా, ‘కన్యాశుల్కం’ చిత్రంలో కపటి పాత్రలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన సన్నివేశాలు మస్తిష్కం నుంచి ఎలా చెరిగిపోతాయి. ‘పాండురంగ మహత్మ్యం’లోని ఓ పాటలో దేకుతూ కనిపిస్తాడు. ‘కలిసివుంటే కలదు సుఖం’లో సినిమా మొత్తం పక్షవాతం వచ్చినవాడి పాత్రలో మెప్పించాడు. కుటుంబం, బంధువర్గం, చివరకు ఊరివాళ్లనుంచి ఛీత్కారాలు ఎదుర్కొనే పాత్రలో కనిపించి కంటనీరు పెట్టిస్తాడు. అదీ ప్రయోగం అంటే. ‘నర్తనశాల’ చిత్రంలో పేడిపాత్రలో బృహన్నలగా కనిపించడం కంటే గొప్ప ప్రయోగం ఏముంటుంది? ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో ప్రతినాయక పాత్రను ‘హీరో’స్థాయికి తీసుకెళ్లడం కంటే ఎక్కువేముంటుంది?
ఇక -‘అర్దాంగి’లో మానసిక వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తాడు ఏఎన్నార్. ‘బాటసారి’, ‘పునర్జన్మ’ చిత్రాల్లో అర్థంకాని వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడు. ‘ఆరాధన’లో అంధుడిగా, ‘నవరాత్రి’లో తొమ్మిది పాత్రలు పోషిస్తూ ఒక పాత్రలో కుష్ఠువ్యాధితో కనిపిస్తాడు. సూపర్‌స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్‌బాబు సైతం -ప్రతినాయక పాత్రలు, హీరో ఇమేజ్‌కు సూట్‌కాని పాత్రలు చేసినోళ్లే. అవీ ప్రయోగాలంటే. చిత్రం ఏంటంటే -ఆ హీరోలెవరూ ‘ప్రయోగం’ పదాన్ని ఉచ్చరించలేదు. హీరోయిజాన్ని ఆపాదిస్తూ ఆ పాత్రలను ప్రస్తావించలేదు. ఆ తరం నటులు పోషించిన పాత్రల్లో ఒకటోవంతు పాత్రల్ని చేయకున్నా -మన హీరోలు మాత్రం ‘ప్రయోగం’ పదాన్ని ఊదరగొడుతూ హీరోయిజాన్ని ప్రదర్శించటం హాస్యాస్పదమే.

- ప్రవవి