మెయన్ ఫీచర్

ఉసురు తీస్తున్న ‘ఉదారవాద’ డ్రైవింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోటారు వాహనాలు నడిపేవారు ముఖ్యంగా యువకులు ఇతరుల భద్రతను , చివరకు తమ భద్రతను గాని లక్ష్యపెట్టని విధంగా ఎందుకు డ్రైవింగ్ చేస్తుంటారు? ప్రమాదాలు జరగటం, వాహనాలు దెబ్బతినటం, ప్రాణాలు పోవటం వంటివి కళ్లఎదుట కనిపిస్తున్నా వారి తీరు ఎందుకు మారటం లేదు? రోడ్డుపై ఉన్నది స్ర్తిలు, పిల్లలు, వృద్ధులు అయినాసరే లెక్కచేయక యథేచ్ఛగా బండ్లు నడపటం, వారు బెదిరిపోతే ఆనందించటం వంటి లక్షణాలు యువకుల్లో ఎందుకు వస్తున్నాయి?
కొన్ని దశాబ్దాల క్రితం రోడ్డు ప్రమాదాలు అనగానే సాధారణంగా లారీ ప్రమాదాలు అని స్ఫురణకు వచ్చేది. లారీ డ్రైవర్లు సరకులను త్వరగా చేరవేసేందుకు వేగంగా వెళ్లటం, అలసట కారణంగా మద్యం సేవించటం, ఆరోజుల్లో రాత్రుళ్లు లైట్లు సరిగా ఉండకపోవటం, లారీలు భారీ వాహనాలు అయినందున ఒక్కోసారి నియంత్రించ లేకపోవటం, అప్పట్లో టెక్నాలజీ పాతది కావటం, సర్వీసింగ్ పట్ల ఉపేక్ష, రోడ్ల స్థాయి అధ్వానం కావటం వంటి కారణాలను ప్రమాదాలకు మూలంగా చూపుతుండేవారు. ఇతర వాహనాల ప్రమాదాలు లారీలతో పోల్చితే తక్కువ. కాలక్రమేణా ఇతర వాహనాల ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. అందుకు కారణాలు అనేకం. వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోవటం, త్వరగా దూసుకుపోవాలనుకోవటం, రోడ్లుసరిగా ఉండకపోవటం, వాహనాల కొత్త టెక్నాలజీ మితిమీరిన వేగానికి అనుకూలం కావటం, జీవితంలో వేగం పెరిగినందున దాని ప్రభావం డ్రైవింగ్‌పై పడడం వంటివి జరుగుతున్నాయి.
కానీ, ఇక్కడ అర్థం కానిది ఒకటున్నది. భారత్ ఒక వర్ధమాన దేశం. వలస పాలన నుంచి బయట పడినటువంటిది. మరి ఇదే విధంగా వర్ధమాన దేశాలు, మాజీ వలస దేశాలు అయిన ఇతరచోట్ల డ్రైవింగ్‌లో కనిపించే క్రమశిక్షణ ఇక్కడ ఎందుకు ఉండటం లేదు? అక్కడ అంతా నూటికినూరు శాతం సవ్యంగా ఉంటుందని కాదు. మనతో పోల్చినపుడు ట్రాఫిక్ నియమాలను పాటించటం గాని, రోడ్లపై మనుషుల పట్ల బాధ్యతగా, మానవతాయుతంగా ప్రవర్తించటం గాని చాలా మెరుగు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించరు. ముఖ్యమైన కూడలి అయినాసరే అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోయినా, జంక్షన్ కన్న కొన్ని మీటర్ల ముందే వాహనాలను తమంతతాము వేగాన్ని బాగా తగ్గిస్తారు. పాదచారులు రోడ్డుదాటేందుకు వేచి చూస్తుంటే వాహనాలను పూర్తిగా ఆపివేస్తారు. కూడలి వద్ద జీబ్రా క్రాసింగ్ ఉండటం వల్లనే కాదు. ఇతరత్రా కూడా ఎక్కడైనాసరే పాదచారులు వేచి ఉంటే, జీబ్రా క్రాసింగ్ గుర్తులు లేకపోయినా సరే ఆపుతారు. కూడళ్లవద్దనైతే వేగం బాగా తగ్గించి, అన్నివైపులా గమనిస్తూ జాగ్రత్తగా వాహద చోదకులు ముందుకు వెళతారు. గమనించదగిన మరొక విశేషమేమంటే, ఎన్నోచోట్ల సిగ్నల్స్ లేకపోవటమే కాదు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఉండరు. ఇక్కడ ఒక ఆలోచన కలగవచ్చు. అంతటా నిఘా కెమెరాలు ఉంటాయని, అందుకు డ్రైవర్లు భయపడి జాగ్రత్తగా ఉంటారని, పోలీసులు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తారని. ఇది కొన్నిచోట్ల నిజమైనా అంతటా కాదు. ట్రాఫిక్ క్రమశిక్షణ, మిగతా మనుషుల పట్ల మానవత్వం అనే రెండూ ఒక సంస్కృతిగా మారినట్లు అనేకచోట్ల మన దృష్టికి వస్తుంది. యువకులు వాహనాలు నడిపినా ఇలాగే ప్రవర్తిస్తారు.
ఏదో ఒకటిరెండుచోట్ల గాక, పలు వర్ధమాన దేశాలలో ఇది గమనించిన మీదట మనదగ్గరి పరిస్థితి పట్ల విచారం కలగక మానదు. ఆసియాలో, ఆఫ్రికాలో కూడా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి మనకు. ముఖ్యంగా ఆఫ్రికా అంటే మనకు చాలా చిన్నచూపు. వారు చదువు, సంస్కారాలు లేని అనాగరికులని పాశ్చాత్యులు చేసే దుష్ప్రచారాలు మన మనస్సులకు బాగా ఎక్కాయి. ప్రత్యక్ష పరిజ్ఞానం గలవారు చాలా తక్కువ గనుక అవే దురభిప్రాయాలు చెలామణిలో ఉంటాయి. మనతో పోల్చితే అక్కడ చదువులు తక్కువన్నది నిజమే, సంస్కారం చాలా ఎక్కువ. పట్టణాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ వారి ట్రాఫిక్ క్రమశిక్షణను గమనిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. హైవేల మీదుగా గ్రామాలను దాటుతూ ఎంత దూరమైనా వెళ్లి చూడండి. రోడ్లను అతిక్రమించటం ఆఫ్రికన్ల వాహనాలు గాని, పాదచారులు కాని చేయరు. తమ పశువులను దారిపైకి రానివ్వరు. ఆఫ్రికన్ల నుంచి మనం నేర్చుకోవలసిన ట్రాఫిక్ క్రమశిక్షణ, మానవత్వం చాలా ఉంది. వాహనదారులు ఇతర మనుషులపై కేకలు వేసి దుర్భాషలాడటం, భయపెట్టటం కన్పించదు. ఇదంతా ఆసియా, ఆఫ్రికాల్లోని పలు దేశాలలో గమనించిన స్థితి.
ఇందుకు భిన్నమైన స్థితి ఇక్కడ ఎందుకున్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ఎంతోమందిని కదిలించినా ఏమీ తెలియరాలేదు. అట్లా కదిలించిన వారిలో అన్ని ఖండాలలో పదులకొద్దీ దేశాలు చూసినవారు, ప్రొఫెసర్లు, సామాజిక శాస్తవ్రేత్తలు, నిపుణులు ఉన్నారు. కానీ ఇది అర్థం చేసుకోవలసిన ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇపుడిక్కడ ట్రక్కులు, బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు అన్నీ ప్రమాదకరంగా నడుస్తుంటాయి. ఒకప్పుడు ఆర్‌టిసి బస్సులంటే భద్రతకు మారుపేరుగా ఉండేవి. డ్రైవర్లు బహుజాగ్రత్తగా నడుపుతూ ఇతర వాహనదారులన్నా, పాదచారులన్నా, బస్సులలో ఎక్కేదిగే వారన్నా ఎంతో మర్యాదగా ఉండేవారు. ఆరోజులు పోయాయి. వారు ఇతరులతో సమానమయ్యారు. పాదచారులు రోడ్డు దాటాలంటే అది జీబ్రాక్రాసింగ్‌ల వద్దనైనా, ఒకరోఇద్దరోగాక పలువురు అయినాసరే ప్రాణాలు అరచేత పెట్టుకోవలసిందే. ఎందుకిట్లా?
డ్రైవర్లకు స్వతహాగా క్రమశిక్షణ, మానవత్వం లేనపుడు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించినట్లయితే దాని ప్రభావం తగినంత ఉంటుందన్నది నిజమే. అది ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక మేరకు రుజువైంది కూడా. సిగ్నల్స్ వద్ద జంప్ చేయటం, జిగ్‌జాగ్ డ్రైవింగ్‌లు, మితిమీరిన వేగం, రాంగ్ పార్కింగుల వంటివి తగ్గాయి. కాని నిఘా పెరిగినపుడు తగ్గి, నిఘా తగ్గినప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా ఈ దశే సాగుతున్నది గాని వాహనదారులలో ఆ మార్పు అన్నది ఒక సంస్కృతిగా పెంపొందటం లేదు. పలు వర్ధమాన దేశాలలో మనకన్న చిన్నవి, ఆర్థికంగా వెనుకబడినవి కూడా అయిన దేశాలలో ఈ సంస్కృతి వచ్చినపుడు, మనదగ్గర భయం ఉన్నపుడు మాత్రమే మార్పు కనిపించటం, అది తాత్కాలికం కావటమన్నది గమనించవలసిన విషయం. ఆ సంస్కృతి రావటం ఎట్లా? ఎప్పటికి వచ్చేను? సమీప భవిష్యత్తులో వస్తుందా? లేదా? అనే ప్రశ్నలను అట్లుంచితే, ప్రస్తుత దశకు సంబంధించి పోలీస్ శాఖ వైఫల్యం కనిపిస్తుంది. పెద్ద ప్రమాదాలు, వరుస ప్రమాదాలు జరిగినపుడో, కోర్టులు నిలదీసినపుడో కఠినంగా వ్యవహరించటం, కొన్నాళ్లకు అశ్రద్ధ చూపటం వారికి మామూలైపోయింది. గతంలో ఇట్లా ఉండేది. ఇపుడు కూడా అంతే జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేరాల విషయంలో కట్టుదిట్టాలు బాగానే జరుగుతున్నాయి. కాని ట్రాఫిక్ నియమాలకు కట్టుబడేట్లు చూడటం ‘ముందుకు- వెనక్కు’ అన్నట్లుగా ఉంది. అందుకు కారణాలు ఏవైనా అయి ఉండవచ్చుగాక. కాని కావలసింది ఫలితాలు. కఠినమైన వ్యవహరణ పట్టువిడుపులు లేకుండా దీర్ఘకాలం పాటు కొనసాగితే అపుడది నెమ్మదిగా క్రమశిక్షణా సంస్కృతిగా మారుతుంది- పోలీసులకు, డ్రైవర్లకు కూడా. సంస్కృతి ప్రజలకు సహజమైన నాగరికతలో భాగంగా అలవడితే అంతకన్న ఉత్తమం ఉండదు. అట్లా కానపుడు కఠిన చర్యల ద్వారా అలవరచటం అవసరం. ఇంతకూ అసలు ప్రశ్న అట్లానే ఉండిపోయింది. అనేక ఇతర వర్ధమాన దేశాలలో ఈ సంస్కృతి సహజమైన రీతిలో కలుగుతున్నపుడు మనవద్ద ఎందుకు జరగదు? ఇది ఆలోచించవలసిన విషయమే. కొన్ని పరిస్థితులు ఇందుకు మూలమవుతున్నాయేమో చూడవలసి ఉంది. పైన పేర్కొన్న తరగతిలోకి వచ్చే ఇతర దేశాలకన్న మనవద్ద ఆర్థికాభివృద్ధివేగం ఎక్కువగా ఉంది. ఆ వేగంలో భాగమవుతున్న జనసంఖ్య ఇతర దేశాల సంఖ్యలకన్న చాలా ఎక్కువ. ఆర్థికాభివృద్ధి పరిధి ఎక్కువ. ఈ మూడు విధాలైన ఆధిక్యాల వల్ల జీవితాలలో వేగం గణనీయంగా పెరుగుతున్నది. ఈ నాలుగు కూడా ‘ఆర్థికం’ అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అదే అంశం జీవితాలను, ఆలోచనలను, ప్రవర్తనల తీరును, సంస్కృతిని శాసిస్తున్నది. రూపుదిద్దుతున్నది. ఇంతకన్న గమనించదగిన విషయం ఒకటుంది. పైన పేర్కొన్న ఆర్థికాంశాలు సరేసరి కాగా, వాటిని సమతులనం చేయగలవి ఏవీ సామాజిక పార్శ్వం నుంచి జరగటం లేదు. ఆ పని ఎవరూ చేయటం లేదు. విద్యాపరంగా కాని, కుటుంబపరంగా, సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా కాని. ఈ విషయంలో ప్రభుత్వపరంగా చేయగలది కూడా కొంత ఉంటుంది. ఒక ఆలోచనతో, పద్ధతితో ఇవన్నీ జరిగినట్లయితే పైన అనుకున్న సమతులనానికి అవకాశం ఉంటుంది. అందుకు ఆరంభం జరిగితే, పైన చెప్పుకున్నట్లు ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు, ఈ విధమైన సమతులన చర్యలు కలిసి పరిస్థితిని తప్పక మెరుగుపరచగలవు.
ప్రస్తుతం ఇది జరగటం లేదు గనుక, పైన పేర్కొన్న ఆర్థికాంశాలు మనుషులను వ్యక్తిగతంగా తాము, తమ ఆలోచనలు, చదువులు, ఉద్యోగ, వ్యాపారాలు, ఆదాయాలు, ఆనందాలు, వివిధ ప్రయోజనాలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, యధేచ్ఛలు అన్నట్లుగా మార్చుతున్నాయి. ఆ విధంగా మారిన మనుషులు ఇతర మనుషుల గురించి గాని, ట్రాఫిక్ నియమాల గురించి గాని, భద్రతల గురించి గాని లెక్కచేయరు. తరచు తమనుతామే మైమరచి యాంత్రికంగా మారుతారు.
‘నియోలిబరల్’ అనే మాటను మనం సర్వసాధారణంగా ఆర్థిక విధానాలు, ఆర్థిక జీవనాల గురించి ఉపయోగిస్తాము. కాని సమాజంలో ఒక తరహా ఆర్థిక వ్యవస్థకు ప్రాబల్యం ఏర్పడినపుడు ఆ ప్రభావాలు ఆ సమాజంలోని వ్యక్తుల ఆలోచనలు, వ్యవహరణలు, సంస్కృతులపై కూడా ఉంటాయనే మాటను విస్మరిస్తున్నాము. ఇతర వర్ధమాన దేశాలకన్న మనవద్ద నియోలిబరల్ ఆర్థిక విస్తరణ, లోతు, విస్తృతి ఎక్కువగా ఉన్నాయి. జనాభారీత్యా కూడా. ఇందులో అధికులు మధ్యతరగతిగా మారారు లేదా మారుతున్నారు. వీరంతా ఈ నియోలిబరల్ ప్రభావాలలోకి వస్తున్నవారే. ఇటువంటి ప్రభావాలలోగల వారికి ఇతర మనుషుల భద్రతలు పట్టవు. అది డ్రైవింగ్ చేసే సమయంలో కావచ్చు, ఇతరత్రా నిత్యజీవితంలో కావచ్చు. పైన అనుకున్నట్లు వివిధ మార్గాలలో సామాజిక సమతులనం గల వారిలో మాత్రం తేడా కనిపిస్తుంది. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767