మెయన్ ఫీచర్

‘మత్తు’ వీడితేనే యువతకు భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం మొత్తమీద యువశక్తి అధికంగా ఉన్నది భారత్‌లోనే. అధిక జనాభాకు సంబంధించి చైనా అగ్రభాగాన ఉన్నప్పటికీ, యువత విషయంలో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. చైనాలో 26.9 కోట్ల మంది యువతీ యువకులు ఉండగా, భారత్‌లో 10 నుంచి 24 ఏళ్లలోపు వారి సంఖ్య 36.5 కోట్లు. ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాప్యులేషన్-2014’ ప్రకారం మన దేశ జనాభాలో 30 శాతం మేరకు యువశక్తి ఉంది. అందువల్లనే దేశ భవిష్యత్తు యువత చేతిలోనే వుంది. వీరు దురలవాట్లకు బానిసలైపోతే జాతి ప్రగతి ప్రశ్నార్థకమే. యువతకు సంబంధించి ఇటీవల వెలుగు చూస్తున్న సంఘటనలను పరిశీలిస్తే మనం ప్రమాదపుటంచుల్లో వున్నామనిపిస్తుంది. యువతకు హానిచేస్తున్న మాదకద్రవ్యాల అలవాటు ఇటీవల మన దేశంలో మహమ్మారిలా వ్యాపించింది.
‘వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2016’ ప్రకారం బిలియన్‌లో నాలుగో వంతు మంది ప్రజలు 2014లో కనీసం ఒకసారైనా మాదక ద్రవ్యాలను రుచి చూశారు. ఒకసారి ‘మత్తు’ను రుచి చూచినవారు దానికి దాసులవకుండా ఉన్న సందర్భాలు అరుదు. అందుకే మాదక ద్రవ్యాలను విక్రయించేవారు చిన్న పొట్లంలో ‘హెరాయిన్’వంటి మాదక ద్రవ్యాలను విద్యార్థులకు మొదటిసారి ఉచితంగా ఇస్తారు. ఒకప్పుడు ‘హరిత విప్లవాని’కి ప్రసిద్ధిగాంచిన పంజాబ్ ఇపుడు ‘మాదకద్రవ్యాల విష ఫలాల’కు కేంద్రంగా వుంది. పంజాబీ యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికడతామని, ‘డ్రగ్స్’ ముఠాలను నిర్మూలిస్తామని తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హామీలు గుప్పించాయి. పంజాబ్ మాత్రమే కాదు, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు కూడా మాదక ద్రవ్యాల ముఠాలు విస్తరిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయిని సేవిస్తూ అధికారులకు పట్టుబడి, కళాశాల నుంచి సస్పెండయ్యారు. అంతకుముందు మరో ముగ్గురు విద్యార్థులు ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘డ్రగ్స్’ సేవిస్తూ పట్టుబడ్డారు. విశాఖలో ఈ ఆరుగురు విద్యార్థులే మాదకద్రవ్యాలకు బానిసలైనట్లు భావిస్తే పొరబాటే. అనేక వృత్తివిద్యా కళాశాలల్లో, సాధారణ కళాశాలల్లో కూడా విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. నల్లమందు, హెరాయిన్, స్మోక్, బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాలు అనేకం వున్నాయి. కొన్నింటిని సిగరెట్లలోను, హుక్కాలోను కలుపుతుంటారు. మరికొన్నింటిని ‘ఇంజక్షన్’ ద్వారా తీసుకుంటారు. ఏ రూపంలో మాదక ద్రవ్యాన్ని వాడినా అది ఆరోగ్యానికి హానికరమే. వీటిని వినియోగించడం వల్ల 14 రకాల కేన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లివర్, గొంతు కేన్సర్లు రావచ్చు. అన్నింటికీ మించి ఎయిడ్స్ వ్యాధి సోకే అవకాశం వుంది. స్నేహితులతో కలిసి కులాసాగా సేవిస్తూ వుంటారు కాబట్టి ఒకే సిరంజితో మాదక ద్రవ్యాన్ని అందరూ ఇంజెక్ట్ చేసుకుంటారు. వారిలో ఎవరికైనా హెచ్.ఐ.వి. పోజిటివ్ వుంటే మిగతావారికి కూడా ఆ వ్యాధిసోకే అవకాశం వుంది. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు వైద్యుల వద్దకు వెళ్లే యువకుల్లో కొందరికి ఎయిడ్స్ ఉన్నట్లు పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ‘డ్రగ్స్’కు బానిసలైన వారికి సిరెంజిలను ఉచితంగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారంటే ఈ అలవాటు ఎంతగా ప్రబలిపోయిందో తెలుస్తోంది. మాదకద్రవ్యాల కోసం వేలాది రూపాయలను ఖర్చు చేసేవారు సిరెంజిల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
కళ్లు మత్తుగా వుండడం, పెదిమలు పొడిబారి పోవడం, దిగులుగా వుండడం, నలుగురితో కలవడానికి ఇష్టపడక పోవడం, తమలోతాము నవ్వుకుంటూ వుండడం, సీనియర్ విద్యార్థులతో నేస్తం కట్టడం, ఇంటికి ఆలస్యంగా రావడం.. ఇలాంటి లక్షణాలు తమ పిల్లలలో కనబడితే తల్లిదండ్రులు ఏ మాత్రం అలక్ష్యం చేయక, వారిని వైద్యుల వద్దకు కౌనె్సలింగ్‌కు తీసుకుని వెళ్లాలి. కానీ, చాలామంది తల్లిదండ్రులు ఆ పనిచెయ్యరు. తమ పిల్లల ‘బుద్ధిబలం’పై వారికి అపారమైన నమ్మకం! ఇక, మరికొంతమంది తల్లిదండ్రులకైతే పిల్లల గురించి ఆరా తీసే తీరిక, ఓపిక ఉండవు.
విద్యార్థులు మాదకద్రవ్యానికి అలవాటుపడడానికి చెడు సావాసాలతో పాటు తల్లిదండ్రులు కూడా కారకులవుతున్నారు. తమ స్థోమతకు మించి పిల్లలను ఇంజనీరింగ్ కాలేజీలోనో, మెడికల్ కాలేజీలోనో చేర్పించాలన్న తాపత్రయమే గాని- వారి అభిరుచి ఏమిటి? వారు ఏమి చదవాలనుకుంటున్నారనే విషయాలను ఆలోచించరు. అభిరుచి, ఆసక్తి లేని కోర్సులో చేరిన విద్యార్థులు సరిగా చదవలేకపోవడం, మార్కులు తక్కువ రావడమో, ఫెయిల్ అవడమో జరుగుతూ వుంటుంది. ఫలితంగా మానసిక కుంగుబాటుకు లోనైన విద్యార్థులు మిగతా వారితో కలవలేక మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల ముందు మాదకద్రవ్యాలను అమ్ముతూ వుండడం, అవినీతిపరులైన అధికారులు వీటిని అరికట్టక పోవడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. సంపన్నులు, పేదలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల విద్యార్థులు వీటికి అలవాటు పడుతున్నారు. మత్తు పదార్థాలను కొనేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్యకు ప్రయత్నించే వారూ ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఏజెన్సీ ప్రాంతం నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి నగరాలకు సులువుగా చేరుకుంటున్నాయి.
మాదకద్రవ్యాల వ్యాపారం అతి సాధారణ వ్యక్తుల్ని బడా కోటీశ్వరుల్ని చేస్తున్నది. వీటి ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు అధిక వ్యత్యాసం వుండడమే దీనికి కారణం. భారీ ఎత్తున వీటిని స్మగ్లింగ్ చేసే ముఠా నాయకులు తక్కువ పెట్టుబడితో కోట్లకు పడగలెత్తుతున్నారంటే అందులో ఆశ్చర్యం ఏముంది? రసాయన చర్యల ద్వారా మాదకద్రవ్యాలను తయారుచేసే యూనిట్లు, గంజాయి పండించే ప్రాంతాలు మన దేశంలో వున్నప్పటికీ ఇవి మన దేశానికి అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాల నుండి అధికంగా చేరుతున్నాయి. మాదకద్రవ్యాల విషయంలో ఈ దేశాలను ‘బంగారు నెలవంక’ (గోల్డెన్ క్రిసెంట్) దేశాలు అని అంటారు. ఇతర దేశాల నుండి ఇవి పాకిస్తాన్‌కు చేరితే, అక్కడి నుంచి మన దేశంలోని సరిహద్దులకు, అనేక రాష్ట్రాలకు ఇవి స్మగ్లింగ్ అవుతుంటాయి. వివిధ శాఖల అధికారుల అండదండలతో స్మగ్లర్లు వీటిని పలు రాష్ట్రాలకు రవాణాచేస్తారు. ‘సింథటిక్ డ్రగ్’లను రవాణాచేసే ముఠాలు ఎక్కువగా పంజాబ్‌ను ఆశ్రయిస్తుంటాయి. పంజాబ్‌లో 553 కిలోమీటర్ల పొడవున ఇండో- పాకిస్తాన్ సరిహద్దు వుంది. ‘హెరాయిన్’ను ఈ సరిహద్దు నుంచే పాకిస్తాన్ మీదుగా అఫ్ఘాన్ మన దేశానికి సరఫరా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లభించే హెరాయిన్‌లో 96 శాతం అఫ్ఘానిస్తాన్ నుంచే అని తెలుసుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. పంజాబ్ నుండి ఇతర రాష్ట్రాలకు హెరాయిన్‌ను తరలిస్తుంటారు.
మాదక ద్రవ్యాలకు బానిసలై, అవి లేకుంటే బతకలేని వారు మన దేశంలో రెండున్నర లక్షల మంది వున్నారని ఒక పరిశీలనలో తేలింది. వీరుగాక, ఎనిమిదిన్నర లక్షలమంది వీటికి కొంతమేరకు అలవాటు పడ్డారు. వీటికి దాసోహం అయినవారిలో 53 శాతం మంది హెరాయిన్‌తోబాటు నల్లమందు కూడా వాడతారు! 75వేల మంది ఈ ఆనందాన్ని ఇంజెక్షన్‌ల ద్వారా పొందుతారు. దేశం మొత్తమీద హెరాయిన్, స్మోక్ వాడేవారి సగటుతో పోల్చిచూస్తే పంజాబ్‌లో వీరి సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. మాదకద్రవ్యాల కోసం పంజాబ్ ప్రజలు ఏడాదికి 7,575 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీరిలో 18-35 ఏళ్ల వయసు వారే ఎక్కువ. పోలీసులు దాడులు చేసి 2000-11 మధ్యకాలంలో 4,864 మందిని అరెస్ట్‌చేస్తే, 2012-14 మధ్యకాలంలో వీరి సంఖ్య 15,186కు పెరిగిందని తెలుసుకుంటే, ఇటీవలి కాలంలో పంజాబ్‌లో ఈ సమస్య ఎంతగా పెరిగిందో అర్ధం అవుతుంది. వీటికి అలవాటుపడ్డ వారు డబ్బు కోసం మొదట్లో అప్పులు చేస్తారు. ఆ తర్వాత చోరీలు, హత్యలకు సైతం వెనుకాడరు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ పరిస్థితి మరింత ముదరకుండా వుండడానికి మాదకద్రవ్యాలకు బానిసలైన వారు సకాలంలో వైద్య చికిత్స తీసుకోవాలి. ఈ అలవాటును వదిలించుకోవాలంటే గట్టి పట్టుదలను కలిగి వుండాలి. మానసికంగా, శారీరకంగా కుంగిపోయి జీవితాన్ని పాడుచేసుకోకూడదు.
పంజాబ్‌లోని పునరావాస కేంద్రాలలో 2014 సంవత్సరంలో మూడు లక్షల మందికి పైగా వైద్య చికిత్స పొందారు. ఈ విషయమై మంచి ఫలితాలు సాధించేందుకు ప్రైవేటు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇలాంటి పునరావాస కేంద్రాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభించాలి. ‘డ్రగ్స్’ వినియోగం అన్ని వయసుల విద్యార్థులలోనూ పెరుగుతోంది. యువతులు సైతం వీటికి అలవాటు పడుతున్న దాఖలాలున్నాయి. సమాజంలో నైతిక విలువల పతనానికి ఇది పరాకాష్ఠ! ఈ సమస్యను నిర్మూలించాలంటే మాదకద్రవ్యాల అక్రమరవాణాను ఎలాంటి ప్రలోభాలకు అతీతంగా నివారించే పటిష్టమైన యంత్రాంగం రూపొందాలి. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరగాలి. యువతీ యువకులలో విలువలు పెంచేందుకు ఇంట్లో, కళాశాలల్లో దృష్టి సారించాలి. స్వామి వివేకానంద కోరుకున్నట్టుగా- ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో’ యువత వర్ధిల్లాలంటే.. ‘డ్రగ్స్’ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాలి. *

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969