మెయన్ ఫీచర్

బ్యాంకింగ్ అంటే.. ‘బాదుడే’నా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందిరా గాంధీ హయాంలో జరిగిన రెండు మంచి ప నుల్లో ఒకటి బ్యాంకుల జాతీయకరణ, మరొకటి రాజభరణాల రద్దు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చెప్పుకోతగ్గ సంస్కరణలు కూడా ఈ రెండే! వీటితోపాటు భూసంస్కరణలు కూడా జరిగి వుంటే భారతదేశ ముఖచిత్రమే మారిపోయి వుండేది. 85 శాతం ఖాతాదారులుగా వున్న నాటి 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్ని ‘అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఆర్డినెన్స్ - 1969’ అనే చట్టంతో జులై 19, 1969 అర్ధరాత్రి నుంచి జాతీయ బ్యాంకులుగా మార్చివేయడం జరిగింది. క్రమానుగత ఆర్థికాభివృద్ధిని సాధించడానికి చేపట్టిన ఈ జాతీయకరణను ఏప్రిల్ 1980లో మరికొన్ని బ్యాంకులకు విస్తరింపజేశారు. ఇలా నేడు 27 బ్యాంకులు ఈ జాబితాలో వుండగా, దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐ సహా 6 రాష్ట్ర బ్యాంకులు, 19 జాతీయ బ్యాంకులు, ఒక మహిళా బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు పబ్లిక్ సెక్టార్‌లో ఉన్నాయి. ఆరు ప్రాధాన్యతా అంశాల్ని దృష్టిలో పెట్టుకొని నాడు వీటిని జాతీయకరణ చేశారు. ఇందులో మొదటిది సాంఘిక సంక్షేమం కాగా, రెండోది ప్రైవేట్ గుత్త్ధాపత్యాన్ని నియంత్రించడంగా, మూడోది బ్యాంకుల విస్తరణగా, నాల్గోది ప్రాంతీయ అసమానతల్ని తగ్గించడంగా, అయిదోది ప్రాధాన్యతా రంగాలకు ఆర్థిక ఊతమివ్వడంగా, ఆరోది ఖాతాదారుల, వినియోగదారుల సంఖ్యను పెంచడంగా నిర్దేశించారు. ఇందులో మొదటి, అయిదో అంశాల్లో వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, చిన్నతరహా, గ్రామీణ కుటీర పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహాల్ని ఇచ్చి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని, వీటిని ‘చోదకశక్తులు’గా గుర్తించాలని ప్రస్తావించడం జరిగింది.
కాలంతో పాటు దేశ రాజకీయాలు మారడం, ప్రపంచీకరణతో పాలకుల ఆలోచనలు మారడం, అభివృద్ధి ముసుగులో దోపిడీ స్వభావం పెరగడం, నిధుల సేకరణే బ్యాంకుల లక్ష్యంగా మారడం, ప్రాధాన్యతా రంగాలకు రుణాలివ్వడం కాకుండా, రాజకీయ సంబంధ వ్యక్తులకు, సంస్థలకే అప్పులివ్వడం, వీరిని ఎగవేతదారులుగా ఎదిగించడం బ్యాంకుల విధిగా మారింది. ఈ ఎగవేతదారులు మరో 24 బ్యాంకులు, ప్రైవేట్ రంగంలో ఏర్పాటుచేయడం, విదేశాల్లో దోచుకున్న సొమ్ముతో మరో 84 విదేశీ బ్యాంకులు కూడా ప్రధాన పట్టణాల్లో, నగరాల్లో ఏర్పాటుకావడంతో జాతీయ బ్యాంకులకు పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకోవడానికి, బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఆయా ప్రభుత్వాలు కో-ఆపరేటివ్ బ్యాంకుల్ని ఏర్పాటుచేయగా, జాతీయ బ్యాంకులే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏర్పాటు చేశాయి. ఇంతగా బ్యాంకుల విస్తరణ జరిగినా ఉత్తుత్తి బ్యాంకులు, జనాలకు శఠగోపం పెట్టే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఏటా పుట్టుకురావడం, జనాల డబ్బును మూటగట్టుకొని పలాయనం చిత్తగించడం జరుగుతూనే వున్నది. గుత్త్ధాపత్యాన్ని నియంత్రించాలన్న స్థానంలో బ్యాంకు అధికారులే గుత్త్ధాపతులుగా మారిపోవడం, వినియోగదారుడే దేవుడనే నినాదం స్థానంలో బ్యాంకుల్ని కొల్లగొట్టేవారే సూపర్ డూపర్లుగా గుర్తించే స్థాయికి ఈ బ్యాంకులు రూటు మార్చుకున్నాయి.
నిజానికి ప్రాధాన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి ప్రణాళికబద్ధంగా బ్యాంకులు గ్రామీణ, గిరిజన ఆవాస ప్రాంతాలకు కూడా విస్తరించి, ప్రతి బ్యాంకుశాఖ ఎంపిక చేసిన కొన్ని ఆవాస ప్రాంతాల్ని దత్తతగా తీసుకొని నిర్దేశిత కాలంలో ఆ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా, నిలదొక్కుకునేలా తోడ్పడాలి. ఆర్థిక అసమానతల్ని తొలగించి ఆర్థిక స్వావలంబన కల్గించాలి. కాని, ఇలాంటి ఆవాస ప్రాంతం దేశవ్యాప్తంగా గల 6 లక్షలకు పైగా ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కటీ కనపడదు. ఇలా పనిచేసిన బ్యాంకు గాని, బ్రాంచి గాని దేశంలో ఎక్కడ వెతికినా కానరాదు. తమ లక్ష్యాలను గుర్తించే బ్యాంకు చైర్మన్లుగాని, బ్యాంకు మేనేజర్లుగాని భూతద్దం వేసి వెతికినా దొరకరు. జాతీయకరణ జరిగి అయిదు దశాబ్దాలు కావస్తున్నా ఓ బుడ్డగోచిగాడు, ఓ సాధారణ కూలీ, ఓ చిరు వ్యాపారి, ఓ నిరుద్యోగి- బ్యాంకింగ్‌ను వినియోగించుకోలేని స్థితి. పైగా ఓ ఖాతా తెరవాలంటే పరపతిగల వ్యక్తి సంతకం పెట్టాల్సిందే!
అలాగని బ్యాంకులు రుణాలెవ్వరికీ ఇవ్వవా? అని అనుకుంటే పొరపాటే! వ్యాపారవర్గాలకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లకు, అత్యధిక వేతనాల్ని పొందుతున్న ఉద్యోగులకు పిలిచి లేదా వారి గుమ్మాల వద్దకే వెళ్ళి రాయితీలతో అప్పులివ్వడం జరుగుతూనే వున్నది. ఇలాంటి వారిలో కొందర్ని ‘ఇష్టపూర్వక ఎగవేతదారులు’గా ఎదిగిస్తూనే వున్నాయి. వీరి నిరర్ధక ఆస్తుల విలువను 10 శాతం చొప్పున తగ్గిస్తూ నిర్ణయించినా ఎవరు కొనకుండా జాగ్రత్త పడుతున్నాయి. మరికొందరు దర్జాగా విదేశాలకు పారిపోయి (విజయ్ మాల్యాకు ఈ పదం నచ్చదు) విలాసవంత జీవితం గడిపేలా బ్యాంకులు పథకరచన చేస్తూనే వున్నాయి. ప్రభుత్వాలు, ఆర్‌బిఐ కూడా వీరిపట్ల ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూనే ఉంటాయి. చిన్న వ్యాపారో, రైతో, చిరుపారిశ్రామిక సంస్థ పెట్టాలనుకున్న వ్యక్తో జీవనోపాధికి అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితి ఏర్పడితే వారిని బజారుకీడ్చి, బహిరంగంగా వారి ఆస్తుల్ని వేలం వేయడంలో మాత్రం బ్యాంకులు ఎప్పుడు ముందువరుసలోనే వుంటున్నాయి. నిరర్ధక ఆస్తుల్ని జప్తుచేసి, వాటిని ప్రజాప్రయోజనాలకు ఉపయోగించేలా చట్టాల్ని చేయలేని మన పార్లమెంటు, లక్షలాది ఎకరాల్ని ‘సెజ్’ల పేరిట ధారాదత్తం చేయడానికి చట్టాల్ని మాత్రం రూపొందిస్తుంది.
ఇలాంటి బ్యాంకుల నిరర్ధక విధానంతో యావత్ దేశం ఆర్థిక అసమానతలతో రెండు శిబిరాలుగా చీలిపోయింది. ఈమధ్యనే విడుదలైన ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదిక ప్రకారం ఆర్థిక అసమానతలున్న దేశాల్లో రష్యా తర్వాత భారత్ రెండో స్థానంలో వుంది. జపాన్ అతి తక్కువ అసమానతలున్న దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ లాంటి ఒక శాతం ధనవంతులు భారతదేశ సంపదలో 58 శాతాన్ని కల్గివున్నారని, అట్టడుగున గల 10 శాతం జనాభా సంపద 1.5 శాతంగా తగ్గుతుపోతుంటే, పైస్థాయిలోని 10 శాతం జనాభా సంపదలు ఇదే 15 శాతం చొప్పున పెరుగుతూ పోతున్నట్లు ‘ఆక్స్‌ఫాం’ నివేదిక తెలిపింది. ఇలా జనాభాలో అట్టడుగు వర్గాల సంపదలు (కొద్దిపాటి భూమి/గుడిసె/ ఇల్లు మొ.) కొల్లగొట్టబడడంతో రెక్కలే పెట్టుబడిగా మారి వలసలుపోవడం, దినసరి కూలీలుగా, నిరాశ్రయులుగా మారడం జరుగుతున్నది. తాజాగా యుపి ఎన్నికల్లో తిరిగి పోటీచేసిన వివిధ పార్టీలకు చెందిన 311 ఎమ్మెల్యేల ఆస్తులు గత 5 ఏళ్లలో 82 శాతం పెరిగినట్లు ఎడిఆర్ సంస్థ తెలపింది. 2012లో వీరి సరాసరి ఆస్తి రూ.3.49 కోట్లు కాగా నేడది రూ.6.33 కోట్లకు ఎదిగింది. దీన్నిబట్టి మన ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లుతున్నదో, ఎవరి రక్షణకై పనిచేస్తున్నదో తెలుస్తున్నది. ఈమధ్యనే విడుదలైన ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్టు ఇండియా -2016’ ప్రకారం దేశంలో బిలియనీర్ల సంఖ్య 132 కాగా, వీరి ఆస్తుల విలువ 392 బిలియన్ డాలర్లుగా గుర్తించారు. సంపదల్ని పోగుచేసుకొని, బ్యాంకుల్ని కొల్లగొట్టి, జనాలకు కుచ్చుటోపీలు పెట్టి దేశాన్ని వదిలిన బిలియనీర్ల సంఖ్య 32గా ఈ సంస్థ పేర్కొన్నది.
అత్యధిక శాతం ప్రజల సంపదలు పెరక్కపోగా, తరిగిపోవడానికి దేశంలో వేళ్ళూనుకున్న అవినీతి, లంచగొండితనమే కారణమంటూ అంతర్జాతీయ అవినీతి నిరోధక హక్కుల సంస్థ ఈమధ్యన నిర్వహించిన సర్వేలో తేల్చింది. చిన్న చిన్న పనులు జరుపుకోవాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని, లంచాలు ఇవ్వడంలో చివరికి న్యాయమూర్తులు కూడా ఉంటున్నట్లు, ఇలా 69 శాతం లంచాలిచ్చే ప్రజలతో మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో వుండగా ఇందులో 38 శాతం పేదవారే కావడం గమనార్హం! రెక్కల కష్టాన్ని లంచాలకు, వైద్యానికి, పిల్లల విద్యకు, వలసపోయిన ప్రాంతాల్లో ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక నివాసాలకు ఇవ్వడం మామూలైపోయింది. ఇక మధ్యతరగతి వారు ఉన్నత వర్గాల్లా ఆడంబరాలకు ఖర్చుచేసే ఓ వ్యవస్థ బలోపేతం కావడంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల పాత్ర ఏంటనే ప్రశ్న రావచ్చు! జాతీయకరణకు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బ్యాంకులు సంపన్నవర్గాల గుమ్మాల దగ్గరికేపోయి రాయితీలతో, షరతులు లేకుండా డబ్బుల్ని ధారాదత్తం చేస్తూ, ఆర్థికంగా ఎదిగించాల్సిన వర్గాల్ని బ్యాంకుల గుమ్మాల్ని తొక్కకుండా చేస్తున్నాయి. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన జాతీయ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకుల దారిలోనే నడుస్తూ వినియోగ సేవలకు అదనపు రుసుములు చెల్లించాలని, ఖాతాల్లో కనీస నిల్వలుండాలని, నెలవారీగా జరిపే లావాదేవీలకు పరిమితులు వుండాలనడం, హద్దుదాటితే అదనపు రుసుముల పేరిట వాతలు పెట్టాలనే నిర్ణయాలు అప్రజాస్వామ్యమే! బ్యాంకుల్లోని నిల్వలన్నీ సాధారణ ఖాతాదారులవే గాని, విజయ్ మాల్యావి గాని, అంబానీలవి గాని కాదని గుర్తించాలి. ఖాతాల్ని తెరిచి, కొద్ది మొత్తంలో జమచేసి మరిచిపోయిన ఖాతాల సొమ్మే లక్షల కోట్లల్లో బ్యాంకుల్లో మూలుగుతూనే వున్నది. సాధారణ ఖాతాలకు ఇచ్చే 4 శాతం వడ్డీతో 20 శాతానికి మించి చక్రవడ్డీతో వ్యాపారం చేసే బ్యాంకులు ఆస్తుల్ని, సంపదల్ని పోగుచేసుకుంటూ, ప్రజల్ని దూరం చేయడమంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల్ని, సహారా లాంటి సంస్థల్ని, అగ్రి గోల్డ్, షోంజీ లాంటి పథకాల దోపిడికి ఊతమివ్వడమే అవుతుంది.
ఇలాంటి స్థితిలో బ్యాంకుల చర్యల్ని నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం బుజ్జగింపుగా బ్యాంకుల్ని బతిమిలాడడం అంటే, ఎవరిని ఎవరు నిర్దేశిస్తున్నారో తెలుస్తున్నది. ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల మేలుకన్నా కొన్నివర్గాల ప్రయోజనాలే మిన్నగా భావించడంలో ఆశ్చర్యం లేదు. వీటిని నిలదీయడమే నేడు జనం కర్తవ్యం. *

- డా జి.లచ్చయ్య 9440116162