మెయిన్ ఫీచర్

భామనే.. గొల్లభామనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లభామ... ఈ పేరు వింటే సిద్దిపేట గుర్తుకువస్తుంది...
సిద్దిపేట పేరు వింటే ‘గొల్లభామ’ మదిలో మెదులుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ రెండు పేర్లలో ఏది విన్నా అందమైన చేనేత చీర గుర్తుకువస్తుంది. అవే సిద్దిపేట గొల్లభామ చీరలు. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలకు ఎంతో పేరుప్రఖ్యాతులున్నాయి. అయితే పేరుగొప్ప..ఊరుదిబ్బ అన్న చందంగా నైపుణ్యం ఉన్న కార్మికులు కష్టపడి, ఇష్టంగా నేసే గొల్లభామ చీరలకు పేరైతే ఉంది కానీ ఆదరణ అంతంతమాత్రం. ఆ పరిస్థితిలో మార్పువచ్చి మళ్లీ పాతరోజులు రావాలని గొల్లభామ చీరలు నేయగల నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులు కోరుకుంటున్నారు. అదే పనిలో నిమగ్నమవుతోంది సినీనటి సమంత.
చీరలంటే మహిళలకు మక్కువ...కొందరికి పట్టుచీరలంటే ఇష్టం.. మరికొందరికి నేత చీరలంటే మక్కువ.. భారతీయ సంప్రదాయంలో అతివల అందాన్ని ఇనుమడింప చేసే చీరకు ప్రాధాన్యం అంతాఇంతాకాదు. చక్కటి నైపుణ్యంతో, నాణ్యమైన చీరలను నేయడంలో తెలుగువారిది అందెవేసిన చేయి. అగ్గిపెట్టెలో పట్టే చీరలనుంచి బంగారంతో చేసే చీరలవరకు సృష్టించగల నేర్పు తెలుగు చేనేత కార్మికులకు ఉంది. గద్వాల, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, భూదాన్‌పోచంపల్లి, పొందూరు ఇలా ఎన్నో ప్రాంతాలు చేనేత రంగంలో ఎనె్నన్నో విశిష్టతలకు పెట్టిందిపేరుగా మారాయి.
అయితే ఒకప్పుడు ఎంతో వైభవంతో సాగిన ఆయా ప్రాం తాల చేనేత కుటుంబాల జీవనం ఇప్పుడు దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది. సిద్దిపేట గొల్లభామ చీరలు నేసే కార్మికులదీ అదే పరిస్థితి. ఆధునిక కాలంలో ఆదరణ, ధర, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడంతో చేనేతకు చేవ తగ్గినట్లయింది. కానీ కాస్తంత శ్రద్ధచూపి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే వందలాది చేనేత కార్మిక కుటుంబాల కడుపునిండుతుంది. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చేనేతకు ప్రాణం పోసినట్లవుతుంది.సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల కార్మికులు ప్రాణం పోసిన గొల్లభామ చీరలకు మళ్లీ మంచిరోజులు రావాలన్నదే అందరి ఆకాంక్ష.

గొల్లభామలే స్ఫూర్తి
కళాకారుల్లో సృజన దాగి ఉంటుంది. చేనేత కార్మికులూ కళాకారులే. సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షించడం ఎలా అన్నది వారి ఆలోచన. ఎప్పటికప్పుడు ఆధునికత జోడిస్తూ సరికొత్తగా కనిపించేలా చీరలను నేయాలని వారు తపన పడుతూంటారు. నిరంతరం ఆ ఆలోచనలు వారిని స్థిమితంగా ఉండనియ్యవు. గొల్లభామ చీరల సృష్టికూడా అలా జరిగినదే. దాదాపు 70 ఏళ్ల క్రితంనాటి సందర్భం అది. సిద్దిపేటకు కీర్తిప్రతిష్టలు తెచ్చిన గొల్లభామల వైభవానికి చిహ్నం అది. అక్కడి చేనేత కళాకారుల ఆలోచనలకు సృజనాత్మకత తోడై గొల్లభామ చీరలు పురుడుపోసుకున్నాయి. పాలు అమ్మేందుకు వచ్చే మహిళలను చూసి వారికి వచ్చిన ఆలోచనల ఫలితమే గొల్లభామ చీరల తయారీ.
ఆ ఇద్దరే సృష్టికర్తలు
సిద్దిపేటకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు రచ్చ దేవదాస్, కొంక సాయిలుతో కలిసి మరికొందరు సిద్దిపేట చేనేత సహకార సంఘంలో వస్త్రాలు నేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. అప్పట్లో జనతా, ముత్యంపేట, పటోల తదితర రకాల చీరలను నేసేవారు. వీటిపై అందమైన పువ్వులు, హంసలు, చేపలు, ఆకులు, పక్షలు తదితర బొమ్మల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునేలా చీరలను ఆకర్షణీయంగా నేసేవారు. చీరలు నేసేటపుడు కార్మికులు విరామ సమయంలో చాయ్ తాగేందుకు సిద్దిపేట గాంధిచౌక్, వెంకటేశ్వరాలయం వద్ద గల హోటళ్లకు వెళ్లేవారు. ఆ కాలంలో వివిధ గ్రామాల నుండి పాలు, పెరుగు బుట్టలు, కుండల్లో పోసి తలపై వాటిని పెట్టుకుని మహిళలు తీసుకువచ్చి హోటళ్లలో విక్రయించేవారు. చేనేత కార్మికులకు పాలు, పెరుగుతో వచ్చే గొల్లభామల రూపం మదిలో ముద్రపడింది. దీంతో వారు చీరలపై వేసే పూవులు, ఆకులు, చేపలు, హంస, పక్షులకు బదులుగా పాలను విక్రయించే గొల్లభామలను వేయాలని నిశ్చయించుకున్నారు. గొల్లభామల ఆకృతిలో డిజైన్లు తయారు చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమించి సఫలీకృతులైనారు. మిగతా బొమ్మలను సులువుగా వేసే కార్మికులు గొల్లభామల ఆకృతిని తయారు చేసేందుకు వ్యయప్రయాసలకు ఓర్చి సహజసిద్ధంగా రూపుదిద్ది రంగులను అద్ది గొల్లభామ ఆకృతికి ప్రాణంపోశారు. ఇంతటి చారిత్రకమైన ప్రాధాన్యత గల చీర స్వాతంత్య్రం సిద్ధించకముందే 1940లోనే పురుడుపోసుకొంది. గొల్లభామ ఒక చేతితో తలపై పాలకుండ, మరో చేతితో పెరుగుకుండను పట్టుకున్నట్లు బొమ్మలు వచ్చేలా చీరల అంచులు, మధ్యలో, కొంగు భాగాల్లో నేశారు. ఎదురెదురుగా గొల్లభామలు వస్తున్నట్లు, స్వాగత తోరణాలలో వారున్నట్లు ఆకర్షణగా ఉండేలా వివిధ రంగులతో రూపొందించారు. అప్పటివరకు మార్కెట్‌లో లేని సరికొత్త గొల్లభామ చీరలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆ రోజులే వేరు
సిద్దిపేట గొల్లభామ చీరలకు డిమాండ్ పెరగడంతో సిద్దిపేట, దుబ్బాక, దుద్దెడ సహకార సంఘాల్లో వీటిని పెద్ద ఎత్తున నేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టారు. దీంతో వీటికి దేశంలోని ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, పంజాబ్, ఒడిస్సా, కలకత్తా తదితర ప్రాంతాల నుండి వేలాదిగా చీరలకు ఆర్డర్లు వచ్చాయి. ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన గొల్లభామల చీరల తయారు ఎంతో మంది నేతన్నలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. గొల్లభామల చీరలకు వస్తున్న డిమాండ్‌తో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో గొల్లభామ చీరలు నేసే నైపుణ్యం ఉన్న కార్మికులు రెండువేలమంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పదుల్లోనే.
2012లో జిఐ గుర్తింపు
సిద్దిపేట చేనేత కార్మికుల సృజనాత్మకతను చాటిచెప్పిన గొల్లభామ చీరల ప్రత్యేకతను భారత ప్రభుత్వం 2012లో గుర్తించింది. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ చీరకు భౌగోళిక గుర్తింపు కల్పిస్తూ నెంబర్ 188 ఇస్తూ ప్రత్యేక చిహ్నాన్ని కేటాయించింది. దీంతో ఈ చీరలపై సిద్దిపేట చేనేత సహకార సంఘానికి పేటెంట్ హక్కులు దక్కాయి. దేశ వ్యాప్తంగా ఈ చీరలకు గుర్తింపు వచ్చినా అప్పటి ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహకాలు అందించలేదనే విమర్శలున్నాయి. అందుకే ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూత, సంఘాల పటిష్టతకు కృషి చేస్తామని ప్రకటించడంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పాండురంగం

జైల్‌సింగ్ నుంచి సమంత వరకు..

అలనాటి రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు గొల్లభామ చీరలంటే ఎంతో ఇష్టం. హైదరాబాద్ చేనేత ప్రదర్శనలో వీటి గురించి తెలుసుకుని ముచ్చటపడ్డారు. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఆ చీరలు తెప్పించుకున్న జైల్‌సింగ్ తన భార్యకు బహుమతిగా ఇచ్చేవారని చెబుతారు. శంకర్‌దయాళ్‌శర్మకూ ఈ చీరలంటే ప్రాణం. యుపి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డి తివారికి కూడా ఈ చీరలంటే మక్కువే. వీరంతా ప్రత్యేకంగా వీటిని తెప్పించుకునేవారు. ధరలు అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి మహిళలకు ఈ చీరలంటే ఎంతోఇష్టం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేతరంగానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీనటి సమంత అయితే గొల్లభామ చీరలను చూసినదే తడవుగా పెద్దసంఖ్యలో కొని తీసుకువెళ్లారు. వాటిని నేసే విధానం తెలుసుకున్నారు. ఈమధ్యే సిద్దిపేట వెళ్లిన ఆమె గొల్లభామ చీరల తయారీని స్వయంగా చూశారు. ఆదరణ లేక చేనేత కార్మికులు నిరుత్సాహానికి గురవడాన్ని గుర్తించారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తనతోపాటు గొల్లభామ చీరలను ఇంటికి తీసుకువెళ్లడం విశేషం.

భామలకు తోడుగా బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాల ఆకృతులతో గొల్లభామ చీరలను నేస్తున్నారు. చేనేత కార్మికులకు పనికల్పించడంతో పాటు వారు నేసిన వస్త్రాలను తెలంగాణ కోఆపరేటివ్ సంస్థ (టెస్కో) ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించి కార్మికులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ఆదేశాలు ఇవ్వటంతో ఆ దిశగా ఆచరణలో పెట్టడంతో చేనేత కార్మికుల్లో ఆశలు చిగురించాయి.

ముడిసరుకు ధర తగ్గాలి
సృజనాత్మకతో తయారు చేసిన గొల్లభామ చీరలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఆ ఉత్సాహంతో సరికొత్త ఆకృతులను సృష్టించగలం. చీరలపై గొల్లభామ ఆకృతిని నేయడానికి రెండు నుండి మూడు రోజులు పడితే, చీరంతా గొల్లభామలు వేసేందుకు 4నుండి 5రోజులు పడుతుంది. ఒక్కో చీరకు 400నుండి 800 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుం. రోజంత కష్టపడినా రెండువందల కూలీకూడా రావడం లేదు. ప్రభుత్వం సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, ముడిసరుకలు ధరలు తగ్గించాలి. - వేముల భూమయ్య, చేనేత కార్మికుడు

కొత్త ఆకృతులు సృష్టించగలం
సిద్దిపేట పట్టణంలోని గొల్లభామ చీరలు నేసే కార్మికులకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని వెరైటీల్లో గొల్లభామల చీరలను తయారు చేయగలం. ప్రస్తుతం పాలు విక్రయించే గొల్లభామల ఆకృతులతోపాటు, బతుకమ్మ, కోలాటం, బోనాల ఆకృతులు తయా రు చేస్తున్నాం. గొల్లభామ చీర తయారీ అంతరించిపోకుం డా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గొల్లభామ చీరలను కొనుగోలు చేసిన తెలంగాణ కోఆపరేటివ్ సంస్థ (టెస్కో) సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. - పాశికంటి మల్లేశం, మాస్టర్ డిజైనర్

రోజుకు వంద కూడా రాదు

చీరలు తయారు చేసేందుకు తాము దారం ఉండలు, కండెలు కడతాం. పొద్దంత రాట్నం ఒడుకుతున్న తమకు కనీసం వంద రూపాయలు సైతం కూలీ లభించటం లేదు. వీరబత్తిని ఎల్లవ్వ మాట కూడా అదే. ముప్పయి ఐదు సంవత్సరాలుగా ప్రాజెక్టు సొసైటీలో పనిచేస్తున్నా. పరిస్థితులు దిగజారిపోయాయి.
- బొమ్మెర్ల సరస్వతి,
మహిళ కార్మికురాలు

కూలీరేటు పెంచాలి

చీరలు, ధోవతులు తయారు చేసేందుకు దారం కండెలు చుడతాం. రోజంతా పనిచేసినా 70 రూపాయలకు మించి రావటం లేదు. రోజుకూలీ 200 రూపాయలకు పెంచాలి.
- తుమ్మ వజ్రమ్మ,
మహిళ
కార్మికురాలు

- ఆకుల