మెయన్ ఫీచర్

సామాజిక స్వచ్ఛతకు చోటేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16వ తేదీన జరగనుంది. రెండు దశాబ్దుల క్రితం ఆయన 1848లో జన్మించారు. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఆయన గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే- ఏ సామాజిక వికృతులను తొలగించడానికి జీవితాంతం ఆయన పోరాడాడో వాటిల్లో చాలా ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీరేశలింగం గురించి చెప్పేటప్పుడు వితంతు పునర్వివాహాల కోసం అవిశ్రాంతంగా ఆయన చేసిన సాహసోపేత పోరాటం గురించి అందరూ చెబుతారు. అదే ఆయన ఏకైక లక్ష్యంగా కూడా భావిస్తారు. కానీ, ఆ ఆలోచన పూర్తిగా సరికాదు. అన్నిరంగాల్లో సామాజిక స్వచ్ఛత వుండాలని ఆయన కోరుకున్నారు. మూఢ నమ్మకాలు, అవినీతి, లంచగొండితనం వంటివేవీ లేని సమాజం కోసం కలలుకన్నాడు. సమాజంలో ఉన్న వికృతులన్నింటినీ తన పత్రికలలో దుయ్యబట్టాడు. ఆయన నడిపిన ‘వివేక వర్ధిని’ (1874), హాస్య సంజీవని (1876), ‘సతీ హితబోధిని’ (1883), చింతామణి (1891), తెలుగు జనానా (1904), సత్యవాదిని (1905) వంటి పత్రికలకు సామాజిక స్వచ్ఛతా సాధనే ప్రధాన లక్ష్యం. ఈ పత్రికల్లో కొన్నింటిని కేవలం తాను మాత్రమే నడిపాడు. మరికొన్ని కొందరు ప్రముఖుల సహకారంతో నడిపాడు. తెలుగుసీమలో సంఘ సంస్కరణ లక్ష్యంతో వెలువడిన మొట్టమొదటి పత్రిక ‘వివేకవర్ధిని’.
వీరేశలింగం తన ‘స్వీయచరిత్ర’లోను, తన పత్రికలలోను తెలిపిన కొన్ని భావాలను గమనిస్తే, అవి నేటికీ వర్తిస్తాయనిపిస్తుంది.
‘‘మా పట్టణములో (రాజమహేంద్రవరంలో) సారాయి దుకాణములు ఇదివరకటి కంటే పదిరెట్లు అధికశాతమైనవి. సమస్తాకర్షకములకు మూలమయిన త్రాగుబోతుతనమును ప్రభుత్వము వారు ప్రోత్సహించుట కంటెనవమానకరమైన కార్యము మరియొకటి లేదు’’
‘‘కార్యశూరులు లేక, వాక్సూరులు మాత్రమే ఉన్న దేశము ఎన్నటికీ వృద్ధి కానేరదు.. నిజమైన సంఘ సంస్కరణము వట్టి చర్చలతోనూ, తీర్మానములతోనూ మాసిపోదు.’’
‘‘దేశభాషలు వృద్ధి చెందిన గాని, దేశము యొక్క స్థితి బాగుపడనేరదు. జన సామాన్యము యొక్క స్థితిని బాగుపరచవలెనన్న-తప్పక దేశభాషలలో ఉపయుక్తమైన గ్రంథములను సులభశైలిలో వ్రాసిన ఎడల అవి ఎల్లవారికిని ఉపయుక్తములగును. జనుల వ్ఢ్యౌము కొంతవరకు తగ్గును.’’
‘‘పదహారు సంవత్సరములు మొదలుకొని, ఇరువది సంవత్సరముల వరకూ మనకు సుగుణములుగాని, దుర్గుణములు గాని, పట్టుటకవకాశమున్నది. తరువాతనవి స్థిరపడును’’
... ఇట్లాంటి వాక్యాలను చూచినప్పుడు- నేటి పరిస్థితులను అప్పుడే ఆయన ఊహించి చెబుతున్నారేమో అనిపిస్తుంది. వీరేశలింగం చేసిన సమస్త మహత్కార్యాలకు ఆయన విద్యార్థులు అండగా నిలిచారు. ఆయన ఎంతో ప్రయాసపడి వివాహానికై తీసుకువచ్చిన బాల వితంతువులను చాలా సందర్భాల్లో ఆయన పూర్వ విద్యార్థులే వివాహమాడారు. చదువుకునే రోజుల నుండి ఆయన విద్యార్థులకు సంఘ సంస్కరణ భావాలను నూరిపోసేవారు. తాను పనిచేసిన పాఠశాలల్లో సంఘ సంస్కరణ సమాజమును ఏర్పరిచేవారు. దీనివలన స్ఫూర్తి పొందిన విద్యార్థులు- సనాతన వాదులు ఆయనపై దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆయన వంటిమీద ఒక్క దెబ్బ కూడా పడకుండా అడ్డుకున్నారు. విద్యార్థులపై ఆధారపడి ఉద్యమాన్ని నడుపుతున్నారని కొందరు ఆయనను హేళన చేస్తే-
‘‘మన సమాజములోను, మన ప్రసంగములు వినువారిలోను, విశేష భాగము విద్యార్థులని ప్రతిపక్షులొక యాక్షేపము పలుకుచున్నారు. విద్యార్థులధికముగా జేరుచుండుట వల్లనే మన పక్షము సబలమయి భావి శుభ సూచకముగానున్నదని నేను సంతోషించుచున్నాను. మన దేశము భావి క్షేమాభివృద్ధుల నిమిత్తము-ఇప్పుడు పిన్నలుగా ఉండి, ముందు పెద్దలు కాబోవుచున్న విద్యార్థుల కొరకే యెంతో ఆశతో చూచుచున్నాను-’’ అన్నారు వీరేశలింగం. ఆనాటి తరంలో యువకులు ఉదాత్త లక్ష్యాలతో ఉండడం వల్లనే సంఘ సంస్కరణోద్యమాలలో గాని, జాతీయోద్యమంలో గాని ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం కలిగింది. కాని, ఈనాటి యువతరానికి అలాంటి ఉదాత్త లక్ష్యాలు లేవు. నేటి యువతరంలో రెండు తరహాల వారు కనబడతారు. ఒకరు- కేవలం తమ బ్రతుకుతెరువు కోసం, ఆ బ్రతుకు తెరువును సముపార్జించిపెట్టే విద్యనభ్యసించి -చదువుల పోటీలో ప్రథములుగా రావాలని తాపత్రయ పడేవారు. రెండవవారు- అలాంటి పోటీని తట్టుకోలేక మద్యపానానికో, మాదక ద్రవ్యాలకో బానిసలు అయ్యేవారు. వీరే భావి నేరస్థులుగానో, గూండాలుగానో మారతారు. లేదా- ఏమీ చేతకాక నిస్పృహతో ఆత్మహత్య చేసుకుంటారు. ఈరెండు తరహాల వారివల్లనూ సామాజికాభివృద్ధి జరగదు. కొందరివల్ల వ్యక్తిగత ఉన్నతి జరగవచ్చు. మరికొందరి వల్ల వ్యక్తి వినాశనమూ, సామాజిక విధ్వంసమూ మాత్రం జరుగుతాయి. తన విద్యనూ, తన సంస్కారాన్ని, మెరుగుపరుచుకుంటూ సామాజిక ప్రయోజనాన్ని సాధించగల యువతరం మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఏనాడో గ్రహించిన మహనీయుడు వీరేశలింగం.
వీరేశలింగం దేశభాషల్లో విద్యాబోధన జరగాలని మాత్రమే కాక, శాస్త్ర గ్రంథాలన్నీ తెలుగు భాషలో ఉండాలని కోరుకున్నారు. మెట్రిక్యులేషన్ మాత్రమే చదివి- తెలుగు పండితునిగా పనిచేసిన ఆయన స్వయం కృషితో ఆ తరహా విజ్ఞానాన్ని సంపాదించి, వైద్య శాస్తమ్రు, శరీర శాస్తమ్రు, ఖగోళ శాస్తమ్రు, యంత్ర శాస్తమ్రు వంటి విషయాలను సులభ శైలిలో తన పత్రికలలో రాశారు. ఇప్పుడు మనకు పరాయి దేశస్తుల పరిపాలన లేదు. కానీ- ఆంగ్ల భాషా వ్యామోహం పోలేదు సరికదా నానాటికీ పెరుగుతున్నది. పల్లెటూరి స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాం. తెలుగు అకాడమీ వంటి సంస్థలు శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి రాయించేందుకు కొంత కృషి చేస్తున్నప్పటికీ, ఆ పని ఆవగింజలో అరపాతిక మాత్రమే అయింది. చాలా శాస్త్ర విషయాలలో-ముఖ్యంగా సాంకేతిక శాస్త్ర విషయంలో ఇంకా చాలా ఉన్నత ప్రమాణాలు గల గ్రంథాలు వెలువడవలసి ఉన్నది. ఉత్తరాదిలో అన్ని శాస్త్రాలు హిందీలోకి వచ్చాయి. ఆ భాషలో పలు రంగాలకు సంబంధించి పరిశోధన జరుగుతున్నది. డాక్టరేటు, ఎంఫిల్, సిద్ధాంత వ్యాసాలు అన్ని శాస్త్రాల విషయంలోను తెలుగులో కూడ రావడానికి అవకాశం ఉండాలి.
అయితే-ఒక విషయంలో మాత్రం ‘పురోగతి’ని సాధించాం. వీరేశలింగం ఒకనాటి రాజమహేంద్రవరంలో సారాయి దుకాణాల సంఖ్య పెరిగిపోతున్నదని బాధపడ్డారు. ఇవాళ వీధికి రెండు మూడు వైన్ షాపులు దర్శనిమిస్తున్నాయి. లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, కారుడ్రైవర్లు జాతీయ రహదారిపై వెడుతున్నప్పుడు వారి కంటికి మద్యం దుకాణాలు కనబడితే-వారు మత్తులో తూలిపోతారనే ఉద్దేశంతో-కనీసం జాతీయ రహదారులపైన మద్యం దుకాణాలు లేకుండా చేసి, రోడ్డు ప్రమాదాలు అరికట్టాలనే ఉద్దేశంతో- సుప్రీంకోర్టు వాటి మూసివేతకు ఆదేశం జారీ చేయాల్సి వచ్చింది.
వీరేశలింగం వంటి పెద్దలకు ఆరోజుల్లో-స్ర్తిలకు దాంపత్య జీవితంలో కష్టాలు రావడానికి, అణచివేతకు గురి కావడానికి ప్రధాన కారణం స్ర్తిలకు విద్య లేకపోవడం అని భావించి, స్ర్తి విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. స్ర్తి విద్య గురించి చెబుతూ -
‘వనజాక్షి చదువు నేర్చుకొనగ
నరమాంస విక్రయం బెట్లనుచు వెరచునొకడు
మానవతి విదుషియైనచో వెర్రినోములు
పట్టుట నెట్లంచు బొక్కునొకడు
కమలాక్షి సద్విద్య గరుచుచో నను దేవునిగా
నెంచుకొనుటెట్లంచు బొగులునొకడు
పికవాణి పాండితి వెరయుచో
దెబ్బలు పడుట నెట్లంచును బనువునొకడు
హంసయాన విద్యావతి యయ్యెనేని
బ్రతిమలుగొల్చు నెట్లంచు బదరునొకడు’’
... అని పద్య రూపంలో చెప్పారు. ఇక్కడ ‘నరమాంస విక్రయం’ అంటే- ఆ రోజుల్లో వున్న కన్యాశుల్క పద్ధతి అని అర్థం. ఇక-‘బ్రతిమల గొల్చు’ట గురించి చెప్పడం అంటే-బ్రహ్మసమాజ విధానంలోని ఏకేశ్వరోపాసన గురించి చెప్పడం అని అర్థం.
ఇవాళ స్ర్తిలు ఉన్నత విద్యావంతులవుతున్నారు. కళాశాలల్లోను, విశ్వవిద్యాలయాల్లోను పురుషులకన్నా స్ర్తిలే అధికంగా ఉంటున్నారు. పురుషులతో సమానంగా ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. కానీ-స్ర్తి, పురుష సమానత సిద్ధించిందా? గృహహింస అనేది లేకుండా ఉంటున్నదా?-‘మహిళా సాధికారత’ అనేది కబుర్లకు మాత్రమే ఎందుకు పరిమితమై ఉంటున్నది? ఇలా ఆలోచిస్తే వీరేశలింగం కాలంలో లేని అనేక వికృతులు మరింత వికృత రూపంలో ఈనాటి సమాజాన్ని పీడిస్తున్నాయనిపిస్తుంది.
‘‘నాకు నెయ్యము కన్నా న్యాయమే ప్రియకరమైనది’’ అన్నారాయన. కానీ- ఇవాళ న్యాయము కంటే నెయ్యమే ముఖ్యంగా ఉన్నది. ‘‘ఆచరణలో సంస్కరణ పాటించాలంటే హేతువును సాయంగా తెచ్చుకోవాలి-’’ అన్నారాయన. నేడు ‘హేతువు’కు మనం చాలా దూరంగా ఉంటున్నాం- భూతాలు, దెయ్యాలు, మంత్రాలు వంటి వాటి మీద నమ్మకం పెరిగిపోతోంది. ఒకవేపు చేతబడులను నమ్ముతూ, మరొక వైపు బాల్య వివాహాలు జరుపుతున్నాం. వీరేశలింగం అమావాస్యరోజు- దుర్ముహుర్త సమయంలో కావాలని ఉద్యోగంలోకి చేరాడు. జ్యోతిషం పట్ల నమ్మకాన్ని, శకునాల పట్ల విశ్వాసాన్ని ఆయన అపహాస్యం చేసాడు. ఇవాళ-‘వాస్తు’ శాస్త్రంపై నానాటికీ పెరిగిపోతున్న విశ్వాసాన్ని, జ్యోతిష సిద్ధాంతులకు పెరిగిపోతున్న డిమాండ్‌ను చూస్తే- వీరేశలింగం కలలుగన్న సమాజానికి నేడు మనం ఎంతో దూరంలో ఉన్నామనిపిస్తుంది. వీరేశలింగం కాలం నాటి సమాజానికి ఎంతో ముందు ఉండాల్సిన మనం ఇంకా వెనుకబడే ఉన్నాం!
‘‘ఏ విషయంలోనైనను నేను ఇతరులు చూపిన దారిన పోయినవాడను కాను. నా మనస్సాక్షి తెలిపినట్లుగా నా దారిన నేనే నడుచువాడను-’’ అన్న వీరేశలింగం వాణి మనకు ఇప్పటికీ, ఎప్పటికీ శిరోధార్యం.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969