మెయన్ ఫీచర్

అప్పులే అభివృద్ధి సూచికలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామయ్యకు ఇద్దరు కొడుకులు. చెరో ఐదు ఎకరాలిచ్చి ఎలాంటి అప్పులు లేకుండా కొడుకులిద్దరికీ సమ న్యాయం చేశాడు. లౌక్యంతో పెద్దోడు భార్యతో కలిసి, ఆర్థిక క్రమశిక్షణతో పిల్లలిద్దర్ని చదివించి పెళ్లిళ్లు చేశాడు. తప్పుడు విధానాలతో, చెడు అలవాట్లతో, మరికొంత భూమి కొని వ్యవసాయం చేసిన రెండోవాడు ఆస్తులకు మించి అప్పుల్ని చేశాడు. ఈ కథనంలో ఏది సామాజికమో, ఏది శాస్ర్తియమో, ఏది ఆమోదమో వివరించాల్ని అవసరం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా వున్న భారత్ గణతంత్రం పేరున విశాల దేశంగా ఏర్పడింది. ఇలా ఏర్పడే నాటికి బాహ్యదాడులతో, అంతర్గత యుద్ధాలతో విదేశీయుల పాలనలో కొనసాగిన దేశంలో అప్పులు మాత్రం లేకుండే! ఇలా ఏర్పడిన దేశం విపరీతంగా వున్న సహజ ఖనిజ, జల, అటవీ, సముద్ర సంపదలను శాస్ర్తియంగా వినియోగించుకొని నేటికి సమగ్రాభివృద్ధిని సాధించాలి. రజాకార్ల, దొరల, జమిందార్ల దాష్టీకాల్ని పక్కన పెట్టితే- నిజాం ప్రభువుల పాలనలో విద్య, వైద్య, సామాజిక భద్రతలో, సేవా రంగంలో అవినీతి రహిత, అభివృద్ధికర రాజ్యంగా పేరు పొందింది. సెప్టెంబర్ 1948 ఇండియన్ యూనియన్‌లో కలిసేనాటికి మిగులు బడ్జెట్‌తో ఏడవ నైజాం తులతూగడమే కాక, పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించడం చారిత్రక సత్యం. తన పాలన ఎలా వుందోనని, ఆరవ నిజాం మహబూబ్ అలీ బాషా స్వయంగా గూఢచారి వేషంలో తెలుసుకునేవాడని ప్రతీతి.
స్వతంత్ర దేశంలో స్వయం సమృద్ధితో, సంపదల వినియోగంతో స్వావలంబన సాధించి సమగ్రాభివృద్ధి జరగాల్సిన భారత్ అప్పులపై దృష్టి సారించింది. నీటి పారుదల ప్రాజెక్టుల పేరున, పరిశ్రమల స్థాపన పేరున మొదలైన విదేశీ అప్పులు అదుపూ అంతూ లేకుండా కొనసాగుతూనే వున్నాయి. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకు దగ్గర, దాని అనుబంధ సంస్థల దగ్గర అప్పులు చేసేది. ఇలా 1947 నుంచి డిసెంబర్ 2015 నాటికి ప్రపంచ బ్యాంకు దగ్గర చేసిన అప్పు 102.1 బిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు దగ్గర 52.7 బిలియన్ డాలర్లను, అంతర్జాతీయ అభివృద్ధి అసోసియేషన్ దగ్గర 49.4 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంది. నాడు వీటిని దేశాభివృద్ధికేనని నమ్మించడం జరిగింది. ఇలా తెచ్చిన నిధులతో భారీ ప్రాజెక్టుల్ని, ప్రభుత్వ రంగంలోనే భారీ పరిశ్రమల్ని స్థాపించి వ్యవసాయానికి ఊతమిస్తూ లక్షలాదిమందికి ఉపాధి అవకాశాల్ని కల్గించడం జరిగింది. కాలంతోపాటు మారిన పరిస్థితులు, రాజకీయ అధికారిక స్థాయిలో పెరిగిన ఆడంబరత, అవినీతి, బంధుప్రీతి, అంతులేని ఆస్తుల్ని పోగు చేసుకోవడం అనే సూత్రీకరణతో దేశం అప్పుల్లో దినదినాభివృద్ధి గావించడం మొదలైంది. ఆరంభమే గాని, అంతమే లేని ఈ ఆర్థిక సూత్రీకరణ అప్రతిహతంగా కొనసాగుతూనే వున్నది.
ఏటా 10.6 బిలియన్ డాలర్ల అప్పు చేస్తూపోతున్న భారత్ రుణభారం గత మార్చి 2016 నాటికి 485.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది దేశ జిడిపిలో 69 శాతం కావడంతో ఏటా బడ్జెట్‌లో మిత్తిని (వడ్డీ) కట్టడానికే సింహభాగాన్ని వినియోగించాల్సి వస్తుంది. అప్పుడప్పుడు రాయితీలనిచ్చి, వడ్డీని, అప్పుల్ని తిరిగి చెల్లించడానికి మారటోరియాన్ని విధించి మరిన్ని అప్పులు చేసేలా ఈ బ్యాంకులు ప్రోత్సహంచడం, దీనికి మనవారు గర్వపడడం జరుగుతూనే వున్నది. ఇలా అప్పులు చేయడంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుంది. దీన్ని తలదించుకునే విధానంగా భావించని ప్రభుత్వాలు అప్పులు చేయడం ఓ హోదాగా భావిస్తున్నాయి. పైగా రాష్ట్రాలే నేరుగా అప్పులు తెచ్చుకోవడం కొసమెరుపు.
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి హైదరాబాద్ రాష్ట్రం అప్పులతో లేదు. కోస్తా, సీమ కూడా అప్పుల్లో లేకున్నా పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అవసరంగా వుండేది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడడంతో అదనంగా కోస్తా తీర ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి తోడైనప్పుడు మూడు ప్రాంతాలు మరింతగా అభివృద్ధి జరగాలి. ఎన్‌టిఆర్ పాలన చేపట్టేనాటికి కూడా రాష్ట్రం అప్పుల్లో లేని విషయం తెలిసిందే! స్వర్ణాంధ్రప్రదేశ్ పేరున, సరళీకృత ఆర్థిక వెసులుబాటుతో అప్పులు చేయడం ఓ రాజ్యతంత్రంగా భావించడం, ప్రజల్ని కలలు కనేలా చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తిరిగి స్వయం సమృద్ధిని సాధించాల్సిన రాష్ట్రం అప్పుల బాటలోనే తన ప్రయాణాన్ని సాగించడం మొదలుపెట్టింది. వలస పాలకులు తెలంగాణను అప్పుల్లో ముంచుతున్నారని ఉద్యమ కాలంలో నిందించిన గొంతులు తిరిగి అప్పులతోనే గొంతుల్ని తడుపుకోవడం బాధాకరం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లు అప్పుల్ని తగ్గించకున్నా పెరగకుండా చూడాలి. కానీ, రాష్ట్రం ఏర్పడిన రోజున ఉన్న రుణభారం రూ.61,710 కోట్ల నుంచి మొన్నటి బడ్జెట్ నాటికి రూ.1,40,052 కోట్లకు పెరిగింది. దీన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నిస్తే, అభివృద్ధి కోసం అప్పు చేయడం తప్పుకాదంటూ, అసలు అప్పు చేయని రాష్ట్రం, దేశం లేదని, అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని ఐటి మంత్రి కెటిఆర్ ప్రకటించి ఆర్థికవేత్తలకే ఓ సవాలు విసిరాడు. నిజమే! అమెరికాలో చదువుకుని అవసరానికో, అవకాశవాదానికో రాజకీయాల్లో చేరిన వ్యక్తులకు ఇంతకన్నా భిన్నమైన అవగాహన వుంటుందనుకోవడం పొరపాటే. ప్రజా ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించానని బల్లగుద్ది చెపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అప్పు చేయడం తప్పెలా అవుతుందని, ‘సూపర్ పవర్’ దేశమైన అమెరికా కూడా అప్పులు చేస్తోందని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం గమనార్హం. అప్పులు చేస్తేనే అభివృద్ధి చేసే బాధ్యత పెరుగుతుందనే మరో కొత్త సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి నోబెల్ బహుమతులను ఇచ్చే కమిటీని ఆలోచనలో పడేశారు.
ఇలాంటి పరిస్థితిలో రైతులు చేసిన అప్పులు కూడా వ్యవసాయ అభివృద్ధికే అని భావించి, రుణమాఫీ పథకానికి బదులుగా, మరిన్ని అప్పులు చేయండని రైతుల్ని, కావాల్సినన్ని అప్పులు ఇవ్వండని బ్యాంకుల్ని కెసిఆర్ ఆదేశించాలి. విజయ్ మాల్యాలా చేసిన అప్పుల్ని తీర్చకున్నా సరే.. అనే నిర్ణయానికి రావాల్సింది. ఆసరా పథకాల్ని కొనసాగించకుండా, నేరుగా ప్రజల్నే అప్పులు చేసుకొమ్మంటే సరిపోయేది. ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పుతుండేది. ఇలాంటప్పుడు ఆంధ్రా పాలనంటూ, వలస పాలనంటూ ఎందుకు నినదించినట్లు? ప్రతిదానికీ గత పాలకుల్ని నిందించడమెందుకు? ఈ లెక్కన చంద్రబాబును కూడా అభినందించాలి. అంటే, అప్పుల్ని చేయడానికి రాజకీయ అర్హతతోపాటు, ప్రాంతీయ అర్హత కూడా వుండాలన్నమాట!
ఇలా ‘తండ్రీ కొడుకులు’ (కెసిఆర్, కెటిఆర్) తమదైన శైలిలో అప్పుల ఘనత గూర్చి చెప్పిన ఓ నాలుగు రోజులకే మార్చి 20న ‘ప్రపంచ సంతోష దినా’న్ని పురస్కరించుకొని ఐక్య రాజ్యసమితి తన ఐదవ నివేదికను విడుదల చేసింది. నిజమైన జిడిపిలో సరాసరిగా వ్యక్తులు అనుభవిస్తున్న ఆదాయం, జీవన ప్రమాణాల్ని పెంచే ఆరోగ్యం, అవినీతి రహిత సేవారంగం, జనాలలో దాతృత్వం, ఇష్టమున్న అవకాశాల్ని న్యాయబద్ధంగా వినియోగించుకోవడం, సామాజిక భద్రత అనే అంశాలపై 155 దేశాల్లో జరిపిన సర్వేలో భారత్ 122వ స్థానంలో వుండడం గమనార్హం. అభిప్రాయ సేకరణకు కేటాయించిన 10 మార్కులకు గాను అత్యధికంగా 7.54 పాయింట్లు సాధించి నార్వే మొదటి స్థనంలో నిలువగా 5.3 పాయింట్లతో భారత్ 118వ స్థానం నుంచి 122వ స్థానం పడిపోయింది. మొదటి పది స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఐస్‌లాండ్, స్విడ్జర్‌లాండ్, ఫిన్‌లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విస్‌లు నిలిచాయి. ఏ దేశాభివృద్ధికైనా పైన పేర్కొన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఇవన్నీ కలిస్తేనే ‘సస్టయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్ నెట్‌వర్క్’గా భావించాల్సి వస్తుందని, సామాజిక భద్రతను మరిచి అప్పులు చేయడం అభివృద్ధికరం కాదని నర్మగర్భితంగా ఆ నివేదికలో హెచ్చరించడం జరిగింది.
అప్పులు చేస్తూనే అమెరికా సూపర్ పవర్‌గా ఎదిగిందన్న కెసిఆర్, అమెరికా 14వ స్థానంలో వుందన్న విషయం గుర్తించాలి. చైనా 79వ స్థానంలో వుండగా, మన సరసన గల సార్క్ దేశాలైన పాక్, నేపాల్, భూటాన్, బంగ్లా, శ్రీలంకలు మనకన్నా పై స్థాయిలో వుండడం మన నాయకులు ఈ సందర్భంగా గుర్తించాలి. ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్’ అంటూ, రాబోయేవన్నీ మంచి దినాలేనంటున్న మోదీ, కెసిఆర్ లాంటివారు ప్రపంచంలోనే ఆర్థికంగా మూడో స్థానంలో వున్న భారత్, దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్న తెలంగాణ ఎందుకు వెనుబడుతున్నాయో వివరించాలి. అప్పులతో, విదేశీ పెట్టుబడులతో ‘స్వర్ణాంధ్ర’ కల ఎలా సాకారమైతుందో చంద్రబాబు స్పష్టం చేయాలి.
ప్రాధాన్యత లేని ప్రాజెక్టుల్ని, సత్వరం అవసరం కాని పథకాల్ని ముందేసుకుంటూ, పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ, స్వామిజీలను వైస్ చాన్సలర్లుగా భ్రమిస్తే ఎదిగేది బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్ర కాదు. ఇవి రుణ రాష్ట్రాలుగానే ఎదుగుతాయి. ఇప్పటికే ఇది దాటాల్సిన పరిధిని దాటుతుంది. అప్పుల్ని తీర్చకున్నా, పెరగకుండా చూస్తే అదే పదివేలనుకోవాల్సిందే! ప్రజల దృష్టిలో పడడానికి తాపత్రయపడే ప్రతిపక్షాలు, అప్పుల విషయంలో తమ విధానాల్ని విధిగా ప్రకటించాలి. లేదంటే పాలకపక్షం, ప్రతిపక్షం దొందూ దొందేనని గుర్తించాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ఆలోచన జనాల్లో వుందని మర్చిపోకూడదు. *

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162