మెయన్ ఫీచర్

‘లాల్-నీల్’ నినాదంలో స్పష్టత ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లాల్ జెండా’, ‘నీల్ జెండా’ ఒకటి కావాలన్నది కొంతకాలంగా వినవస్తున్న నినాదం. తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపుసభ సందర్భంగా హైదరాబాద్‌లో ఇటీవల మళ్లీ ఈ నినాదం వినిపించింది. ఇది ఉత్తేజకరంగా తోచే నినాదమని కమ్యూనిస్టు శ్రేణులు , తమది ‘నీల్ జెండా’ అని భావించే దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ నినాదం బలంగా ముందుకు వచ్చి ఏడాది కాలం అవుతున్నది. అపుడు ఆ పని చేసింది సిపిఎం జాతీయ నాయకత్వం. ఆ నినాదం ఇవ్వటానికి కారణం 2014 ఎన్నికలలో వారు ఎదుర్కొన్న తీవ్రమైన పరాజయాలు అనే అభిప్రాయం పరిశీలకులకు కలిగింది. అదెట్లున్నా ఒక కొత్త నినాదాన్ని ఇవ్వటాన్ని బట్టి, వారి దృక్పథంలో మార్పు వస్తుండవచ్చునని, అదేమిటో గమనించవలసి ఉంటుందని అంతా భావించారు.
ఏ పార్టీకి అయినా సరే ఒక ముఖ్యమైన విషయంలో ఒక వైఖరి తీసుకున్నపుడు దానిపై విధానపత్రం లేదా దృక్పథపత్రం (కానె్సప్ట్ పేపర్) ఉండాలి. అందులో ఆ విషయంపై ముందు వెనుకల చర్చ, తీసుకోదలచిన వైఖరి, ఆ వైఖరి తీసుకోవటానికి గల కారణాలు, ఆ దృక్పథం ఆచరణకు అనుసరించవలసిన పద్ధతులు, ఆ దారిలో తమకు మిత్రులెవరు? ప్రత్యర్థులెవరు? విధాన లక్ష్యాలు ఏమిటి? వంటి వివరాలు ఉంటాయి. ఆ పత్రంపై స్వంత పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది. తర్వాత ఆ విధాన ముసాయిదాకు తగు మార్పులతో తుది రూపం ఇస్తారు. ఆ ప్రకారం ఆచరణకు వెళతారు. ఒకవేళ తమ విధానం అమలు కోసం మిత్రపక్షాలు, లేదా సామాజిక సంఘాలతో ఐక్యవేదిక అవసరమనుకుంటే విధాన పత్రాన్ని వారికి కూడా అందజేసి చర్చలకు ఆహ్వానిస్తారు. ఆ మీదట ఉమ్మడి అవగాహనలు, కార్యాచరణలు ఉంటాయి. అవి నూటికి నూరు శాతం ఏకోభావనలు కానవసరం లేదు. ఎవరి వౌలిక సిద్ధాంతాలను, అంతిమ లక్ష్యాలను వారు ఉంచుకుంటూనే విశాల ప్రాతిపదికపైన స్థూలమైన అంగీకారాలన్నమాట.
సిపిఎం నాయకత్వం ఏడాది క్రితం ‘లాల్-నీల్’ నినాదమిచ్చినపుడు వారి నుంచి ఇటువంటి విధానపత్రం ఒకటి వెలువడగలదని వేచి చూసిన వారు తగినంతమంది ఉండి ఉంటారు. కాని అప్పటి నుంచి ఏడాది గడిచిపోయినా పత్రమేదీ రాలేదు సరికదా, పత్రరచనకు ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు కూడా లేవు. ఆ పని అవసరమని వారు భావిస్తున్నారో లేదో కూడా తెలియదు. ఈ మాట అనటం నిర్హేతుకమైన తొందరపాటుగా తోచవచ్చు. కాని ఈ సందేహానికి కారణం ఉంది. ఉదాహరణకు కమ్యూనిస్టుల ‘మతతత్త్వ ప్రమాదం’ అనే విషయాన్ని తీసుకుందాం. దేశంలో మధ్యేమార్గ అనుకూల, వామపక్ష అనుకూల భావజాలాలకు భిన్నంగా ఒక కొత్త వాతావరణం నెమ్మదిగా ఏర్పడటం మొదలై సుమారు ముప్పయి సంవత్సరాలైంది. అది కొంత వెనుక ముందులవుతూనే మొత్తం మీద ముందుకు ప్రయాణిస్తున్నది. ఈ స్థితిపట్ల మధ్యేమార్గవాదులు, ఉదారవాదులకు మించి వామపక్ష వాదులు ఎక్కువ ఆందోళన ప్రకటించారు. ఈ ముప్పయి ఏళ్లలో కాలం గడిచిన కొద్దీ వారి ఆందోళనా పెరుగుతూ వచ్చింది. ఆ ధోరణిపై విమర్శలు, దానిని ఎదుర్కోవాలనే వాదనలు తీవ్రమవుతూ వచ్చాయి. కాని గమనించ దగినదేమంటే ఈ విషయమై ముప్పయి సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వారికి నినాదాలు, తీర్మానాలు, ప్రసంగాలు మినహా ఒక నికరమైన దృక్పథ పత్రమంటూ లేదు, వ్యూహమూ లేదు.
ఈ దేశం, ఇక్కడి సమాజాలు, మతాలు, సంస్కృతులు, మనోభావాలు, ఏది మతం, ఏది మతతత్త్వం, సమాజాలు ఎందుకు, ఎపుడు, ఏ విధంగా వ్యవహరిస్తూ రావటాన్ని చరిత్రలో చూస్తాము, వర్తమానంలో జరుగుతూ వస్తున్నదేమిటి? మతం - లౌకికతల మధ్యన జరుగుతున్నదేమిటి? తమకు దీనంతటిలో ఏదైనా అభ్యంతరకరమని తోస్తే ఆ విషయమై తక్షణంగా - మధ్యకాలికంగా - దీర్ఘకాలికంగా అనుసరించవలసిన వ్యూహమేమిటి? అనే దృక్పథ పత్రం వారికి లేనే లేదు. ఇలా లేకపోవటం సిపిఎంకు మాత్రమే కాదు. వామపక్షాలలో దేనికీ లేదు. ఇది విస్మయాన్ని కలిగించే పరిస్థితి. ఇటువంటి సైద్ధాంతికపరమైన కొరతను తీర్చుకునేందుకు ఏ ప్రయత్నమూ చేయని వారు కేవలం నినాదాలు, ఇతర పార్టీలతో పొత్తుల ద్వారా సమస్యను ఎదుర్కొనజూశారు. పొత్తులన్నీ అధికార రాజకీయం చుట్టూ తిరిగేవి గనుక, అదే దృష్టిలో పనిచేసే అవతలి పార్టీలు ఇవాళ సెక్యులర్, మరునాడు కమ్యూనల్ అవుతూ వచ్చాయి. కమ్యూనిస్టులకు తాము ఈ చదరంగంలో ఎక్కడున్నదీ తమకే అర్థం కాకుండా పోయింది. అందుకే కావచ్చు 2014 తర్వాతి ఎన్నికలలో ఎక్కడ కూడా సెక్యులర్ పొత్తులనే మాట వినిపించలేదు.
ఇంత కీలకమైన అంశంపై మూడు దశాబ్దాలపాటు ఈ విధంగా వ్యవహరించిన వారు, ఇపుడు ‘లాల్- నీల్’ నినాదమిచ్చి ఏడాది అయినా ఈ విషయమై విధానపత్రం గురించి ఆలోచించక పోవటంలో ఆశ్చర్యపడవలసింది లేదేమో. సెక్యులరిజంపై పత్రాన్ని రూపొందించక పోవటంలోనే వారికి ఒక సౌకర్యం ఉందా? అనే అనుమానం కలుగుతున్నది. ఒకసారి పత్రం తయారు చేస్తే ఎన్నికల అవగాహనలు అందుకు తగినట్లు ఉండాలి. ఇతరత్రా కార్యాచరణ ఆ ప్రకారం సాగాలి. కాని దైనందిన అధికార రాజకీయాలలో పొత్తులు ఆ విధంగా ఉండటం కష్టం. కమ్యూనిస్టుల రాజకీయం ‘ఏదో ఒక పద్ధతిలో’ కొన్ని సీట్లు సంపాదించుకోవటమనే దశలోకి ప్రవేశించిన తర్వాత, విధానపత్రాన్ని ముందు పెట్టుకుని కూర్చుంటే దానికి అధికార రాజకీయపు ఓట్ల లెక్కలతో సమస్య ఏర్పడుతుంది. ‘ఫ్రీ మార్కెటింగ్’ కష్టమవుతుంది. కనుక విధాన పత్రపు ‘గుదిబండ’ లేకపోవటంలోనే సౌకర్యముంది.
ఇపుడు ‘లాల్- నీల్’ విషయం అందుకు భిన్నమైందా? ‘నీల్’ అనే నిర్వచనం కిందకు వచ్చే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, బిసిలతో పొత్తు కోరుకోవటంలోని ఉద్దేశం ఓట్లు-సీట్లు మాత్రమేనా? లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఉంటే అదేమిటి? యథాతథంగా కమ్యూనిస్టులది మార్క్స్- ఎంగెల్స్ సూత్రీకరించిన వర్గవాదం. ఆ వాదం ఆర్థిక వర్గాలను తప్ప కులాలు, ఆదివాసీ జాతులు, జెండర్, అల్ప సంఖ్యాక వర్గాల వంటి విభజనలను గుర్తించదు. వాటిని గుర్తించి ఆయా వర్గాల సమస్యల అజెండాను చేపట్టడమంటే వర్గ దృక్పథపు అజెండాను భంగపరచటమేనని వారి అభిప్రాయం. కనుక మొదటి నుంచి ఇటీవలి కాలం వరకు ఆ పార్టీలు ఈ భిన్నత్వాలను గుర్తించక పోవటమే గాక, అందువల్ల పేదలు పక్కదారి పడతారంటూ ఖండించాయి. వారి సిద్ధాంతం ప్రకారం అది సరైన తర్కమే కావచ్చుగాని, భారతదేశ సామాజిక వాస్తవాలను గుర్తించని కమ్యూనిస్టులు విఫలమవుతున్నారని, కనుక తమ దృక్పథాన్ని మార్చుకోవాలన్న వాదన స్వాతంత్య్రానికి ముందునుంచే ఉంది. అయినా మారని వామపక్షాలు ఇటీవలి కాలంలో మాత్రం ‘కులం’ ప్రశ్నపై ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనుకకు తరహాలో కొయ్య గుర్రపు స్వారీ చేస్తూ మొత్తం మీద ఉన్నచోటనే ఉన్నారు.
అటువంటిది అకస్మాత్తుగా ఇపుడు- 2014 ఎన్నికల ఎదురు దెబ్బలతో ‘లాల్-నీల్’ నినాదం మొదలుపెట్టారు. కులాన్ని సూత్రప్రాయంగా గుర్తించటం పదిహేనేళ్ల క్రితమే చేసినప్పటికీ తిరిగి అందుకు భిన్నమైన వైఖరిని మరొక దశాబ్దానికి తీసుకున్న వారికి, 2014 ఎన్నికలు కొత్త వివేకాన్ని కలిగించినట్లా? 2014 వరకు వామపక్షాలకు కాంగ్రెస్‌తోపాటు వివిధ జాతీయ ఫ్రంట్‌లు, ప్రాంతీయ పార్టీలు తగినంత ఆసరాగా ఉండేవి. క్రమంగా ఫ్రంట్‌లు కనుమరుగు కాగా, కాంగ్రెస్ బలహీనపడిపోతున్నది. ప్రాంతీయ పార్టీల సెక్యులరిజం ఒక జూదంగా మారింది. ఇటువంటి స్థితిలో అధికార రాజకీయం కోసం కొత్త ఆధారాలు కావాలి. అందుకు తగిన ఆధారం ‘నీల్’లో కనిపిస్తున్నదనుకుంటే పొరపాటు అవుతుందా?
ఇదంతా చూసి వింతగా కూడా తోస్తుంది. ‘నీల్’ అనే నిర్వచనం కిందకు వచ్చే వర్గాలన్నీ నిజానికి మార్క్సిస్టు దృక్పథం కిందకు వచ్చే వర్గాలే. అట్లా అవన్నీ ‘లాల్’ అయేవే. కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడటం, పనిచేయటం ఈ అవగాహన ప్రకారం జరిగేవే. అనగా ఈ వర్గాలకు ‘లాల్’కు మధ్య ‘సహజ మైత్రి’ ఉండాలి. ఆ స్థితి ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 90 సంవత్సరాల తర్వాత పోయినట్లా? ఆ వర్గాలకు ‘నీల్’ పేరిట వేరే ఉనికి వచ్చినట్లా? వారితో మైత్రికి ‘లాల్’ పార్టీలు కొత్త ప్రయత్నాలు చేయవలసి వస్తున్నట్లా? ఇంతకూ ఇది సైద్ధాంతికమైన, సామాజికమైన, వ్యవస్థాగత రాజకీయమైన దృక్పథమా? లేక కేవలం అధికార రాజకీయాల దృష్టిగలదా?
70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం పలు విధాల అనుభావాలతో సమాజం, రాజకీయాలూ అనేక మార్పులకు గురవుతున్నాయి. వాటిలో స్థూల దృష్టికి కనిపిస్తున్నవి కొన్ని కాగా, సూక్ష్మ దృష్టికి తప్ప కనిపించనివి కొన్నున్నాయి. ‘నీల్’ అనబడే సామాజిక వర్గాలు చాలా మథనానికి గురవుతున్నాయి. అవి ఈ ఏడు దశాబ్దాలలో తాము పలువురికి ఉపయోగపడి మోసపోయామనే భావనతో ఉన్నాయి. సరిగ్గా ఇవే వర్గాలు బెంగాల్‌లో ఇపుడు వామపక్షాల నుంచి దూరమవుతుండటానికి కారణం ఈ భావనే. దళిత, ఆదివాసీ జనసామాన్యం తమ నాయకులను సైతం విశ్వసించలేని పరిస్థితి తగినంత ఉంది. అందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ విధమైన వివిధ నేపథ్యాల మధ్య వామపక్షాలు ‘లాల్-నీలా’ నినాదమిస్తూ వీరిని ఆకర్షించ జూస్తున్నాయి. ఇందులోని ఉద్దేశం ఎంతవరకు తమ ప్రయోజనమో? ఏ మేరకు ‘నీల్’ వర్గాల ప్రయోజనమో? చెప్పగల స్థితి లేదు. మొదటనే అనుకున్నట్లు వామపక్షాలకు దీనిపై ఒక విధానపత్రమూ లేదు. ఉత్తేజకర నినాదం భ్రమలు కల్పించటానికి మించి ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వగలదా? *

టంకశాల అశోక్ సెల్: 98481 91767