మెయన్ ఫీచర్

అందరికీ ఆరోగ్యం.. ఎన్నాళ్లకి సాకారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా ఏప్రిల్ 7వ తేదీన ‘ప్రపంచ ఆరోగ్య దినం’ పాటిస్తున్నా, అనేక దేశాల్లో ఇప్పటికీ ఆరోగ్య విధానం అగమ్యగోచరంగానే ఉంది. ప్రత్యేకించి స్ర్తిలను, శిశువులను అంటువ్యాధుల బారినుంచి రక్షించడానికి పునరంకితం కావడం ‘ప్రపంచ ఆరోగ్య దినం’ లక్ష్యం. ఐక్యరాజ్యసమితిలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యుహెచ్‌ఓ) అవతరించిన రోజు ఏప్రిల్ 7 కావడంతో ఆ సంస్థ ఆవిర్భావ దినాన్ని ‘ప్రపంచ ఆరోగ్య దినం’గా పాటిస్తున్నారు. 1978లో ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ‘కజికిస్తాన్’లోని ఆల్మాఆటా అనే చోట సభ్య దేశాలన్నింటినీ సమావేశపరిచి- ఆరోగ్య పరిరక్షణ విషయమై ఒక విధాన పత్రాన్ని విడుదల చేసింది. దానినే ‘ఆల్మా ఆటా ప్రకటన’ లేదా ‘ఆల్మా ఆటా తీర్మానం’ అని అంటారు. సభ్య దేశాలన్నింటిలోను 2000వ సంవత్సరం నాటికి ‘ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ’ జరగాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దాన్ని అంగీకరిస్తూ భారత్ సహా సభ్య దేశాలన్నీ సంతకాలు చేశాయి. ఈ లక్ష్యంతోనే మన దేశం 1983లోనే జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించింది. 2000 సంవత్సరం దాటి నేటికి 16 ఏళ్లు గడిచాయి. అయితే ప్రపంచ దేశాల్లో, ప్రత్యేకించి మన దేశంలో ప్రజల ఆరోగ్య స్థితి ఎలా ఉన్నదన్నది ఓ ప్రశ్నార్థకమే.
2012లో ఐక్యరాజ్యసమితి జరిపిన గణాంక పరిశీలన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.1 కోట్లమంది పిల్లలు అతిసార, మలేరియా, న్యుమోనియా, ఇతర అంటువ్యాధుల కారణంగా అస్వస్థతకు గురి అవుతున్నారు. వారిలో దాదాపు 70 శాతం మంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా మరణిస్తున్న వారిలో 21 శాతం మంది భారత్‌లో జన్మించిన వారే కావడం గమనార్హం. మన దేశంలో శిశు మరణాల సంఖ్య వెయ్యికి 43.8 శాతంగా వుంది. అభివృద్ధి చెందిన దేశాలలో పరిస్థితి ఇలా లేదు. ప్రతి వెయ్యిమంది శిశువుల్లో చనిపోతున్నవారి సంఖ్య జపాన్‌లో కన్నా భారత్‌లో పదిరెట్లు ఎక్కువ, కెనడా, స్విట్జర్లాండ్‌ల కన్నా 11 రెట్లు ఎక్కువ, అమెరికా కన్నా ఏడున్నర రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం అల్పాదాయ వర్గాల వారికి వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడం, దారిద్య్రం కారణంగా పిల్లలు, తల్లులు, గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడడడం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం. ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో 90 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మన దేశంలో 20 శాతం మంది పిల్లలలో తీవ్ర పోషకాహార లోపం ఉన్నది. ఇలాంటి గణాంకాలు మనం సాధిస్తున్న ప్రగతికి సూచికలుగా ఉండవు. ప్రజారోగ్యం బాగుపడడమనేది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోగ్య రంగానికి ఎంత శాతం కేటాయిస్తున్నాం? ఆ మొత్తం ఎంతగా సద్వినియోగం అవుతోంది? దారిద్య్ర నిర్మూలన పథకాలు ఎంతగా విజయవంతం అవుతున్నాయన్న విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికంగా ఉన్నప్పుడు ఏ రంగంలోనైనా ప్రగతి శూన్యంగా ఉన్నట్టే, ఆరోగ్య రంగంలో కూడా ప్రగతి కనబడదు.
కొద్ది వారాల క్రితం భారత ప్రభుత్వం కొత్త ఆరోగ్య విధానాన్ని (నేషనల్ హెల్త్ పాలసీ) ప్రకటించింది. 2014లో రూపొందించిన ముసాయిదాకు ఇది తుది రూపం. ఇందులో ‘వినసొంపుగా ఉండే విషయాలు’ చాలానే ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో సదుపాయాలు అధికం చెయ్యడం, జిల్లా ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరచడం, ‘నేషనల్ హెల్త్‌కేర్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్’ అనే సంస్థను ఏర్పరిచి ఆసుపత్రుల్లో సదుపాయాలు, ప్రమాణాలను నిర్ధారించడం, ‘నేషనల్ డిజిటల్ హెల్త్ అథారిటీ’ సంస్థను ప్రారంభించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సేవలు లభించేలా చూడడం వంటి హామీలు బోలెడు ఉన్నాయి.
‘అందరికీ ఆరోగ్యం’ ఎప్పుడు సమకూరుతుంది?’ అంటే- అది 2030 నాటికి సాకారం అవుతుందని పాలకులు అంటున్నారు. ఇది వాస్తవ రూపం దాల్చాలంటే- ప్రభుత్వ ఆసుపత్రులలో తగినంత మంది వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది, మందుల లభ్యత, వైద్య ఉపకరణాల లభ్యత ఉండాలి. ఇందుకు నిధుల కేటాయింపులు విరివిగా ఉండాలి. 2025 నాటికి స్థూల జాతీయోత్పత్తి విలువలో 2.5 శాతాన్ని వైద్యరంగానికి ఖర్చు చేస్తామంటున్నారు. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు స్థూల జాతీయోత్పత్తి విలువలో 12 శాతం ఖర్చు చెయ్యాలనుకున్నారు. కానీ, ఈనాటికీ ఏ ప్రభుత్వంలో కూడా కనీసం 2 శాతం కూడా ఖర్చు చేస్తున్న దాఖలా లేదు. వైద్యరంగం అనేది రాష్ట్రాలకు కూడా సంబంధించినది కాబట్టి రాష్ట్రాలు తమ రాష్ట్ర బడ్జెట్‌లో 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి విలువలో 8 శాతం ఖర్చు చెయ్యాలంటున్నారు.
మనకన్నా పేద దేశాలైన బ్రెజిల్, శ్రీలంక, తమ స్థూల జాతీయోత్పత్తిలో 2 శాతం కన్నా ఎక్కువ ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అధికంగా కేరళ తన స్థూల జాతీయోత్పత్తి విలువలో 11 శాతం నిధులను ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నది. కేటాయింపుల సంగతి సరే, నిధుల ఖర్చు ఏ మేరకు సక్రమమైన ఫలితాలనిస్తున్నదా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. స్థూల జాతీయోత్పత్తి విలువలో బంగ్లాదేశ్ కూడా 1.3 శాతమే ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నది. కానీ ఫలితాల సాధనలో తేడా ఉంది. 1990-2012 మధ్య కాలాన్ని తీసుకుంటే భారతదేశంలో శిశుమరణాల సంఖ్య 50 శాతం తగ్గింది. బంగ్లాదేశ్‌లో మాత్రం 67 శాతం తగ్గింది. ఆరోగ్య రంగంలో మనం పెడుతున్న ఖర్చు ఎంత అన్న విషయాన్ని పక్కన పెడితే, ఖర్చుకు తగిన ఫలితాలు రావడం లేదనేది గమనించాల్సిన విషయం.
వైద్య రంగంలో ప్రభుత్వ రంగం, ప్రైవేటురంగం రెండూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ రెండు రంగాల్లోని ఆస్పత్రులూ వేర్వేరు రూపాలలో ప్రజల కష్టాలను అధికం చేస్తున్నాయి. సిబ్బంది కొరత, మందుల కొరత, సిబ్బంది అనాసక్తత, నిర్లక్ష్యం, అవినీతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో బాధ కలిగిస్తూ ఉంటే-ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులు తమ దగ్గరకు వచ్చిన రోగులకు వ్యాధి నయం చేయడం విషయం అలా వుంచి, అక్కర్లేని పరీక్షలతో, శస్త్ర చికిత్సలతో, దారుణమైన ఫీజులతో దోచుకొనడం జరుగుతున్నది. ఆమధ్య కోల్‌కతలో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం కారణంగా ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే ఆస్పత్రివారు రకరకాల పరీక్షలు జరిపి, వారం రోజులు ఆస్పత్రిలో ఉంచారు. కానీ అతడికి నయం కాలేదు. ఇలాంటి స్థితిలో ఆ వ్యక్తి కుటుంబీకులు మరొక ఆస్పత్రికి అతడిని తీసుకెడతామనుకుంటే, ఇన్నాళ్లు చేసిన వైద్యానికి ఏడున్నర లక్షలు చెల్లించమన్నారు! రోగి ఎన్నాళ్లు ఆస్పత్రిలో ఉండాలో ఆస్పత్రి సిబ్బంది ముందుగా చెప్పలేదు. ఏయే పరీక్షలు చేస్తున్నారో, ఏ మందులు ఎందుకు వాడుతున్నారో చెప్పలేదు. కానీ చివరికి అంత పెద్ద మొత్తం చెల్లించమన్నారు. ఆర్థిక స్థోమత లేకపోయినా వారు అతికష్టం మీద ఆ మొత్తం చెల్లించి మరొక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరోజు ఉన్నాక రోగి చనిపోయాడు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి 3 లక్షలు చెల్లించమన్నారు! ఆ మొత్తం వారి దగ్గర లేనందున ఆస్పత్రి యాజమాన్యానికి తమ దగ్గర ఉన్న బంగారం, తమ ఇంటి దస్తావేజులు తాకట్టుపెట్టి- మృతదేహాన్ని తీసుకువెళ్లారు! ఇది వాస్తవంగా జరిగిన ఉదంతం. ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్‌లో అలజడిని రేపితే, అక్కడి ప్రభుత్వం హడావుడిగా - ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్, అండ్ ట్రాన్స్‌పెరన్సీ) చట్టా’న్ని కొద్ది మాసాల క్రితం జారీ చేసింది. ఈ బిల్లులోని ముఖ్య అంశాలేమిటంటే- 1. రోగులకు ప్రైవేటు ఆసుపత్రుల వారు ఎలాంటి వైద్య పరీక్షలు చేయదలచిందీ, వాటికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే తెలియజేయాలి. రోగి తీవ్ర అస్వస్థతలో ఉంటే, అతడి కుటుంబీకులకు తెలియజెయ్యాలి. తాము చెయ్యదలచుకున్న వైద్యం విషయంలో- వాడాల్సిన మందుల విషయంలో పారదర్శకత ఉండాలి. 2. రోడ్డు ప్రమాదాల విషయంలో, హఠాత్తుగా వచ్చే తీవ్ర వ్యాధుల విషయంలో-రోగి కుటుంబీకులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా వారిని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం ప్రారంభించాలి. ఆ తర్వాత వారు తగు మొత్తాన్ని చెల్లించుకునే అవకాశం ఇవ్వాలి. 3. రోగి మరణిస్తే డబ్బు చెల్లిస్తేనే గానీ మృతదేహం ఇస్తామని అనకూడదు. సంబంధీకులకు మృతదేహాన్ని అప్పగించి, ఆ తర్వాత ద్రవ్యాన్ని చెల్లించుకునే అవకాశం ఇవ్వాలి. 4. రోగి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన ప్రాథమిక అంచనా కంటే వాస్తవంలో చెల్లించాల్సిన మొత్తం కొంత ఎక్కువ ఉండవచ్చును కానీ, చాలా ఎక్కువ వుండకూడదు. ఈ తేడా ఎంతశాతం వరకూ ఉండవచ్చునో తర్వాత నిర్ధారిస్తారు. ఈ చట్టం ఎంతవరకు అమలు జరుగుతుందనేది ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు ఇచ్చే సహకారం బట్టి ఆధారపడి ఉంటుంది. అది సహజంగానే తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల వారు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం వ్యాపారంగా వున్న ఈ రోజుల్లో ఇలాంటి చట్టాలు అమలు జరగడడం చాలా కష్టం.
ప్రభుత్వ ఆసుపత్రులు సక్రమంగా పనిచేస్తే ఇట్లాంటి పరిస్థితులకు అవకాశమే ఉండదు. విద్య, వైద్యం అనేవి జాతి ప్రగతికి కీలకమైన అంశాలు. కానీ నేడు ఈ రెండు రంగాలలోనూ వాణిజ్య ప్రవృత్తి రాజ్యమేలుతున్నది. మనం ఆర్థిక వృద్ధి రేటు విషయంలో-ప్రతిబంధకాలన్నింటినీ అథిగమించి ముందడుగు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మానవాభివృద్ధి సూచిక విషయంలో చాలా తక్కువ ‘ర్యాంకు’లో ఉన్నాం. ఇటీవల వెలువడిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారం- లెక్కింపు జరిగిన 186 దేశాల్లో మనది 131వ స్థానం. మనకన్నా దిగువ స్థానంలో 55 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక వృద్ధి రేటు అనేది స్థూల జాతీయాదాయం ఏ రేటున పెరుగుతున్నదనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మానవాభివృద్ధి సూచిక అనేది కేవలం జాతీయాదాయం, తలసరి ఆదాయం, విదేశీ మారకపు నిల్వల వంటి లెక్కల పైన మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ దేశంలోని ప్రజల సగటు ఆయుఃప్రమాణం, విద్య, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సదుపాయాలు- లైంగిక విచక్షణ, ప్రసూతి సదుపాయాలు, శిశు మరణాల సంఖ్య మొదలైన ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లనే జాతీయాదాయ వృద్ధి రేటు అధికంగా ఉన్న దేశాలు కూడా మానవాభివృద్ధి సూచిక విషయంలో వెనుకబడి ఉండే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాల్లో ప్రజల జీవన ప్రమాణం పెరిగినప్పుడే మానవాభివృద్ధి సూచికలో పురోగతి సాధించేందుకు అవకాశముంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా మనం ‘యుఎన్‌జిసి’ లెక్కల ప్రకారం ‘మధ్యస్థాయి అభివృద్ధి చెందిన దేశం’గా మిగిలిపోవడానికి కారణం ఇదే! ఈ పరిస్థితుల్లో ‘అందరికీ ఆరోగ్యం’ సాధ్యమా? *

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969