మెయన్ ఫీచర్

సర్కారీ విద్యకు ‘కార్పొరేటు’ కాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మేధావులు స్వార్థపరుల’నే నానుడి వుంది. అందరూ కాకపోయినా కొందరు అవకాశాలకు అనుగుణంగా మాట్లాడ డం, లబ్ది పొందడం జరుగుతూ వుంటుంది. ఇందులో బుద్ధిజీవులది ప్రత్యేక పాత్ర! మాటలు మధురంగా, చేష్టలు వగరుగా వుంటాయి. వీరికి సామాజిక స్పృహ దండిగా వున్నా పరాన్నజీవుల్లా బతుకీడ్చడం, పాలక పక్షం వైపు మొగ్గు చూపడం అలవాటు. ఈ బలహీనతల్ని గుర్తెరిగిన పాలకులు ప్రజల్ని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ, తమవైపు అయస్కాంతంలా ఆకర్షించడం జరుగుతుంది. ఈ సంధికాలంలో జరగాల్సిన విధ్వంసం జరుగుతూనే వుంటుంది. అందుకే పాలకులదే ఎప్పుడు పై చేయిగా వుంటుంది. ఇందుకు విద్యారంగాన్ని ఉదాహరణగా తీసుకుంటే అన్నీ విషాద గాధలే. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దాని పయనమెటో, ఎవరు నిర్దేశిస్తున్నారో, ప్రభుత్వాల విధానమేంటో ఏనాడూ విశదపడదు. తల్లిదండ్రులకు పట్టించుకోవాలనే బాధ్యత కనపడదు. పిల్లల్ని కన్నందుకు ఓ పాఠశాలకు పంపాలని, ఆ పాఠశాల అత్యుత్తమంగా వుండాలని, అక్కడ అతి తక్కువ ఫీజుల్ని వసూలు చేయాలని, నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని, తమ బుడతలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్‌గా ఎదగాలని, ప్రపంచాన్ని ఏలాలని కలలుగనడం నేటి తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. ఎంత అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే చింత తప్ప, సంబంధిత పాఠశాల యాజమాన్యం స్వభావమేంటి? లక్ష్యం ఏంటి? ఏ నియమ నిబంధనల కింద ఆ పాఠశాల నడుస్తున్నది, ఏ విధానాల్ని పాటిస్తున్నారు? భాషల పట్ల, మాతృభాష పట్ల యాజమాన్యానికున్న వైఖరి ఏంటి? ఏ బోర్డుకు అనుసంధానమైంది? ఎందుకైంది? నిజంగా అంత అవసరం వుందా? ఉపాధ్యాయుల నియామకం, వారి జీతభత్యాలు, విద్యార్హతలు, బోధనా విధానం, ఆ బోధన విద్యార్థి మానసిక, శారీరక స్థాయికి అనుగుణంగా వుందా? పాఠశాల కల్గిస్తున్న వాస్తవ భౌతిక, పరిస్థితులేంటి? యాజమాన్యాలు చెపుతున్నది, ఆచరిస్తున్నది ఒకటేనా? పాఠ్యాంశాల ఎంపిక, పుస్తకాల ఎంపిక ఏ విధానంపై జరిగింది? పరీక్షల విధానం, మూల్యాంకనం ఏ విధంగా వుంది? అన్ని హంగులతో విద్యనందిస్తే కొంతమంది పిల్లలు ఎందుకు వెనకబడుతున్నారు? .. ఇలాంటి అనేక ప్రశ్నలు ఏ స్థాయి తల్లిదండ్రుల బుర్రల్లో మెదలదు. అన్నింటికి మించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే ‘సంకెళ్ళు’ (ఐఐటి- ఐఎఎస్- ఎమ్సెట్ లాంటివి) ఎలావేస్తారనే ఆలోచన ఏ కోశాన వుండదు.
మాతృభాషను మాట్లాడడం నిషేధిస్తే అదో గొప్ప పాఠశాల..! విషయ పరిజ్ఞానం కన్నా అంగ్రేజీ (ఇంగ్లీష్) పరిజ్ఞానం మెండుంటే చాలు. స్థాయికి మించిన హోంవర్కు ఇస్తే ఎనలేని సంతోషం. పాఠశాల పనిగంటలకు అదనంగా ఉదయం, సాయంత్రం రుద్దితే అదో ఆదర్శ పాఠశాల. పాఠశాల పనిచేయాల్సిన 220 పని దినాలకు అదనంగా పండగలకు, పబ్బాలకు, చివరికి వేసవి సెలవుల్లోకూడా నడిస్తే పాఠశాలకు గుర్తింపు..
నిజానికి ‘బోధన’లో నాణ్యత ఉంటోందా? వుంటే దాన్ని కొలవడం ఎలా? గుర్తించడం ఎలా? మార్కులు కొలబద్ద కాదని అంటూనే నాణ్యత అనే పదం చుట్టూ పరిభ్రమించడమేంటి? ఇదే వాస్తవమని భ్రమిస్తే- అర్జునుడికి, భీమునికి వేరువేరు విద్యల్ని ద్రోణాచార్యుడెందుకు నేర్పినట్లు? కౌరవులకు, పాండవులకు రాజనీతి, ఆర్థిక, మానవ ధర్మశాస్త్రాన్ని ద్రోణాచార్యుడే బోధించినా కౌరవులకు, పాండవులకే కాదు, పాండవుల మధ్యనే వైరుధ్యాలున్నాయిగా? నిజానికి గద, ఖడ్గవిద్యలు ఎదురెదురుగా తలపడేవే అయినా, ఖడ్గవిద్య కొంత అభివృద్ధి చెందినది. గద కన్నా ఖడ్గం భారం తక్కువే కాకుండా, శత్రువును గాయపర్చడానికి, చంపడానికి, గుర్రంపై సవారీ చేస్తూ యుద్ధం చేయడానికి అనువైనదిగా వుంటుంది. విలువిద్య మరింత అభివృద్ధికరమైంది. చాటుమాటున శత్రువుకు తెలియకుండా వాడే విద్య. వీటి తర్వాత వచ్చినవే తోపులు, ట్యాంకులు, బాంబులు, మిసైల్లు. ఈ లెక్కన మిసైల్ విద్య నేర్చుకున్నవారు, ఈ విద్యను బోధించినవారు, తయారుచేసిన వారందరూ నైపుణ్యంతో కూడిన వారని, ఈ విద్యనే నాణ్యమైందని భావించాల్సి వస్తుంది. ఇది అవగతమైతే, ‘నాణ్యత’ అనే పదం విద్యారంగానికి ఎలా పనికిరాదో తెలుస్తుంది. విభిన్న వ్యక్తులకు విభిన్న విద్యలందుతాయని, అలా విద్యనందించడమే విద్యారంగ బాధ్యతని గుర్తిస్తాం. అందుకే సాధారణ (10వ తరగతి) విద్యలో భాషలతోపాటు మరో మూడు అంశాలను విషయాల వారీగా బోధిస్తారు. విద్యార్థి ఇష్టాయిష్టాల్నిబట్టి, అభిరుచిని బట్టి భవిష్యత్తును నిర్ణయించుకోవడం జరుగుతుంది, జరగాలి. కాని, పిల్లల భవిష్యత్తును తామే తీర్చిదిద్దుతామని, తమ సంస్థ మాత్రమే ఫలానా టార్గట్‌ను చేరేలా చేస్తుందని చేసే ప్రచారాలన్నీ అవాస్తవాలు. ఈ విషయాల్ని గుర్తించలేని అమాయకపు తల్లిదండ్రుల్ని సొమ్ముచేసుకోవడమే అవుతుంది.
చరిత్రలో ఇలాంటి దృష్ట్యాంతాల్ని ఎన్నైనా ఇవ్వవచ్చు. శాస్తజ్ఞ్రులు, తత్వవేత్తలు, సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగిన మేధావులు, రాజకీయ దురంధరులు, రాజకీయ సిద్ధాంతకర్తలు, ఒకరేమిటి? ప్రపంచవ్యాప్తంగా మొన్న, నిన్న, నేడు ప్రజలకోసం ప్రాణాల్ని త్యాగం చేసిన ధీరులు, పోరాటయోధులు, ప్రాణదానం చేస్తున్న వైద్య విధానకర్తలు... ఎవరు కూడా ఫలానా బ్రాండెడ్ పాఠశాలలో, అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో విద్యనందుకున్న దాఖలాలు లేవు. ఇలా చెప్పినవారు లేరు. సోక్రటీస్, అరిస్టాటిల్, ఠాగూర్, వివేకానంద వంటి వారు ఏ ప్రత్యేక పాఠశాలలో చదువుకొని తత్త్వవేత్తలయ్యారు? అలెగ్జాండర్, అక్బర్, శివాజీ ఏ పాఠశాలలో రాజనీతిని నేర్చుకున్నారు? మార్క్సు, ఏంగెల్స్, కౌటీల్యుడు సహా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజకీయ సిద్ధాంతకర్తలు చదువుకున్న పాఠశాలలు ఎలాంటివి? లెనిన్, మావో, హోచ్‌మిన్, చావెజ్, క్యాస్ట్రో సహా, నేడు ప్రపంచాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్, నిన్నటి ఒబామా, మొన్నటి అమెరికా అంకుల్ శ్యాంలు ఏ విద్యాప్రమాణాలతో వున్న పాఠశాలల్లో చదువుకున్నారు?
ఇక నిప్పును గుర్తించిన ఆదిమానవుని నుంచి కోపర్నికస్, గెలీలియో, ఆర్కిమెడిస్, మెండలీఫ్, డార్విన్, ఐన్‌స్టీన్, పైథాగరస్, సివి రామన్, జగదీష్ చంద్రబోస్, సర్ సివి రామానుజం, ఆర్యభట్టు లాంటి మేధావివర్గం చదివిన పాఠశాలల స్థాయేంటి? వాటి బోధనా విధానాలేంటి? ఈ ప్రశ్నలెప్పుడైనా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వీరిని అజమాయిషీ చేస్తున్నామంటున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తడుతున్నాయా? అనేది సమాధానం లేని ప్రశ్న! వలసపాలన దేశంలో (ఇంగ్లాండ్)లో ఉన్నత విద్యనభ్యసించినా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దేశం కోసం ఆలోచించారు. వీరికి నాణ్యతతో కూడిన విద్య అందినట్లా? అందనట్లా? ఇలా చెప్పుకుంటూపోతే విద్యారంగానిది ఓ తరగని వేదనాభరితమే! ఆహ్లాదకరంగా వుండాల్సిన విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలు ఓ ముడి సరుకుగా, మార్కెటు వస్తువుగా మార్చివేస్తే నిలదీసి, నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వారికే సరెండర్ కావడం అప్రజాస్వామికం. ఈ విషయాల్ని గుర్తించక పోవడం పిల్లల తల్లిదండ్రుల విషాదం!
తన కొడుక్కి కన్నీరు పెట్టని పాఠశాల కావాలన్న ఓ రష్యా తండ్రి ఆలోచనను తిరగరాస్తూ, ‘దండం దశగుణం’గా భావిస్తూ, ‘చస్తే పోతాడు, చదువు మాత్రం దండిగా రావాల’ని నేటి తల్లిదండ్రులు అత్యాశ పడుతున్నారు. అత్యాశపడుతూనే- ఫీజులు తక్కువగా వుండాలని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని ఓ అధర్మయుద్ధాన్ని చేస్తున్నారు. పిల్లల పాలిట తల్లిదండ్రులే శత్రువులుగా మారిపోతున్నారు. గొర్రె కసాయిని నమ్మినట్టు, వీరు కార్పొరేట్ పాఠశాలల్ని, ఈ పాఠశాలలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వాల్ని నమ్ముకుంటున్నారు. గతంలో అప్పటి కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ తమ పిల్లల అడ్మిషన్ కోసం పాఠశాలలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరైందంటే- ఎవరు ఎవరిని నియంత్రిస్తున్నారో తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులకున్న ఏకైక మార్గం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలనే ఉద్యమాన్ని లేవదీయడమే! ఓ కలెక్టర్ తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు అన్ని వర్గాల వారూ స్పందించినపుడే పరిస్థితిలో మార్పు వస్తుంది. గతంలో అలహాబాద్ హైకోర్టు చేసిన సూచనల్ని ఆచరించాలని ఒత్తిడి చేస్తే, కార్పొరేట్ విద్యాసంస్థల కొమ్ములు మెత్తపడుతాయి. దుబ్బాక ప్రభుత్వ పాఠశాల పునఃనిర్మాణానికి రూ.11 కోట్లను ప్రకటించిన తెలంగాణ సిఎం కెసిఆర్ తన మనవడిని అదే పాఠశాలలో చదివిస్తే మిగతావారికి స్ఫూర్తి కలుగుతుంది.
ఇలాంటి ఆలోచనలు చేయకుండా తమదో ప్రత్యేక ఆర్థిక వర్గం కాబట్టి, తమకే ప్రత్యేక స్కూళ్ళుండాలని, అవి ప్రభుత్వ రంగంలో సాధ్యం కావుకాబట్టి, ప్రైవేట్ రంగంలోనే విద్య వుండాలనే ఆకాంక్షతో ఫీజుల నియంత్రణ అంశాన్ని కొందరు ముందేసుకున్నారు. దాదాపుగా ఈ వర్గాలన్నీ డబ్బున్న వర్గాలే! వీరి ఆర్థిక రాబడి కూడా ఎక్కువే! వీరికి ‘పేయింగ్ కెపాసిటీ’ కూడా వుంటుంది. కాబట్టే కార్పొరేట్ విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఏటేటా ఫీజుల్ని పెంచుతున్నాయి. పేయింగ్ కెపాసిటీ లేదనుకుంటే, ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయండనే ఉద్యమాన్ని లేవదీయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఉపాధ్యాయుల్ని నిలదీయవచ్చు! ఇదో ఎన్నికల నినాదంగా మారవచ్చు!
ఈ విషయంలో హయత్‌నగర్ జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల గత 5 సంవత్సరాలుగా ఆదర్శంగా నిలిచింది. 2011-12లో నర్సింహాచారి అనే వ్యక్తి తన కూతురును, కొడుకును ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, పాఠశాల యాజమాన్య (ఎస్‌ఎంసి) కమిటీకి అధ్యక్షుడిగా మారి, పాఠశాల సక్రమంగా నడిచేలా ధర్మయుద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యా రిజర్వేషన్ సంస్థను (బివిఆర్‌ఎస్) స్థాపించి, ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పాఠశాలలకు ‘కార్డుక్యాంపెన్’ చేసాడు, చేస్తున్నాడు. ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగస్థులెవరైనా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లైతే అవార్డులిస్తానని ప్రకటించి సంచలనం లేపాడు. అనేక జిల్లాలలో సభ్యుల్ని చేర్పించాడు. సమాన విద్య ఒక వాస్తవం. ఈ వాస్తవం వెనుక దేశ భవిష్యత్ దాగి వుందంటూ, పన్నుల విషయంగా జియస్‌టిని ప్రతిపాదించినట్లే, విద్యారంగాన్ని అందరికీ సమానంగా అందించాలనే సామాజిక మాధ్యమ ఉద్యమంతోపాటు, కర పత్రాల యుద్ధాన్ని ఈ సంస్థ చేపట్టింది.
ఇలాంటి ఉద్యమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడితే, ప్రభుత్వ పాఠశాలలు తిరిగి వికసిస్తాయి. ఈ దిశగా హైదరాబాద్ ప్రైవేట్ పాఠశాలల పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తే, తాము బాగుపడడమే కాదు, సమాజాన్ని బాగుచేసిన వారవుతారు. పాలకుల రోగం కుదురుతుంది. ఇది జరగని పక్షంలో ప్రభుత్వంపై కార్పొరేట్ సంస్థలే పెత్తనం చెలాయిస్తాయి. ఇప్పుడు జరుగుతోంది ఇదే..!
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162