మెయిన్ ఫీచర్

రామనామం.. జగదానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు శ్రీరామ నవమి పర్వదినం. యావత్ దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం శ్రీరామ నామ స్మరణతో ప్రతిధ్వనిస్తాయి. అందుకే రామాలయం లేని ఊరు కానరాదు. వసంతరుతువులో చైత్రమాసం నవమినాడు సకల గుణాభిరాముడు ఈ భువిపైకి అరుదెంచారు. విద్యార్థిగా, రాజుగా, తండ్రి మాటను జవదాటని తనయునిగా, సీతానే్వషణలో ఆ మహనీయుడు ప్రదర్శించే వ్యక్తిత్వం ఆదర్శనీయం. ఆచరణీయం. ఇలా ఓ పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో ఆచరణలో చూపిన ఈ పురుషోత్తముడ్ని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించి భక్తితో కొలిచే రూపమిది. ఆ రామనామాన్ని స్మరించినా..ఆయన బాటలో నడిచినా అంతా అలౌకికానందం..పరిపూర్ణత వైపు పయనయం.
శ్రీరామచంద్రుడు- పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది. అదే శ్రీరామచంద్రునిలోని గొప్పతనం. అందరినీ ఆనందపరిచేవాడే శ్రీరాముడు. ‘‘రమయతీతి రామః’’ కదా. మరి వేరే దిక్కెవరయ్యా రామా అంటూ త్యాగరాజు శరణాగతి చేసినా ‘‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’’ అంటూ రామదాసు ,గుండెలమీద చెయ్యి వేసుకున్నా ‘‘రాముడు లోకాభిరాముడు’’ అంటూ ‘‘కలడన్నవారి పాలి కన్నుల ఎదుటే మూరితి’’ అంటూ అన్నమయ్య సున్నితంగా తత్త్వాన్ని ప్రతిపాదించినా అందరి ఎదుట, అందరి హృదయాల్లో రూపుదిద్దుకున్నది ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని వైశిష్ట్యమే అని చెప్పక తప్పదు.
అందరి హృదయాలను ఆకర్షించిన ఈ శ్రీరామచంద్రుడు శ్రీరామాయణంలో నాయకుడు. వాల్మీకి తన కథకు ఎంచుకొని, మలచుకొన్న ధర్మస్వరూపం. ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ కదా! అందుకే నేటికి శ్రీమద్రామాయణ మహాకావ్యం పరమ ప్రామాణిక గ్రంథమైనది. సమకాలీనుడైన రాముడి చరిత్రను మలచిన వాల్మీకి రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాదు అలంకారికులకు, సాహిత్యకారులకు, శాస్తవ్రేత్తలకు కూడా మార్గనిర్దేశక గ్రంథం. గాయత్రీ మంత్ర నిక్షిప్తమైన రామాయణం సకలార్థసిద్ధికి ఒక కల్పవృక్షం. అందుకే విశ్వనాథవారి రచన రామాయణ కల్పవృక్షమైనది.
తమసా నదీ తీరంలో జరిగిన ఒక సంఘటన వాల్మీకిలో రామాయణ రచనకు శ్రీకారం చుట్టింది. ఆ సందర్భంలో ‘‘అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ’’ ‘‘రమణీయం ప్రసన్నాంభుసన్మనుష్య మనోయథా’’ అంటూ సజ్జనుని హృదయంతో తమసా నదీ జలాలను పోల్చి చెప్పిన వాల్మీకి మాటల్లో ‘అకర్దమమ్’ (అంటే బురద లేకుండా ఉండుట) పాపరహితమైన చిత్తవృత్తిని ‘తీర్థం’ అనే పదం పవిత్రతను, దివ్యత్వాన్ని సూచిస్తుంటే రమణీయం, ప్రసన్నాంబువు అనే రెండు పదాలు కావ్య వైశిష్ట్యానికి ఉప లక్షణాలు వాల్మీకి హృదయం మనకిక్కడే గోచరిస్తుంది.
నారదుడు త్రిలోక సంచారి. ఒకసారి తన ప్రయాణంలో వాల్మీకి మహర్షిని కలిశాడు. వాల్మీకి ప్రశ్నించాడు. దేవర్షి బ్రహ్మర్షికి శ్రీరామకథని వివరించాడు. దీనివలన కావ్యగౌరవం మరింత ఇనుమడించింది. మహర్షి ప్రశ్నలోనే ఒక వైలక్షణ్యం

‘‘కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్వ సత్యవాక్యో ధృఢవ్రతః
చారిత్రేణచకోయుక్తః సర్వభూతేషుకోహితః
విద్వాన్ కః కస్సమర్దశ్చ కశ్చైక ప్రియదర్శనః
ఆత్మవాన్ కోజితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః
కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే’’ అన్నది ప్రశ్న.
దేవర్షీ! ఈ లోకంలో, ఈ కాలంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవ్రతుడు, దృఢ సంకల్పుడు, కృతజ్ఞుడు, సదాచార సంపన్నుడు, భూతదయ కలిగినవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, కాంతిమంతుడు, కోపము, అసూయ లేనివాడు, దేవతలను కూడా జయించగలిగినవాడు ఎవరైనా వున్నారా? ఆనికి నారదుడు చెప్పిన సమాధానమే శ్రీరామకథ.
ఉదాహరణకు శ్రీరాముడు గుణవంతుడు. అన్నీ సుగుణాలే కదా. మరి గుణవంతుడెవడు? అని ప్రశ్నించడంలో,శ్రీరాముడు గుణవంతుడని చెప్పడంలో ఆ గుణము సౌశీల్యము అంటారు పెద్దలు. గొప్పవారు తక్కువ వారితో తారతమ్యం లేకుండా కలసిపోవడం అనే గుణాన్ని సౌశీల్యం అంటారు. శ్రీరాముడు రాజు, చక్రవర్తి కుమారుడు. సాటిలేని మేటి. మరి స్నేహితులు- పడవ నడుపుకునే గుహుడు, వానరుడు, రాక్షస జాతికి చెందిన విభీషణుడు. వారి ముగ్గురితో రాముడు ప్రవర్తించిన విధానమే అతడు గుణవంతుడని తెలుస్తోంది. మరొక అద్భుతమైన గుణాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముడు దృఢవ్రతుడు. అంటే దృఢమైన సంకల్పం కలవాడు. అరణ్యంలో ఋషులను కాపాడే విషయంలో సీతాదేవితో శ్రీరాముడు పలికిన మాటలు గమనించతగినవి. ఓ సీతా! నీకంటే, లక్ష్మణుకంటే ఋషులకిచ్చిన మాట ముఖ్యం. ఆడిన మాటను తప్పలేను అని (దృఢంగా) తన మనసులోని మాటను నిష్కర్షగా చెప్తాడు శ్రీరాముడు. ఋజు ప్రవర్తనలో సత్యవాక్పరిపాలనలో, సామర్థ్యంలో, జ్ఞానంలో అందరికీ ఆనందాన్ని కల్గించడంలో రాముడికి రాముడే సాటి. పశువులు, పక్షులు, క్రూర జంతువులు, పామరులు పండితులు, రాక్షసులు, వానరులు ఒకరేమిటి అనంత ప్రాణికోటి రాముని చూసి పరవశించినవే.
ఇక శ్రీరామచంద్రుని గుణ వైభవాన్ని ఒకసారి చూద్దాం. శ్రీరాముడు మానవునికుండవలసిన గుణాలను కలిగి సమాజంలో మనిషి ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. పదహారు గుణాలు అనే పదహారు కళలతో శ్రీరామచంద్రమూర్తి అయినాడు. మర్యాదాపురుషోత్తముడుగా కీర్తిని పొందాడు. ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినవి ఎన్నో వున్నాయి. తండ్రి మాటను పాటించడం, సత్యాన్ని పలుకడం, ఏకపత్నీవ్రతం, సోదర ప్రేమ, ఆర్తులను రక్షించడం, అసూయ లేకపోవడం, ఇలా ఎన్నో, ఎనె్నన్నో. ఈ గుణాలన్నింటిలో ముఖ్యమైనది కృతజ్ఞత.
కైక దశరథుని రెండు వరాలు కోరింది. ఒకటి తన కుమారుడైన భరతునికి పట్ట్భాషేకం, రెండు శ్రీరాముడు పధ్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడం. దశరథుడు రామునితో ఈ విషయం చెప్పలేక బాధపడితే స్వయంగా చెప్పిన కైకకు ఆనందంగా ఆమోదాన్ని తెలిపాడు శ్రీరామచంద్రుడు. రెండవ ఆలోచనే లేకుండా రాజ్యమయితేనేమి? వనవాసమైతేనేమి? తల్లిదండ్రుల మాటలను మన్నించే వనవాసమే నాకానందం అన్నాడు.
అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా సోదరుడైన లక్ష్మణునికి నచ్చజెప్పి, ఓదార్చి, కైకను గౌరవించి, తల్లి కౌసల్య ఆశీస్సులందుకొని వనవాసానికి కదిలాడు. అనంతరం తల్లిని దూషించి కోపంతో తన వద్దకు వచ్చిన భరతుని అనునయించి రాజ్యభారాన్ని అప్పచెప్పాడు. చివరిగా రావణ వధానంతరం విభీషండు నూతన వస్త్రాలను, ఆభరణాలను ధరించమని ప్రార్థిస్తే కైకేయి కుమారుడైన భరతుడు నా కోసం ఎదురుచూస్తుంటే అతనిని చూసి కలసిన తరువాతే నాకీ అలంకారాలు అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
ఇంకా వనవాసంలో రాముడు చేసిన, సాధించిన కార్యాలను చూస్తే ఖరదూషణ వధ చేసి ఋషులకు విముక్తి కలిగించడం, రావణుని వధించి దేవతల ప్రార్థనను నెరవేర్చడం. భగవంతునిగా దేవతలను కాపాడడం, మానవునిగా రాజ్యపరిపాలకునిగా ఋషుల తపస్సులను కొనసాగేటట్లు చేయడం. ఇవన్నీ చూస్తుంటే రాముడు సాక్షాత్తూ నారాయణుడా? మానవుడా? అనే సందేహం కలుగక మానదు.
ధర్మసంస్థాపనార్థాక సంభవామి యుగే యుగే అంటూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తనకు తాను చెప్పుకున్నాడు. కానీ శ్రీరాముడు తాను భగవానుడని ఎక్కడా అనలేదు. మానవునిగా / నరునిగా అవతరించాడు. కలసిమెలసి మెలిగాడు. నరుడు తలిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. సత్ప్రవర్తనలో చూపించాడు. అందుకే ఆదర్శపురుషుడైనాడు. రఘువీరుడైనాడు, జానకి రాముడైనాడు, మర్యాదా పురుషోత్తముడైనాడు. ఎప్పటికీ ఆయనే మనకు ఆదర్శం.
ఈ రామాయణమే మనకు నిత్యపారాయణ గ్రంథం. ధర్మమూర్తి అయిన శ్రీరాముడు అవతరించిన ఈ శ్రీరామ నవమినాడు ఆయనను మనసారా ధ్యానిద్దాం. ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. మంచి చక్కటి మీగడ కట్టిన పాలను పంచదారతో కలిపి తింటే ఎంత మధురమో రామనామము అంత మధురంగా ఉంటుంది అంటాడు భక్తరామదాసు. ఓ రామా! నీ రూపం, నీ నామం, నీ కథ ఇవన్నీ ఇష్టమనే పళ్లెంలో పెట్టుకుని దాస్యమనే దోసిలితో జుర్రుకోవాలని వుంది అంటాడు భక్తరామదాసు.
చూశారా నీకు దాసుడను నేను శరణాగతి చేస్తున్నాను. నీ పట్ల నాకపారమైన అనురాగముంది అనే విషయాన్ని ఎంత మధురంగా అందించాడు కదా! రామ, రామ, రామా అని మూడుసార్లు పలికితే చాలు సహస్ర నామాలు చెప్పినట్లే అంటాడు ఈశ్వరుడు పార్వతీదేవితో. రామనామంలోని మాధుర్యం, గొప్పతనం అలాంటిది. అందుకే శ్రీరామః శ్శరణం మమ అందాం. చేతులెత్తి మొక్కుదాం. శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష.
*
శ్రీరాముడు తాను భగవానుడని ఎక్కడా అనలేదు. మానవునిగా / నరునిగా అవతరించాడు. కలసిమెలసి మెలిగాడు. నరుడు తలిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. సత్ప్రవర్తనలో చూపించాడు. అందుకే ఆదర్శపురుషుడైనాడు.
*
‘‘దాసిన చుట్టమా శబరి దానిదయామతినేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు’’ అంటాడు కంచర్ల గోపన్న. శబరి, గుహలే కాదు హనుమ వంటి దాసుని, సుగ్రీవుని వంటి మిత్రుని, విభీషణుని వంటి సోదరుని పొందగలిగానని ఆనందపడ్డాడు. జటాయుకి మోక్షాన్నిచ్చాడు. వారధి కట్టి అద్భుతాలు సృష్టించాడు. ఎండనకా, వాననకా, రాయనకా, రప్పనకా వనవాసంలో కష్టపడి, సీతను ఎడబాసి, విలపించి, పరితపించినా ఏనాడూ కైకను నిందించలేదు. ధర్మానికి కట్టుబడి వున్నాడు. అన్నీ మరిపోయి ఇన్ని పనులు చేయగలిగాను, ఇందర్ని చూడగలిగాను అంటే కైకవల్లనే కదా అని అనుకున్నాడు. అదీ రాముని కృతజ్ఞత, సంస్కారం. ఇలా ఒక్కొక్క గుణాన్ని చూస్తే ఎంతని చెప్పగలం.
*
వాల్మీకి నారదుడు చెప్పిన కథను దివ్యదృష్టితో చూశాడు. పాడుకోవడానికి వీలుగా అనుష్టప్ చ్ఛందస్సులో మధురంగా రచించాడు. కుశలవులకు నేర్పించాడు. విషయం మూర్త్భీవించిన ధర్మమూర్తి శ్రీరాముని కథ. ఇచ్చినది వాల్మీకి మహర్షి. ‘ఋషే కవి కాగలడు కదా! మహర్షులు, ధర్మబద్ధులు, సత్యనిష్ఠులు, సమాజం చక్కగా అభివృద్ధి చెందాలనే కోరిక గలవారు. అందుకే వారి రచనలు సత్య, ధర్మాలకు, సాక్ష్యాలు. వారి ఆలోచనలకు అనుగుణంగా సాగే వారి రచనలు అందరికీ ఆదర్శం. ‘‘లోకాః సమస్తా స్సుభినోభవన్తు’’ అనే వాక్యానికి నిదర్శనం.*
*
కృతజ్ఞత అంటే ఏమిటి? ఎవరైనా మనకుపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకవోటం, వారిపట్ల గౌరవభావాన్ని కలిగివుండడం, అవకాశం వుంటే వారికి తిరిగి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం. అందులో వింతేముంది అంటారా! ఎదుటివారు చేసిన ఉపకారాన్ని మరిపోయేవారు అవసరం తీరగానే మొహం చాటేసేవారు, ఉపకారం చేసేవారికి అపకారం చేయ సిద్ధపడవారు ఉన్నారు కదా సమాజంలో. మన శ్రీరామచంద్రుడో! ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేసి వారిపట్ల కృతజ్ఞత కలిగి వుండడమే కాక తనను అడవులపాలు చేసి ఎన్నో కష్టాలకు గురిచేసిన కైక విషయంలో కూడా కృతజ్ఞుడై ఉన్నాడు.

- డాక్టర్ కె.వి.హరిప్రియ