మెయన్ ఫీచర్

‘సమాఖ్య’ రాజకీయానికి గడ్డుకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో పాతికేళ్లకు పైగా ఒక వెలుగు వెలిగిన ఫెడరలిస్టు (సమాఖ్య) రాజకీయాలకు నెమ్మదిగా గడ్డుదశ వస్తున్నదా? భారతీయ సమాజంలో వౌలికంగా ‘ఫెడరలిజం’ అనే స్థితి బలహీనపడుతున్నదని అనడం లేదిక్కడ. ఫెడరలిస్టు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఫెడరలిజం అనేది ఒక వైవిధ్య సమాజంలో ఉండే వౌలిక స్థితి. సమాజంలో భాషా సంస్కృతులు, ఆర్థిక వ్యత్యాసాలు, సమతులనం లేని అభివృద్ధి వల్ల ఏర్పడే ప్రాంతీయ అసమానతలు, దేశ పరిపాలనా వ్యవహారాలలో భాగస్వామ్యం లేకపోవడం వంటి వివిధ కారణాలతో పాటు తాము ఉపేక్షకు గురవుతున్నామనే భావనలు ఫెడరలిస్టు స్థితికి దోహదం చేస్తాయి. ఈ స్థితి ఏర్పడడానికి అది చిన్న దేశమా? లేక పెద్దదా? అనే దానితో నిమిత్తం లేదు. ‘రాజకీయాలు-అభివృద్ధి- పరిపాలన’ అనే మూడింటి స్వరూప స్వభావాలు ఏమిటన్నది మాత్రమే పరిగణనలోకి వస్తుంది.
ఈ అంశాన్ని పరిశీలించవలసిన మరొక స్థాయి విషయం కూడ ఉంది. అది- ఫెడరలిజం స్థితిగతులు, జాతీయత లేదా జాతి ని ర్మాణం. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచే భారత జాతి నిర్మాణం (నేషన్ బిల్డింగ్) అనే అంశంపై చర్చ మొదలైంది. భారత జాతి, జాతీయతా భావం అనాదిగా ఉందా? లేదా? సాంస్కృతిక జాతీయ భావాన్ని ఆధునికార్థంలో జాతి ఏర్పాటుగా పరిగణించవచ్చునా? లేదా? అనే వివాదాన్ని పక్కన ఉంచితే, స్వాతంత్రోద్యమ కాలంలో స్థూలంగా గుర్తించిన అంశాలు మూడున్నాయి. అవి- సువిశాల దేశంలో అనేక వైవిధ్యతలు ఉండడం. మరొకవైపు అందరం భారతీయులమనే భావనలు ఆ ఉద్యమకాలంలో విస్తరించి బలపడడం. ఈ భావనలను బ్రిటిష్ పాలనా కాలంలో అమలుకు వచ్చిన ఏకీకృత పాలనా వ్యవస్థలను ఆధారంగా చేసుకుంటూ ఆధునికార్థంలో భారత జాతి నిర్మాణం (నేషన్ బిల్డింగ్) జరపటం. ఈ ప్రయత్నాలను స్వాతంత్య్రానంతరం కొనసాగిన తొలితరం నాయకత్వం తన పద్ధతిలో తాను సాగించింది.
కానీ- ఆ పద్ధతిలోని లోపాలు, దాని అమలులోని లోపాలు, స్వాతంత్య్రానంతరం కొత్తగా బలపడిన ఆర్థిక-రాజకీయ శక్తుల కారణంగా జాతి నిర్మాణ ప్రయత్నంలో కొన్ని కొరతలు ఏర్పడ్డాయి. అవి వైరుధ్యాలకు దారి తీశాయి. ఈ కొరతలు, వైరుధ్యాల శూన్యంలోకి ఫెడరలిస్టు ధోరణులు వచ్చి విస్తరించాయి. ఆ ఫెడరలిస్టు ధోరణులు జాతి నిర్మాణం ‘ఫ్రేమ్ వర్క్’లో భాగంగా ఇమిడిపోయి లేదా ఒదిగిపోయి తమ భావనలను వ్యక్తీకరించాయి, రాజకీయమూ చేశాయి. కానీ వక్రీకరణలకు పోలేదు. ప్రకోపించి జాతి నిర్మాణపుఫ్రేమ్ వర్క్‌ను భంగపరచబూనలేదు. తమిళనాడులో ఒక స్వల్ప కాలాన్ని మించితే ఈ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో ఫెడరలిస్టు రాజకీయాలు జోరుగానే సాగాయి. కొందరు స్వప్రయోజనపరులు ‘నేషన్ బిల్డింగ్’లో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, ఫెడరలిస్టు ధోరణులను ‘నేషన్ బిల్డింగ్’కు భంగకరమైనవిగా చూపే ప్రయత్నం చేసారు. అది నెరవేరకపోవడం భారత సమాజంలోని ఐక్యతా భావనకు, బలిమికి గుర్తు. వాస్తవానికి ఫెడరలిస్టు ధోరణుల కారణాలను గుర్తించడం, అందుకు తగు చర్యలు దిద్దుబాటుగా తీసుకోవడం, నేషన్ బిల్డింగ్‌కు దోహదం చేసే దృష్టి అవుతుంది.
మొత్తానికి స్వాతంత్య్రానంతరం జాతి నిర్మాణ కార్యక్రమం ప్రాంతాల స్థాయిలో సవ్యంగా సాగలేదు. ఈ లోపాలు మరీ ముఖ్యంగా నెహ్రూ తర్వాత ముందుకొచ్చాయి. ఇందిరాగాంధీ హయాంలో అసలు రాజకీయ వ్యవస్థే ఛిన్నాభిన్నం కాగా ప్రాంతీయ రాజకీయాలు, అభివృద్ధి, అస్తిత్వ గుర్తింపులు క్రమంగా బలపడుతుండిన అక్కడి ఆర్థిక-రాజకీయ-సామాజిక శక్తులు కొత్త తరహా వత్తిడికి లోనయ్యాయి. దాని పర్యవసానంగా జరిగిందేమిటో అందరికీ తెలిసిన చరిత్రే. దేశంలో ఫెడరలిస్టు రాజకీయం పాతికేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిందని మొదట అనుకున్నది ఈ చరిత్ర కాలం గురించే. ఆ కాలమంతా అప్పటికే గల ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. అవి చీలిన సందర్భాలలోను చీలిక గ్రూపులదే ఆధిపత్యం అయింది గానీ జాతీయ పార్టీలకు ప్రవేశం లేకపోయింది. అనేక రాష్ట్రాలలో కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఒక ప్రాంతీయ పార్టీ బలహీనపడితే దాని స్థానంలోకి మరొకటి వచ్చి చేరింది. జాతీయ పార్టీలకు అనేకచోట్ల స్థానం లేకుండా పోయింది. చోటు మిగలాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహనకు రాక తప్పని స్థితి జాతీయ పార్టీలకు ఎదురైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయం చేసినా అది ఒక మేర తనకు ఉపయోగపడడం మినహా తనదే అగ్రస్థానం కాలేదు. కొన్నిచోట్ల రెండవ-మూడవ స్థానమైనా లభించక నిమ్నస్థాయికి పడిపోయింది. ఓట్లు, సీట్ల సంఖ్యలు దయనీయంగా మారాయి. గవర్నర్లను, ఆర్థిక బలాన్ని, కేంద్రంలో గల అధికార బలాన్ని, చీలికలను, ప్రలోభాలను ఉపయోగించుకునే ఎత్తుగడలు అధిక సందర్భాల్లో పనిచేయలేదు. ఇరవయ్యవ శతాబ్దపు చివరకు వచ్చేసరికి కేంద్రంలోనూ అధికారం కోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు తప్పని సరి అయ్యాయి. అంతకు ముందు అదే కేంద్రాధికారం కోసం ప్రాంతీయ పార్టీలను చీల్చే పద్ధతులకు పాల్పడి తమ రాజకీయ బలహీనతలను రుజువు చేసుకున్నారు. తర్వాత ఆ పార్టీలతో పొత్తులు అనివార్యమయ్యాయి. చివరకు కేవలం ఒకే ఒక సభ్యుడు గల పార్టీని సైతం మచ్చిక చేసుకోవాల్సిన దశ వచ్చింది.
ఆ విధంగా ఇదంతా ఫెడరలిస్టు రాజకీయాల స్వర్ణ యుగం అయింది. పైన చెప్పుకున్నట్టు వౌలికంగా క్షేత్రస్థాయిలో ఫెడరలిస్టు వైవిధ్య స్థితి ఎప్పుడూ ఉన్నదే. ఇక్కడ మాట్లాడుతున్నది ఫెడరలిస్టు రాజకీయాల గురించి. ఫెడరలిస్టు స్థితిగతులు క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు అవి కాలపరిస్థితులను బట్టి రాజకీయాల రూపంలో వ్యక్తమవుతాయి. కాల పరిస్థితులు బాగా కలిసి వచ్చినప్పుడు వేగాన్ని అందుకుంటాయి. కలిసి రానప్పుడు తగ్గుతాయి. తగ్గినపుడు దాని అర్థం క్షేత్ర స్థాయి ఫెడరలిస్టు స్థితి బలహీనపడిందని కాదు. కాని ఆ స్థితిని వ్యక్తీకరించే రాజకీయ వేదిక వివిధ కారణాల వల్ల బలహీనపడిందన్న మాట.
ఈ స్వర్ణ యుగమన్నది ఇప్పుడు బలహీన దశలోకి ప్రవేశిస్తున్నది. దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఆ కారణాలు ఫెడరల్ శక్తుల స్వయం కృతమే తప్ప బయట నుంచి వచ్చి పడినవి కావు. జాతీయ పార్టీలు అనబడేవి తెచ్చి తోసినవి కావు. దీని అర్థం ఫెడరలిస్టు పార్టీలు అన్నీ బలహీన దశలోకి వచ్చివేసాయని కాదు. కాని అందుకు ఆరంభం జరగడమన్నది గుర్తించవలసిన విషయం. విచిత్రమేమంటే, ఈ పార్టీల బలహీనతలు అవి ‘మధ్యందిన మార్తాండుని’ వలె వెలిగిపోతున్నప్పుడే మొదలయ్యాయి.
దీనినంతా ఇప్పుడు సూటిగా చెప్పుకుందాము. ఫెడరలిస్టు స్థితిలో లోపాలు లేవుకానీ ఆ స్థితి ఆధారంగా పనిచేసే రాజకీయ పార్టీలలో ముఖ్యమైన లోపాలు కొన్ని ఉన్నాయి. ఒకటి- తాము స్వయంగా ఫెడరలిస్టు స్పృహతో పనిచేయకపోవటం, రెండు- అధికారంలోకి వచ్చినప్పుడు ఆ స్పృహతో పరిపాలించకపోవడం. మూడు- జాతీయ పార్టీలలోని ఏ లోపాలను తాము ఎత్తి చూపారో వాటిని వదిలివేయడానికి బదులు తాము కూడా అదే లోపాలను అనుకరించడం వంటివి. ఇటువంటివి వారి వైఫల్యాలకు దారి తీసాయి. దాని ఫలితంగా తిరిగి రాజకీయ శూన్యాలు ఏర్పడసాగాయి. జాతీయ పార్టీల వైఫల్యంతో ఏర్పడిన శూన్యంలోకి తాము ప్రవేశించగా, తమ వైఫల్యంలో ఏర్పడిన శూన్యంలోకి మరొక ప్రాంతీయ పార్టీ లేదా తిరిగి జాతీయ పార్టీలు ప్రవేశిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీల వైఫల్యాలన్న వాటిని పేర్కొనాల్సి ఉంది. అవి- తమ పరిపాలనలోనూ అసమర్ధతగా ఉండటం, అవినీతి తగ్గకపోవడం. అభివృద్ధి జరగకపోవడం. సమన్యాయం లేకపోవటం, కుల దృష్టితో కొన్ని కులాలపట్ల మొగ్గు చూపటం, ఆ కులాలలోనూ అందరికీ న్యాయం కాక ధనికులకు అనుకూలంగా వ్యవహరించి సామాన్యులను ఉపేక్షించడం వంటివి. ప్రాంతీయ అసమానతలను నిర్మూలించే ప్రయత్నం చేయకపోవటం, అభివృద్ధి కన్నా జనాకర్షక పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అధికార సాధనకు, దానిని నిలబెట్టుకునేందుకు తాము ఈసడించిన జాతీయ పార్టీల పద్ధతులనే అనుసరించడం. అభివృద్ధి కోసం కేంద్రం నుంచి, ఇతర సంస్థల నుంచి గణనీయంగా లభించే నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడం. ఆర్థికాభివృద్ధితోపాటు మానవాభివృద్ధికి తగిన చర్యలతో సమతులన దృష్టిని తీసుకోకపోవడం. దయనీయ స్థితిలో గల అట్టడుగు కులాలు, పేద తరగతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం. చట్టాలను తరతమ భేదాలు లేకుండా అమలు పరచడం. కచ్చితమైన అమలు. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పని చేయడం.. ఇటువంటి అనేకానేక విషయాలలో తాము విమర్శించిన జాతీయ పార్టీల ప్రభుత్వాలకు తమకు తేడా లేకుండా పోయింది. కొన్ని విషయాలలో బహుశా అంతకన్నా హీనంగా తయారయ్యారు.
ప్రజలకు అంతిమంగా కావలసింది మంచి పరిపాలన. ఫెడరలిస్టు ప్రాంతీయ స్థితిగతులు ఒక భావజాలం వలె మారి ఫెడరలిస్టు పార్టీలకు పునాది కావడం, వాటిని తర్వాత కూడా నిలబెట్టి ఉంచడం నిజమే. కానీ, అందుకు పరిమితులు ఉంటాయన్నది ఈ శక్తులు గుర్తించక తప్పని విషయం. భావజాలానికి ఆధారం కొన్ని నికరమైన స్థితిగతులు. ఆ స్థితిగతులకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఫెడరల్ పార్టీలపై ఉంటుంది. అందులో వారు విఫలం అయిననపుడు భావజాలం అదృశ్యం కాకపోయినా, కనీసం తాత్కాలికంగానైనా నిరర్ధకమైనట్టు తోస్తుంది ప్రజలకు. సరిగా అపుడే శూన్యం ఏర్పడి మరొక ప్రాంతీయ పార్టీయో, జాతీయ పార్టీయో అందులోకి ప్రవేశిస్తుంది. దేశంలో ఇటీవల ఈ ధోరణి పెరుగుతున్నదా? ఈ పార్టీలపై 2004లో పూర్తిగా ఆధారపడిన కాంగ్రెస్‌కు ఆ అవసరం 2009 వచ్చేసరికి కొంతైనా తగ్గింది. అంతకు ముందు వాజపేయి కాలంలో పూర్తిగా ఆధారపడిన బిజెపికి నరేంద్ర మోదీ వచ్చేసరికి ఆ అవసరం లేకుండాపోయింది. రాష్ట్రాలలోనూ అదే ప్రాబల్యం లభించనున్నదనే నమ్మకంతో బిజెపి ఉంది. ఫెడరల్ పార్టీలు తమలో తాము కలిసి, తర్వాత వామపక్షాలతో, కాంగ్రెస్‌తో ఐక్య సంఘటన ద్వారా ప్రత్యామ్నాయం కాగలిగిన రోజులు కనీసం ప్రస్తుతానికి గతించిపోయాయి. ఒకప్పటి స్వర్ణయుగం అయోమయంలో ఉంది. ఫెడరల్ పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ ముట్టడికి గురవుతున్నాయి. గడ్డు దశ అంటున్నది ఈ మార్పులనే.
*

టంకశాల అశోక్ సెల్: 98481 91767