మెయన్ ఫీచర్

ఎందుకొచ్చిన ఈ ‘మొక్కుబడి’బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్ల శ్రీనివాస్ మేకల్ని, గొర్రెల్ని మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇది కూడా వార్తేనా? అనే సందేహం రావచ్చు! ‘మనిషి కుక్కను కరిస్తే’ వార్తెలా అవుతుందో శ్రీనివాస్‌ది అలాంటి వార్తనే! అట్టహాసంగా ‘బడిబాట’ చేపట్టిన రోజే చెరువులో పడిన గొర్రెల్ని రక్షించబోయి, మరో పెద్దమనిషితోపాటు శ్రీనివాస్ ఆకస్మికంగా మరణించాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లి గ్రామంలో జరిగిన ఈ విషాదం రోజూ జరిగే సాధారణ సంఘటన లాంటిదే అయినా, చనిపోయిన శ్రీనివాస్ వయస్సు కేవలం 14 ఏళ్లే. మన ప్రభుత్వ విద్యానిర్వాహక శాస్త్రం ప్రకారం మొన్నటి మార్చి 21న 9వ తరగతి పూర్తిచేసి 10వ తరగతిలోకి అడుగిడాలి. వేసవిలో కొత్త విద్యా సంవత్సరం ఏమిటనే చచ్చు ప్రశ్నలు మనం వేసుకోవద్దు. పోనీ, తరగతులు నడుస్తున్నాయా? అంటే విద్యార్థుల్ని పైతరగతులకు పంపించిన పంతుళ్ళు పదవ తరగతి పేపర్లను దిద్దడానికి వెళ్ళారు. ఉన్న పంతుళ్ళు ‘బడిబాట’ పట్టారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన పాపానికి బ్యానర్లు పట్టుకొని రాని పిల్లల కోసం ర్యాలీలు చేస్తున్నారు.
మళ్ళీ శ్రీనివాస్ విషయానికే వద్దాం! వయస్సు ప్రకారం శ్రీనివాస్ చదువు కోవాలి. కానీ, గొర్రెల కాపరిగానే మరణించాడు. అంటే, శ్రీనివాస్ పాఠశాల ముఖం చూడలేనట్లే లెక్క. అనగా శ్రీనివాస్‌కు 5 ఏళ్లు నిండిన నాటి నుంచి 9సార్లు ‘బడిబాట’ కార్యక్రమం సాగింది. మధ్యమధ్యన బడిబయట పిల్లలను గుర్తించే తంత్రం లాంటి తతంగాలు ఎన్ని జరిగాయో తెలియదు. ఈ ఆటకు, తంత్రాలకు కూడా శ్రీనివాస్ చిక్కకుండా గొర్రెలను కాయడమే విచిత్రం! కాని, గత తొమ్మిది సంవత్సరాలుగా కోస్లి గ్రామంలో బడి పిల్లల నమోదు వంద శాతం జరిగినట్లు అధికారుల రికార్డులో వుంటుంది. బడి బయట పిల్లలు ఇంకా వుంటే, అందులో శ్రీనివాస్ కూడా వుండి వుండాలి. ఎంఇవో కూడా దీనే్న ప్రతిసారి ధ్రువీకరించి వుంటాడు. అయినా శ్రీనివాస్ విద్యాశాఖ అధికారులకు చిక్కలేదు. చిక్కినా, దొరకకుండా పారిపోయి గొర్రెల కాపరిగా మారి తన ప్రాణాల్ని పణంగా పెట్టి వుంటాడు. అయినా- ‘బడిబాట’ కార్యక్రమం కోస్లిలో, నవీపేట మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సంబరంగా, సరదాగా సాగుతూనే వున్నది. గతంలో జూన్‌లో, ఈసారి ఏప్రిల్‌లో వంద శాతం నమోదు జరుగుతూనే వున్నది. తిరిగి జులై, ఆగస్టులలో బడి బయట పిల్లలు తారసపడుతుంటారు. దీన్నో విజయగాథలా భావిస్తూ అధికారులు పత్రికలకు పోజులిస్తూనే వున్నారు. శ్రీనివాస్ లాంటి నిర్భాగ్యులు అధికారులకు చిక్కకుండా గొర్రెల వెంట తిరుగుతూనే వున్నారు.
మాదే ఆకర్షణీయమైన పాఠశాల.. విశాలమైన గదులు.. నిష్ణాతులైన ఉపాధ్యాయులు.. కంప్యూటర్ విద్య.. డిజిటల్ బోధన.. సి.సి.ఇ విధానంలో నిత్య మూల్యాంకనం.. రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు.. పోటీ పరీక్షలకు సంసిద్ధత.. పేరుమోసిన లేదా పేరు గడించాలనుకునే ప్రైవేటు విద్యాసంస్థ ప్రకటన ఇలా వుంటుంది. దీనికి కొంచెం ఉప్పు, కారం వేస్తే- ఉచిత పుస్తకాలు, దుస్తులు, వారానికి మూడు కోడిగుడ్లతో ఉచిత పౌష్టికాహారం, ప్రజల భాగస్వామ్యంతో ఆంగ్ల మాధ్యమ బోధన, పేదలు, బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు.. వీటన్నింటికీ అదనంగా పాఠశాల యాజమాన్య కమిటీలచే పర్యవేక్షక కమిటీ, ఉపాధ్యాయుల సమావేశాలు.. ఇదో ప్రభుత్వ పాఠశాల ప్రకటనగా మారిపోతుంది. ఈసారి రాజీవ్ విద్యామిషన్ విడుదల చేసిన కరపత్రమిది! ఈ కరపత్రాన్ని ఊరూరా, వాడవాడలా పంతుళ్ళ చేత, ప్రభుత్వ బడులకు వచ్చినందుకు పిల్లలచేత పంపిణీ చేయిస్తూ వున్నారు. ఇదే పనిని ఓ ప్రైవేట్ పాఠశాలలో- అక్కడి విద్యార్థుల చేత, పంతుళ్ళచేత చేయించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉన్నదా? అనేది మనకు అప్రస్తుతం.
పాల లాంటి స్వచ్ఛమైన, పెరుగు లాంటి చిక్కని, వెన్న లాంటి మృదువైన, నెయ్యిలా ఘుమఘుమలాడే ఈ ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్లతోపాటు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అధికారులు, ఉపాధ్యాయులు.. వారి పిల్లల్ని ఎందుకు పంపడం లేదనేదే తేలని ప్రశ్న! మన హైకోర్టుకే కాదు, అలహాబాదు హైకోర్టుకు కూడా ఇవి తేలని ప్రశ్నలే! సుప్రీం కోర్టు ఈ ప్రశ్నను వేసుకున్నా ఏనాటికి సమాధానం చిక్కకుండా చేసే రాజకీయ వ్యవస్థ మనది. ఇలాంటి చచ్చు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఆడే నాటకమే ఈ బడిబా (ఆ)ట కార్యకమం. ఈ ఆటలో చేరే పిల్లల సంఖ్య ఏప్రిల్ 11న గాని తేలదు. తేలినా ఇదేం చిదంబర రహస్యం కాదు. గత విద్యా సంవత్సరమే సున్నా శాతం నమోదు అయిన పాఠశాలల సంఖ్య 405. ఇందులో మూడు ఉన్నత పాఠశాలలుండడం గమనించాలి. 12వేలకు పైగా సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50కి లోపే. 13వేలకు పైగా పాఠశాలల్లో పిల్లల సంఖ్య 60 లోపే. 10-20 మంది పిల్లలుగల పాఠశాలలు 4వేల దాకా వున్నాయి. హేతుబద్ధీకరణతో మూతబడే పాఠశాలల సంఖ్య 4,481. ఇవన్నీ ఎవరో చెప్పిన కాకిలెక్కలు కాదు. స్వయానా విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన గణాంకాలు! పైన ప్రస్తావించిన ‘ఉత్తమోత్తమ’ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులెందుకు చేరడం లేదో, చేరినా ఎందుకు నిలకడగా వుండడం లేదో, కాబోయే ‘మూడోతరం ముఖ్యమంత్రి’, కెసిఆర్ మనవడు హిమాన్షు కూడా చెప్పకపోవచ్చు. బహుశా ఆనాటికి ప్రభుత్వ పాఠశాలల ఉనికే వుండక పోవచ్చు!
అందుకే జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో(జాతీయ నిష్పత్తి 1:27 కాగా, తెలంగాణలో 1:22) వుంది. మరో తొమ్మిది వేలదాకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను నింపాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పుండు మీద కారం చల్లడం లాంటిదే! 2028 నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తలెత్తుకొని నిలబడే రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దాలనుకుంటున్న ఆ రాష్ట్ర సిఎం చంద్రబాబును 4వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను వెంటనే నింపాలని (డిఎస్సీ నిర్వహించినా భర్తీకాని ఖాళీలు) కోర్టు ఆదేశించింది. బహుశా వీటికి సమాధానం కొత్తగా మంత్రి అయిన లోకేష్‌కు కూడా దొరక్కపోవచ్చు! గ్రీకు నాటకం ముగింపులా విషాదమో, తెలుగు సినిమాలా శుభమో తెలియదు.
కులానికో రెసిడెన్షియల్, మతానికో రెసిడెన్షియల్, వర్గానికో రెసిడెన్షియల్ పాఠశాలల్ని తెరుస్తూ, మధ్యమధ్యన కస్తూర్బా స్కూళ్లను ప్రేరేపిస్తూ, మోడల్ స్కూళ్ల బూచిని చూపుతూ, సాంఘిక, గిరిజన గురుకులాలంటూ ఊదరగొడుతూ విద్యను కుక్కలు చించిన విస్తరిలా చేస్తున్నారు. పిల్లల్ని బలవంతంగా లాగేస్తూ, రాకపోతే బుజ్జగిస్తూ ప్రైవేటు పాఠశాలలు వేట సాగిస్తుంటే- సర్కారీ బడులకు పిల్లలు ఎలా వస్తారు? ఎక్కణ్ణుంచి వస్తారు? రెగ్యులర్ పాఠశాలలకు పిల్లలు రాకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకుపోతూ, మరోవైపు- ‘మా పాఠశాలకు రండి.. మాదే అత్యుత్తమ పాఠశాల..’ అంటూ కేకలు, అరుపులు, పెడబొబ్బలు పెట్టినా పిల్లలు రారని తెలిసినా, వచ్చిన పిల్లలతో ప్రచారం చేయించడం- వీరినికూడా బడికి దూరం చేయడమే! ఈ నిగూఢ రహస్యాలు తెలియని ప్రజలేమీ లేరు. ఇది తెలియనివారే ఇంకా రెగ్యులర్ పాఠశాలల్ని నమ్ముకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు గంజిని పోస్తున్నారు. పంతుళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. అధికారుల, రాజకీయ నాయకుల విలాసాలకు వీరు సమిధలైతున్నారు. వీటిని గుర్తించని కబోదుల్లా మనమంతా నటిస్తున్నాం!
మళ్ళీ గొర్రెల కాపరి శ్రీనివాస్ దగ్గరికే పోదాం! శ్రీనివాస్ గొర్రెల్నే ఎందుకు నమ్ముకున్నాడో ఈ పిట్టకథ చెబుతుంది. అది- హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్. ఈ దేశంలో లక్షలాది మంది బతుకీడ్చినట్లే రామూ షిండే అనే పిల్లవాడి తండ్రి రోజూ ఇడ్లీబండిని నడిపేవాడు. మిగతా గరీబు పిల్లల్లాగానే తండ్రికి సహాయపడుతూ, కొందరి పిల్లల్లా రాము ఎంబిఎ పూర్తిచేసాడు. ఉద్యోగమా? వృత్త్ధిర్మమా? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేసుకొని చివరికి తండ్రి చేసిన వృత్తినే ఎంచుకున్నాడు. అలా మొదలైన రాము జీవితం, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాల దోశల సృష్టికి నాందీ ప్రస్తావన చేసింది. అలా ఎదిగిన రాము వ్యాపారం బంజారా హిల్స్ రోడ్ నెం.14కు పాకింది. ‘రామూస్ దోశ హౌస్ (ఎసి)’గా ఎదిగింది. ముప్ఫై మందికి ఉపాధి కల్పించడమే కాదు- అందులో పనిచేస్తున్న మాస్టర్ చెఫ్‌లకు రూ.30-40 వేల జీతం ఇస్తున్నాడంటే నమ్మలేం. అయినా, నాంపల్లి అడ్డాను ఇప్పటికీ రామూ నమ్ముకోవడం కొసమెరుపు. ఈ ఉదంతం గురించి ఏ పాఠ్యవ్యవస్థ మాట్లాడదు. అంతా హైఫై! మన విద్యంతా అంతర్జాతీయ స్థాయే! ఒకప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు కావడం అన్నది నినాదంగా వుంటే, ఇప్పుడంతా ఐఎఎస్‌లు, ఐఐటిలనుగా ఎదిగించడమే!
రామూ షిండేలా గొల్ల శ్రీనివాస్ తండ్రి వృత్త్ధిర్మానే్న ఎన్నుకోవడంలో విజ్ఞతనే చూపాడనుకోవాల్సిందే! రాముకు విద్యాగంధం అంటడం ప్లస్ పాయింటు. ఈ లెక్కన శ్రీనివాస్‌కు ఈ గంధం ఎందుకు అంటలేదో విద్యాశాఖ చెప్పాలనేదే ఈ కథనం ఉద్దేశం. తెలిసిన వారు తమకు తెలిసినట్టుగా చెప్పుకోవచ్చు! చివరికి వౌనం విడగొట్టిన శవంలోని బేతాళుడు ఎలాగూ చెట్టుపైకి చేరుతాడు.
నైజాం కాలంలో- స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దాదాపు 60వ దశకం దాకా పాఠశాల ఆవాస ప్రాంతాల్లో స్కూలు అటెండర్ పిల్లల వేటను సాగించేవాడు. పాఠశాలకు పంపిస్తే పిల్లలకు టీకాలు వేస్తారనే భయం నాటి ప్రజల్లో వుండేది. ‘పిల్లల్ని భయపెట్టడానికి అటెండర్ వస్తుండు..’ అంటూ తల్లిదండ్రులను బెదిరించేవారు. విశాల పరిధిని ఏర్పర్చుకున్న విద్య ఈ 70 సంవత్సరాలలో సాధించింది ఎంతనో తెలియదు గాని, ఇంకా పిల్లల్ని వేటాడడం జరుగుతూనే వున్నది. స్వచ్ఛందంగా, సంతోషంగా వెళ్ళాల్సిన పిల్లలు బడి అంటే ఎందుకు భయపడుతున్నారో ప్రశ్నించుకోలేక పోతున్నాం. అదే నిజామాబాద్ జిల్లాల్లో ఒకప్పటి సిఎంవో పిల్లల్ని వేటాడి, వెంటాడి పట్టుకున్న (పొలం గట్లవద్ద, పశువుల మందల దగ్గర, చెట్లపై నుండి...) ఫొటోలను ఆదర్శంగా భావిస్తూ ఇప్పటికి రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ గోడలపై పెట్టుకున్నారు. సదరు సిఎంవోనే, జిల్లాలోని వేల్పూర్ మండలాన్ని బాల కార్మిక రహిత మండలంగా ప్రకటిస్తే అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా నమ్మింది. ఏనాడూ ఓ సర్వే జరిపి వాస్తవాల్ని గుర్తించలేదు. ఆయన సేవల్ని మెచ్చిన ఆర్‌విఎం, జిల్లా బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టు డైరెక్టరుగా (ఎస్‌జిటి పోస్టు వ్యక్తిని) నియామకం చేసింది. దశ తిరగాల్సిన సదరు డైరెక్టర్, జిల్లాలోని 21 ప్రాజెక్టులలో లేని పిల్లలు ఉన్నట్లు చూపి బియ్యం కోటాల్ని ఎత్తుకునేలా హస్తం తిప్పడంతో ప్రభుత్వ చర్యలకు గురయ్యాడు. మన విద్యారంగ నిర్వహణకు ఇదో చిరు ఉదాహరణ. మిగతాది వెండితెరపైలా, ఎవరికి వారే ఊహించుకోవాలి.
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162