మెయన్ ఫీచర్

‘వక్రబుద్ధి’ జాస్తి.. శిక్షలు నాస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్‌లీలా బన్సాలీ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. రాజస్థాన్‌కు చెందిన ‘చిత్తూరు రాణి పద్మిని’ జీవిత చరిత్ర ఆధారంగా ‘పద్మావతి’ అనే సినిమా నిర్మించాలని ఆయన సంకల్పించాడు. జనరంజకంగా ఈ చారిత్రక సినిమాను రూపొందించాలని తపన పడి, అందుకోసం కావలసిన స్క్రిప్టును కూడా తయారుచేసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. చారిత్రక సినిమాలను తీయడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఇదివరకూ ఎందరెందరో దర్శకులు చారిత్రక కథాంశాలతో మేటి కళాఖండాలను సృష్టించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అయితే, బన్సాలీ తీస్తున్న సినిమాకు సంబంధించి ఆదిలోనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సినిమా కోసం చరిత్రను ఆయన వక్రీకరిస్నుట్లు ఓ వర్గం ప్రజలు బాహాటంగా దాడులకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రాణిపద్మిని కథ క్రీస్తుశకం 1300 ప్రాంతం నాటిది. అప్పుడు ఢిల్లీని అల్లాఉద్దీన్ ఖిల్జీ అనే ప్రభువు పరిపాలిస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రాంతంలోని చిత్తూరు మీదికి దండయాత్ర చేయగా వేలాది మంది రాజపుత్ర స్ర్తిలు ఆత్మార్పణం చేసుకున్నారు. దీనికే ‘జోహార్’ అని పేరు. ఇలాంటి ‘జోహార్’లు రాజస్థాన్ చరిత్రలో మూడుసార్లు జరిగాయి. అలనాటి సంఘటనలను ప్రాతిపదికగా చేసుకొని ఇపుడు సంజయ్‌లీలా బన్సాలీ ఓ కట్టుకథ కల్పించాడు. ఇస్లాం మతస్థుడైన అల్లాఉద్దీన్ ఖిల్జీని రాణి పద్మావతి ప్రేమించిందని బన్సాలీ తన సినిమా కోసం స్క్రిప్టు తయారుచేశాడు. ఆ స్క్రిప్టు గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో ఆయన ఉద్దేశ పూర్వకంగా చరిత్రను వక్రీకరించినట్లు విమర్శలు చోటుచేసుకున్నాయి.
సామాన్యంగా పాశ్చాత్య చరిత్రకారులు, సామ్యవాదులు భారతదేశ చరిత్రను వక్రీకరించడమూ, అభూత వ్యాఖ్యానాలు (ఇంటర్‌పెటేషన్లు) చేయడమూ జరుగుతూ ఉం టుంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. చరిత్రను వక్రీకరించడానికి కారణం- భారతీయ సంస్కృతిని నిర్మూలించాలనే దురుద్దేశమే. ఇప్పుడు బన్సాలీ చేసింది నిజంగా దేశద్రోహం కిందకే వస్తుందని చెప్పాలి. మన ఘనమైన చరిత్రకు వక్రభాష్యాలు చెప్పినందుకు బన్సాలీని బాలీవుడ్ ప్రముఖులు వెనుకేసుకొని రావటం ఏమిటి? సినీ ప్రముఖులు తప్పులు చేసినా, నేరారోపణలు ఎదుర్కొన్నా వారిని గుడ్డిగా సమర్థించడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పైనా గతంలో న్యాయస్థానాలలో పలు అభియోగాలు నమోదయ్యాయి. తాగిన మత్తులో కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి ఆయన కారకుడయ్యాడని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లో కృష్ణజింకలను వధించినట్లు సల్మాన్ ఖాన్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కేసుల విచారణ రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగింది. చాలా కేసుల్లో ఆయనను నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయి. న్యాయస్థానాల్లో శిక్ష పడకుండా ఆయన తప్పించుకోవచ్చుగాక, కానీ భగవంతుని న్యాయస్థానం నుండి ఏ పరిస్థితుల్లోనూ తప్పించుకోజాలడు. ఓ మనిషిని, మూగజీవాలను కడతేర్చిన అలాంటి వ్యక్తిని బాలీవుడ్ వెనకేసుకొని రావటం ఏమిటి? అంటే.. సినిమా ప్రముఖులకు చట్టాలు, సంస్కృతి, చరిత్రలపైన గౌరవం లేదు, నైతిక విలువలపైనా నమ్మకం లేదు అని మనం భావించక తప్పదు. ఎంతసేపూ వారికి ధనం, కీర్తిప్రతిష్టలు సంపాదించడం తప్ప మిగతా విషయాలేవీ పట్టవా? నేరాలు చేసినప్పటికీ సినీ నటులు చట్టాలకు, న్యాయానికి అతీతులా? గతంలో వివిధ భాషలలో చాలా చారిత్రక చిత్రాలు వచ్చాయి. తెలుగులో అల్లూరి సీతారామరాజు, మహామంత్రి తిమ్మరుసు, అన్నమయ్య, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం వంటివి చాలా ఉన్నాయి. చారిత్రక కథలను సినిమాలుగా మలచినప్పుడు కొద్దిపాటి మార్పులు, కొంత కల్పన జత చేయడం పరిపాటే. తెలుగులో అఖండ జనాదరణ పొందిన సినిమాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే మిగతా భాగం చరిత్రకు చాలావరకూ అనుగుణంగానే ఉన్నట్లు భావించాలి. ‘అనార్కలి’ చిత్రంలో చారిత్రక ప్రామాణ్యం ఎంత? హిందీలో ‘మొగల్ ఎ అజాం’ పేరిట ఈ కథను సినిమాగా తీశారు. తెలుగులో ‘అనార్కలి’, ‘అక్బర్ సలీం అనార్కలి’ వంటివి వచ్చాయి. అనార్కలి- సలీంలది ఒక ప్రేమకథ. ఈ కథకు చరిత్రలో ఎటువంటి శాసనాధారాలు లభించవు. ఇక ఆ మధ్య ‘జోధా అక్బర్’ అనే పేరుతో మరొక హిందీ చిత్రం వచ్చింది. అందులో నిరక్షరకుక్షి అయిన అక్బర్‌ను జోధ్‌బాయి వివాహమాడటం ఇతివృత్తం. ఇది రాజపుత్రుల అవమాన చరిత్రకు సంకేతం. రాణాప్రతాప్ దేశ స్వాతంత్య్రం కోసం చిత్తశుద్ధితో పోరాడుతుంటే కొందరు రాజపుత్ర నాయకులు అక్బర్‌కు పాదాభివందనం చేశారు. రాజపుత్ర నాయకులు వారి కుమార్తెలను అక్బర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఇక మస్తానా అనే అమ్మాయిని బాజీరావు వివాహం చేసుకున్నాడు. ఈ కథ రాజా ఛత్రసాలో కాలంలో జరిగింది. ఇది కూడా ఇటీవలే సినిమా వచ్చి విజయం సాధించింది. ఇందులో చారిత్రక వక్రీకరణ లేదు. ఇక ‘ఝాన్సీరాణి’, ‘ఆమ్రపాలి’ వంటి హిందీ చిత్రాలు లోగడ వచ్చాయి.
ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే- చారిత్రక చిత్రాల్లో కల్పన ఉండవచ్చునా? అని. వందల సంవత్సరాల క్రితం నాటి చరిత్రలో కొన్ని అంశాలు మరుగున పడిపోతాయి. అలాంటి సందర్భాలలో కథాస్రవంతి కోసం అక్కడక్కడ అతుకుపెట్టినట్లు కొన్ని కల్పనలు చేయవచ్చు. అంతేకాని- మన స్వార్థ ప్రయోజనాల కోసం చరిత్రను సమూలంగా వక్రీకరించకూడదు. సరిగ్గా ఇటువంటి ప్రయత్నమే ‘పద్మావతి’ సినిమా కోసం బన్సాలీ చేశాడు. హిందువులు- మస్లిముల మధ్య సమైక్యత, సామరస్యం వంటి అంశాలు చూపించాలంటే చరిత్రను అడ్డగోలుగా మార్చివేయాలా? బైరాంఖాన్ విషయంలోనే కాదు, రాణాప్రతాప్ విషయంలోనూ అక్బర్ ఎంత క్రూరంగా ప్రవర్తించాడో చరిత్ర విద్యార్థులకు తెలియదా? ‘అక్బర్ ది గ్రేట్’ అని ఆంగ్లేయులు చరిత్ర గ్రంథం వ్రాశారు. అందులో రాణాప్రతాప్ పేరు లేదు. దేశం కోసం శ్రమించిన ఓ వీరుడిని ఇలా విస్మరించడం అంటే చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడమే. అల్లాఉద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫర్‌లు చేసిన దుర్మార్గాలు చరిత్ర పుటల నిండా మనకు కన్పిస్తుంటాయి. వాటిని ఇవాళ ఎవరూ విస్మరింపజాలరు.
12వ శతాబ్దంలో మహమ్మద్ జైషే అనే ఒక సూఫీ వాగ్గేయకారుడు ఉండేవాడని చారిత్రక గ్రంథాల వల్ల తెలుస్తున్నది. అతడు రచించిన ‘వీరగాధ’ ఆధారంగా రాణి పద్మిని గురించి మనం తెలుసుకోవచ్చు. సంజయ్‌లీలా బన్సాలీ ‘పద్మావతి’ పేరుతో తీస్తున్న సినిమా ఆ ‘వీరగాధ’ మీద ఆధారపడిందేనా? ఇందులో కల్పన ఎంత? వాస్తవం ఎంత? ‘కర్ణిసేన’ అనే ఒక రాజస్థానీ సామాజిక సంస్థ గతంలో ‘జోధా అక్బర్’ సినిమా తీసినపుడు కూడా తమ నిరసనను తెలియజేసింది. కానీ- మన దేశంలో లౌకికవాదులు గానీ, మేధావులు గానీ ఆ నిరసనను పట్టించుకోలేదు. ‘పద్మావతి’ పేరిట తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఇటీవల ‘కర్ణిసేన’ కార్యకర్తలే బన్సాలీపై చేయి చేసుకున్నారు. షూటింగ్ కోసం వేసిన భారీ సెట్టింగ్‌లకు నష్టం కలిగించారు. చరిత్రను వక్రీకరిస్తున్నందుకు బన్సాలీపై చర్యలు తీసుకోవాలంటూ వారు కోర్టులో కేసు కూడా పెట్టారు. బన్సాలీ చరిత్రను వక్రీకరించడం చారిత్రక నేరం. అలాగే, శాంతియుత నిరసనలకు బదులు ఆయనపై ‘కర్ణిసేన’ కార్యకర్తలు చేయి చేసుకోవటం చట్టరీత్యా నేరమే. ఈ కేసుల సంగతి పక్కన పెడితే- దేశ చరిత్రను తారుమారు చేసే అధికారం సినీ నిర్మాతలకు, దర్శకులకు ఎవరు ఇచ్చారు? ఎంత సినిమావాళ్లయితే మాత్రం చరిత్రను ఇష్టారాజ్యంగా మార్చేస్తారా?
నా చిన్నతనంలో ‘అవ్వయ్యార్’ అనే మహిళా చిత్రం వచ్చింది. అందులో అవ్వై అనే తమిళ వాగ్గేయకారిణి పాండిరాజును కలిసినట్టు చూపించారు. ఇది చారిత్రక సత్యం కాదు అని ఓ తమిళ మిత్రుడు నాకు చెప్పాడు. అది నిజమే కావచ్చు. కానీ, దానివల్ల అవ్వై పాత్రకు పెద్దగా నష్టం కలుగదు. కానీ, సంజయ్ లీలా బన్సాలీ చేసిన వక్రీకరణ ఫలితంగా భారతదేశ చరిత్రయే మార్చివేయబడుతున్నదని మనం భావించక తప్పదు. నిరసన జ్వాలలు, ఆందోళన సెగలు తగలడంతో చివరికి దర్శకుడు బన్సాలీ- ‘నేను స్క్రిప్టు మార్చుకుంటాను’ అని ప్రకటించక తప్పలేదు. ‘స్క్రిప్టు’ మారాక బన్సాలీ కథనం ఎలా ఉంటుందో చూడాలి. గిద్వానీ రచించిన ‘స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్’ ఆధారంగా గతంలో ఒక టెలీ సీరియల్ వచ్చింది. టిప్పు సుల్తాన్ చేసిన ఒక్క దుర్మార్గం కూడా ఈ సీరియల్‌లో చూపబడలేదు. వాస్తవాలను చూపెడితే ఓ వర్గం ప్రజలు ఆందోళన చేస్తారన్న భయం ఇందుకు కారణం కావచ్చు.
ఇక ‘పద్మావతి’ అనే పేరు చరిత్రలో ఎక్కడా లేదు. ఆమె పేరు చరిత్రలో ‘పద్మిని’ అని మాత్రమే ఉంది. రాజస్తాన్‌లోని ‘రాజపుత్ర సభ’ నాయకులు ఈ చిత్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పద్మినికి, అల్లాఉద్దీన్ ఖిల్జీకి మధ్య ప్రణయ యుగళగీతాలు పెట్టి సినిమా విడుదల చేస్తే నిర్మాతలకు ‘కలెక్షన్ల కనక వర్షం’ కురుస్తుందేమో గానీ, చరిత్రకు వక్రభాష్యం జరిగిందని ఎంతమంది జనం నిలదీస్తారు? సినీ ప్రేక్షకుల సంగతలా ఉంచి, చరిత్రను వక్రీకరించిన బన్సాలీ వంటి సినీ ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం అయినా ప్రశ్నిస్తుందా?

- ముదిగొండ శివప్రసాద్