మెయన్ ఫీచర్

ఉస్మానియా శతాబ్ది.. నవ సంకల్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు సరిగ్గా మరొక రెండు వారాలలో ఈనెల 26వ తేదీన ప్రారంభం కానున్నా యి. మూడు రోజుల ఆరంభోత్సవాల తర్వాత వివిధ కార్యక్రమాలు మొ త్తం సంవత్సరం పొడవునా సాగనున్నాయి. ఉస్మానియాకు నూరేళ్లు పూర్తికావటం ఒక్క తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటికీ గర్వించదగ్గ విషయం. ఇంకా బాగా చెప్పాలంటే మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇరుగు పొరుగు రాష్ట్ర వాసులకు కూడా. ఆసఫ్ జాహీ వంశపు చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917లో ఒక ఫర్మానా ద్వారా నెలకొల్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయం గత వంద సంవత్సరాలుగా తెలుగు ప్రాంతాలతోపాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల విద్యార్థులెందరికో విద్యను అందిస్తూ వచ్చింది. భారతదేశంలోనే గాక ప్రపంచంలో మంచి పేరు పొందింది. ఒకవైపు సామాజిక శాస్త్రాలు, మరొకవైపు వైజ్ఞానిక- ఇంజనీరింగ్ - వైద్య విద్యలన్నింటిలో ఉత్తమ ప్రమాణాలు సాధించిన విద్యా కేంద్రంగా ఖ్యాతి సంపాదించటం సాధారణమైన విషయం కాదు. ఉస్మానియాలో భవనాలు ఎంత సుందరమైనవో, చదువులు అంత అద్భుతమైనవని అంగీకరించనివారు లేరు.
తొలిదశలో బోధన ఉర్దూ మీడియం మాత్రమే కావటమనే విమర్శ ఒకటి ఉండటం, మీడియం ఏదైనప్పటికీ బ్రిటీష్ వలస పాలనా కాలంలో ‘ఒక స్థానిక భాషలో ఉన్నత విద్యాబోధన’ అన్నదే ఒక ఘనత అనే వివరణ వంటి వాటిని పక్కన ఉంచితే, ఇంగ్లీష్ బోధనను స్వయంగా నిజాం తప్పనిసరి చేయటం, తర్వాత ఎక్కువ కాలం గడవకుండానే యూనివర్సిటీ విద్యలు పలు భాషా సాహిత్యాలకు ఆలవాలం కావటమన్నది గుర్తించవలసిన విషయం. ఇంజనీరింగ్, వైద్య విద్యలైతే ప్రపంచ స్థాయిని అందుకుని బయటి నిపుణులను, విద్యార్థులను ఆకర్షించాయి. ఈ రోజున కూడా దేశంలోని ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోల్చినపుడు ఉత్తమమైన ర్యాంకులు పొందుతున్న ఉస్మానియా- విదేశీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వాటిలో ఒకటి కావటం గమనార్హం.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి మరొక ముఖ్య విశేషం ఉంది. ఇక్కడి విద్యార్థులు ప్రతి దశలో చదువులకు, సామాజిక స్పృహతో కూడిన ఉద్యమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. యువతరం విద్య, ఉద్యోగ అంశాలపై స్పందించటంతో పాటు సామాజిక- రాజకీయ వ్యవహారాలపై కూడా ముందుకు రావటం ఎన్నోచోట్ల సాధారణంగా జరిగేదే. కానీ ఆ స్పృహ, చైతన్యం నిరంతరం కావటం, ఉన్నత స్థాయికి చేరటం అనే ప్రమాణాలను బట్టి చూసినట్లయితే ఒక్క భారతదేశంలోనే గాక వర్థమాన ప్రపంచపు అగ్రస్థాయి విద్యా కేంద్రాలలో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటవుతుంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 1947 వరకు జరిగిన ఉద్యమాలలో, తర్వాత సమసమాజ ఆదర్శంతో సాగిన పలు విడతల ఆందోళనలలో, ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదంతో జరిగిన ఉద్యమాలలో, అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వర్థమాన దేశాల ప్రజలకు సంఘీభావంగా కొన్ని దశాబ్దాల కాలం తరచూ సాగుతూపోయిన కార్యక్రమాలలో ఉస్మానియా విద్యార్థులు ఎల్లప్పుడూ క్రియాశీలంగా ఉండేవారు. ఇదంతా వారి సాహిత్య- గానకళా ప్రతిభలోనూ వ్యక్తమవుతూ రావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ కోణాలపై ప్రత్యేక పరిశోధనలు జరగాలే గాని, ఉస్మానియాతోపాటు దాని ప్రేరణతో, నాయకత్వంలో ఈ ప్రాంత విద్యార్థి యువజన తరాలు తమ చదువుతోపాటు సామాజిక- రాజకీయ- అంతర్జాతీయ విషయాలలో నిర్వహించిన నిరంతర క్రియాశీలక పాత్రలు, సాహిత్య- కళాసృజనలు ఎంత మహత్తరమైనవో మన ముందుకు వస్తాయి. 1960లలోని ప్రపంచ వ్యాప్త విద్యార్థి ఉద్యమాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అమెరికాలోని క్యాంపస్‌లు వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాలతో కల్లోలితంగా మారాయి. ఫ్రాన్స్‌లో డీగాల్‌కు వ్యతిరేకంగా సోర్‌బోన్ యూనివర్సిటీ, పాకిస్తాన్‌లో జనరల్ అయూబ్ ఖాన్‌ను నిరసిస్తూ కరాచీ విశ్వవిద్యాలయం, థాయ్‌లాండ్ రాచరిక నియంతృత్వానికి వ్యతిరేకంగా థమ్మాసాట్ యూనివర్సిటీలను విద్యార్థులు యుద్ధ కేంద్రాలుగా మార్చి మొత్తం ప్రపంచానే్న ఊపివేశారు. అదే కాలం నాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమాన్ని బిబిసి వంటి వార్తా సంస్థ- ‘ప్రపంచంలోని నాలుగు అతి పెద్ద విద్యార్థి ఉద్యమాలలో ఒకట’ని అభివర్ణించింది. ప్రపంచంలోని వివిధ ఉద్యమాల చరిత్రలో తెలంగాణకు, ఉస్మానియాకు ఒక అధ్యాయమే ఏర్పడిందనటం అతిశయోక్తికాదు.
అటువంటి చదువులు, చైతన్యాలు కలగలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇపుడు నూరేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నది. స్వయంగా గొప్ప విద్యావంతుడు అయిన రాష్టప్రతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సంవత్సరం పొడవునా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న కార్యక్రమాలను అట్లుంచితే, నిజాం నవాబు ఉస్మానియాను వ్యవస్థాపితం చేస్తూ 1917లో ఫర్మానాను జారీ చేసిన ఏప్రిల్ 26కు గుర్తుగా ఈనెల 26 నుంచి మూడు రోజుల కార్యక్రమాలు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జాతి నిర్మాణంలో ఉస్మానియా పాత్ర, ఉస్మానియా దార్శనికత’ వంటి శీర్షికలతో చర్చాగోష్ఠులు ఏర్పాటవుతున్నాయి. పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు విడివిడిగా సమావేశమై తమ విద్యా సంస్థ భూత - వర్తమాన- భవిష్యత్తుల గురించి చర్చించనున్నారు. దేశమంతటి నుంచి పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, వివిధ దేశాలకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇవి అన్నీ ముగిసేసరికి ఈ చారిత్రక విశ్వవిద్యాలయం తన గతాన్ని, వర్తమానాన్ని సమీక్షించుకోవటంతోపాటు భవిష్యత్తు గురించి కొత్త సంకల్పాలను చెప్పుకోగలదనే ఆశాభావం ‘ఉస్మానియా పరివార్’లో వ్యక్తమవుతున్నది. వందేళ్ల క్రితపు తన ఫర్మానాలో మీర్ ఉస్మాన్ అలీఖాన్.. ‘ప్రాచీన- ఆధునిక కాలాల జ్ఞానం, సంస్కృతుల సమరస సమ్మేళనం జరగాలని, వర్తమాన విద్యా వ్యవస్థలోని లోపాలు తొలగిపోవాల’ని ఆశించాడు. ప్రాచీన - ఆధునిక కాలాలలోని భౌతిక, మేధో, ఆధ్యాత్మిక సంస్కృతులలోని మంచిని గ్రహించాలన్నాడు. శాస్ర్తియ విజ్ఞానాలన్నింటికి అది ప్రేరణ కావాలని సూచించాడు. ఈ అధ్యయన అభ్యాసాల కోసం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ రూపంలో ఒక అతి సుందరమైన భవనాన్ని నిర్మింపజేసి విశాలమైన భూభాగాన్ని అప్పగించాడు. నేటికీ చెక్కు చెదరక చూపరులను కట్టిపడేసే ఆ భవన ప్రాంతంలో ఉత్సవాలు జరుపుకుని చెప్పుకోనున్న నవీన సంకల్పాలు, అవే లక్ష్యాలను మరింత ముందుకు తీసుకుపోయి విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను ఇంకా రాణింపజేయగలవని ఆశించాలి.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానంగా రెండు విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఒకటి- యూనివర్సిటీకి వసతుల కల్పన, రెండు- విద్య, పరిశోధనా ప్రమాణాల మెరుగుదల. బోధనా భవనాలు, పరిపాలనా భవనాలు, హాస్టళ్లు, ఇతర వసతులకు మరమ్మతులు, కొత్త నిర్మాణాలు మొదలైన వాటికోసం, అదేవిధంగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్ కోసం యూనివర్సిటీ వారు రూ.100 కోట్లకుపైగా నిధులను కోరుతున్నారు. అంబేడ్కర్ అధ్యయన కేంద్రం ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇందుకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ కోరిన దానికి మించి రూ.200 కోట్లు కేటాయించింది. ఉస్మానియాతో గల చారిత్రక అనుబంధం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ప్రత్యేక గ్రాంట్లు ప్రకటించడం సముచితంగా ఉంటుందనే అభిప్రాయం వినవస్తున్నది. కేంద్రం నుంచి, యుజిసి నుంచి ఎందువల్లనో ఇంకా స్పందనలు లేవు.
ఈ విధమైన కొత్త అధ్యయన కేంద్రాలు, వసతుల మెరుగుదల ఏవిధంగా జరగనున్నదనేది ప్రస్తుతం వినవస్తున్న ఒక చర్చ కాగా, రెండవది విద్యా- పరిశోధనా ప్రమాణాలకు సంబంధించినది. పైన చెప్పుకున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీకి సామాజిక శాస్త్రాలు, వైజ్ఞానిక శాస్త్రాలలో మొదటినుండి కూడా మంచి పేరుంది. వేర్వేరు అధికార, అనధికార సంస్థలు తరచు విడుదల చేసే ర్యాకింగ్స్‌లోనూ ఆ పేరు నిలుస్తూనే ఉంది. ఉస్మానియా పేరు వినగానే ఆందోళనలకు నిలయమని భావించే వారు కూడా అక్కడి చదువుల స్థాయిని ప్రశంసించకుండా ఉండలేరు. అయితే అదే సమయంలో ఒక మాట దాపరికం లేకుండా చెప్పుకోవలసి ఉంది. యూనివర్సిటీ మంచి కోసం అది అవసరం.
ఆర్థిక సంస్కరణల కాలం నుంచి సైన్స్, ఇంజనీరింగ్‌లతో పోల్చితే సామాజిక శాస్త్రాలు, భాషా సాహిత్య బోధనలు- పరిశోధనల ప్రమాణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత పాతికేళ్లుగా ప్రభుత్వాలు ఈ కోర్సులను ఉద్దేశ పూర్వకంగా నిరుత్సాహపరచడం అందుకు ప్రధాన కారణం. సమాజాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి మధ్య సమతులనం వల్లనే ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. కాని ప్రభుత్వాలను నడిపే వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు ప్రధానం కావటంతో ప్రతిభావంతులైన విద్యార్థులను సైన్స్, ఇంజనీరింగ్, ఐటి, బిటిలవైపు మళ్లిస్తూ ఉద్యోగాలను వాటితో ముడిపెట్టివేశారు. సామాజిక, భాషా సాహిత్య కోర్సులను నిర్లక్ష్యం చేయటంతో ఆ ప్రభావాలు అధ్యాపకులపై, విద్యార్థులపై, ఆ కోర్సులపై తీవ్రంగా కన్పించాయి. అందువల్ల కలుగుతున్న నష్టాలు చదువులు, పరిశోధనల స్థాయిలోనే కాదు, సమాజంలోనూ పలు విధాలుగా ఉంటున్నాయి. ఇది విద్యా రంగాన్ని సమగ్ర దృష్టితో చూసినపుడు అంగవైకల్యం వంటిది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవటం అవసరం. ఇది జరిగితేగాని చరిత్ర, రాజకీయ శాస్త్రం, సోషియాలజీ, ఆర్థిక శాస్త్రం, సైకాలజీ, భాషా సాహిత్య బోధన, పరిశోధనలు మెరుగుపడి సమాజాన్ని పరిపుష్టం చేయలేవు. ఈ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ కృషి చేయటం శతాబ్ది ఉత్సవాల సంకల్పాలలో ఒకటి కావాలి. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767