మెయిన్ ఫీచర్

మహిళలు పెద్ద పదవుల్ని నిర్వర్తించలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుళ బాధ్యతల్లో వారిదే పైచేయవివిధ రంగాల్లో మహిళలు అపారమైన గుర్తింపు తెచ్చుకున్నా కూడా పెద్ద పెద్ద బరువుబాధ్యతల్ని.. నిర్ణయాల్ని తీసుకునే పదవుల్లో చాలా తక్కువగానే వున్నారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాలేజి చదువులు అయిపోయిన తర్వాత సాధారణంగా ఎక్కువ శాతం టీచర్‌లగానో, ఆఫీసుల్లో గుమస్తాలగానో, లేదా హాస్పిటల్స్‌లోని పనుల్లోనో స్థిరపడిపోతున్నారు. దీనికి కారణం ఆడవాళ్లు బరువుబాధ్యతల్ని మోయలేరని, ఏ విషయాన్నైనా వెంటనే నమ్మేస్తారని, సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోలేరని పూర్వకాలం నించి అందని మనస్సుల్లో ముఖ్యంగా మగవారిలో వుంది. పెద్ద చదువులు చదివిన ఆడవాళ్లల్లో చాలా తక్కువమందే పెద్ద పెద్ద బాధ్యతల్ని, నిర్ణయాల్ని తీసుకునే ఉద్యోగాల్లో వున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థల్లో ‘సిఈవో’లుగా చేసే ఆడవాళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇక్కడ మనమొక విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మెచ్చుకోలు కోసం పాకులాడరు..
ఒక ప్రాచీన విజ్ఞాని చెప్పినట్టు ప్రపంచంలోనే విధి నిర్వహణలో ఆడవాళ్లని మించినవాళ్లు లేరన్నది. ఒకప్రక్క కుటుంబ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చుతూ, మరోప్రక్క ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లు ఏడు రకాల బాధ్యతల్ని మోస్తున్నారు.
పిల్లల్ని కనీ, వాళ్లని చక్కగా పెంచడం.
కుటుంబంలోని వాళ్లని, వాళ్లకి నచ్చినట్లుగా, బడ్జెట్టుకి తగ్గట్టు వండి పెట్టడం.
ఇల్లుని చక్కగా అందంగా వుంచుకోవడానికి కావలసిన పనుల్ని నిర్వర్తించడం.
ఇంటిని, చుట్టుప్రక్కల పరిసరాల్ని శుభ్రంగా వుంచుకోవడం.
ఇంటిలోని అందరి ఆరోగ్యం గురించి శ్రద్ధవహించి, అందర్నీ ఒక నర్సులా కనిపెట్టుకుని వుండడం.
ఇంట్లో వయసైన వాళ్ల సంరక్షణకి బాధ్యత వహించడం.
ఉద్యోగాన్ని కూడా ఎటువంటి మాట పడకుండా చక్కగా నిర్వర్తించడం.
ఈ ఏడు బాధ్యతల్నీ ఆడవాళ్లు వాళ్ల జీవితాంతం చక్కగా నిర్వహిస్తూనే వుంటున్నారు. ఇన్ని బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఆడవాళ్లకి జీతం ఏదైనా ఇస్తున్నామా? పోనీ వాళ్ల పనిని గుర్తించి వాళ్లని మనసారా పొగుడుతున్నామా? లేక వాళ్లు నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని గుర్తించగలుగుతున్నామా? ఇవేవి పట్టనట్టుగా ‘ఆడవాళ్లుగా పుట్టారు కాబట్టి మీరే చెయ్యాలి’అన్నట్టు మగవాళ్లు, ఇంట్లోని పెద్దలూ ప్రవర్తిస్తున్నారు. ఇదెంత వరకూ న్యాయమంటారు?
ఆడవాళ్లు తమ పనిని ఒకరు మెచ్చుకోవాలని గానీ, గుర్తించాలని గానీ ఏనాడు అనుకోలేదు. ఆత్మతృప్తికోసమే కుటుంబ బాధ్యతల్ని, ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారే తప్ప ఎవరో మెచ్చుకోవాలని చెయ్యడం లేదు. దీనినిబట్టే మనకి తెలుస్తుంది, ఆడవాళ్లకి ఒక బాధ్యత అప్పచెబితే ఎంత చక్కగా నిర్వర్తించగలరో అన్నది. ఉదాహరణకి కుటుంబంలో వంటకి సంబంధించినంతవరకూ ఆడవాళ్ల సామర్థ్యంని మెచ్చుకోకుండా ఉండలేం! వాళ్లవాళ్ల ఇష్టానికి తగ్గట్టు, అదే సమయం, బడ్జెట్టుకి తగ్గట్టు, అదే సమయం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి తగ్గట్టు జీవితాంతం ఎలాంటి మాటపడకుండా చెయ్యడం మహిళలకే దక్కింది. అందువల్ల మహిళల్ని మెటీరియల్ మేనేజుమెంటులో ఎదుర్కోలేమని ఒప్పుకోవలసిందే మరి!
మార్కెటింగ్ రంగాల్లో కష్టమర్ కేర్ యూనిట్లలో ప్రోత్సాహం
మహిళలు తామనుకున్నది సాధించడంలోనూ, ఇతరుల్ని తమదారికి తెచ్చుకోవడంలోనూ ఆరితేరిన వారన్నది జగమెరిగిన సత్యం! కుటుంబంలో ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని, తన కుటుంబాన్ని గొప్పగా నిలబెట్టడమే కాకుండా, కుటుంబంలోని వ్యక్తుల గురించి కూడా గొప్పగా చెప్పుకునేటట్టు చెయ్యడంలో ఆడవాళ్లు ముమ్మాటికీ సిద్ధహస్తులు! అందువల్ల మార్కెటింగు రంగాల్లో కష్టమర్ కేర్ యూనిట్లలో ఆడవాళ్లనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. దీనికి కారణం ఆడవాళ్లు సహనానికి, సామర్థ్యానికి మారుపేరని! అందుకే మార్కెటింగు మేనేజ్‌మెంటులోనూ వీళ్లకి ఎవరూ సరిరారు!
అనుకోని అవాంతరాలు వచ్చినా..
కుటుంబంలో అనుకోకుండా సమస్యలు తలెత్తితే మగవారు బెంబేలెత్తిపోయి ఏంచెయ్యాలో పాలుపోక చేతులెత్తేస్తారు. లేదా సమస్యల్నించి దూరంగా పారిపోతుంటారు. ఇటువంటి సమయాల్లో ఆడవాళ్లు కొంచెంకూడా భయపడకుండా మనసులో ఎంత బాధవున్నా దాన్ని బయటికి కనిపించనీయకుండా చిరునవ్వుతో చాకచక్యంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవడం మనం ఎంతోమంది దగ్గర చూస్తుంటాం! అందువల్లే భర్త చనిపోతే ఏ ఆడదీ కుటుంబాన్ని ఎలా నడపాలి, పిల్లల్ని ఎలా పెంచడం వంటి ఎలాంటి సమస్యల్నైనా సయస్ఫూర్తితో ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతున్నారు. అదే సమయం భార్య చనిపోతే మగవారు సమస్యల్ని ఎదుర్కోలేక, పిల్లల్ని పెంచలేక, కుటుంబం బరువుబాధ్యతల్ని మోయలేక వెంటనే రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. దీనినిబట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆడవాళ్లని క్రయిసిస్ మేనేజ్‌మెంటులో కూడా ఎవరూ ఓడించలేరని తెలుస్తుంది.
టైంమేనేజ్‌మెంటులోనూ సిద్ధహస్తులు
ఉద్యోగంచేసే ఆడవాళ్లకి రెండు గుర్రాలపై స్వారీ చెయ్యవలసిన పరిస్థితి. ఇంటి పనుల్లో చిన్న తప్పు జరిగినా ‘సంపాదిస్తున్నావన్న పొగరా నీకు’ అని అంటుంటారు. అలాగే ఉద్యోగం చేసేచోట ఏదైనా తప్పుజరిగితే ‘మనస్సంతా ఇంటిమీద వుంటే పనేల చెయ్యగలరు. జీతం మాత్రం మగవారితో సమానం కావాలి’అంటూ నానా మాటలు పడవలసి వస్తుంది. అందుకే ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా రెండు పదవుల్నీ ఎంతో చక్కగా చెయ్యగలుగుతున్నారు అన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వంట చేస్తునే పిల్లల్ని స్కూలుకి రెడీచేసి పంపగలరు. మిక్సీ, గ్రైండర్, స్టౌవ్ ఈ మూడింటినీ ఒకేసారి నిర్వర్తించే సామర్థ్యం వీళ్లకి వుంది. అలాగే టి.వి. చూస్తూ వంట పనుల్ని చిటికెలో చెయ్యగలరు. రాత్రుళ్లు నిద్రపోవడానికి ముందు పిల్లలకి, తనకి కావలసిన వస్తువుల్ని, బట్టల్నీ తీసి వుంచుకుని, వాటికి కావలసిన సామాన్లని కూడా సిద్ధంగా వుంచుకుంటుంటారు. అందువల్లే ఆడవాళ్లు టైంమేనేజ్‌మెంటులో కూడా సిద్ధహస్తులన్నది నిరూపించబడింది. ఇలా ఏడురకాల బాధ్యతల్ని ఆడవాళ్లు నిర్వర్తించడంలో వాళ్ల మనస్సుకి, శరీరానికి విశ్రాంతి లేకపోవడంవల్ల వాళ్లకి నీరసం రాదా అన్న సందేహం మీకు కలగొచ్చు. నీరసం కలిగినా, విశ్రాంతి లేకపోయినా వాటిని లెక్కచెయ్యక తనవారికోసం సంతోషంగా చేసుకెళ్లిపోతుంటారు. ఆడవాళ్లు సునాయాసంగాచేసే పనుల్ని మగవారు ఒక్కరోజు చెయ్యాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది. అటువంటప్పుడు ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లోనూ, కార్పొరేట్ సంస్థల్లోనూ పెద్ద పదవుల్నీ, నిర్ణయాల్ని తీసుకునే బాధ్యతల్ని ఇవ్వడానికి ఇంకా సందేహిస్తున్నారంటే ఇంకా 17వ శతాబ్దంలో లాగానే ఈ 21వ శతాబ్దంలో కూడా పురుషాధిపత్యం కొనసాగుతునే వుందికదా! దీనికి చక్కటి ఉదాహరణ పార్లమెంటులో ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవకపోవడమే!
ఆర్థికమంత్రి ఆమే
ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ పనిచేసి సంపాదిస్తున్నా రోజురోజుకి పెరిగిపోతున్న ధరల్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. కుటుంబానికి ఏ కష్టమొచ్చినా, మేమున్నాం అంటూ తమ నగల్ని, దాచుకున్న డబ్బుల్ని ఇచ్చేసి సమస్యల్ని గట్టెక్కించేస్తారు. రేపటి గురించి ఆలోచించి తన కుటుంబం కష్టపడకూడదని, డబ్బుల్ని ఏదో విధంగా దాచే ఆడవాళ్లని ఫైనాన్షియల్ మేనేజ్‌మెంటులో సిద్ధహస్తులనడంలో తప్పులేదు కదా! .పెళ్లివరకూ ఎంతో గారాబంగా, ముద్దుగా పెరిగి పెళ్లి తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ, సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఆడవాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. దీనినిబట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆడవాళ్లు హ్యుమన్‌రిసోర్స్ మేనేజ్‌మెంటులోనూ ఆరితేరిన వారని తెలుస్తుంది కదా!

- వసంతకుమార్ సూరిశెట్టి