మెయన్ ఫీచర్

బాబరీ కేసులో ఎన్నో వింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించి పాతికేళ్ల నాటి కేసులో ‘కుట్ర సంగతి తేల్చండి..’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించడంతో కొందరికి మళ్లీ పనిపడింది. పక్షపాత ఉదారవాదులు, ముస్లింలకు ‘అపరాధ క్షమాపణలు’ చెప్పేవారు, అంతరించిపోతున్న కమ్యూనిస్టులు- ఈ దేశంలో ‘మెజారిటీ మతస్థుల’ విశ్వాసాలపై దాడి చేసేందుకు మళ్లీ సమాయత్తమవుతున్నారు. కొన్నాళ్లు వౌనంగా ఉన్న ఈ కుహనా లౌకికవాదులు ఇపుడు- బాబ్రీ మసీదు కేసు మళ్లీ తెరచుకోవడంతో కార్యరంగంలోకి దూకేందుకు అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల తర్వాత ‘అసహనం’ పేరిట అవాస్తవిక చర్చల్లో మునిగితేలుతూ కాలక్షేపం చేసిన ఉదారవాదులు, కుహనా లౌకికవాదులు ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ‘సంచలన విజయం’తో ఓ సాధువు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాక పూర్తిస్థాయిలో వౌనం వహించారు. అయితే, ఇపుడు సుప్రీం కోర్టు తీర్పు యాధృచ్చికంగా కలిసిరావడంతో వీరు ‘మెజారిటీ మతస్థుల’ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా నేతలు అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాల కింద విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో దినపత్రికల్లో, ‘బుల్లితెర’పై ఇపుడు మనం మళ్లీ ఎడతెగని చర్చలను చూడొచ్చు. కొంతకాలం పాటు కొనసాగనున్న ఈ చర్చల సందర్భంగా మీడియా తన సొంత ఎజెండాను సైతం ఆవిష్కరించడాన్ని మనం గమనించవచ్చు. కొత్త ఉత్సాహం, శక్తి సామర్ధ్యాలు తమకు లభించాయని భావించే ముస్లిం వర్గీయులు సుప్రీం తీర్పుతో తమకు న్యాయం తథ్యమన్న ధీమాను వ్యక్తం చేసే అవకాశం ఉంది.
బాబ్రీ కేసు విచారణలో సుప్రీం వైఖరిపై న్యాయనిపుణులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని మనం గమనించవచ్చు. ఎల్‌కె అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను తొలగిస్తూ 2011లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే, కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అటువంటి రివ్యూ పిటిషన్‌ను సిబిఐ దాఖలు చేయడం విడ్డూరం. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఇలా రివ్యూ పిటిషన్ వేయాలన్న నిర్ణయం వెనుక రాజకీయ వత్తిడి ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణ వ్యవహారంలా కాక సిబిఐపై ఒత్తిడితోనే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద కట్టడం కూల్చివేతపై పాతికేళ్లుగా ఎలాంటి తీర్పు ప్రకటించని సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రారంభించేందుకు ఆరేళ్ల సమయం తీసుకుంది. కేసుల విచారణలో ఇలా సుదీర్ఘ జాప్యం జరుగుతుండగా, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఇరుపక్షాలూ ముందుకు రావాలని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించడంతో మరో చర్చకు తెరలేచింది. అయితే, ‘ఈ కేసులో మధ్యవర్తిత్వానికి ఏముంది?’ అని ఆ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి ప్రశ్నించడం విస్మయం కలిగిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ పలురకాలుగా ఎవరికివారు అన్వయించుకోవచ్చు! ఇదంతా చూస్తుంటే- న్యాయమూర్తుల ఆలోచనల మేరకు చివరికి ప్రజలే ‘ఓ నిర్ణయాని’కి రావాలేమో?
ఒకే ఉదంతంపై సిబిఐ రెండు కేసులు పెట్టడమూ, అవి వేర్వేరు న్యాయస్థానాల్లో నడుస్తుండటమూ మరొక విచిత్రం. బాబ్రీ కట్టడం కూల్చివేతపై గుర్తు తెలియని కరసేవకులపై పెట్టిన కేసు లక్నో సెషన్స్ కోర్టులోను, భిన్నవర్గాల మధ్య విద్వేషాలు సృష్టించి శాంతికి విఘాతం కలిగించారంటూ అద్వానీ తదితరులపై నమోదైన కేసు రాయ్‌బరేలీ కోర్టులోను కొనసాగుతున్నాయి. తదనంతర కాలంలో కుట్రకు సంబంధించిన అభియోగం కూడా చేరింది. ఇప్పుడు ఈ రెండింటినీ విలీనం చేసి విచారించాలని సుప్రీం ఆదేశించడంతో మరింత గందరగోళానికి తెరలేచింది. యావత్ దేశాన్ని కుదిపేసిన అత్యంత కీలకమైన ఘటనల్లో కూడా సత్వర విచారణ లేకుండా కేసులు ఇంత అస్పష్టంగా, సుదీర్ఘంగా కొనసాగడం విషాదం. కేసు విచారణను రాయ్‌బరేలీ నుంచి లక్నోకు మార్చడాన్ని అద్వానీ తరఫున వాదించిన న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, కేసు విచారణ ఎక్కడ జరిగినా తమకు అభ్యంతరం లేదని, నిందితులపై అభియోగాలను పునరుద్ధరించడమే కావాలని సిబిఐ తెలిపింది. కాగా, వేర్వేరు వ్యక్తులు, అంశాలతో కూడిన రెండు కేసులను కలపడమంటే విచారణను సరికొత్తగా ప్రారంభించడమేనని కొందరు న్యాయనిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇది తాజా విచారణ కాదంటూ సుప్రీం చెబుతోంది.
‘మిన్ను విరిగి మీద పడినా సరే.. జరగాల్సిన న్యాయం జరగాల్సిందే..’ బాబ్రీ కేసులో తిరిగి విచారణకు ఆదేశిస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఇది. అద్వానీ తదితరులు నిందితులుగా ఉన్న కేసులో విచారణను రాయ్‌బరేలీ నుంచి లక్నోకు మార్చాలని సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. వివాదంలో సంపూర్ణ న్యాయం జరిగేలా ఆర్టికల్ 142 ప్రకారం నిర్ణయం తీసుకున్నామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ఆర్టికల్ 142ను ఉపయోగించుకుంటున్నట్లు సుప్రీం పేర్కొనడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాసనవ్యవస్థ అధికారాలను వినియోగించుకొనేందుకు ఆర్టికల్ 142 న్యాయస్థానాలకు అవకాశం ఇచ్చింది. అరుదైన సందర్భాల్లో ఆర్టికల్ 142ను తాము ఆశ్రయించడం సబబేనని సర్వోన్నత న్యాయస్థానం భావించింది.
అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంగణంలో నాలుగింట మూడొంతుల స్థలం రామ్‌లల్లాకు చెందినదని గతంలో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా వివాదాస్పద కట్టడంపై నిర్ణయం తీసుకోవడంలో సుప్రీం కోర్టు విఫలమైందన్న విమర్శలు లేకపోలేదు. రామమందిరానికి సంబంధించి పురావస్తుశాఖకు కచ్చితమైన ఆధారాలు లభించాయి. మసీదుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని, 1930 నుంచి అక్కడ ఎలాంటి ప్రార్థనలు జరగడం లేదని కూడా తేలింది. బాబర్ కాలంలో రామజన్మభూమి మందిరాన్ని కూల్చివేసినట్లు కూడా చారిత్రక ఆధారాలు లభించాయి. ‘హిందూ ఆలయాలు’ అనే గ్రంథంలో రచయిత సీతారామ్ గోయల్ దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను ఉటంకించారు. ఈ చారిత్రక సాక్ష్యాలను వీక్షించేందుకు న్యాయవ్యవస్థ ఎందుకు కళ్లు మూసుకుంటున్నదో ఎవరికీ అర్థం కాదు. తన తీర్పు ద్వారా మతసహనానికి విఘాతం కలుగుతుందని ఎందుకు భావిస్తోంది? వివాదంలో ఏ వర్గం వారికీ న్యాయం దక్కకుండా పాతికేళ్లపాటు న్యాయవ్యవస్థ ఎందుకు సాగదీస్తోంది?
ఉపయోగంలో లేని లేదా శిధిలమైన మసీదును ఎందుకు కూల్చేశారంటూ ఉదారవాదులు అంతులేని రభస సృష్టిస్తున్నారు. అయితే, రామజన్మభూమిలోనే మందిరానికి దూరంగా మసీదును కూడా నిర్మించుకోవచ్చని మెజారిటీ వర్గీయులు సుముఖత వ్యక్తం చేయడాన్ని కుహనా లౌకికవాదులు ఎందుకు గుర్తించరు? హిందువుల మనోగతాన్ని ముస్లింలు అంగీకరిస్తే ఉదారవాదులు, లౌకికవాదులు సహించలేరు! ఉభయ వర్గాలు కలిసి ఉండడం వారికి ఇష్టం లేదు. కాశ్మీర్ లోయలో 1947 తర్వాత 208 హిందూ ఆలయాలను కూల్చివేసినా ఈ కుహనా లౌకికవాదులు నోరు మెదపరు. మొఘలుల రాజ్యంలో కూల్చేసిన వందలాది ఆలయాలను పునర్ నిర్మించాలని ‘మెజారిటీ మతస్థులు’ డిమాండ్ చేస్తారన్న భయం ఉదారవాదులను పట్టి పీడిస్తోంది.
అప్రస్తుతమైనా ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ‘జాతి వివక్ష’పై బిజెపి మాజీ ఎంపి ఒకరు చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేయాలని ఉదారవాదులు, కుహనా లౌకికవాదులు యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. ఆఫ్రికా దేశాల్లో ఇతరులపై నల్లజాతీయుల దాడుల సందర్భంగా ఉదారవాదులు అత్యుత్సాహంతో మాట్లాడుతూ జాతివివక్ష భారతీయుల రక్తంలో ఉందనడం సిగ్గుచేటు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విలువల పట్ల ఏ మాత్రం అవగాహన లేకుండా వీరు మాట్లాడుతుంటారు. ‘నల్లనయ్య’ శ్రీకృష్ణుడిని భారతీయులు ఎంతగా ఆరాధిస్తారో ఈ లౌకికవాదులకు తెలియదా? నల్లగా ఉన్నాడని కృష్ణుడిని ఆరాధించవద్దని ఎవరైనా చెబుతారా? ఉదారవాదుల మానసిక స్థితి భారతీయతకు పూర్తి విరుద్ధం.
*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206