మెయన్ ఫీచర్

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ, శాసనమండలిలో ఆమోదించడంతో ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికినట్లయ్యింది. ఏకకాలంలో మరో చారిత్రాత్మక నిర్ణయానికి తెరతీస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు- రాష్ట్రాలకు ఉండాల్సిన రాజ్యాంగ హక్కులను పునరద్ఘాటిస్తూ శాసనసభలో మాట్లాడడం, తద్వారా కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలకడం కూడా జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు.. మరేదైనా కావచ్చు.. కానీ, యావత్భారతదేశం సమీప భవిష్యత్‌లో సుదీర్ఘంగా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, ఒక నిర్ధిష్ట నిర్ణయానికి రావల్సిన అంశమిది అనాలి.
ఈ నేపథ్యంలో ఒక విషయం మననం చేసుకోవడం అవసరమేమో! ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో- 2012 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్న విషయంగా పరిగణించాలి. ‘్భరత సమాఖ్య నిర్మాణంలో ఒక క్రమపద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి ఆందోళన కలిగిస్తున్నది..’ అని ఆనాడు మోదీ అన్నట్లు వార్తలొచ్చాయి. ‘రాష్ట్రాలకు న్యాయబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వాటికి దక్కేట్లు చేయడం వల్ల కేంద్రం ఎంతమాత్రం బలహీనపడిపోదు. రా ష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలను అందించాలే కాని కేంద్రానికి అణగి మణగి వుండాల్సిన అవసరం లేదు. ‘సహకార సమాఖ్య పద్ధతి’ వుండాలే కాని ‘బలత్కార సమాఖ్య పద్ధతి’ వుండరాదు’ అనే భావనని మోదీ ఆనాడు స్పష్టంగా వ్యక్తపరిచారు.
బహుశా అంతకన్నా ఇనుమడించిన గుండె ధైర్యంతో, సాహసంతో, ఉత్సాహంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన వాదన వినిపించారు. ముస్లిం మైనారిటీలకు బిసి-ఇ కేటగిరి కింద, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లును ప్రవేశపడుతూ ఆయన మాట్లాడిన పద్ధతిని బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందడానికి అవసరమైన భూమికను తయారు చేసుకుంటున్నట్లుగా మనం భావించాలి. శాసనసభలో సిఎం కెసిఆర్ వ్యాఖ్యలు కుండబద్దలు కొట్టినట్లుగా తేటతెల్లంగా వున్నాయనాలి. ‘నేను కేంద్రాన్ని అర్థించడం లేదు.. పోరాటం చేయబోతున్నా.. నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావిస్తా.. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా..’ అని ఆయన స్పష్టంగా, అరమరికలు లేకుండా చెప్పడం గమనించాల్సిన విషయం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి- తమిళనాడు సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో వున్న రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సుప్రీం కోర్టు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించిందని, అలాంటి పరిస్థితులు తెలంగాణలో కూడా వున్నాయని సిఎం అన్నారు. రాష్ట్రాలు ఇప్పడు అమలులో వున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న ‘సరైన గణాంకాలు’ ‘స్పష్టమైన లెక్కలు’ తెలంగాణ రాష్ట్రంలోనూ వున్నాయని సిఎం అన్నారు. శాసనసభలో వివిధ సందర్భాల్లో జరిగిన చర్చల్లో సిఎం మాట్లాడుతూ, ‘రిజర్వేషన్ల లాంటి కొన్ని కొన్ని విధానపరమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన, ఇతర ప్రాధాన్యతాంశాల, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలను తీసుకునే అధికారం రాష్ట్రాలకే వుండాలి. వాటిని రాష్ట్రాలకే కేంద్రం వదిలేయాలి. పరిణతి చెందిన, సచేతనమైన మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన సౌలభ్యాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలి. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన నాటి స్థితిగతులు నేడు దేశంలో ఎక్కడా లేవు. 70 సంవత్సరాలకు పూర్వం మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఇప్పుడు జనాభా భారీగా పెరిగింది, పెరుగుతున్నది. ప్రజల్లో అవగాహన పెద్దఎత్తున పెరిగింది. అందుకు తగ్గ అవకాశాలు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు తమ తమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోరికలు కోరటం జరుగుతున్నది. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోవడానికి, పరుగులు తీయడానికి, ముందంజ వేయడానికి, రిజర్వేషన్ల అంశాన్ని ఆయా రాష్ట్రాల నిర్ణయానికి వదిలి పెట్టేయాల్సిన తరుణం ఆసన్నమయింది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా మేం పోరాటం చేసినప్పుడు మాకు లభించిన, అందించిన సహకారం, కలిసివచ్చిన నేపథ్యం ఇప్పుడు కూడా కావాలి. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం.. మన నైజం.. అదే మనకు ప్రాతిపదిక. లేని పక్షంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగి ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది’ అన్నారు.
‘షెడ్యూల్డు కులాల వర్గీకరణ’ అంశాన్ని సిఎం కెసిఆర్ ప్రస్తావిస్తూ, ఆ అంశంపై పెద్దఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారం అందిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అదో పెద్ద విషయం కాకపోవచ్చని, తెలంగాణలో మాత్రం ప్రాధాన్యత చాలా వుందని అన్నారు. గనుకనే ఇలాంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు, సౌలభ్యం, అధికారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వుండాల్సిందే అని సిఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, ఆలోచనలను కేంద్రం గౌరవించాల్సిన అవసరం వుందని, కేంద్రంలో పార్టీలు మారవచ్చునేమోకానీ పటిష్టమైన పాలనా వ్యవస్థ కొనసాగుతూనే వుంటుందని, అదో నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. తమళనాడులో యుపిఎ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం ఎన్డీయే కొనసాగించక తప్పలేదని ఆయన గుర్తుచేశారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో కెసిఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం యావద్భారతదేశం దృష్టిని ఆకర్షించడంతోపాటు జాతీయస్థాయిలో విస్తృతస్థాయి చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. అవసరమైతే సిఎం కెసిఆర్ జాతీయ నాయకులైన ములాయం సింగ్ (ఎస్పీ), బిఎస్పీకి చెందిన మాయావతి వంటివారు తన ఆలోచనలకు అనుగుణంగా కలిసొచ్చేలా ప్రయత్నించవచ్చు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు తొలుత ప్రాథమిక స్థాయిలో, పలువురు జాతీయ నాయకులతో సమావేశమై ఈ అంశాలను ప్రస్తావించి వారి అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నాటికి పటిష్టమైన భూమికను తయారు చేయవచ్చు.
తాను అనుకున్న విధంగా, అభాగ్యులను ఆదుకోవాలనే ఆశయ సాధన వున్న వ్యక్తి సిఎం కెసిఆర్. అలాచేస్తే అవాంతరాలు వుండవన్నది ఆయన బలమైన నమ్మకం. సమాజంలోని వెనుకబడిన వర్గాలను ప్రగతి పథాన నడిపించడానికి తాను తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నిర్విఘ్నంగా ముందుకు సాగగలదని ఆయన నమ్మకం. ఎరువుల కొనుగోలుపై ఎకరానికి 4వేలు సబ్సిడీ అందించడంలో, ఉచిత విద్యుత్తును అందిస్తూ వ్యవసాయ రుణాల రద్దుకు ఉపక్రమించిన క్రమంలో, ఒంటరి మహిళలకు సహాయం అందించడంలో, గర్భిణులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, బాలింతలకు కెసిఆర్ కిట్‌లను అందించే ఆలోచన, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచే ఆలోచన వంటి చారిత్రాత్మక నిర్ణయాల నేపథ్యానికి మూలం- తెలంగాణ ప్రజల మెరుగైన జీవనానికి, అభ్యున్నతికి, పురోభివృద్ధికి నాంది పలకడం మాత్రమేనన్నది నిర్వివాదాంశం.
ఆత్మనిబ్బరం, నిబద్ధత కలిగిన సిఎం కెసిఆర్ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్వయంగా తానే చారిత్రాత్మక రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, బిసి-ఇ కేటగిరిలో 4 శాతం నుంచి 12 శాతానికి, షెడ్యూల్డు తెగలకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఈ ప్రతిపాదనకి అంగీకారం తెలుపగా, బిజెపి మాత్రం వ్యతిరేకించింది. బిల్లు ప్రవేశపెడుతూ, ఎన్నికల ముందు తమ పార్టీ ప్రకటించిన వాగ్దానాల్లో రిజర్వేషన్ల పెంపు ఒకటని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని సిఎం అన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఒక క్రమపద్ధతిన, దీనికవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని, రిజర్వేషన్ల అమలులో కూడా అన్ని నిబంధనలు పాటిస్తామని, షెడ్యూల్డు కులాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా 1 శాతం పెంచి, మొత్తం 16 శాతానికి చేరుస్తామని ప్రకటించారు. తెలంగాణలోని షెడ్యూల్డు కులాల జనాభాను పరిగణనలోకి తీసుకుని ఆ ప్రకారం పెంపుదల చర్యలు చేపడతామని, వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను పెంచడానికి చర్యలు చేపట్టామనీ, అందుకు బిసి కమిషన్ సమగ్ర అధ్యయనం చేస్తున్నదని, బిసిల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా పెంపుదల అంశం ముందుకు తీసుకువెళతామని చెప్పారు.
న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించి, సుప్రీం కోర్టు గతంలో విధించిన 50 శాతం సీలింగ్ దాటి, 62 శాతానికి పెంచిన రిజర్వేషన్లు అమలు చేస్తామని, అలా చేయగలమన్న మ్మకం తనకున్నదని సిఎం స్పష్టం చేశారు. భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన సారాంశాన్ని సిఎం శాసనమండలిలో చదివి వినిపించడంతో, రాష్ట్ర బిజెపి వ్యూహం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ‘చారిత్రాత్మక నిర్ణయం మీద శాసనమండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలోనే ప్రధాని మోదీ కూడా ఈ అంశం మీదే వ్యాఖ్యానించడం యాదృచ్ఛికమే అయినా ఆహ్వానించాల్సిన విషయం. ముస్లింలలో వెనుకబాటుతనాన్ని గురించి ప్రధాని ప్రస్తావించారు. వారి సమగ్రాభివృద్ధి గురించి కూడా ప్రధాని మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే కేంద్రం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్న ఆశకు బలం చేకూరుతున్నది’ అని శాసనమండలిలో కెసిఆర్ అన్నారు. ప్రధాని ప్రకటనతో తన ఆశయసిద్ధికి మార్గం సుగమమైందని కనీసం ఇప్పుడైనా సహకరించాలని బిజెపి సభ్యులను ఆయన కోరారు.
మొత్తం మీద తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో బిసి-ఇ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లు ఆమోదం పొందడం కెసిఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. ప్రజలకు లాభం చేకూరే విషయంలో కెసిఆర్ ప్రదర్శించిన పట్టుదల, అందరినీ కలుపుకుని పోవాలనే ఆలోచన అవసరమైతే ఎంత దూరమైనా పోవాలన్న నిర్ణయం- ఆయన నాయకత్వ పటిమకు సాక్ష్యాలు. ‘నీ చర్యలు ఇతరులను మరిన్ని కలలు కలగనడానికి, మరింత చైతన్యం కావడానికి, మరికొన్ని గొప్ప పనులు చేయడానికి దోహదపడగలిగితే.. నువ్వే నిజమైన నాయకుడివి..’ ఈ మాటలు కెసిఆర్ వంటి నాయకులకు వర్తిస్తాయి. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం- సిఎం కెసిఆర్‌కు లేఖ రాస్తూ.. రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. సిఎంను అసలు సిసలైన నాయకుడిగా ముద్రగడ కొనియాడడం సందర్భోచితంగా వుందనాలి.

- వనం జ్వాలా నరసింహారావు సెల్ : 80081 37012