మెయన్ ఫీచర్

ఆధునిక విద్యలో మానవీయ విలువలెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో విద్యా వ్యవహారాలపై మునుపెన్నడూ లేనంతగా విస్తృతంగా చర్చ, విమర్శల పరంపర కొనసాగటం హర్షణీయం. తెలంగాణ సిఎం కె.సి.ఆర్ గత ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో ‘కెజి టూ పిజి’ అందరికీ ఉచిత విద్య అందిస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. తెలంగాణలో ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను ఆధునిక కాలానుగుణంగా సంపూర్ణంగా మార్చివేసి, నూతన మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలన్న తపన ఆస్వాదించదగ్గదే. ఇందుకు విద్యావ్యవస్థను ఒక సాధనంగా భావించడం శుభ పరిణామం. ‘కెజి టూ పిజి’లో అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్యతో పాటు ఒకేరకమైన విద్యా విధానాన్ని రాష్టమ్రంతటా అమలు చేయాలని, రాజ్యాంగబద్ధమైన విద్యాహక్కును వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. కాగా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధన చేయాలని గతంలో కొందరు మేధావులు పాలకులకు సలహా ఇచ్చారు. అయితే నేటికీ 70 శాతం గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో, తండాలలో నివసిస్తున్న చిన్నారులకు ఆంగ్ల బోధన ఉపయోగపడుతుందా? లేక వారిని నిరుత్సాహపరుస్తుందా? అని ఆలోచించకపోవడం శోచనీయం. ప్రొ.హరగోపాల్ ప్రస్తుత తెలంగాణ విద్యామంత్రికి ‘సేవ్ ఎడ్యుకేషన్’ సంస్థ సభ్యులతో కలిసి ‘కెజి టూ పిజి ఉచిత విద్య’ అన్నది ఒక నినాదం మాత్రమే, అది ఆచరణ సాధ్యం కాదనే విధంగా ప్రకటన ఇవ్వడం విద్యారంగ నిపుణులను ఒకింత ఆశ్చర్యపరిచింది. కానీ, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి అర్థవంతమైన నిర్ణయానికి వస్తున్నట్లు గోచరవౌతున్నది. ప్రైమరీ స్కూలు వరకు సెమీ గురుకులాలు, 5 నుంచి 12వ తరగతి వరకు గురుకులాలు, ఆ తరువాత డిగ్రీ, పిజి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వాలని, ఒకేషనల్ విద్యా విధానాన్ని ఆసక్తిగల విద్యార్థులకు ప్రవేశపెట్టాలని ఆ తరువాత ఈ స్ట్రీమ్‌లో చదివినవారికి పైచదువులు చదవాలనుకుంటే అవకాశం ఉండాలని దిశానిర్దేశం చేయడం హర్షణీయం.
ప్రభుత్వం ఏ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలన్నా ‘కానె్సప్ట్ పేపర్’ తప్పక కావాలి. దాని లక్ష్యాలు, పరిధి, వ్యవస్థ రూపకల్పన, నిర్వహణ, యంత్రాంగం, వౌలిక వసతులు, పర్యవసానాలు తదితర విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలి. అవగాహన కలిగిన అధికారులతోపాటు అనుభవజ్ఞులైన మేధావులతో ప్రభుత్వం చర్చలు జరిపి సృజనాత్మకమైన కానె్సప్ట్ పేపర్‌ను తయారుచేయాలి. కానీ, ‘ముందుకు తోసి.. వెనక్కి మళ్లే మేధావుల’ సలహాలను పాటించడం సరికాదు. విద్యా వ్యవస్థను మార్చాలంటే ప్రథమంగా కొత్త విధానం వల్ల విద్యార్థుల్లోని సృజనాత్మకత శక్తులు బయటకు ఆవిష్కృతమై విద్యార్థికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది శాస్ర్తియమైన విద్యా విధానం ద్వారానే సాధ్యవౌతుంది. ఈ లక్ష్యసాధనకు అన్ని విద్యా విధానాలను ఒక గొడుకు కిందికి తేవాలి. ఒకేరకమైన విద్య, బోధనా భాష, పరీక్షల విధానం ఉండాలి. ఒకే స్థాయిలోని విద్యార్థులకు ఒకే రకమైన విద్యా క్యాలెండర్ ఉండాలి. అన్ని స్కూళ్ళలో, కాలేజీలలో వౌలిక వసతులు కల్పించాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించాలి. పనివేళలు ఒకే మాదిరిగా ఉండాలి. వ్యాయామం, క్రాఫ్ట్, కంప్యూటర్ విద్యకు అనుభవజ్ఞులను టీచర్లుగా నియమించాలి. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రాంతాలవారీగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వార్షిక ప్రణాళికను తయారుచేసుకొని వాటిని అమలుపరచాలి. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మానవతా విలువలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రవర్తించాలి.
‘కెజి టూ పిజి’ ద్వారా అందరికీ విద్యను అందించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి విశాల దృక్పథాన్ని రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించాలి. ఆ విధానం అమలుకు ఆచరణాత్మక సూచనలివ్వాలి. ఒకే విద్యా విధానం ద్వారా మనం కలలుగనే సమాజ సామరస్యం, సమానత్వం పెంపొంది మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. ఈ మహత్తర లక్ష్య సాధనలో అన్ని సామాజిక వ్యవస్థల కంటే విద్యారంగం అతి ముఖ్యమైనది, అత్యంత క్లిష్టమైనది. ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి. భౌతిక అంశాలతోపాటు సాంస్కృతిక, మానసిక, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, పరిసరాల ప్రభావం వంటివి ముడివడి ఉంటాయి. ఇవి పైపైన చూసేవాళ్లకు బోధపడవు. అంకితభావంతో కూడిన నిష్ణాతులైన, సత్యానే్వషులైన మేధావులకే గోచరమవుతాయి.
మన దేశంలో సనాతన కాలం నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా పద్ధతులు, మార్గాలను మన పూర్వీకులు ఎంతో కృషి చేసి మనకు అందించారు. దురదృష్టవశాత్తూ వాటి ప్రస్తావన నేటి విద్యా విధానంలో ఎక్కడా గోచరించకుండా చేశారు. విదేశీ విధానాలను ఎక్కువగా అనుసరిస్తున్నాము. అరవిందుడు, వివేకానందుడు, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, డా.సర్వేపల్లి రాధాకృష్ణ మొదలైన మహాపురుషులు విద్యా వ్యవస్థ స్వభావాన్ని, లక్ష్యాలను నిర్వచించారు. గుడ్డిగా విదేశీ విద్యా విధానాన్ని అనుసరించడం వల్ల మన విద్యా వ్యవస్థ అనేక దుష్ప్రభావాలకు లోనై, రకరకాల సామాజిక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటికైనా విద్యను వ్యాపార, ఉపాధి సాధనంగా చూసే దృక్పథాన్ని మన మేధావులు, విద్యావేత్తలు విడనాడాలి. ప్రస్తుత విద్యా విధానం సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చూసే దృక్పథాన్ని పెంపొందిస్తోంది. సామాజిక ఉపయోగంతో పాటు వ్యక్తి వికాసం జరగాలన్న ఉన్నత లక్ష్యాన్ని చాలాకాలం క్రితమే మన మేధావులు, పాలకులు మరిచారు. నైతిక విలువలు మృగ్యం కావడంతో ప్రతిరోజూ హింసాపూరితమైన సంఘటనలతో అభద్రతాభావంతో ప్రజలు జీవించవలసి వస్తుంది. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న యువశక్తికి సరైన విద్యను అందించి సమాజ ప్రగతిలో భాగస్వాములను చేస్తే, అనతికాలంలోనే ప్రపంచ దేశాలలో మన దేశం సంపన్న దేశంగా, ప్రగతికి ఉపయోగపడే మానవ వనరుల శక్తిగా అవతరిస్తుంది. యువశక్తిని సద్వినియోగం చేయలేని విద్యా విధానాలతో నేడు మనదేశం అమానవీయ దృశ్యాలకు నిలయమవుతోంది.
ప్రస్తుత విద్యా విధానాన్ని మనం గమనిస్తే- స్వాతంత్య్రానికి పూర్వం వున్న విధానమే కొంత సరళీకరించబడి కొనసాగుతుందనుటలో అతిశయోక్తి లేదు. విద్య, విజ్ఞానాన్ని ఒకటి, రెండు వర్గాలు తమ చేతుల్లో పెట్టుకొని అధిక సంఖ్యాకులను నాణ్యమైన విద్యకు దూరం చేయడం మనందరికీ తెలిసిందే. విదేశీయుల పాలనలో మెకాలే విద్యా విధానం కొంతమేర నాటి భారతీయ విద్యా విధానాన్ని సరళీకరించి నిమ్నవర్గాలకు చదువుకునే అవకాశం కల్పించినప్పటికీ, నాటి సామాజిక పరిస్థితులు, పేదరికం వల్ల చాలామంది ప్రజలు వెనుకబడిపోయారు. బ్రిటీష్ పాలకుల విద్యా విధానం లక్ష్యం ఇక్కడి ప్రజలను గుమస్తాలుగా, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులుగా తయారుచేయడానికి మాత్రమే అనడంలో సందేహం లేదు. స్వాతంత్య్రానంతరం మన నాయకులు, రాజ్యాంగ నిర్మాతలు విద్యాహక్కుతో పాటు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిఫామ్ ఎడ్యుకేషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించి, భాషాపరమైన మైనారిటీలకు వారి విద్యా సంస్థల్లోనే బోధన భాషలో స్వేచ్ఛను కల్పించారు. దురదృష్టవశాత్తూ దేశ వ్యాప్తంగా ఒకేరకమైన విద్యా విధానాన్ని కాకుండా ఒకే రాష్ట్రంలో వేరు వేరు విధానాలు కొనసాగించి, సామాజిక అసమానతలను ప్రోత్సహించడం విచారకరం. ఈ క్రమంలో రూపొందిన నవీన విద్యా విధానంలో స్కూలు ఫైనల్ తరువాత పై చదువులు చదవలేని పిల్లలు ఐటిఐ కానీ, పాలిటెక్నిక్‌గాని చేసుకొని ఉద్యోగాల్లో చేరేవారు. ఈ విధానం స్వాతంత్య్రం తరువాత మూడు దశాబ్దాల వరకు ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆర్థిక భారంతో ఉన్నత చదువులు చదవలేని పిల్లలకు ఈ కోర్సులు ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడ్డాయి. ఇటీవల శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులలో భాగంగా ఎలక్ట్రానిక్, కంప్యూటర్ కోర్సులు ప్రాధాన్యతను పొంది ఐటిఐ, పాలిటెక్నిక్ కోర్సులకు ప్రాధాన్యత తగ్గింది. ఇంటర్మీడియట్ కోర్సులు కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకివెళ్లి చాలావరకూ ప్రభుత్వ కళాశాలలు మూతపడ్డాయి. ఇంటర్ చదివిన ప్రతి విద్యార్థి జాబ్ మార్కెట్‌కు అనుకూలంగా తను చదివే కోర్సులో తనకు స్కిల్స్ ఉన్నాయా? లేవా? అనే విషయాలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ఆర్ట్స్, సోషల్ సైనె్సస్, బేసిక్ సైనె్సస్ కోర్సులను వదిలి, ఉపాధి పొందాలనే నెపంతో- నైపుణ్యం వున్నా లేకపోయినా ఇంజనీరింగ్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు చదివి నిరుద్యోగులుగా మారడం ఒకటైతే, విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్, ఎంబిఎ కాలేజీలు వౌలిక వసతులు లేక మూతపడుతున్నాయి. గుర్తింపు పొందని 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఆపివేయడంచే మేనేజిమెంటులు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంలో చదవని పేద విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో డిమాండ్ లేని ఆర్ట్స్, లా, సోషల్ సైనె్సస్ కోర్సులలో చేరుతున్నారు. చదివే కోర్సులపై ఆసక్తిలేక తరగతులకు వీరు గైరుహాజరు అవుతున్నందున కళాశాలలు వెలవెలబోతున్నాయి.
ప్రస్తుత విద్యా విధానం విద్యార్థులకే కాక సమాజానికి, దేశానికి పెనుసవాలుగా మారింది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఫలితంగా విద్యారంగం వాణిజ్య వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. విద్యాహక్కు చట్టం వంటివి అంతగా ప్రభావం చూపడం లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో విద్యా వ్యవస్థలోని అసమానతలు మరింతగా పెరిగాయి. నైపుణ్యం వున్న పేద విద్యార్థులను విద్యా వ్యవస్థ నుండి దూరం చేస్తున్నాయి.
ఇక యూనివర్సిటీ విద్యా విధానాన్ని గమనిస్తే మరింత జుగుప్సాకరంగా మారింది. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కానీ వాటిలో నిష్ణాతులైన అధ్యాపకులు, వౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అనేక కారణాల రీత్యా అధ్యాపకులు విద్యాబోధన, పరిశోధనకు దూరం అవుతున్నందున ప్రస్తుత విద్యా వ్యవస్థ విమర్శల పాలవుతోంది. ఈ పరిస్థితులను ఆకళింపు చేసుకుని, నూతన విద్యా విధానంలో ‘కెజి టూ పిజి’లో ఒకే రకమైన ఉచిత విద్యను ఇచ్చేందుకు, వౌలిక విషయాలను దృష్టిలో ఉంచుకొని కానె్సప్ట్ పేపర్‌ను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యవస్థ వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అసమానతలు లేని, మానవ విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి పునాదిగా విద్యావ్యవస్థ దోహదపడాలి. స్వాతంత్రానంతరం ప్రతి పది సంవత్సరాలకు విద్యా సంక్షోభం రావడం అనివార్యమైంది. ప్రజావసరాల మేరకు చదువు ప్రాధాన్యాలు, బోధించే అంశాలు మారవచ్చు. కానీ పిల్లల స్కిల్స్, ఆసక్తి, మాతృభాషలో విద్యాబోధన మొదలగు విషయాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల పిల్లలకు ఒకే రకమైన విద్య అందించాలి. పేద పిల్లలకు హాస్టల్ వసతి, ట్యూటర్స్, ఇతర వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యం. ఆ దిశగా మానవ విలువలతో కూడిన శాస్ర్తియమైన, ఆచరణాత్మక ఆలోచనలను మేధావులు అందించాలి.

- ప్రొ. గట్టు సత్యనారాయణ 98666 78087