మెయన్ ఫీచర్

అంతర్గత వైరుధ్యాల ఐరోపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా దేశాలలో ‘సంకుచిత జాతీయ తత్త్వం’ పెరుగుతోందన్నది రెండు దశాబ్దులుగా జరుగుతున్న ప్రచారం. ఇది ‘సంకుచిత జాతీయ తత్త్వం’- అల్‌ట్రా నేషనలిజమ్- కాదని, ‘స్వజాతీయతా నిష్ఠ’- నేషనలిస్ట్ కమిట్‌మెంట్- అని సమాంతర ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా ‘సంకుచిత తత్త్వం’ లేదా ‘నిష్ఠ’ విస్తరించిపోతుండడం వల్ల ‘ఐరోపా దేశాల సమాఖ్య’- యూరోపియన్ యూనియన్- ఇయు-లోని సమైక్య స్ఫూర్తి సన్నగిల్లిపోతోందన్న ఆందోళన దాదాపు అన్ని దేశాలలోను వ్యక్తవౌతోంది. ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికలో ఈ ‘సంకుచిత తత్త్వం’ లేదా ‘జాతీయతా నిష్ఠ’ మరింతగా ప్రస్ఫుటించింది. ఈ జాతీయ వాదులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఫ్రంట్ నేషనల్’- ఎఫ్‌ఎన్- అన్న రాజకీయ పక్షం అభ్యర్థినిగా పోటీచేసిన మరీనా లీపెన్‌కు ముప్ఫయి నాలుగు శాతం వోట్లు రావడం ఐరోపా సమైక్యభావం సన్నగిల్లుతోందనడానికి సరికొత్త నిదర్శనం. పదహైదు సంవత్సరాలలో ఈ పార్టీ వోట్ల శాతం రెట్టింపు కావడం ‘సమాఖ్య’లోని సమైక్యవాదులకు కలవరం కలిగిస్తోంది. క్రీస్తుశకం 2002లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో మరీనా లీపెన్ తండ్రి జేన్ మోరీ లీపెన్ ‘ఫ్రంట్ నేషనల్’ తరఫున పోటీ చేసి, పదిహేడు శాతం వోట్లు సాధించాడు. అప్పుడు తండ్రి లీపెన్, ఇప్పుడు కుమార్తె లీపెన్ ఓడిపోయారు. అప్పటికీ, ఇప్పటికీ మధ్య ‘ఐరోపా సమాఖ్య’ను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య ఫ్రాన్స్‌లో రెట్టింపు అయ్యింది! ఫ్రాన్స్‌లో ఇంతవరకు మొదటి రెండు స్థానాలలో ఉండిన రిపబ్లికన్స్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఈ ఎన్నికలలో మూడవ నాలుగవ స్థానాలకు దిగజారిపోవడానికి కారణం ‘ఫ్రంట్ నేషనల్’ బలం పెరగడం. ఐరోపా సమాఖ్య నుంచి ఫ్రాన్స్ వైదొలగాలని ‘ఫ్రంట్ నేషనల్’ కోరుతోంది. ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్‌ను వ్యతిరేకిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు ‘అనామకుడు’గా ఉండిన స్వతంత్ర అభ్యర్థి ఎమాన్యుయెల్ మాక్రోన్ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ‘ప్రజాస్వామ్య’ అద్భుతం. ముప్ఫయి తొమ్మిది ఏళ్ళ మాక్రోన్ మూడేళ్ల క్రితం అధ్యక్షుడు ఫ్రాంకోరుూ హోలెండ్ మంత్రివర్గంలో చేరేవరకు జనానికి తెలీదు. ప్రభుత్వ అధికారిగా, వాణిజ్యవేత్తగా పనిచేసిన మాక్రోన్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన మూడేళ్లకే ఏ ప్రధాన రాజకీయ పక్షం మద్దతు లేకుండా అధ్యక్షుడుగా ఎన్నికకావడం ఒక నిశ్శబ్ద విప్లవం. కానీ ఈ ‘స్వతంత్రుడు’ ఎన్నిక కావడానికి ‘ఫ్రంట్ నేషనల్’ ఎదగడం పరోక్షంగా సహకరించింది!
ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో ‘వర్తుల పద్ధతి’- రౌండ్ సిస్టమ్‌ని పాటిస్తున్నారు. మొదటి ‘వర్తులం’ మత నివేదనం- పోలింగ్-లోనే అభ్యర్థులలో ఒకరికి యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు లభించినపుడు ఆ అభ్యర్థి అధ్యక్షుడుగా ఎన్నికవుతాడు. పోటీలో ఇద్దరు మాత్రమే ఉన్నపుడు ఇది సాధ్యం. ఎక్కువమంది అభ్యర్థులు పోటీ చేసినపుడు ఏ ఒక్కరికీ యాభై శాతం పైబడి వోట్లు వచ్చే అవకాశం లేదు. మొదటి వర్తుల మత నివేదన- ఫస్ట్ రౌండ్ పోలింగ్-లో ఏ అభ్యర్థికీ యాభై శాతం కంటే ఎక్కువ వోట్లు రానపుడు రెండవసారి పోలింగ్ జరపడం ఫ్రాన్స్‌లో తప్పనిసరి. గత ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన జరిగిన మొదటి వర్తులం ఎన్నికలలో అభ్యర్థులెవ్వరికీ యాభై శాతం కంటే ఎక్కువ వోట్లు రాలేదు. మాక్రోన్, లీపెన్ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు. సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి బెనాయిట్ హామన్, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థి ఫ్రాంకోరుూ ఫిలాన్ మూడు నాలుగు స్థానాలకు దిగజారడం ఫ్రాన్స్‌లో పెరుగుతున్న ‘ఐరోపా సమాఖ్య’ వ్యతిరేకతకు నిదర్శనం. ఇలా ‘జాతీయ’వాదిని లీపెన్ ప్రధాన ప్రత్యర్థి కావడం ఎమాన్యుయెల్ మాక్రోన్ విజయానికి కారణం! ఎందుకంటే ‘సంకుచిత జాతీయత’ను వ్యతిరేకిస్తున్న సోషలిస్టు, రిపబ్లికన్స్ పార్టీలు సహజంగానే మరీనా లీపెన్‌కు బద్ధ విరోధులు! ఈ పార్టీలు రెండవ వర్తులం ఎన్నికలో, అందువల్ల ‘అనామకుడైన’ స్వతంత్ర అభ్యర్థి మాక్రోన్‌ను అనివార్యంగా బలపరిచారు. మాక్రోన్ గెలిచాడు.
ఇలా మాక్రోన్ గెలవడం గురించి కాక, ‘ఐరోపా సమాఖ్య’ నుంచి ఫ్రాన్స్‌ను తప్పించడం విధానమైన ‘ఫ్రంట్ నేషనల్’ ఎదుగుతుండడం పట్ల ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇటలీ, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఐరోపా సమాఖ్యలోని ప్రముఖ శక్తులు. బ్రిటన్ ఇప్పటికే సమాఖ్య నుండి విడిపోయింది. భవిష్యత్‌లో ఫ్రాన్స్ కూడా వైదొలగినట్టయితే ‘సమాఖ్య’ విఘటితమైపోవచ్చు! ఐరోపా ‘సమైక్య’ సిద్ధాంతం నిజానికి కృత్రిమమైనది. పరస్పరం కలహించుకోవడమే క్రీస్తుశకం 1945 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు ఐరోపా దేశాల చరిత్ర! మొదటి ప్రపంచ యుద్ధం కాని, రెండవ ప్రపంచ యుద్దం కాని నిజానికి ప్రపంచ యుద్ధాలు కావు. ఆధిపత్యం కోసం, ప్రపంచంలోని ఇతర దేశాలను దోచుకోవడం శతాబ్దుల పాటు ఐరోపా దేశాల మధ్య జరిగిన అమానవీయ సంఘర్షణకు పరాకాష్ఠ- ఈ రెండు యుద్ధాలు. క్రీస్తుశకం 1914వ, 1918వ సంవత్సరాలలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపా యుద్ధంగానే మొదట ప్రచారం పొందింది. 1939వ, 1945వ సంవత్సరాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం కూడా జర్మనీ, బ్రిటన్‌ల మధ్య ఆధిపత్య సంఘర్షణ మాత్రమే! ఈ రెండు యుద్ధాల్లోను ‘మిత్రులు’గా పోరాడిన ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అంతకుపూర్వం శతాబ్దుల తరబడి ప్రబల శత్రువులు! మన దేశం క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దం నుంచి దాదాపు రెండు వందల యాభయి ఏళ్లపాటు ఫ్రాన్స్‌కూ బ్రిటన్‌కూ మధ్య జరిగిన పోరాటాలకు రంగభూమి! ‘దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు’గా మన దేశాన్ని ఫ్రాన్స్, బ్రిటన్‌లు పంచుకోవడం చరిత్ర. బ్రిటన్ మన దేశం నుండి నిష్క్రమించిన తరువాత కూడా క్రీస్తుశకం 1954 వరకు మన పుదుచ్చేరిని ఫ్రాన్స్ వదలిపెట్టలేదు. 1816లో ఈ ‘ఐరోపా దొంగల’ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం మన పుదుచ్చేరిని ఫ్రాన్స్‌కు అప్పగించింది. కెనడాలోని క్యూబెక్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం బ్రిటన్‌కు కట్టబెట్టింది. క్యూబెక్ ప్రాంతంలో ‘ఫ్రాన్సీయ’ భాషను మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. అందువల్ల తమది ప్రత్యేక జాతి అని ‘ఆంగ్ల భాష జాతి’ అయిన కెనడా నుండి విడిపోయి ప్రత్యేక స్వతంత్ర దేశంగా తాము అవతరించాలని ‘క్యూబెక్’ ప్రాంతీయులు కలలు కంటున్నారు, శతాబ్దికిపైగా ‘స్వాతంత్ర ఉద్యమం’ చేస్తున్నారు. ‘్భష’ పేరుతో ‘జాతి’ ఏర్పడుతుందన్న కృత్రిమ విశ్వాసం దీనికి కారణం! ఐరోపా విభిన్న భాషల నిలయం కాబట్టి ఒక్కొక్క భాషా జన సముదాయం ఒక ‘జాతి’గా ఏర్పడిందన్నది ఈ విశ్వాసం. ఈ భాషా జాతీయ వాదమే ఐరోపాను వివిధ ‘జాతులు’గా శతాబ్దులపాటు విడగొట్టింది!
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పశ్చిమ ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన ఐక్యభావం కేవలం ప్రతిక్రియాత్మకమైనది. ‘సామ్యవాద ఏకపక్ష నియంతృత్వ’- కమ్యూనిస్ట్ టోటలిటేరియన్ డిక్టేటర్‌షిప్- విస్తరణను ప్రతిఘటించడం ఈ ప్రతిక్రియ. ‘సోవియట్ యూనియన్’ సామ్యవాద సామ్రాజ్యం తూర్పు ఐరోపా దేశాలను కబళించిన తరువాత పశ్చిమ ఐరోపాలోని ప్రజాస్వామ్య దేశాల మధ్య సమైక్య బంధం మరింత బిగిసింది. క్రీస్తుశకం 1989వ 1991వ సంవత్సరాల మధ్య సామ్రాజ్యవాద నియంతృత్వ వ్యవస్థలు, ‘సోవియట్ యూనియన్’ విచ్ఛిన్నమైపోయాయి. ఉమ్మడి శత్రువు అంతరించడంతో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన ‘కృత్రిమ సమైక్యం’ కూడా రెండు దశాబ్దాలుగా పలుచబడిపోయింది! ‘ఐరోపా ఆర్థిక సమాఖ్య’గా 1950వ దశకం నుండి చెలామణి అయిన ‘పశ్చిమ ఐరోపా కూటమి’లో 1989 తరువాత ‘కమ్యూనిస్టు’ నియంతృత్వం నుండి విముక్తమైన తూర్పు ఐరోపా దేశాలు కూడా చేరాయి. కానీ దాదాపు అన్ని ‘ఐరోపా దేశాలలోను ఇప్పుడు ఐక్యభావం సన్నగిల్లింది!
భాష ప్రాతిపదికగా జాతులు ఏర్పడడం ఐరోపాను శతాబ్దుల పాటు విభజించిన విపరిణామక్రమం. ఐరోపా మానవుల స్వరూప స్వభావాలలో అంతరం లేదు, చలి దేశాలు కనుక చర్మం రంగు తెల్లబడడం స్వరూప సామ్యం. ఇతర దేశాలను దోచుకొనడానికి శక్తిని, ఇతర జాతులను వంచించడానిని బుద్ధిని ఉపయోగించడం స్వభావ సమానవత్వం. ఈ సామ్యం, సమానత్వం ఐరోపా సమష్టి సమాజానికి చెందినవి. అపవాదాలు ఉండవచ్చు, మంచివారు ఉండవచ్చు, వైవిధ్య పరిరక్షణ స్వభావులు ఉండవచ్చు! కానీ ఐరోపా సమాజం వేలఏళ్లుగా ‘తమది కాని దాన్ని’ సహించకపోవడం చరిత్ర! అందువల్లనే ఐరోపా సమాజంలో వైవిధ్యాలు సమాంతరంగా ఏకకాలంలో వికసించలేదు. ఒక ‘వైవిధ్యం’ మరో ‘వైవిధ్యాన్ని’ విరోధించడం విధ్వంసం చేయడం ఐరోపా చరిత్ర. గ్రీసు నాగరికతను రోము నాగరికత ధ్వంసం చేసింది. రోము నాగరికతను క్రైస్తవం నిర్మూలించింది. ఏకకాలంలో అనేక మతాలు అనేక భాషలు ఒక దేశంలో పరిఢవిల్లిన చరిత్ర ఐరోపాకు లేదు. ఇలాంటి విధానాలను సహించలేని సమాజ స్వభావం వల్లనే ‘్భన్న మతాలు, భిన్న భాషలు, అనేకానేక ఇతర వైవిధ్యాల’తో కూడిన సమన్వయ జాతీయత ఐరోపాలో ఏర్పడలేదు. ఇలాంటి సమన్వయ తత్త్వం మన దేశంలో అనాదిగా వికసించింది. అందువల్లనే అనాదిగా ఒక జాతి- నేషన్‌గా, ఒకే జాతిగా వికసించిన మన దేశం సర్వమత సమాహారమైంది, సర్వ భాషా సమగ్ర సంపుటమైంది, అసంఖ్యాక వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయ జాతీయత మన దేశంలో వికసించింది! అందువల్లనే ‘ఆనోభద్రా క్రతవో యస్తు విశ్వతః’- ప్రపంచంలోని అన్ని మంగళకర భావాలు మాకు కలుగుగాక- అన్నది మన జాతీయ స్వభావమైంది! ఈ అద్వితీయ జాతీయతకు ఒక మతం కాని, ఒక భాషకాని ప్రాతిపదిక కాలేదు! భాషా వైవిధ్యాల, మత వైవిధ్యాల, ఇతరేతర వైవిధ్యాల సమాహారమైన సంస్కృతి మన జాతీయతకు ప్రాతిపదిక! మన దేశంలో భాషల పేరుతో జాతులు- నేషన్స్ లేవు! అన్ని భాషల జనసముదాయాలది ఒకే జాతి.. భారతజాతి!!
ఈ సమన్వయ తత్త్వం స్వభావం కాని ఐరోపాలో వైవిధ్యాలు వైరుధ్యాలుగా మారాయి. ఒక్కొక్క భాషా సముదాయం ఒక ప్రత్యేక జాతిగా మారింది. ఉక్రెయిన్ నుండి క్రీవియా విడిపోవడానికి, బ్రిటన్ నుండి స్కాట్‌లాంట్ విడిపోవడానికి సిద్ధమవుతుండడానికి ఈ భాషా జాతీయవాదమే కారణం! నిజానికి ప్రాచీన ఐరోపాలో ‘జాతీయత’, ‘జాతి’, ‘దేశభక్తి’ మాతృభూమి’ వంటి జీవన వాస్తవాల ధ్యాస లేదు! వారికి తెలిసిందల్లా కేవలం ‘నాగరికత’- సివిలైజేషన్! ‘నగర రాజ్యాలు’ నాగరికతా సామ్రాజ్యాలు మాత్రమే ఐరోపాకు తెలుసు! ‘జాతి’ ధ్యాస ఐదారు శతాబ్దుల క్రితం కలిగినప్పటికీ భాషా జాతులుగా ఐరోపా విడిపోయింది!
వాణిజ్యం ప్రాతిపదికగా ఏర్పడిన ‘ఐరోపా సమాఖ్య’ 1994 తరువాత రాజకీయ, దౌత్య, వ్యూహాత్మక వ్యవహారాలకు విస్తరించింది! ఈ కృత్రిమ సమైక్య వ్యవస్థతో ప్రతి దేశంలోను ‘్భషా జాతీయవాదం’ భంగకరంగా మారడం నడుస్తున్న చరిత్ర! ఫ్రాన్స్ ఎన్నికలు సరికొత్త సంకేతాలు!
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352