మెయిన్ ఫీచర్

అమ్మకు ప్రేమతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ.. సృష్టిలో విలువైన వ్యక్తి.. అమ్మ.. సహనానికి మారుపేరు... అమ్మ.. ఓ నిజమైన మార్గదర్శి..
వేదనలోనూ ఆనందాన్ని వెతుక్కునే మాతృమూర్తి..
బిడ్డను దారిలో పెట్టేందుకు మనసు గట్టి చేసుకుని మొట్టికాయవేసి... ఆనక తల్లడిల్లిపోయే సున్నితమైన హృదయమున్న అతివ. సృష్టిలో తియ్యనైన పదం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైన ఈ జన్న తొలి అడుగులో తడబాటును, బతుకు బాటలో పొరపాట్లను సరిదిద్దే సమర్థురాలు. బిడ్డలను సన్మార్గంలో నడిపేందుకు తనను తాను పవిత్రంగా మలుచుకునే ఆ పవిత్రమూర్తి ప్రేమకు వెలకట్టలేం. కులం, జాతి, రంగు, రూపం ఇవేవీ తల్లిప్రేమకు అడ్డుకాదు. ప్రాణమున్న జీవి ఏదైనా తల్లి పాత్రలో జీవిస్తూనే ఉంటాయి... మరణించేవరకు. అందుకేనేమో ఆ భగవంతుడు అన్నిచోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించి ఉంటాడు. అలాంటి త్యాగమూర్తి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపైనా ఉంది. మాతృదినోత్సవం సందర్భంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరున కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొందరు అమ్మను ఆప్యాయంగా పలకరిస్తే మరికొందరు పూజిస్తారు. ఇంకొందరు స్మరిస్తారు.
అక్కడ ఇలా...
అనంతమైన అమ్మ ప్రేమకు హద్దులు సరిహద్దుల్లేకుండా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంది. అలాంటి అమ్మను గౌరవిస్తూ నేటి అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా చేసే వేడుకలు మాత్రం పరిమితంగానే జరగటం శోచనీయం. ఆమె త్యాగం, కుటుంబం పట్ల చూపే నిబద్ధతే తమ జీవితాలు ఆనందంగా ఉండటానికి కారణమని నేటి యువతరం సైతం అంగీకరించే సత్యం. అలాంటి అమ్మకు ఒక్కరోజు వేడుక సరిపోదు. ప్రతిరోజూ ఆమెకు తగిన గౌరవం దక్కాల్సిందేనని అంటున్నారు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మరుపురాని జ్ఞాపకంగా పదిలపరుచుకుంటూ వివిధ దేశాలలో మాతృదినోత్సవ వేడుకలు ఇలా నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో మాతృదినోత్సవ వేడుకలను మే రెండవ వారంలో సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. మరణించిన తల్లులను సైతం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు. తెల్లటి కాంతినిచ్చే బల్బ్‌ను ఏర్పాటు చేసి నివాళులర్పిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఆ రోజు పిల్లలు అమ్మకు ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసి పెడతారు. దీంతో పాటు బహుమతులు, ఇంటిలో తయారుచేసిన కార్డులతో గానీ, పూల బొకేలతోగానీ శుభాకాంక్షలు చెబుతారు.
పూలగుత్తులతో అభినందనలు
ఫ్రాన్స్‌లో మే చివరి ఆదివారంనాడు మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు కేకు తీసుకు వచ్చి అమ్మచేత కట్ చేయించుకుని తింటారు. అంతేకాదు అమ్మకు పూలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు. మెక్సికోలో పిల్లలు కొత్త బట్టలు ధరిస్తారు. అంతేకాదు ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చిల్లో పిల్లలు అమ్మ కోసం ప్రార్థనలు చేయటం ఇక్కడ ప్రత్యేకత. తల్లికి పిల్లలు ఆరోజంతా సేవ చేస్తారు.

17 శతాబ్దం నుంచే
బ్రిటన్‌లో ఈ వేడుకలను 17వ శతాబ్దం నుంచే నిర్వహిస్తున్నారు. ఇక్కడ మే నాలుగవ ఆదివారంనాడు చేస్తారు. బేకరీ షాపుల్లో మదర్స్ కేకులు అమ్ముతారు. ప్రతి ఇంట్లో ఆ కేకులను కట్ చేస్తారు. అమ్మ దినోత్సవాన్ని ఏ దేశంలో ఏవిధంగా జరుపుకున్నా అవన్నీ ఆమె ప్రేమకు సరితూగలేవు. అమ్మ అమితంగా సంతోషించే సందర్భం ఏదైనా ఉందంటే నవమాసాలు మోసి కన్నబిడ్డను చూసిన క్షణం. మాటలకందని ఆ మధురానుభూతి ఆమె సొంతం కావాలంటే ఓ ప్రత్యేకరోజు అని కాకుండా నిత్యం గౌరవించినపుడే సాధ్యం.
*
ఆరోగ్యం జాగ్రత్తమ్మా!
ఇంట్లో అందరూ తిన్న తరువాత ఆఖరి ముద్ద తిని ఆకలి తీర్చుకునే అమ్మ ఆరోగ్యం మనదేశంలో బాగుందా అంటే ఎన్నో సందేహలు తలెత్తుతాయి. నమ్మలేని చేదు నిజాలు బయటపడతాయి. రక్తహీనత వెంటాడుతుంది. బిడ్డకు జన్మనిచ్చే సందర్భంలో తీవ్రమైన రక్తపోటు, ఇనె్ఫక్షన్లు సోకటం, వైద్యుల పర్యవేక్షణలో పిల్లల్ని కనకపోవటం తదితర కారణాల వల్ల ఏడాదికి 44,000 మంది తల్లులు చనిపోతున్నారు.
ప్రతి లక్షమంది తల్లుల్లో 167 మంది ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు.
అందరి వలే జీవించే హక్కు ఉన్నప్పటికీ పదమూడు రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి గర్భిణీల్లో 57మంది మృత్యువాత పడుతున్నారు.

బీహర్ వంటి రాష్ట్రాల్లో 40శాతం మంది ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లిల్లు చేసేస్తున్నారు..
అవిద్య వెన్నాడుతుంది. గోవా వంటి రాష్ట్రంలో 15-49 మధ్య వయసువారిలో 80శాతం మంది చదువుకోనివారే. బీహర్‌లో అతివల్లో అవిద్య ఒక్కసారిగా 49.6 నుంచి 37శాతానికి పడిపోయింది.
పొగాకు నమలటం వంటి దురలవాట్లకు సైతం మహిళలు బలవుతున్నారు. దాదాపు 4.4శాతం మంది మహిళలు పొగాకు నములుతున్నారు.
దేశంలో మహిళలకు బ్యాంక్ అకౌంట్లు పెరిగాయి. అలాగే సొంత ఆస్తులు కూడా ఉంటున్నాయి. బీహర్‌లో 58.8శాతం మంది మహిళలకు ఆస్తులు ఉన్నాయి.

అమ్మకు అన్నీ తెలుసు!
ఇదీ సరికొత్త థీమ్
అమ్మకు అన్నీ తెలుసు.. ఔనుమరి.. పిల్లల మనసులో ఏముందో చదివే శక్తి ఆమెకు తప్ప మరెవరికి ఉంది. గడుగ్గాయిల్లాంటి పిల్లలు వౌనం వహిస్తే అలా ఎందుకున్నారో కనిపెట్టే శక్తి ఆమెకు ఉంది. అక్కున చేర్చుకునో, కబుర్లు చెప్పో, బుజ్జగించో, అనునయించో, బూచాడొస్తాడనో అసలు నిజాన్ని రాబట్టే మాంచి డిటెక్టివ్ అమ్మ. పెళ్లయిన కొడుకో, కూతురో చిరాకుగా ఉన్నా పరాకుగా ఉన్నా అసలు కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడంలో ఆమెకన్నా ప్రజ్ఞావంతులు ఎవరుంటారు. అందుకే ఓ కుటుంబంలో పరిస్థితులను ఆకళింపు చేసుకుని, చక్కదిద్దే శక్తి ఆమెకు ఉంది. బుడిబుడి అడుగులు వేసే పిల్లలనయినా, ఎదిగిన పిల్లలైనా తల్లడిల్లకుండా చూడటంలోనే ఆమెకు తృప్తి. ఆ విషయానే్న 2017 అంతర్జాతీయ మాతృదినోత్సవ నినాదంగా మార్చారు. ‘ప్రతి అమ్మకు తెలుసు’ (ఎవ్విరి మదర్ నోస్) అన్నది ఈ ఏడాది థీమ్. భారత్, సింగపూర్, శ్రీలంక, పాకిస్తాన్, సమోవ, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని ఎక్కువ దేశాలు మే రెండో ఆదివారం నాడు (ఈఏడు మే 14న) అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తాయి. మే 8, 13 తేదీల్లోనూ మరికొన్ని దేశాలు పాటిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఆడంబరంగా చేసే ఈ వేడుక మనదగ్గర ఇప్పుడిప్పుడే జనబాహుళ్యంలోకి వెళుతోంది. హిందూ సమాజంలో అమ్మకు ఎప్పుడూ పవిత్రమైన స్థానమే ఉంది. అమ్మను నిత్యం తలచుకోవాలేగానీ ఏ ఒక్కరోజో కేటాయించడమేమిటన్న వాదనలూ ఉన్నాయి.

కుటుంబ అవసరాలకే..
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృమూర్తితో ఉన్న అనుబంధం గొప్పది. అందుకే ఆమె రోజంతా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎక్కువ భాగం ఇంటికే ప్రాధాన్యం ఇచ్చి తన కుటుంబ అవసరాలను తీర్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిగింది. ఈ సందర్భంగా వెల్లడైన కొన్ని నిజాలు ఆమె గొప్పతనాన్ని వివరిస్తున్నాయి.
కొత్త అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే మహిళలు తమ సంపాదనలో ఎక్కువ భాగం స్వదేశంలో ఉండే ఇంటి అవసరాలకే పంపుతున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
విదేశాలకు వెళ్లిన 48శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడంగానీ, సొంత వ్యాపారాలు చేస్తున్నారు.
విదేశాలకు వెళ్లిన ఓ జంట విషయమే తీసుకుంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా డబ్బు పంపిస్తున్నారు. అంతేకాదు తమ సంపాదన తక్కువైనప్పటికీ ఎక్కువ భాగానే్న పంపిస్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లో తక్కువ డబ్బు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో మహిళలు (13.4),పురుషులు (15.6శాతం) ధీటుగా ఉన్నారు.
గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన తల్లుల్లో ఎక్కువ మంది ఇంటికి చేయూతనిచ్చేందుకు వచ్చినవారే.

అలసిపోని మనసు
కుటుంబం అంటే అమ్మకు ప్రాణం. అమ్మ తినిపించే గోరుముద్ద రుచి ఎవరు తెచ్చి ఇవ్వగలరు. అమ్మ లాలిపాటలోని మమతకు కరిగిపోయి నిద్రలోకి జారిపోని పసివాళ్లుంటారా? తనొక్కతే కుటుంబ సభ్యుల ఆలనాపాలనా చూసుకునేందుకు తహతహలాడుతుంది. ఉద్యోగ బాధ్యతలతో తలమునకలైనా ఈ పనులపై అశ్రద్ధ చూపదు. అలసిసొలసిన పిల్లల తలపై ప్రేమగా నిమిరితే దొరికే సాంత్వన ఇంకెక్కడైనా లభిస్తుందా? తాజా అధ్యయనాలు, సర్వేలు, పరిశోధనలు వడగట్టాక తేలిన కొన్ని నిజాలు తెలుసుకుంటే అమ్మ గొప్పతనమేంటో అర్థమవుతుంది.

*1971లో సగటున 21 ఏళ్లకు అమ్మాయిలు తొలి కాన్పుతో అమ్మగా ఆనందించేవారు. అక్షరాస్యత, ఆరోగ్య, వైద్య స్పృహ పెరిగిన ఆధునిక కాలంలో ఇప్పుడు సగటున 25 ఏళ్లకు అమ్మతనంతో మురిసిపోతున్నారు.
*1700 నాటికి ప్రతి తల్లి సగటున 7-10 మంది పిల్లల్ని కనేవారు. ఇప్పుడు సగటున ఇద్దర్ని కంటున్నారు.
*సగటు గృహిణి తన భర్త కోసం కనీసం 1.2 గంట ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే బిడ్డకోసం 2.7 గంటలు కేటాయిస్తుంది.
*ప్రిస్కాలర్ పిల్లలపై తల్లికి శ్రద్ధ ఎక్కువ. ఆ వయసు పిల్లల ఆలనాపాలనపై తల్లులకు దృష్టి ఎక్కువగా ఉంటుంది. ప్రతి నాలుగు నిమిషాలకోసారి వారేం చేస్తున్నారో ఆతృతగా గమనిస్తూంటారట తల్లులు. అంటే రోజుకు 210 సార్లు అలా చేస్తారన్నమాట.
*చిన్నపిల్లలు పదేపదే పక్క తడపటం, మలవిసర్జన చేయడం మామూలే. ఏ చికాకు లేకుండా శ్రద్ధగా డయపర్ మార్చడం లేదా శుభ్రం చేస్తారు. అందుకు సగటున ఒక్కో తడవకు కేవలం 2.5 నిమిషాలు మాత్రమే వారు సమయం తీసుకుంటారట.
*ఏడాది వయసు పిల్లలున్న తల్లుల్లో ఉద్యోగం చేసేవారి సంఖ్య 72 శాతం. 1976లో ఇది 30 శాతం మాత్రమే. ఏడాది లోపు వయసు పిల్లలున్న తల్లుల్లో ఉద్యోగం చేసే వారి సంఖ్య 55 శాతం.
*పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తున్న తల్లులు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా కుటుంబం, పిల్లల కోసం కనీసం 13 గంటలు పనిచేస్తారట.
*ప్రపంచంలో తల్లుల సంఖ్య 200 కోట్లు. తల్లులు ఇష్టంగా చేసే పనుల్లో ఫోన్లలో మాట్లాడటం. వంట చేయడం మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. బాత్రూమ్ శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వారు కష్టమైన, చికాకు పనులుగా భావిస్తారు.
*అమెరికా సహా 54 దేశాలు మాతృదినోత్సవాన్ని పాటిస్తాయి. వాటిలో సగానికి సగం మదర్స్ డేను సెలవుగా ప్రకటించాయి. అయితే ఎక్కువ దేశాలు మేలోను, కొన్ని దేశాలు వివిధ నెలలు, వివిధ రోజుల్లో దీనిని పాటిస్తారు.
*ఎరుపు, ఊదా రంగుల్లోని పూలగుత్తులను బహుమతిగా అందుకోవడానికి ఎక్కువమంది తల్లులు ఇష్టపడతారట. ముఖ్యంగా అమెరికాలో. మరణించిన మాతృమూర్తులకు తెల్లగులాబీల గుత్తులతో నివాళి అర్పించడం అక్కడి సంప్రదాయం. అమెరికాలో తొలిసారి మాతృదినోత్సవం అధికారికంగా 1914లో ప్రారంభమైతే 1940నాటికి అది కమర్షియల్ రూపం సంతరించుకుంది.
*