మెయిన్ ఫీచర్

ఏది మంచి సినిమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మా బొరుసుల్లా మంచీ చెడూ ఎక్కడైనా ఉంటాయి. మనుషుల్లో మంచి తలంపు, చెడు తలంపుల వైరుధ్యాలున్నట్టే.. సినిమాల్లోనూ మంచి సినిమా, చెడు సినిమా అనే రెండు పార్శ్వాలుంటాయని అంటారు సినీ మేధావులు. సినీ విమర్శకులు వర్గీకరించినట్టు... మంచి సినిమా అంటే ఏమిటో? దర్శకుడు మెచ్చి తీసేదా? ప్రేక్షకుడు నచ్చి చూసేదా? సినీ పండితులను ఆకర్షించి పాజిటివ్ రివ్యూగా పేరు తెచ్చుకునేదా? వీటిలో ఏది మంచి సినిమాగా కొనియాడబడుతుంది అనేది మీమాంశ. అయితే ఇదేం జవాబు దొరకనిదేం కాదు. మిలియన్ డాలర్ల ప్రశ్న అస్సలు కాదు. అయినా సమాధానం తెలియాల్సిందేగా. వెతకాల్సిందేగా.

మంచిని ప్రభోదిస్తూ సందేశాత్మకంగా.. సామాజిక స్ఫూర్తిని రగిలించడానికి తీసేది మంచి సినిమా అవుతుందా? చెడును బలపరుస్తూ, ఆకర్షణీయంగా.. కాసుల వర్షం కోసం చుట్టేసేది చెడ్డ సినిమా అవుతుందా? ఏదవుతుంది మరి మంచి.. చెడ్డ సినిమా?
***
ఒక పాత సినిమాలోని ఎంటరవుదాం.
వెండితెర పాఠ్య పుస్తకం, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పెంకి పెళ్లాం’ సినిమాలోని రెండు విలక్షణ పాత్రలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే సినిమా మొత్తంగాకంటే.. ఆయా చిత్రాల్లోని పాత్ర చిత్రణలు, సన్నివేశ రూపకల్పనలతో దర్శకుడి ఉద్దేశం వ్యక్తమవుతుంది. అతను సినిమాని ప్రేక్షకుల గుండెల్లో ఎలా ఆవిష్కరించాలని అనుకుంటున్నాడో అర్థమవుతుంది.
పెంకి పెళ్లాం సినిమాలో హీరోయిన్ పాత్రధారిణి రాజసులోచన. ఆమె తండ్రి పాత్రలో రేలంగి కనిపిస్తాడు. చుట్టపు చూపుగా వచ్చిన ఆయన సోదరి, వితంతువు అయిన సూర్యకాంతమ్మ తిరిగి ఇంటి నుంచి వెళ్లేముందు విలువైన కొన్ని వస్తువుల్ని తన పెట్టెలో సర్దేసుకుంటుంది. ఆ విషయం పసిగట్టిన ఇంటి నౌకర్లు యజమాని రేలంగికి చేరవేస్తారు. ఊరికి వెళ్తున్నానని సోదరుడు రేలంగికి చెప్పి, ఖర్చుల కింద డబ్బిమ్మని కూడా అడుగుతుంది సూర్యకాంతమ్మ. నౌకర్లు సైగ చేస్తున్నా కిమ్మనకుండా, ఆమె చేసిన దొంగతనం గురించి నిలదీయకుండా, ఉదాత్త బుద్ధితో ఆమె అడిగినంత సొమ్ము ఇచ్చి సాగనంపుతాడు. ఆమె వెళ్లిపోయాక ‘పండాలి/ చెట్టుమీది పండైనా/ మనిషి చేసే పాపమైనా/ పండాలి’ అంటూ నౌకర్ల ముందు చిరునవ్వుతో వేదాంత ధోరణి ప్రదర్శిస్తాడు తప్ప ఆమెని పల్లెత్తు మాట అనడు. చూశారా? ఈ పాత్ర ఔచిత్యం. దర్శక, రచయితలు తీర్చిదిద్దిన వైనం. అపకారికి ఉపకారం అన్న వేమన అద్భుత సందేశం మదిలో మెదలడం లేదూ? నిజంగా ఇంత గొప్ప పాత్రని మరింత ఉన్నతంగా మలిచిన ఆ సినీ మహామహులను తప్పక అభినందించాల్సిందే.
***
మరో పాత సినిమా ‘దేవత’పై లుక్కేద్దాం. ఇందులోనూ సీనియర్ ఎన్టీఆర్ హీరో. అందులోని ఓ సీన్ చూద్దాం. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు, గది తలుపులు దగ్గర నిలబడి భార్య పాత్రధారి సావిత్రిని త్వరగా రమ్మని విరహపు సైగలు చేస్తూ తంటాలు పడుతుంటాడు హీరో ఎన్టీఆర్. ఆమె వాటిని సున్నితంగా తిరస్కరిస్తూనే.. తన మామగారికి పాదసేవ చేయడంలో నిమగ్నమవుతుంది. మరోవంక కాసింత ఆగమని, భర్తని క్రీగంటితో సున్నితంగా ప్రాధేయపడుతుంది. ఎంత గొప్ప సీన్. కుటుంబ బాంధవ్యాలను శిఖరాయమానంగా ఆవిష్కరించిన అద్భుత దృశ్యమిది. అలాంటి సౌశీల్యవతి అయిన ఇల్లాలి పాత్రే కనుక ఆ సినిమాకి ఆమె ‘దేవత’ అయ్యింది. ప్రేక్షక హృదయాలను హత్తుకుని నీరాజనాలు అందుకుంది.
కుటుంబ విలువలు, తల్లిదండ్రులు -పిల్లల గురించి కాసింత చర్చించినందుకే ‘శతమానంభవతి’ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. జాతీయ అవార్డు గెలుచుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని ప్రశంసల జల్లులు కురిపించుకుంది. అలాంటిది అన్ని పాజిటివ్ నేచర్ పాత్రలతో మనమిలా మారితే బావుంటుంది, మన మధ్య మనుషులంతా ఇలా మెదిలితే సంతోషంగా ఉంటుంది అనే సద్భావన చివురించేలా.. సంస్కారవంతమైన పాత్రలతో కూడిన అలనాటి ‘దేవత’ మళ్లీ వెండి తెరపై మెరిస్తే? నిజంగా ఈతరం కుటుంబ వ్యవస్థకి అలాంటి సినిమాలొక ‘పెద్ద బాలశిక్ష’ లవుతాయి. ఆ సినిమా దర్శక, రచయితలను తప్పక వేనోళ్ల పొగడాల్సిందే.
***
ఆ మధ్య వచ్చిన కొ(చె)త్త సినిమాలోని వికృత సీన్‌ని మననం చేసుకుందాం.
తండ్రీ కొడుకులు కలిసి కూర్చుని మందు కొడుతుంటారు. (ఈ అసహజ దృశ్యం ఎన్నో సినిమాల్లో మరెన్నోసార్లు గింగిరీలు కొట్టిందనుకోండి). అక్కడికి వచ్చిన తల్లి -్భర్త అరాచకాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తుంది. విలన్ పాత్రధారి అయిన తండ్రి అసహనానికి లోనవుతాడు. తండ్రి అనుమతి తీసుకుని మరీ, ఆ తల్లిని కర్కశంగా చంపేస్తాడు కొడుకు. ఎంత ఘనంగా ఉందీ ఘటన? విలన్ క్రూరత్వాన్ని ఇంతగొప్పగా ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు చూపి తరించారు. ఇలాంటివి సమాజంలో జరగడం లేదా? అంటే .. మన దగ్గర సమాధానం దొరకదు. కానీ, ఆ దర్శక, రచయితల (ఒక్కరే) ధైర్యానికి, తెగువకి చప్పట్ల మోత మోగించాల్సిందే. ఆ పాత్రలకి జోహార్ అనాల్సిందే.
అలాగే, తండ్రి మాటని జవదాటకుండా తల్లి రేణుక తలని నరికిన పరశురాముడి కథ కూడా ఈ సందర్భంగా గుర్తుకొస్తే (ఆ సినిమా వాళ్లు సమర్థించుకుంటే) అది నిజంగా వికృత ప్రతిభకి పరాకాష్టే అవుతుంది.
***
పైన చెప్పినట్టు ఎలాంటి పాత్రలతో సినిమా మలచబడితే మంచి సినిమా అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రేక్షకులు (సినిమా) పాత్రలతో కనెక్టవుతారు. కథా ఉద్దేశ్యం కూడా అదేగా. పాత్రల్లో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. అవలోకనం చేసుకుంటారు. సుగుణాలు, సత్ప్రవర్తన కలిగిన పాత్రలు తప్పక ప్రేక్షక లోకాన్ని ప్రభావితం చేస్తాయి. మరి చెడు పాత్రల ఆకర్షించవా? అంటే ఔననే చెప్పాలి. కానీ హింసాత్మక పాత్రలు కళ్లెదుట వెండితెరపై ప్రత్యక్షమై.. వారి వికృత చేష్టలకి యువ ప్రేక్షకుల రక్తం తాత్కాలికంగా మరిగిపోతుందేమోగానీ, ఒక ఆదర్శవంతమైన పాత్రలు, ఆ పాత్రల తీరుతెన్నులు విభిన్న వర్గాల ప్రేక్షకులను తప్పక వెంటాడుతాయి. ఆలోచింపచేస్తాయి. అనుకరణకై ఆసక్తి చూపమంటాయి. మనమూ అలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందన్న ఘర్షణకు లోనుచేస్తాయి. ఎందుకంటే ఎలాంటి మనిషైనా తాత్కాలికంగా చెడుకి ఆకర్షితుడు అవుతాడేమోగానీ, మంచివైపు మాత్రం శాశ్వతంగా మరలాలని ప్రయత్నిస్తాడు.
మరి ఒక వ్యక్తి మంచీ చెడు అనేది అతడి డబ్బుని, హోదాని, విద్వత్తుని బట్టి నిర్ణయించబడవు. అతడి సంస్కారవంతమైన పనులను బట్టే నిర్ణయమవుతాయి. అలాగే ఒక సినిమా మంచి చెడులు కూడా ఆ సినిమాలోని ఆయా పాత్రల ఉన్నతమైన సుగుణాలను బట్టే నిర్ణయించబడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఎవ్వరైనా ఔననే అంటారు.

-ఎనుగంటి వేణుగోపాల్